IPL 2024 LSG VS GT: రాహుల్‌ సూపర్‌ కెప్టెన్సీ.. తిరుగులేని ట్రాక్‌ రికార్డు | IPL 2024 LSG Vs GT: LSG Lost Only One Game While Defending Total In Last 17 Games, See Details - Sakshi
Sakshi News home page

IPL 2024 LSG VS GT: రాహుల్‌ సూపర్‌ కెప్టెన్సీ.. తిరుగులేని ట్రాక్‌ రికార్డు

Published Mon, Apr 8 2024 10:03 AM | Last Updated on Mon, Apr 8 2024 10:42 AM

IPL 2024 LSG VS GT: LSG Lost Only One Game While Defending Total In Last 17 Games - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జట్టు తరఫున స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డు ఉంది. రాహుల్‌ ఎల్‌ఎస్‌జీ కెప్టెన్‌గా స్కోర్లను డిఫెండ్‌ చేసుకుంటూ గత 17 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకసారి ఓటమి చవిచూశాడు. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్‌ దిట్ట. ఈ సీజన్‌లో లక్నో గెలిచిన మ్యాచ్‌లే ఇందుకు ఉదాహరణ. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ 199 పరుగులకు విజయవంతంగా కాపాడుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్దిని 178 పరుగులకే పరిమితం చేశాడు. 

ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ 181 పరుగులను డిఫెండ్‌ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ సూపర్‌ కెప్టెన్సీ స్కిల్స్‌ ప్రదర్శించి ఆర్సీబీని 153 పరుగులకే పరిమితం చేశాడు. 

తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ ఇంకాస్త పరిణితి చెంది 163 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ తన సారధ్య నైపుణ్యాలను రంగరించి గుజరాత్‌ను 130 పరుగులకే పరిమితం చేశాడు. 

కెప్టెన్‌గా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లను డిఫెండ్‌ చేసుకోవడంతో రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భావి భారత కెప్టెన్‌ ఇతడే అంటూ అభిమానులు రాహుల్‌ను ఆకాశానికెత్తుతున్నారు. 

ధోని తర్వాత ధోని అంతటి వాడంటూ కితాబునిస్తున్నారు. ధోనిలాగే రాహుల్‌ కూడా వికెట్ల వెనుక ఊహలకందని వ్యూహరచన చేస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. యువ బౌలింగ్‌ లైనప్‌ను రాహుల్‌ అద్భుతంగా వినియోగించుకుంటున్నాడంటూ ప్రశంసిస్తున్నారు. 

మయాంక్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌ లాంటి అన్‌క్యాప్డ్‌ బౌలర్లు మ్యాచ్‌ విన్నర్లుగా మారడానికి రాహుల్‌ కెప్టెన్సీనే కారణమంటూ ఆకాశానికెత్తుతున్నారు. పంజాబ్‌, ఆర్సీబీపై మయాంక్‌.. తాజాగా గుజరాత్‌పై యశ్‌ ఠాకూర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. 

కాగా, గుజరాత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన గుజరాత్‌ 18.5 ఓవర్లలో 130 పరుగులకే చాపచుట్టేసింది. రాహుల్‌ సారథ్య నైపుణ్యం, యశ్‌ ఠాకూర్‌ సంచలన ప్రదర్శన (3.5-1-30-5) కారణంగా ఈ మ్యాచ్‌లో లక్నో తిరుగులేని విజయాన్ని అందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement