తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఎదురుదాడి ఆరంభించారు. ప్రభుత్వ బొక్కసం అంతా ఖాళీగా ఉందని పూర్తిగా అర్ధం చేసుకున్న రేవంత్ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై ఘాటైన విమర్శలు చేశారు. కేటీఆర్ తిన్న లక్ష కోట్ల రూపాయలను కక్కిస్తామని ఆయన అనడం విశేషం. అలాగే ప్రజా పాలన పేరుతో గ్రామాలలో సభలు ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన స్కీముల కోసం వేలాది మంది ప్రజలుక్యూలు కట్టవలసి వస్తోంది. ఇది క్రమేపి అసంతృప్తిగా మారే అవకాశం ఉంది. ప్రజావాణిలో ఇరవైనాలుగువేల దరఖాస్తులు వచ్చాయంటే గతంలోని గడీల పాలన వల్ల ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కున్నారో అర్ధం అవుతుందని రేవంత్ అంటున్నారు. కాని ఈ ప్రజావాణికి ఈ ఇరవైరోజుల్లో వచ్చిన వేలాది దరఖాస్తులను పరిష్కరించడం తలకు మించిన భారమే అని చెప్పక తప్పదు.
✍️రేవంత్ రెడ్డి మంచి మాటకారే. అదే ఆయనకు కలిసి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పై తీవ్రమైన పరుష భాష వాడడానికి కూడా ఆయన వెనుకాడలేదు.తద్వారా ఆయన కేసీఆర్ ను ఎదిరించే ధీరుడుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడ్డారు. పిసిసి అధ్యక్షుడు అయ్యాక మరింత వేడి పెంచారు. అదంతా ఆయనకు కలిసి వచ్చింది. పార్టీ నాయకత్వం కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకే ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్ అదే బాటలో నడవాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది.
✍️కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాని,ఆయా వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్ లు కాని అమలు చేయడం ఒకరకంగా చెప్పాలంటే దుస్సాధ్యం. అందుకే మొత్తం ఈ పరిస్థితికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకమేనని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి యత్నిస్తున్నారు. ప్రజావాణిలో సమస్య పరిష్‌కారం కాని ఒక మహిళకు కేటీఆర్ లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన తిన్నదానిలో లక్ష కక్కించామని , మిగిలిన 99,999 కోట్ల రూపాయలను కూడా వసూలు చేస్తామని ఆయన గంభీరమైన ప్రకటన చేశారు.ఇలాంటి వాటినే ప్లేయింగ్ టు గ్యాలరీస్ అని అంటారు. కేసీఆర్ ప్రభుత్వం అనండి, కేటీఆర్ లేదా ఇతర బీఆర్‌ఎస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేయవచ్చు. కాని అదేదో లెక్కకట్టి లక్షకోట్లు అని ప్రచారం చేయాలని సంకల్పించడం లోని ఆంతర్యం ప్రజలకు అర్ధం కాకుండా పోదు.ప్రభుత్వాలు ఏ విచారణ చేపట్టినా, సంబందిత ఆధారాలు సేకరించడానికే నెలల సమయం పడుతుంది.
✍️న్యాయ విచారణ అంటే ఇంకా ఆలస్యం అవుతుంది. అంతదాకా ఎందుకు! ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేయడానికి ఎంతకాలం పట్టిందో చూస్తున్నాం. అది ముందుకు వెళ్లకుండా చంద్రబాబు వంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎలా ఆయా వ్యవస్థలను వాడుకుంటున్నారో గమనిస్తున్నాం.ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషీయల్ విచారణకు ఆదేశాలు ఇచ్చినా,అది ఇప్పటికిప్పుడు తేలేది కాదు.కాకపోతే నిత్యం బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలకు, వారిని భయపెట్టడానికి కొంత ఉపయోగపడవచ్చు.మరో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవంత్ రెడ్డిపై వచ్చిన అభియోగాల కేసు ఇంతవరకు ఒక కొలిక్కి వచ్చిందా! ఇవేవి ఆయనకు తెలియనివి కావు.
✍️అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డైలాగులతో నెట్టుకురాక తప్పదు. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందెలు మాత్రమే ఉంచారని ఆయన అనడం ఆసక్తికరంగానే ఉంది. కాంగ్రెస్ నేతలు అంత అమాయకులా అన్న సందేహం వస్తుంది. ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని బీఆర్‌ఎస్ నేతలపై ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు కొత్తవికావు. అయినా భారీ వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించడానికి కాంగ్రెస్ నేతలు ఎన్నిపాట్లు పడ్డారో అందరికి తెలుసు!అదే అధికారం కోసం జరిగే రాజకీయం అంటే. గతంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇలాగే రాజకీయం చేశారు. ఇప్పుడు దానిని రేవంత్ కొనసాగిస్తున్నారని అనుకోవచ్చు.ఒకరకంగా ఇద్దరిది ఈ విషయంలో ఒకే స్కూల్ అనుకోవాలి. సచివాలయం కూల్చివేతకు సంబందించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతమైనవే. కేవలం వాస్తు కోసం సచివాలయ భవనాలు కూల్చడంపై అప్పట్లోనే వ్యతిరేకత వచ్చింది.
✍️కొత్త భవనం చూడడానికి బాగానే ఉన్నా,అసలు ఉన్న భవనాలను కూల్చడం ఎందుకు అన్నదానికి బీఆర్‌ఎస్ సరైన సమాధానం ఇవ్వలేక్పోయింది. ప్రజావాణి వంటి కార్యక్రమాలలో సమస్యలు తీర్చడం ఎవరివల్లా కాని పనిగా మారింది. దానికి కారణం ఏమిటంటే ప్రజలు ప్రతి చిన్న సమస్యకు ముఖ్యమంత్రి వద్దకు వస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రజలకు ఉదయం కొంత సమయం కేటాయించేవారు..అప్పట్లో కొంత స్క్రీనింగ్ చేసి సీఎంను కలిపించేవారు.దానివల్ల అందరికి పనులు అయిపోతాయని కాదు. వాటిలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సాయం కోసం వచ్చే దరఖాస్తుదారులే ఉండేవారు.వారికోసం ఒక ప్రత్యేక అధికారిని పెట్టి వారి జబ్బును పట్టి, చికిత్సకు అయ్యే వ్యయాన్ని బట్టి ఆర్ధిక సాయం చేస్తుండేవారు. అప్పట్లో ఆయనకు అది మంచి పేరే తెచ్చింది.కాని అలా ముఖ్యమంత్రి స్థాయిలోనే అన్ని చూడాలని ప్రయత్నించడం ఎంతవరకు కరెక్టు అన్న భావన కూడా లేకపోలేదు.
✍️దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందన కార్యక్రమం పెట్టారు. అందులో ఎవరైనా తమ సమస్యను చెప్పుకోవచ్చు. వారికి అధికారులు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. స్పందన కార్యక్రమం తీరుతెన్నులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు చేస్తుంటారు. అంతేకాకుండా గ్రామ,వార్డు స్థాయిలోనే సచివాలయాలు ఏర్పాటు చేయడం,వలంటీర్లను ప్రజల ఇళ్ల వద్దకే పంపించడం ప్రజల అవసరాలను తెలుసుకుని , అర్హులైన లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని వారికి తగు సాయం చేస్తున్నారు.దీనితో ప్రతి ఒక్కరు సీఎంను కలవాలన్న ఆలోచన అవసరం లేకుండా పోతోంది. వృద్దులకైతే ఇళ్లవద్దే పెన్షన్ అందించే గొప్ప సదుపాయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చింది.
✍️ఇందుకోసం ప్రభుత్వం చాలా శ్రమించింది. వ్యవస్థలను పకడ్బందీగా రూపొందించడానికి కొంత టైమ్ తీసుకుంది.అందువల్ల అది చాలావరకు సఫలం అయింది. తెలంగాణలో అలాంటి వ్యవస్థలు లేవు. ప్రస్తుతం ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నా,వాటిని పరిష్కరించడానికి చాలా టైమ్ పట్టవచ్చు. ఇదంతా కాలయాపన చేయడానికే అన్న అభిప్రాయం ప్రబలితే ప్రజలలో అసంతృప్తి ఏర్పడుతుంది.కాని రేవంత్ కూడా నిస్సహాయుడే అని చెప్పక తప్పదు. ఈ స్కీములు అన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులు లేకపోతే ఆయన మాత్రం ఏమి చేస్తారు!కాకపోతే ఆ మాట పైకి చెప్పలేరు.
✍️ప్రజాపాలన పేరుతో కొంత గడువు తీసుకుంటున్నారు. తర్వాత అర్హుల గుర్తింపు అంటూ మరికొంత సమయం వాడుకుంటారు. తదుపరి దశలవారీగా వాటిని అమలు చేసే యత్నం జరుగుతుంది. బీఆర్‌ఎస్ నేత కవిత అన్నట్లు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నవారు కొత్తగా పెంచిన నాలుగువేల రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అంటే మాత్రం అది తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.దేనికైనా ఆర్ధిక పరిస్థితే మూలం అవుతుంది కనుక ఈ బండిని ఎలా నెట్టుకువస్తారో తెరపై చూడవలసిందే. ఈ నేపధ్యంలోనే బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ వ్యూహాత్మక దాడి చేశారు. ప్రజల దృష్టిని అటువైపు మళ్లించడం ద్వారా తనకు ఊపిరి పీల్చుకునే అవకాశం తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.అంతకు మించి మరో మార్గం కూడా ఆయనకు లేదేమో!
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment