ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 228 అర్జీలను అందగా, పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై విచారిస్తారని, అందువల్ల అధికారులంతా ముందుగానే అర్జీల పరిష్కారంపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయాన్ని గుర్తించి అర్జీదారు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వడంతో పాటు, వారి అభిప్రాయాన్ని సైతం తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య పరిష్కారం అయినప్పుడు మాత్రమే డిస్పోజ్ చేయాలనీ, అలా కాకుండా తప్పుడు ఎండార్స్‌మెంట్‌లు ఇచ్చినా, సమాధానం సక్రమంగా ఇవ్వకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు కేసులు, ఆర్థికపరమైన సమస్యలతో ముడిపడిన అర్జీలు తప్ప మిగతా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనన్నారు.
అర్జీదారుల కోసం
ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారి కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్జీదారులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. అలాగే డివిజన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, ఉమ్మడి జిల్లా జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఎల్‌డీఎం రమణకుమార్, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, డీఎంహెచ్‌ఓ సైరా బేగం, డీఈఓ కృష్ణప్ప, సివిల్ సప్లయీస్ అధికారి వంశీకృష్ణారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు,ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment