సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలివ్వడం ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను వంచించడంలో మహా నేర్పరిగా పేరు గాంచిన చంద్రబాబు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చేస్తూ, ప్రజలను నమ్మించేందుకు మళ్లీ తన విద్యను ప్రదర్శిస్తున్నారు. గతంలో తాను చెప్పి అమలు చేయలేకపోయిన హామీలనే మళ్లీ ఇప్పుడు కొత్తగా ఇస్తుండడం గమనార్హం.
ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఇస్తానని ప్రకటించారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. అప్పట్లో రూ.2 వేల భృతి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చివరి వరకు ఆ ఊసే ఎత్తకుండా కాలక్షేపం చేశారు.
ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఎన్నికలకు 3 నెలల ముందు తూతూమంత్రంగా వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతిని ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకునేందుకు చివర్లో ఇలా నాటకం ఆడారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి మళ్లీ నిరుద్యోగులను మాయ చేసేందుకు చంద్రబాబు నిర్భీతిగా అదే హామీని ఇస్తుండడంపై ప్రజలు విస్తుపోతున్నారు.
ఇంటికో ఉద్యోగం అని మోసం
2014 ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలుకుతున్నారు. ఈ విషయాన్ని కూడా కుప్పంలో ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. 2014లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని ఎందుకు అమలు చేయలేదనే దానికి మాత్రం సమాధానం చెప్పడంలేదు.
బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగులు, యువతను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను సైతం తొలగించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంతో ప్రజలు ఛీత్కరించారు. 2014 ఎన్నికలకు ముందు 600కు పైగా హామీలతో 50 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలను మాయ చేశారు.
నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల రద్దు, రైతులు తాకట్టు పెట్టిన బంగారు రుణాల మాఫీ వంటి అనేక హామీలు ఇచ్చినప్పటికీ, ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదు. ఈ హామీలు కనిపించకుండా వెబ్‌సైట్ నుంచే తొలగించారు. అందుకే ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించి, నమ్మకానికి మరో పేరైన వైఎస్ జగన్‌కు అధికారం ఇచ్చారు. అందువల్లే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా, ఇతరత్రా మేలు చేసే అనేక పథకాలు, కార్యక్రమాలతో చరిత్ర సృష్టించి.. మళ్లీ ఓట్లు అడుగుతున్నారు.
మళ్లీ మోసాల హామీలు
చంద్రబాబు మాత్రం తన మోసాలు, అబద్ధాల హామీలు, నయవంచన చరిత్రను మరచిపోయి మళ్లీ అవే హామీలను ఎడాపెడా గుప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. హామీలను అమలు చేయకుండా చెత్త బుట్టలో వేసి, ప్రజలకు వెన్నుపోటు పొడవడంలోనూ మాస్టర్స్ డిగ్రీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారు. గతంలో 600 హామీల మేనిఫెస్టోను ప్రజలకు కనపడకుండా దాచేసిన ఆయన ఇప్పుడు మళ్లీ కొత్తగా ముందస్తు మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలకు గేలం వేద్దామని బయలుదేరారు. త్వరలో మళ్లీ ఇంకో మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను మాయ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment