కాన్పూర్ టెస్టులో టీమిండియా ట్రైలర్ మాత్రమే చూపించిందని భారత జట్టు మాజీ సెలక్టర్ జతిన్ పరాజంపే అన్నాడు. ఆస్ట్రేలియాలో అసలు కథ చూడబోతున్నారంటూ రోహిత్ సేన ఆట తీరును కొనియాడాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25కి చేరువయ్యే క్రమంలో టీమిండియా మరో ముందుడుగు వేసిన విషయం తెలిసిందే.
ఆఖరి రెండు రోజుల్లో అద్భుతం
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత చెన్నై టెస్టులో 280 పరుగులతో జయభేరి మోగించిన భారత జట్టు.. కాన్పూర్‌లో డ్రాగా ముగుస్తందనుకున్న రెండో టెస్టులోనూ గెలుపు జెండా ఎగురవేసింది. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. ఆఖరి రెండు రోజుల్లో అద్భుతం చేసింది.
‘బజ్‌బాల్’ను తలదన్నేలా
బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను త్వరత్వరగా పడగొట్టడమే గాకుండా.. ఆ తర్వాత టీ20 తరహా ఇన్నింగ్స్‌తో దుమ్ములేపింది. దూకుడైన ఆట అంటూ ‘బజ్‌బాల్’ పేరు చెప్పే ఇంగ్లండ్ జట్టును మించిపోయే వేగవంతమైన బ్యాటింగ్‌తో టెస్టుల్లో తక్కువ బంతుల్లోనే 50, 100, 150, 200 ,250 పరుగుల మార్కు చేరుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఇక ఈ సిరీస్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో దుమ్ములేపిన స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. కాగా టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ అనంతరం.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం
ఆ తర్వాత నవంబరులో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో జతిన్ పరాంజపే స్పందిస్తూ.. ‘‘బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో అశ్విన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కాన్పూర్ టెస్టులో టీమిండియా ఏం చేసిందో మనమంతా చూశాం.
ఆస్ట్రేలియాలో అసలు స్టోరీ
ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఆస్ట్రేలియాలో అసలు స్టోరీ చూస్తారు’’ అని కంగారూ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ సేన మరింత అద్భుతంగా ఆడి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని జతిన్ పరాంజపే అంచనా వేశాడు. ఇక తనకు ఇష్టమైన భారత క్రికెటర్లు ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్‌లతో పాటు టీమిండియాకు దూరమైన ఓపెనర్ పృథ్వీ షా పేరు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment