సర్వేయర్ల నిర్లక్ష్యం.. రైతుకు శాపం
దగదర్తి (బిట్రగుంట): దగదర్తి మండలంలో భూముల రీసర్వే సందర్భంగా విలేజ్ సర్వేయర్లు చేసిన తప్పులు రైతుల పాలిట శాపాలుగా మారాయి. రీసర్వేకి సంబంధించి రైతులకు ఎటువంటి సమాచారం అందించకుండా, కార్యాలయాల్లో కూర్చుని ఇష్టారాజ్యంగా భూముల సరిహద్దులు మార్చేయడంతో రైతులు నరకం అనుభవిస్తున్నారు. పట్టా భూములను ప్రభుత్వ భూములుగా, భూముల విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఎకరా ఉన్న భూమిని అరెకరాగా మార్చేయడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రీసర్వే తప్పుల సవరణకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, స్థానికంగా సవరించేందుకు ఆన్‌లైన్‌లో ఎటువంటి ఆప్షన్ లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదవడంతో రైతులు ఈ దఫా పంట రుణాలు పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారు. అనంతవరం రెవెన్యూ విలేజ్ పరిధిలో శ్రీకాంత్ అనే విలేజ్ సర్వేయర్ చేసిన తప్పులకు సుమారు 50 మందికిపైగా రైతుల కమతాలు తారుమారయ్యాయి. చాలా మంది భూముల విస్తీరణంలోనూ తేడాలు రాగా, కొంత మందికి ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. సర్వే సమయంలో డబ్బులిచ్చిన రైతుల భూములు మాత్రమే పక్కాగా సర్వే చేశారని, డబ్బులివ్వని రైతుల విషయంలో ఉద్దేశపూర్వకంగా ఇష్టారాజ్యంగా రికార్డులు మార్చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న విలేజ్ సర్వేయర్ శ్రీకాంత్‌ను బోగోలు మండలానికి బదిలీ చేయడంతో దగదర్తిలో సమాధానం చెప్పే వాళ్లు కూడా కరువయ్యారు. దీంతో బాధిత రైతులు తమ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాత అడంగళ్ కాపీలు, ఇతర రికార్డులతో గ్రామ సభల్లో పదేపదే అర్జీలు ఇస్తున్నారు. కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలతో తహసీల్దార్ కార్యాలయం అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకూ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక, రైతులకు సర్ది చెప్పలేక మౌనం వహిస్తున్నారు.
కలెక్టర్ స్పందిస్తేనే న్యాయం
జిల్లాలో భూముల రీసర్వే తప్పుల సవరణ ప్రక్రియ అంతా గందరగోళంగా తయారైంది. ఇప్పటికి రెండు విడతలుగా గ్రామసభలు నిర్వహించి అర్జీలు స్వీకరించినా సవరణకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. మరో వైపు రైతులు విడిగా అర్జీలు తీసుకుని తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్‌లోని భూరికార్డుల విభాగం చుట్టూ తిరుగుతున్నారు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించడంతో సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ స్పందించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే తప్ప రైతుల కష్టాలు తొలగే పరిస్థితి కనిపించడం లేదు.
విలేజ్ సర్వేయర్లపై చర్యలకు డిమాండ్
రైతుల భూములు ఇష్టారాజ్యంగా మార్చేసిన విలేజ్ సర్వేయర్లపై రైతులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. డబ్బుల కోసం భూముల హద్దులు మార్చేసి ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని, తాము మాత్రం నెలల తరబడి తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన విలేజ్ సర్వేయర్లపై కఠిన చర్యలు చేపట్టాలని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెవెన్యూ గ్రామ స్థాయిలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వం రీ సర్వే ప్రక్రియను చేపట్టింది. అయితే క్షేత్రస్థాయిలో విలేజ్ సర్వేయర్లు చేసిన తప్పిదాలు, నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపంగా మారింది. యాజమాన్య హక్కుల కాలంలో అస్తవ్యస్తంగా నమోదు చేయడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. సమస్య ఎదురైనప్పటి నుంచి రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలిచ్చినా.. ఫలితం లేకుండాపోతోంది. పట్టా భూములను ప్రభుత్వ భూములుగా, అటవీశాఖ భూములుగా రికార్డుల్లో పొందుపరిచారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి.. అభ్యంతరాలు తెలపాలని కోరారు. అధికారులు మాత్రం రైతుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలకు విరుద్ధంగా సర్వేయర్లు తప్పుల తడకలుగా రికార్డులు మార్చేశారు.
భూవివాదాల పరిష్కారానికి గత ప్రభుత్వం చేపట్టి రీసర్వే
రీసర్వే జరిగిన గ్రామాల్లో భూముల హక్కులు మార్చేసిన సర్వేయర్లు
విలేజ్ సర్వేయర్ల చేసిన తప్పిదాలకు రైతులు అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment