బీసీల రిజర్వేషన్లపై అపోహలు తొలగించాలి
సిరిసిల్లటౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అపోహలు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో బుధవారం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేశ్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బీసీల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేసిందన్నారు. దేశవ్యాప్త జనగణనలో భాగంగా కులగణన కూడా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల బీసీ నినాదం, ఉద్యమం పేరిట హల్‌చల్ చేస్తుందని, ఆమె నాయకత్వం బీసీలకు అక్కర్లేదన్నారు. జిల్లాలో సంఘం బలోపేతంలో భాగంగా జిల్లా కమిటీ సలహాదారుడిగా తోట్ల రాములుయాదవ్, సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడిగా బచ్చు ప్రసాద్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేశ్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, నాయకులు తోట్ల రాములుయాదవ్, బచ్చు ప్రసాద్, తిరుపతి, నల్ల శ్రీకాంత్, కొండా విజయ్, బోయిని శ్రీనివాస్, తడక శశికుమార్, శ్రీధర్, మల్లేశం పాల్గొన్నారు.
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
Comments
Please login to add a commentAdd a comment