ఆర్‌ఎంపీల ఆగడాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీల ఆగడాలు

Published Mon, Jan 6 2025 7:20 AM | Last Updated on Mon, Jan 6 2025 7:20 AM

ఆర్‌ఎ

ఆర్‌ఎంపీల ఆగడాలు

● ఇష్టారాజ్యంగా వైద్యం ● అర్హత లేకున్నా ఆపరేషన్లు ● కాసుల కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలింపు ● డబ్బుల కోసం బరితెగింపు ● క్లినిక్‌లలోనే మందుల విక్రయాలు ● పట్టించుకోని వైద్యాధికారులు

ఈమె గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ పంచాయతీ పరిధిలోని తుర్కాశీపల్లికి చెందిన ఖాసీంబీ(35). పది రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ సమీప గ్రామమైన రాచర్లతిమ్మాపూర్‌లోని ఆర్‌ఎంపీ దేవేందర్‌ వద్దకు వెళ్లింది. పరీక్షించిన దేవేందర్‌ సూదీమందుతోపాటు సైలెన్‌ ఎక్కించాడు. జ్వరం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో తెలిసీతెలియని వైద్యం చేయడంతో ఖాసీంబీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తన కారులోనే తరలించి చేతులు దులుపుకున్నాడు. చికిత్స పొందుతూ అదే రోజు ఖాసీంబీ ఆస్పత్రిలో మరణించింది.

ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి

ఆర్‌ఎంపీ వైద్యులు ప్రజలకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. క్లినిక్‌ల పేరుతో తెలిసీతెలియని వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీస వైద్యం తెలియని ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

– చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ, సిరిసిల్ల

హద్దు దాటితే చర్యలు

ఆర్‌ఎంపీ, పీఎంపీలు హద్దుదాటి ప్రజలకు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు అర్హత కలిగిన వైద్యులనే సంప్రదించాలి. క్లినిక్‌లలో మందులు విక్రయించడం, ఆపరేషన్లు చేయడం నేరం. అలాంటివి చేస్తే విచారణ చేపట్టి శిక్షలు వేయిస్తాం. లైసెన్స్‌లు లేకుండా మందులు అమ్మడం చట్టవిరుద్ధం. ఇలాంటి ఆర్‌ఎంపీ వైద్యుల గురించి వివరాలు సేకరిస్తున్నాం.

– రజిత, జిల్లా వైద్యాధికారి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉన్నత చదువు లేదు.. అయినా వాళ్లు డాక్టర్లు. నాడీ పట్టే అర్హత లేకున్నా రోగాలను నిర్ధారిస్తూ ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను మించిన స్థాయిలో వైద్యం చేస్తున్నారు. చిన్నపాటి జ్వరానికే యాంటీబయోటిక్స్‌ ఇస్తూ ప్రజల ప్రాణాలమీదికి తెస్తున్నారు. క్లినిక్‌లలోనే ల్యాబులు పెట్టి, టెక్నీషియన్‌ లేకుండానే స్వయంగా పరీక్షలు చేస్తూ రోగాలను నిర్ధారిస్తున్నారు. వ్యాధి చిన్నదైనా.. పెద్దదైనా.. రోగులను భయపెట్టి కమీషన్ల కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. అత్యవసరంపై వస్తున్న అమాయక పల్లెప్రజలకు కొందరు ఆర్‌ఎంపీలు ఆపరేషన్లు సైతం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ సమయంలో ఒక్కోసారి వైద్యం వికటించిన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.

కమీషన్ల కోసం కార్పొరేట్‌కు..

జలుబు, జ్వరంతో తమ వద్దకు వస్తున్న రోగులను ఆర్‌ఎంపీలు ఐదు రోజుల కోర్సు అంటూ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం యాంటీబయోటిక్స్‌ ఇంజక్షన్లు ఇస్తూ వేల కొద్దీ వసూలు చేస్తున్నారు. ఇలా కూడా వ్యాధి తగ్గకపోతే వీరే స్వయంగా స్కానింగ్‌, ఎమ్మారైలు, సీటీస్కానింగ్‌లు, రక్తపరీక్షలు చేయిస్తూ ల్యాబ్‌ నిర్వాహకుల నుంచి కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు. అప్పటికీ వ్యాధి తగ్గకపోతే సిరిసిల్ల, కరీంనగర్‌లలోని ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తూ వారికి అయిన బిల్లుపై 40 నుంచి 50 శాతం కమీషన్లు పొందుతున్నారు. ఇలా ఒక్కో ఆర్‌ఎంపీ ప్రతీ రోజు కనీసం ఒకరిద్దరు రోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తూ కమీషన్ల రూపంలో వేలకు వేలు సంపాదిస్తున్నారు.

ఆస్పత్రుల తరహాలో క్లినిక్‌లు

జిల్లా వ్యాప్తంగా ఆర్‌ఎంపీలు, పీఎంపీలు తమ ఇళ్లల్లో క్లినిక్‌లు నిర్వహిస్తూ పల్లె ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆ క్లినిక్‌లు కార్పొరేట్‌ తరహా ఆస్పత్రుల మాదిరిగా నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎంపీలే స్వయంగా సూదులు ఇవ్వడంతోపాటు మందులు విక్రయిస్తున్నారు. మెడికల్‌షాప్‌ నిర్వహించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫార్మసిస్ట్‌తోపాటు మందులు విక్రయానికి లైసెన్స్‌ కలిగి ఉండాలి. కానీ ఆర్‌ఎంపీల వద్ద ఎలాంటి ఫార్మసిస్ట్‌ లేకుండానే మెడికల్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా జనరిక్‌, నాసిరకం గోళీలు అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదంతా ఒక రకమైతే కొందరు ఆర్‌ఎంపీలు ఏకంగా వారి క్లినిక్‌లలో బెడ్లు, ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేసి.. హైడ్రోసిల్‌, అపెండిసైటిస్‌, గర్భస్రావ ఆపరేషన్లు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆపరేషన్లు వికటించి చనిపోతే రోగి కుటుంబ సభ్యులకు ఎంతో.. కొంత సొమ్ము ముట్టజెప్పి కేసులు కాకుండా చూసుకుంటున్నారు.

పర్యటనలు.. విందులు

వివిధ మెడికన్‌ కంపెనీలు, కొన్ని బడా ఏజెన్సీలు ఏకంగా ఆర్‌ఎంపీలతోనే బిజినెస్‌ మాట్లాడుకొని.. వారి కంపెనీ మందులు విక్రయించాలని డీల్‌ కుదుర్చుకుంటున్నాయి. ఎక్కువ బిజినెస్‌ చేసే ఆర్‌ఎంపీలను గోవా, బ్యాంకాక్‌ వంటి టూరిస్ట్‌ ప్రదేశాలకు తీసుకెళ్తున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్‌, యాదగిరిగుట్ట, బెంగళూర్‌ వంటి ప్రాంతాల్లోని రిసార్ట్స్‌లకు తీసుకెళ్లి విందులు, వినోదాలతో ముంచెత్తుతున్నాయి. ప్రత్యేకంగా పండుగలు, ఇయర్‌ ఎండింగ్‌ సమయాల్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఆర్‌ఎంపీలతో ఎక్కువ బిజినెస్‌ చేయించుకుంటున్నారు. ఊరు, పేరు లేని కంపెనీలు తయారు చేసి నాసిరకం మందులు విక్రయిస్తూ ప్రజల ధన, ప్రాణాలను దోచుకుంటున్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పదో తరగతి చదివే విద్యార్థిని ఐదు నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. నాలుగైదు రోజులపాటు సైలెన్‌లు, యాంటీబయోటిక్స్‌ ఇచ్చాడు. విద్యార్థిని పరిస్థితి విషమించిన తర్వాత ఆర్‌ఎంపీ చేతులు ఎత్తేయడంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే అదే రోజు రాత్రి ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతీ పల్లెలో తెలిసీతెలియని వైద్యం అందిస్తూ ఆర్‌ఎంపీలు ప్రజల ప్రాణాలమీదికి తెస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆర్‌ఎంపీల ఆగడాలు1
1/3

ఆర్‌ఎంపీల ఆగడాలు

ఆర్‌ఎంపీల ఆగడాలు2
2/3

ఆర్‌ఎంపీల ఆగడాలు

ఆర్‌ఎంపీల ఆగడాలు3
3/3

ఆర్‌ఎంపీల ఆగడాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement