సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఆ హామీల ఊసేలేదని ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని చెప్పడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశముందని కాబట్టి ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు డబ్బులను వెంటనే జమ చేయాలని కోరారు. ప్రభుత్వాలను కూల్చే చరిత్ర కాంగ్రెస్‌దేనని, రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దినదినగండంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 1న గ్రూప్ –1 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని ఆ తేదీ గడిచినా కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని మండిపడ్డారు.
గ్రూప్ 1 ఉద్యోగాలతోపాటు గ్రూప్ 2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే అయినప్పటికీ దానివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని వెంటనే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి దానిని అమలు చేయకపోవడమంటే ఆ పవిత్ర గ్రంథాన్ని చిత్తుకాగితంగా పరిగణిస్తున్నట్లేనని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment