దరఖాస్తుకు ఫిబ్రవరి 1 ఆఖరు
చేర్యాల(సిద్దిపేట): గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశంతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తుకు ఫిబ్రవరి 1 ఆఖరు తేదీ అని జిల్లా సమన్వయ అధికారి లింగాల పుల్లయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలవారు బోనఫైడ్, కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23న ఉంటుందన్నారు.
నూతన చట్టాలతో
మరింత రక్షణ
సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: మహిళలు, బాలికల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ ఏర్పడుతుందన్నారు. జిల్లాలో షీటీమ్స్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత నెలలో వివిధ కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 44మంది ఈవ్ టీజర్లను పట్టుకుని కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేపట్టినట్లు తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల వారిగా షీటీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్, సఖీ, భరోసా, స్నేహిత మహిళ సపోర్ట్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
వీరుల యుద్ధ స్ఫూర్తితో
ముందుకు సాగుదాం
గజ్వేల్: మహర్ వీరుల యుద్ధ స్ఫూర్తితో బహుజనులు ముందుకు సాగాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి పిలుపునిచ్చారు. బుధవారం ప్రజ్ఞాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీమ్ కోరేగావ్ మహర్ వీరుల యుద్ధ స్ఫూర్తి దినం సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏగొండస్వామి మాట్లాడుతూ కులతత్వానికి వ్యతిరేకంగా మహర్ సైనికులు 1818 జనవరి 1న పీష్వా సైన్యంతో పోరాడి విజయం సాధించిన రోజును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శౌర్య దినంగా ప్రకటించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు చంద్రం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
శబరిమలకు సైకిల్ యాత్ర
కోహెడ(హుస్నాబాద్): మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప దీక్షాపరుడు ఖమ్మం రమేశ్ కోహెడ నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర ద్వారా బయలుదేరారు. ఆయన 26 ఏళ్లుగా మాలధారణ చేస్తున్నారు. అయ్యప్ప దర్శనం కోసం నాలుగోసారి సైకిల్ పై యాత్రకు సంకల్పించారు. గతంలో ఒకసారి పాదయాత్ర ద్వారా శబరిమల వెళ్లారు. అయ్యప్ప దీక్షాపరులతో కలిసి ఇటీవల అయ్యప్ప సేవా సమితి ఏర్పాటు చేసుకొని.. కోహెడలో ఆలయం నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు.
ముగ్గులు వేస్తూ నిరసన
సిద్దిపేటరూరల్: సమగ్ర శిక్షా ఉద్యోగులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ముగ్గులు వేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ బుధవారం నాటికి చేపడుతున్న సమ్మె 23వ రోజుకు చేరిందన్నారు. ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేసి పేస్కేల్ అందించాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, కార్యదర్శి నవీన్, రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు.
భారీగా నకిలీ మందుల పట్టివేత
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం పారిశ్రామికవాడలోని ఆక్రన్ పరిశ్రమలో నకిలీ మందులను నార్కోటిక్ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ అధికారులు పరిశ్రమలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రముఖ పరిశ్రమలకు చెందిన దాదాపు రూ.2కోట్ల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment