పడగొడతామంటే.. తొడగొట్టలేమా?: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy comments On KCR at media conference | Sakshi
Sakshi News home page

పడగొడతామంటే.. తొడగొట్టలేమా?: సీఎం రేవంత్‌రెడ్డి

Published Fri, Jun 28 2024 5:06 AM | Last Updated on Fri, Jun 28 2024 5:06 AM

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు

మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఎవరెవరు ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరతారనేది ఇప్పుడే చెప్పలేం

అసలు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే

రాష్ట్రానికి నిధుల కోసమే కేంద్ర మంత్రులతో భేటీలు

త్వరలో ప్రధాని మోదీ, అమిత్‌ షాలనూ కలుస్తాం

పునర్విభజన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం

త్వరలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త పీసీసీ చీఫ్‌ నియామకం

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విషయంలో సమన్వయ లోపం నెలకొంది

ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా కాకముందే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. మేం తొడగొట్టలేమా? ఎవరెవరు ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరతారనేది ఇప్పుడే చెప్పలేం. అసలు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆరే..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విషయంలో టీపీసీసీ సమన్వయలోపంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఉంటాయని వెల్లడించారు. రేవంత్‌ గురువారం మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో ఢిల్లీలోని తన నివాసంలో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వివరాలు రేవంత్‌ మాటల్లోనే..

‘‘రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల్లో కూలిపోతుందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అంటే.. దానికి బీజేపీ వంత పాడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతామంటూ రోడ్ల మీద పడి రంకెలేస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీలను గాలికి వదిలేస్తే ఎలా? బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు అన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహారం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్టు.. అసలు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆరే. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 61 మందిని తీసుకున్న కేసీఆర్‌ తప్పులు క్షమించాలంటూ.. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి.

మీరు అడిగితేనే కమిషన్‌ వేశాం..
కేసీఆర్‌ గత 10 ఏళ్లలో ఒక్కసారైనా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రతిపక్షాలను పిలిచారా? మేం అధికారికంగా ఆహ్వానం పంపాం. విద్యుత్‌పై విచారణ కమిషన్‌ వేయాలని మేం అడగలేదు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్‌ కొనుగోళ్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కోరారు. మరి మా ప్రభుత్వం విచారణ కమిషన్‌ వేయడం తప్పా? వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను అడగటం తప్పా? కమిషన్‌కు జస్టిస్‌ నరసింహారెడ్డి అధ్యక్షత వహిస్తుండడాన్ని తప్పు పడుతున్నారా?.. దీనిపై కేసీఆర్, జగదీశ్‌రెడ్డి సమాధానం చెప్పాలి.

రాజకీయాలు అయిపోయాయి!
రాష్ట్రంలో అన్ని పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాం. ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ చేసిన పనులను, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పనులను పోల్చిచూడాలి. మా ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యం.

ఏపీ భవన్‌ సమస్యను పరిష్కరించుకున్నాం
ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్‌ ఉన్నప్పుడే ఢిల్లీలోని ఏపీ భవన్‌ సమస్యను పరిష్కరించుకున్నాం. విభజన సమస్యల పరిష్కారంపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చించాం. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు, నిధులు, పొరుగు రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు నిరంతర ప్రక్రియ కొనసాగుతాయి. 

కేంద్రం ద్వారా విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే కోర్టులను ఆశ్రయిస్తాం. ఆస్తుల పంపకం జరిగిపోయింది. ఇక నిర్మాణం, నిర్వహణ ఎలాగన్న దానిపై దృష్టిపెట్టాం. త్వరలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టబోతుండటంతో.. రాష్ట్రం తరఫున మంత్రులంతా వచ్చి కేంద్ర మంత్రులను కలసి విజ్ఞప్తులు, ప్రతిపాదనలు ఇచ్చాం. త్వరలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను కూడా కలుస్తాం.

వేరేవారికి పీసీసీ ఇవ్వాలని కోరా..
కాంగ్రెస్‌ అధిష్టానం నన్ను పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూన్‌ 21న నియమించగా జూలై 7న బాధ్యతలు తీసుకున్నాను. ఈ ఏడాది జూలై 7న నా పదవీకాలం పూర్తవుతుంది. పీసీసీ బాధ్యతల నుంచి నన్ను తప్పించి సామాజిక న్యాయం పాటిస్తూ, సమర్థుడైన నాయకుడికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాను. త్వరలో అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా..’’ అని రేవంత్‌ చెప్పారు.

త్వరలో మంత్రి వర్గ విస్తరణ
రాష్ట్రంలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. నా జీవితాశయం నెరవేరింది. కేసీఆర్‌ను ఓడిస్తానని, ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాను. అయ్యాను. రేవంత్‌రెడ్డి సీఎం అని 30 సెకన్లలో అధిష్టానం డిసైడ్‌ చేసింది. కేసీఆర్‌ను దింపాలనేది నా మొదటి లక్ష్యం. దానిని గుర్తించి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్‌ దిగిపోవడం, నేను గద్దెనెక్కడమే ఆయనకు పెద్ద గాయం. అంతకు మించింది ఏముంటుంది?

జీవన్‌రెడ్డి విషయంలో సమన్వయలోపం
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మనస్తాపం చెందడానికి సమన్వయ లోపం, పీసీసీ తరఫున ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణం. దీనితో కొంత గందరగోళం ఏర్పడింది. మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో అధిష్టానం పార్టీకి ఎలాంటి నష్టం కలగకుండా చూసింది. హైకమాండ్‌ ఆదేశాలతో.. జీవన్‌రెడ్డి గౌరవాన్ని కాపాడుతూ, ఆ ప్రాంత కార్యకర్తలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. జీవన్‌రెడ్డి అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. జీవన్‌రెడ్డి వ్యవహారంలో ఏదైనా జరిగితే బాగుండునని కొన్ని గోతికాడి నక్కలు ఎదురు చూశాయి. కానీ జీవన్‌రెడ్డి ఆ అవకాశం ఇవ్వలేదు.

టీఆర్‌ఎస్‌ ఖతం కావాలన్నదే హరీశ్‌ కోరిక
కేసీఆర్‌ పార్టీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తే నిలబెట్టుకుంటారు. కానీ ఆయన ఆ మూడ్‌లో లేరు. హరీశ్‌రావు డిస్టర్బ్‌ చేస్తున్నారు. కేసీఆర్‌ను బయటికి రానివ్వడం లేదు. హరీశ్‌ ట్రాప్‌లో కేసీఆర్‌ ఉన్నారు కాబట్టి పార్టీ బతకడం కానీ, కేసీఆర్‌ రాజకీయంగా నిలదొక్కుకోవడంగానీ జరగవు. కేసీఆర్‌ ఉన్నంత సేపు హరీశ్‌ ఏమీ చేయలేడు. చేసినా సమాజం ఒప్పుకోదు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీని ఖతం చేయాలని హరీశ్‌ అనుకుంటున్నారు. 

పార్టీ ఖతమైతే హరీశ్‌ ఒక కొత్త లైన్‌ తీసుకుంటారు. గతంలో ఈటల రాజేందర్‌ను మెడపట్టి బయటకు పంపింది హరీశ్‌రావు కాదా? నరేంద్ర, విజయశాంతిలను బయటికి పంపింది హరీశ్‌ కాదా? ఎప్పుడూ ఒక సమస్యను సృష్టించి.. తనకంటూ ఒక స్పేస్‌ క్రియేట్‌ చేసుకుంటారు. నాకు నచ్చలేదు కాబట్టి కేసీఆర్‌ చిన్నోడేమీ అయిపోడు. అసెంబ్లీలోకి వచ్చి నిలుచుంటే ఆయనకు ఉండే మర్యాద ఆయనకు ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement