విద్యుత్ సేవల్లో జాప్యం వద్దు
తిరుపతి రూరల్: వినియోగదారులకు సకాలంలో విద్యుత్ సేవలందించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. స్థానిక తిరుపతి సర్కిల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం తిరుపతి, చిత్తూరు జిల్లాల విద్యుత్ శాఖాధికారులతో ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ వారి మన్ననలను పొందాలని సూచించారు. అదేవిధంగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాననే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. సంస్థ పరిధిలో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణను సకాలంలో పూర్తి చేసి, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని చెప్పారు. అంతకుముందు ఆయన పచ్చికాపల్లం సమీపంలోని ఏపీ ట్రాన్స్‌కో ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సమావేశంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్లు వరకుమార్, పీహెచ్ జానకీరామ్, ఏపీఈఆర్సీ ఓఎస్డీ మునిశంకరయ్య, సూపరింటెండింగ్ ఇంజినీర్లు సురేంద్ర నాయుడు (తిరుపతి), ఇస్మాయిల్ (చిత్తూరు), సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment