టిడ్కో ఇళ్లలో మందు, చిందు
కదిరి అర్బన్: మున్సిపల్ పరిధిలోని టిడ్కో భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గత టీడీపీ హయాంలో (2018) పట్టణంలోని 36 వార్డులకు చెందిన సుమారు 3 వేల మంది పేదలకు ఇక్కడ ఇళ్లు కేటాయించారు. ఈ భవనాలు 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. చాలా ఇళ్లు అసంపూర్తిగా ఉండిపోయాయి.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..
టిడ్కో భవనాలు అసంపూర్తిగా నిలిపివేయడంతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. రోడ్డుకు పక్కనే ఈ భవనాలు ఉండడంతో మందుబాబులు తమ అడ్డాగా మార్చుకున్నారు. దాంతో పాటు కొందరు ఈ భవనాల్లో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
భయపడిపోతున్న విద్యార్థినులు..
టిడ్కో ఇళ్ల సమీపంలోనే కస్తూర్బా బాలికల విద్యాలయం ఉంది. అక్కడ సుమారు 270 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం టిడ్కో భవనాల మీదుగానే పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. భవనాల చుట్టూ కంపచెట్లు, నడుము వరకు గడ్డి పెరగడంతో విషసర్పాలు సంచరిస్తున్నాయి. అలాగే అసంపూర్తిగా ఉన్న టిడ్కో భవనాల్లో కొందరు మద్యం సేవిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతుంటారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న విద్యార్థులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే దిక్కెవరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేందుకు టిడ్కో భవనాలపైకి ఎక్కి సెల్ఫీలు దిగడం లాంటివి చేస్తున్నారు. జరగరానిది జరిగితే జరిగే నష్టం ఎవరూ ఊహించలేదని. అందువల్ల పోలీసులు వెంటనే స్పందించి పగలు, రాత్రి ఒకసారి గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
భద్రత కల్పించాలి
ఇటీవల ఎక్కడ చూసినా బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. విద్యాసంస్థల పరిసరాల్లోనూ భద్రత పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కదిరి కసూర్బా బాలికల పాఠశాల పట్టణ శివారులో టిడ్కో ఇళ్ల వెనుక ఉంది. అసంపూర్తిగా ఉన్న టిడ్కో భవన సముదాయాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
– శివశంకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి,
వైఎస్సార్ ఎస్‌యూ
సిబ్బందిని రోజూ పంపిస్తాం
టిడ్కో భవనాల వద్దకు పోలీసులను రోజు రౌండ్స్‌కు పంపిస్తా. ఎవరైనా అక్కడ మద్యం సేవిస్తూ ఉన్నా..ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలూ సమాచారం ఇవ్వవచ్చు. తప్పక చర్యలు తీసుకుంటాం.
– నారాయణరెడ్డి, పట్టణ సీఐ
జనవరిలో పనులు
‘టిడ్కో’ భవనాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఇదివరకే రాష్ట్ర పురపాలక శాఖమంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్‌లతో సమావేశం నిర్వహించారు. జనవరిలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉంది. జూన్‌లోపు లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
– కిరణ్‌కుమార్,
మున్సిపల్ కమిషనర్, కదిరి
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
సమీపంలోనే కస్తూర్బా పాఠశాల
భయం భయంగా గడుపుతున్న
విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment