![R Ashwin Breaks Silence On Non Consideration For ODI WC 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/17/indian%20team.jpg.webp?itok=ozrgXdHa)
ODI World Cup 2023: ‘‘నా చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నేనెప్పుడో నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ కెరీర్ సజావుగా సాగుతోంది. ప్రతికూల అంశాల గురించి అస్సలు ఆలోచించను. నెగటివిటీని దరిచేరనివ్వను’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.
వన్డేల్లో నో ఛాన్స్!
జట్టు ఎంపిక తన చేతుల్లో ఉండదని.. ఏదేమైనా ఈసారి భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్-2022తో అశ్విన్ పొట్టి ఫార్మాట్ జట్టులోకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2022లో 17 మ్యాచ్‌లలో 12 వికెట్లు పడగొట్టిన అశ్విన్ టీమిండియా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డేల్లో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు.
జడ్డూ ఉన్నాడు కదా!
ఇక వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ నేపథ్యంలోనూ మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాదే అశ్విన్‌పై పైచేయి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన అశూకు ప్రపంచకప్ జట్టులో స్థానం గురించి ప్రశ్న ఎదురైంది.
నేను ఆడినా.. ఆడకపోయినా
ఇందుకు బదులిస్తూ.. ‘‘జట్టు ఎంపికలో నా పాత్ర, ప్రమేయం ఉండదు. కాబట్టి ఆ విషయం గురించి నేనసలు పట్టించుకోను. ఇప్పటి వరకైతే.. నా జీవితంలో అసంతృప్తిగా ముగిసిన రోజంటూ ఏదీ లేదు. జట్టులో నాకు చోటు ఉన్నా లేకున్నా.. నేను మ్యాచ్ ఆడినా.. ఆడకపోయినా.. టీమిండియా మరోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉంది’’ అని అశ్విన్ తన మనసులోని మాట బయటపెట్టాడు.
డిసెంబరులో మళ్లీ
ఇక ఆటగాళ్లు గాయాల బారిన పడటం సహజమన్న అశ్విన్.. కేవలం వాటి కారణంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం మాత్రం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణిస్తున్నానని.. ఆల్‌రౌండర్‌గా కావాల్సినంత అనుభవం సంపాదించానని చెప్పుకొచ్చాడు.
రేసులో వాళ్లు
కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్లతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలవుతోందని.. డిసెంబరులో మొదలయ్యే సౌతాఫ్రికా టూర్ దాకా విశ్రాంతి దొరుకుతుందని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇక టీమిండియా స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి తదితరులు ప్రపంచకప్ రేసులో ఉన్నారు.
చదవండి: Ind vs Ire: ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే ఎవరు చూస్తారు? హౌజ్‌ఫుల్..
Comments
Please login to add a commentAdd a comment