కాటేస్తున్న కాలుష్యం
జనావాసాల మధ్య ఉన్న కర్మాగారాలతో పట్టణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలు,రసాయనాలతో గాలి, నీరు కలుషితమై అనారోగ్యం పాలవుతున్నారు. కాలుష్యపు కోరల నుంచి కాపాడాలని పోరుబాటపట్టినా.. పట్టించుకునే వారు కరువయ్యారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలోని బొంగ్లూర్, ఎంపీపటేల్‌గూడ, మంగళ్‌పల్లిలో శ్రీశ్రీ అంతఃపురం, శివారెడ్డి నగర్, మెట్రోసిటీ, మైహోమ్స్ కాలనీ, సీఎంఆర్ రిచ్‌మిడాస్, సప్తగిరి, గంగానగర్ కాలనీలలో సుమారు రెండు వేల మంది ప్రజలు నివాసం ఉంటారు. అటు హైదరాబాద్ ఇటు ఇబ్రహీంపట్నంకు మధ్యలో అనువైన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతంలో అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. టీసీఎస్ ఉద్యోగులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సామాన్య ప్రజలు సైతం నివాసం ఉంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. క్రమంగా పెరుగుతున్న కర్మాగారాల సంఖ్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యకోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు.
నలభై పరిశ్రమలు
నగరానికి, కలెక్టరేట్ తదితర కంపెనీలకు పురపాలిక ప్రాంతం అనువైనదిగా పేరు గాంచింది. దీంతో ఈ ప్రాంతంలో అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, చేసుకుంటూనే ఉన్నారు. ఇళ్లతో పాటే జనవాసాలకు చేరువగా చుట్టూరా సుమారు 40 వరకు పరిశ్రమలు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. రైస్‌మిల్లులు, ప్‌లైవుడ్, ఆయిల్, బిస్కెట్, కుర్‌కురేతో పాటు చిన్నచిన్న కంపెనీలు భారీగానే వెలిశాయి. వీటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, రసాయనాలతో గాలీ, నీరు కలుషితమై.. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పొగ నుంచి వచ్చే దుమ్ముధూళి కణాలతో అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే పది మందికి పైగా చర్మ, ఊపిరి సంబంధిత రోగాలతో ఆస్పత్రుల పాలయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఉద్యమాలు చేసినా..
కాలుష్యంతో కలత చెందిన ప్రజలు.. ఏకంగా కాలుష్య వ్యతిరేఖ పోరాట సమితి పేరుతో కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. కాలుష్య కారక కంపెనీలను తరలించాలని కలెక్టర్, ఆదిబట్ల మున్సిపాలిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బొంగ్లూర్ చౌరస్తాలో ధర్న, రస్తారోకోలు చేపట్టారు. పటేల్‌గూడలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ.. ఏ అధికారులు స్పందించడం లేదని ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
జనావాసాల్లో పరిశ్రమలు
రోగాల బారిన పడుతున్న ప్రజలు
ఆదిబట్లలో ఆందోళన బాట
పట్టించుకోని పాలకులు,
పీసీబీ అధికారులు
ఇళ్లను వదిలిపెడతాం..
కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలతో పుర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలతో ఆస్ప త్రుల పాలవుతున్నారు. ఆ కర్మాగారాలను జనవాసాలకు దూరంగా తరలించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. లేదంటే ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుంది. అధికారులు వెంటనే స్పందించాలి.
– రాజు, కాలుష్య వ్యతిరేక
పోరాట సమితి నాయకుడు
ప్రజలను కాపాడండి..
కాలుష్య కారక కంపెనీలను తరలించాలని చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ ప్రజలు ఉద్యమిస్తున్నప్పటికీ.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలి. కాలుష్యంనుంచి ప్రజలను కాపాడాలి. లేని పక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తాం.
– జి.నర్సింహారెడ్డి, స్థానికుడు, ఎంపీపటేల్‌గూడ
Comments
Please login to add a commentAdd a comment