పండుగ సమయాల్లో రద్దీ..
ముఖ్యమైన పండుగల సమయంలో రైళ్లలో సీట్లు దొరకవు. బస్సుల్లో సీట్లు ఫుల్ అవుతాయి. ఉన్నఫలంగా ఊరెళ్లాలనుకునే వారికి కార్ పూలింగ్ బాగా ఉపయోగపడుతోంది. నిమిషాల్లో సీటు దొరకడం.. గంటల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోవడం.. చకచకా జరిగిపోతున్నాయి.
సాక్షి, పుట్టపర్తి
అద్దె కారు ప్రయాణం ఖరీదైంది. ఇద్దరు.. నలుగురు కలిసి హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నుంచి పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లాలంటే రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు అవుతోంది. బస్సుల్లో రద్దీ, సమయం వృథా, సిటీలో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో చాలామంది కారులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ.. కారు ప్రయాణాన్ని చౌక ధరలకే అందిస్తోంది. ‘కార్ పూలింగ్’కు కొన్ని మొబైల్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో జిల్లాలోని చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు.
పెరిగిన ‘కార్ పూలింగ్’ కల్చర్..
కర్ణాటక సరిహద్దున ఉండే జిల్లాలో కార్ పూలింగ్ సంప్రదాయం పెరిగిపోతోంది. డిమాండ్‌కు అనుగుణంగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ఫలితంగా విద్యార్థులు, ఉద్యోగులు కార్ పూలింగ్ ద్వారా బెంగళూరుకు వెళ్లి వస్తున్నారు. ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, గోరంట్ల, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన చాలామంది ఉద్యోగులు, రియల్ ఎస్టేట్, వ్యాపారులు, చిరుద్యోగులు, కూలీలు కార్ పూలింగ్‌లో రోజూ ప్రయాణిస్తున్నారు. తక్కువ చార్జీకే కారు ప్రయాణం అందుబాటులోకి రావడంతో రాకపోకలు సాగించే వారి సంఖ్య రెట్టింపయ్యింది.
నచ్చిన చోట పికప్, డ్రాప్..
బెంగళూరు వంటి నగరాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో దిగి.. అక్కడి నుంచి ఇంటికెళ్లాలంటే క్యాబ్‌కు రూ.200, రూ.300 చెల్లించాల్సిన పరిస్థితి. అదే యాప్ ద్వారా కార్లలో వెళ్తే నచ్చిన చోట పికప్, డ్రాప్ సదుపాయం ఉంటుందని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అందువల్లే పుట్టపర్తి, గోరంట్ల, పెనుకొండ నుంచి బెంగళూరు వెళ్లే వారు కార్ పూలింగ్ సంప్రదాయాన్నే అనుసరిస్తున్నారు.
ఆర్నెల్లలో పెరిగిన వ్యాపారం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో చాలా మంది ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు దినకూలీలు రోజూ బెంగళూరు వెళ్లి వస్తుంటారు. రైళ్లు సమయానికి అందుబాటులో లేకపోవడం.. బస్సుల్లో వెళ్తే చార్జీలు ఎక్కువగా ఉండటంతో కార్ పూలింగ్ కల్చర్‌కు అలవాటు పడ్డారు. ఈ ఏడాదిలోని తొలి ఆర్నెల్లతో పోలిస్తే.. తర్వాత ఆర్నెల్లలో రాకపోకలు సాగించే వారి సంఖ్య రెట్టింపయినట్లు కార్ పూలింగ్ నిర్వాహకులు చెబుతున్నారు.
జిల్లాలో పెరుగుతున్న
‘కార్ పూలింగ్’ కల్చర్
తక్కువ ధరకే మెట్రో సిటీ
బెంగళూరుకు ప్రయాణం
నచ్చిన చోట పికప్, డ్రాప్ సదుపాయం
ఉద్యోగులంతా ‘కార్ పూలింగ్’కే మొగ్గు
సమయంతో పాటు
డబ్బు, ఇంధనం ఆదా
పెరిగిన టెక్నాలజీతో
ఎందరికో ఉపయోగం
సమయానికి గమ్యస్థానం చేరేందుకు అవకాశం
సమయం, ఇంధనం ఆదా..
కార్ పూలింగ్‌తో సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతోంది. ఒకే కారులో నలుగురు ప్రయాణిస్తున్న కారణంగా డబ్బు షేరింగ్ చేసుకుంటారు. ఒకసారి ఇంధనం కొట్టించి.. అందరూ ఒకేసారి ప్రయాణిస్తారు. ఎవరికి వారుగా ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో వెళ్తే డబ్బు ఖర్చు కావడంతో పాటు ఇంధనం వృథా అవుతుంది. ట్రాఫిక్‌జామ్ అవుతుంది.
రెండు విధాలుగా లాభమే..
కార్లు లేని వారికే కాదు.. సొంత వాహనాలు ఉన్న వారికి కూడా కార్ పూలింగ్ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. వారంతపు సెలవులు, పండుగల సమయాల్లో సొంతూళ్లకు వస్తున్న వారు.. యాప్ ద్వారా ఇతరులను వాహనాల్లో తీసుకొచ్చి.. లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులను ఊర్లో దింపి.. తిరుగు పయనంలో ఒంటరిగా వెళ్తున్న సమయంలో చాలామంది యజమానులు ఈ యాప్ ద్వారా ప్రయాణికులను తీసుకెళ్తుంటారు. బ్లాబ్లా, క్విక్ రైడ్ తదితర యాప్‌లపై చాలామంది అవగాహన కలిగి ఉన్నారు. బస్సు చార్జీలనే కార్లలో కూడా తీసుకుంటున్న నేపథ్యంలో చాలామంది కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
కార్ పూలింగ్ అంటే
బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్న అతను తన కారులో ఇతరులను చార్జీ తీసుకుని ఎక్కించుకోవడం. ఇలా ఒకే కారులో నలుగురు, ఐదుగురు కలిసి బస్సు చార్జీల రూపంలో చెల్లిస్తారు. తక్కువ ఖర్చుతో కారులో ప్రయాణించే విధానం. నచ్చిన చోట పికప్, డ్రాపింగ్ ఉండటంతో చాలామంది మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కారులో డ్రైవరు మాత్రమే వెళ్లే సందర్భంలో.. ఇతరులను బస్సు చార్జీల రేటుకే అనుమతించి ఎక్కించుకుని ప్రయాణించడం. ప్రముఖ నగరాల్లో వ్యాప్తి చెందిన కార్ పూలింగ్ విధానం చిన్న చిన్న పట్టణాల వరకు వ్యాపించడం విశేషం.
జిల్లా కేంద్రం పుట్టపర్తి నుంచి బెంగళూరుకు 155 కి.మీ దూరం ఉంటుంది. గతంలో అయితే ఉదయం బయలుదేరితే ఏ సాయంత్రానికో చేరుకునే వారు. కానీ ఇప్పుడు ఒకే
రోజులో వెళ్లి వచ్చేస్తున్నారు. దినసరి కూలీలు కూడా ఇప్పుడు ఉదయం వెళ్లి పని చేసుకుని కూలి డబ్బులతో తిరిగి సాయంత్రం గూటికి చేరుతున్నారు. పెరుగుతున్న సాంకేతిక
పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ‘కార్ పూలింగ్’ కల్చర్‌కు అలవాటు పడ్డారు. దీంతో ‘కారు’చౌక ప్రయాణం సాగిస్తున్నారు. ఫలితంగా వినియోగదారులకు అనుకూలంగా
చాలామంది కార్లు కొని పూలింగ్ విధానం అనుసరిస్తున్నారు.
పుట్టపర్తికి చెందిన ఓ వ్యక్తి యలహంకలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంటాడు. బెంగళూరులో ఫ్యామిలీ పెట్టాలంటే ఖర్చు కూడుకున్న పని అందుకే స్వగ్రామం నుంచే రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. ఇందుకోసం ‘కార్ పూలింగ్‘ను ఎంచుకున్నాడు. బస్సు చార్జీల రేటుకే గంటల వ్యవధిలోనే గమ్యస్థానం చేరుకుంటున్నట్లు చెబుతున్నాడు.
గోరంట్లకు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు జాలహళ్లిలో ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరారు. కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లడం కుదరక రోజూ బెంగళూరు వెళ్లి అక్కడ పనులు చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా ‘కారు పూలింగ్’ సేవలు వినియోగించుకుంటున్నట్లు వివరించారు. బస్సు చార్జీల కంటే తక్కువే ఉంటోందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment