నేటి నుంచి గోదావరి జలాల పునరుద్ధరణ
అర్వపల్లి: యాసంగి సీజన్‌కు గాను జిల్లాకు గోదావరి జలాలను వారబందీ విధానంలో గురువారం పునరుద్ధరించనున్నారు. ఈ సీజన్‌కు ఈనెల 1 నుంచి 9 వరకు వారబందీ విధానంలో జిల్లాకు గోదావరి జలాలు విడుదలైన విషయం తెలిసిందే. తిరిగి నేటి నుంచి ఈ నెల 23 వరకు వారం రోజులపాటు జలాలు విడుదల చేస్తామని బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా కాలువలకు నష్టం కలిగించకుండా వినియోగించుకోవాలని కోరారు.
25 నుంచి సీపీఎం
రాష్ట్ర మహాసభలు
నల్లగొండ టౌన్: సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మహాసభల వాల్ పోస్టర్‌ను బుధవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో పార్టీ శ్రేణులుతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభల్లో భాగంగా మొదటి రోజు 25న ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున, వెంకటేశ్వర్లు, గంజి మురళి, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.
వాసవీ క్లబ్ జిల్లా చైర్మన్‌గా కొత్త లక్ష్మణ్
నేరేడుచర్ల: వాసవీ క్లబ్ జిల్లా నూతన చైర్మన్‌గా నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొత్త లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆ క్లబ్ జిల్లా గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ వాసవీ క్లబ్ బలోపేతానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
‘రైతు భరోసా’
అమలుపై అవగాహన
మునగాల: రైతు భరోసా పథకం అమలుపై బుధవారం మునగాల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శిరీష.. వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ శాఖ, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ సిబ్బంది గ్రామాల్లో సాగు భూముల సర్వే చేపట్టాలన్నారు. గురువారం గణపవరం, కలకోవ, మాధవరం, రేపాల గ్రామాల్లో సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించాలని ఆదేశించారు. సదస్సులో ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్, తహసీల్దార్ వి.ఆంజనేయులు, వ్యవసాయాధికారి బి.రాజు పాల్గొన్నారు.
చేనేత అభయ హస్తానికి నిధులు విడుదల
నల్లగొండ టూటౌన్: చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం తెలంగాణ అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరించి నిధులు విడుదల చేసినట్లు చేనేత జౌళి శాఖ ఏడీ ద్వారక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకం కింద కార్మికులు వారి వేతనంలో 8 శాతం (1,200) పొదుపు చేసుకుంటే ప్రభుత్వం 16 శాతం (రూ.2,400) జమ చేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంలో ఉన్నవారు మరణిస్తే చేనేత భద్రత కింద రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుందని పేర్కొన్నారు. నేతన్న భరోసా పథకం కింద ప్రతి కార్మికునికి సంవత్సరానికి రూ.18వేలు, అనుబంధ కార్మికుడికి రూ.6వేలు వారి ఖాతాల్లో జమ చేయనుందని తెలిపారు. ఈ పథకాలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలవుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment