కాంగ్రెస్ జెండా ఎగరాలి
హుస్నాబాద్‌రూరల్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లెలగడ్డలో మండల, క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ పల్లె నుంచే పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తానని మంత్రి తెలిపారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 126 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, యువతకు 55వేల ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల పనులు పూర్తి చేయించి పంటలకు సాగు నీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. మంజూరైన రోడ్ల పనులకు త్వరలో శంకు స్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. యూత్ కాంగ్రెస్ కమిటీలు పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీ అవకాశాలను కల్పిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందు, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, సరోజన, వల్లపు రాజు, కోమటి సరస్వతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
సంక్షేమ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment