అరణియార్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
మల్లిమడుగు గేట్లు..
రేణిగుంట: మండలంలోని కరకంబాడి సమీపంలో ఉన్న మల్లిమడుగు రిజర్వాయర్ నిండడంతో అధికారులు 11 గేట్లు ఎత్తి వేసి రిజర్వాయర్‌లోని నీటిని బయటకు విడుదల చేశారు. కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఇప్పటికే రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. మళ్లీ బుధవారం రాత్రి నుంచి జోరువాన కురవడంతో రిజర్వాయర్ పైభాగంలో ఉన్న శేషాచలం అడవుల నుంచి భారీగా వరద నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్‌కు ఉన్న 11 గేట్లు ఎత్తి వేసి నీటిని బయటకు విడుదల చేశారు. మల్లిమడుగు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఆశ్వాదిస్తున్నారు.
నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టు నిండిపోవడంతో అధికారులు గురువారం ప్రాజెక్టుకు ఉన్న రెండు గేట్లను ఎత్తి, నీటిని బయటకు విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా బుధవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిచ్చాటూరు మండలంలో 40.01 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో పిచ్చాటూరులోని అరణియార్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఈ క్రమంలో గురువారం 11 గంటలకు ఇరిగేషన్ డీఈ రామచంద్ర ఆధ్వర్యంలో రెండు స్పిల్‌వే గేట్లను తెరిచి నీటిని బయటకు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అరణియార్ ప్రాజెక్టులో 281 అడుగులు మేరకు 1.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 280.5 అడుగుల నీరు చేరిందన్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 6 వేల క్యూసెక్కు నీరు వచ్చి చేరుతుందన్నారు. దీంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. అరణియార్ పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ఏఈ లోకేశ్వర్‌రెడ్డి, ఈఈ మదన్‌గోపాల్, తహసీల్దార్ రమేష్ బాబు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment