పంట నష్టం పరిహారానికి కొత్త మెలికలు
నెల్లూరు (సెంట్రల్): ఒక పక్క పెట్టుబడి సాయం అందక, మరో పక్క దారుణంగా పతనమైన ధాన్యం ధరల నేపథ్యంలో రైతులు భవిష్యత్‌ను తలుచుకుని దిగాలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పులిపై పుట్రలా.. గత ప్రభుత్వం ఉచితంగా అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. బీమా ప్రీమియంను రైతులే చెల్లించాలంటూ నిబంధన విధించింది. ఇప్పటికే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా పథకానికి పంగనామాలు పెట్టింది. మరో పక్క ధాన్యం ధరలు తగ్గిపోతున్నా.. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది.
కేవలం 1,974 మంది రైతులే చెల్లింపు
జిల్లాలో దాదాపు 3.25 లక్షలకుపైగా రైతులు ఉండగా, 9 లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగు జరుగుతుండగా ప్రభుత్వం అనేక దఫాలుగా గడువు పొడిగించుకుంటూ వెళ్లినా.. కేవలం 1,974 మంది రైతులు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించడం గమనార్హం. టీడీపీ పాలనలో బీమా చెల్లించడం ఇదొక దండగ అనే అభిప్రాయం రైతులు ఉంది. గతంలోనూ టీడీపీ అధికారంలో ఉండగా రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా.. ఏనాడు రైతులకు నష్టం జరిగినా పరిహారం దక్కిన పరిస్థితులు లేవు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందని రైతుల్లో నిరాస్తకత కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు గడువు పొడిగించినప్పటికీ రైతుల నుంచి స్పందన కరువైందని అర్థమవుతోంది.
గతంలో అందరికీ..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం ఒక రూపాయి చెల్లించి బీమాలో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత నుంచి రైతుల తరపున ప్రభుత్వమే బీమా చెల్లించి ఉచిత పంటల బీమాను అమలు చేసింది. రైతు పొలం యూనిట్‌గా తీసుకుని పరిహారం అందించింది. దీంతో రైతులు కూడా దీమాగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
ప్రీమియం సొమ్మును కాజేసే కుట్ర
జిల్లాలో 7.77 లక్షల ఎకరాల్లో అధికారిక ఆయుకట్టు, అనధికారికంగా మరో 1 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. సుమారుగా 9 లక్షల ఎకరాల్లో పంట వరి సాగు జరుగుతుందని అంచనా. హెక్టార్‌కు రూ.470 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఎకరాకు రూ.170 ప్రీమియం పడుతుంది. 9 లక్షల ఎకరాలకు ప్రీమియం కట్టిస్తే.. సుమారు రూ.15.30 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. ఈ ప్రీమియం మొత్తాన్ని గత ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రీమి యం మొత్తాన్ని చెల్లించడం నుంచి తప్పుకుని ఆ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేసి ఖజానా నింపుకోవాలని చూస్తోంది. ఇప్పటికే గతేడాది డిసెంబరు 31వ తేదీ వరకు దాదాపు మూడు సార్లు ప్రీమియం చెల్లింపునకు తుది గడువు విధించింది. రైతులు ముందుకు రాకపోవడంతో తాజాగా ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది.
రైతులు పంటలకు సంబంధించి బీమాలో నగదు నమోదు చేసుకున్నా.. ఒక్కో పంటకు ఒక్కో రకంగా నిబంధనలు పెట్టడంతో రైతులు కూడా ముందుకు రావడం లేదు. వరికి గ్రామ యూనిట్, మినుము, శనగ పంటలకు మండల యూనిట్‌గా, పెసర, వేరుశనగ పంటలకు జిల్లా యూనిట్‌గా తీసుకోవడంతో పాటు, గత ఐదేళ్ల కాలంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా, ఎంత మేర నష్టం వచ్చిందో దానికి అనుగుణంగా బీమా ఇస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో రైతులు కూడా ఈ బీమా నగదు కట్టినా, నష్టం వాటిల్లినా ఇచ్చేది ఉండదనే నిర్ధారణతో ముందుకు రాలేదని పలువురు పేర్కొంటున్నారు.
పంటల బీమా ప్రీమియం చెల్లించడానికి రైతుల ససేమిరా
జిల్లాలో సుమారు 7.77 లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు
దాదాపు 3.25 లక్షల వరకు రైతులు
ఇప్పటి వరకు కేవలం బీమా కట్టింది.. 1,974 మంది రైతులే
పరిహారం చెల్లింపుల్లోనూ మెలికలు
పెట్టడమే కారణం
ఈ నెల 15వ తేదీతో ముగిసిన గడువు
బీమా
Comments
Please login to add a commentAdd a comment