భారత్ లో ఏఐ జోరు | Work Trend Index 2024 Study on AI | Sakshi
Sakshi News home page

భారత్ లో ఏఐ జోరు

Published Thu, May 30 2024 4:50 AM | Last Updated on Thu, May 30 2024 4:50 AM

Work Trend Index 2024 Study on AI

కృత్రిమ మేధను వినియోగిస్తున్న 92% మంది

ఏఐని వినియోగించుకోవడంపై 91% మంది ఆసక్తి

ఏఐ స్కిల్క్‌ ఉన్నవారి వైపే 80% కంపెనీల మొగ్గు

మైక్రోసాఫ్ట్‌–లింక్డ్‌ఇన్‌ వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ సర్వే వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతికత – విజ్ఞానం ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో 92 శాతం మంది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఏఐ)ను వినియోగిస్తున్నారని వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌–2024 అధ్యయనం వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, లింక్డ్‌ ఇన్‌ సంయుక్త ఆధ్వర్యంలో 31 దేశాలలో 31 వేల మందిపై చేపట్టిన ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

దాదాపు 91 శాతం మంది భారతీయులు తమ రంగాల్లో పోటీతత్వాన్ని కొనసాగించడానికి కృత్రిమ మేధను వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉండగా, 54 శాతం మంది ఉద్యోగులు వారి ఆఫీస్‌లలో ఏఐ ప్రణాళికలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. 

ఏఐ అవగాహన లేకపోతే కష్టమే
రానున్న ఏడాదిలో ఏఐ ఉద్యోగస్తుల ప్రతిభ, ఉద్యోగ అవకాశాలపై  ప్రభావం చూపించనుంది. భారత్‌లోని 75 శాతం సంస్థలు ఏఐ పరిజ్ఞానంపై అవగాహన లేనివారికి ఉద్యోగాలు ఇవ్వడానికి నిరాసక్తతతో ఉన్నాయని, ఈ సూచీ ప్రపంచ వ్యాప్తంగా 66 శాతం మాత్రమే ఉందని సర్వే ఫలితాలు తెలిపాయి. ముఖ్యంగా 80 శాతం సంస్థలు అనుభవం తక్కువ ఉన్నా సరే ఏఐ స్కిల్స్‌ ఉంటే చాలని, అవి లేకుండా ఎంత అనుభవమున్నా తమకొద్దని తేల్చి చెబుతున్నాయి. 

మరోవైపు దేశంలోని ఉద్యోగుల్లో ఏఐ వినియోగంపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది ఉద్యోగులు వారి వృత్తిలో భాగంగా ఏఐని వాడుతుంటే, భారత్‌లో 92 శాతం మంది వినియోగించడం విశేషం. ఇది సమయాన్ని ఆదా చేయడంతో పాటు సృజనాత్మకతను పెంచుతుందని భారతీయులు భావిస్తున్నారు. ఏఐ వినియోగం కోసం 72 శాతం మంది భారతీయులు సొంత ఏఐ సాధనాలను ఆఫీస్‌లకు తీసుకువెళుతుండటం గమనార్హం. 

ముఖ్యంగా ఉద్యోగులు కోపైలెట్, చాట్‌ జీపీటీ వంటి ఏఐ నైపుణ్యాలను వారి ప్రొఫైల్‌లో జోడిస్తూ అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్కిల్స్‌ పెంచుకునే క్రమంలో లింక్డ్‌ ఇన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ నేర్చుకునే వారి సంఖ్య 160 శాతం పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా–దక్షిణాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇరినా ఘోష్‌ మాట్లాడుతూ.. ‘వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ అందించిన సమాచారం ప్రకారం కృత్రిమ మేధ అన్ని రంగాల్లో భాగమైంది. ముఖ్యంగా భారత్‌ ఇతర దేశాల కన్నా అత్యధికంగా 92 శాతం ఆసక్తి రేటుతో ఉత్తమ భవిష్యత్‌ను నిర్మించుకుంటోంది. ఇది దాదాపు అన్ని రంగాలలో విస్తరించడం గమనించాం..’ అని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement