సైదాపురం మండలం, గిద్దలూరు గ్రామంలో కూటిమి నేతల వాగ్వాదం
ఆయకట్టు.. కనికట్టు!
జిల్లాలో 610 సాగునీటి సంఘాలకుగాను 602 చోట్ల ఏకగ్రీవం
టీడీపీ నేతల విభేదాలతో 8 చోట్ల వాయిదా
అధికార పార్టీ నేతలకు సాగిలపడిన అధికారులు
ఏకగ్రీవాల కోసం అడ్డదారులు
దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. రైతుల మాటున అధికార పార్టీ నేతలు చెలరేగిపోయారు. అధికారుల సహకారంతో ప్రత్యర్థులు లేకుండా ఏకగ్రీవానికి ఉసిగొల్పారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ భయాందోళనకు గురిచేశారు. పోలీసుల సహకారంతో కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఇదిచాలదన్నట్టు టీడీపీ నేతలు కొందరు జట్లుగా విడిపోయి ఘర్షణలకు దిగారు. మొత్తం మీద సాగునీటి సంఘాలన్నింటినీ అధికార పార్టీ నేతలే దక్కించుకున్నారు.
తిరుపతి అర్బన్: జిల్లాలో అన్నదాతలకు చెందిన సాగునీటి సంఘాల ఎన్నికలను రాజకీయం చేశారు. కూటమి నేతలకు అధికారులు సైతం సాగిలపడిపోయారు. ప్రతిపక్షం అనేదే లేకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు. సకాలంలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు. ఒక వేళ ఇచ్చినా స్క్రూట్నీ పేరుతో వారి నామినేషన్లు తిరస్కరించారు. జిల్లాలో మొత్తం 610 సాగునీటి సంఘాలను ఏకగ్రీవం చేయాలని నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. టీడీపీ నేతల మధ్య విభేదాల కారణంగా 8 చోట్ల ఫలితాలు వాయిదా వేశారు. మిగిలిన 602 చోట్ల వారు అనుకున్న వారికే ఆయకట్టు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఏకపక్షంగా కట్టబెట్టేశారు.
నామినేషన్ పత్రాల చించివేత
సత్యవేడు నియోజకవర్గం, బుచ్చినాయుడుకండ్రిగ మండలం పరిధిలో కాళంగి నది కుడి కాలువకు చెందిన నీర్పాకోట, గాజులపెళ్లూరు, కాంపాళెం గ్రామా ల ఆయకట్టు కమిటీకి సంబంధించి టీడీపీ నేత సత్యనారాయణ నామినేషన్ వేయడానికి వచ్చారు. అయి తే అదే పార్టీకి చెందిన దిలీప్ వాటిని చించివేశారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఏఈ అబ్దుల్‌కలాం బాషా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు దిలీప్‌తోపాటు ఆయన అనుచరులు మునిసుబ్బయ్య, బాబును ఆదుపులోకి తీసుకున్నారు.
మితిమీరిన అధికారుల జోక్యం
సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికారుల జోక్యం మితిమీరింది. చంద్రగిరి నియోజకవర్గం, కుంట్రపాకం చెరువు కమిటీకి ఓ రైతు పోటీ చేయడానికి వెళితే రెవెన్యూ వారు ఇచ్చిన నో డ్యూస్ సర్టిఫికెట్ సక్రమంగా లేదంటూ అతన్ని అనర్హుడుగా ప్రకటించారు. గూడూరు నియోజకవర్గంలో 105 ఏకగ్రీవం చేశారు. చిల్లకూరు మండలం, తొనుకుమాల రెండు చెరువులకు రైతు చక్రపాణిరెడ్డి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఓడూరు చెరువుకు ఓ రైతు పోటీ చేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
భగ్గుమన్న విభేదాలు
టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం, సైదాపురం మండలం, గిద్దలూరుకు చెందిన రెండు చోట్ల ఫలితాలను ప్రకటించకుండా వాయిదా వేశారు. అలాగే కోట మండలంలోని ఉత్తమ నెల్లూరుకు చెందిన చెరువు కమిటీకి అబ్బాయి, బాబాయి పోటీ చేయడం.. వారి మధ్య విభేదాలు తలెత్తడంతో ఫలితాలను వాయిదా వేశారు. దొరవారిసత్రం మండలం, కల్లూరు పరిధిలోని ఓ చెరువు కమిటీకి, మేలుపాక, ఉచ్చూరు ఆయకట్టు సంఘాల ఫలితాలు కూడా వాయిదా పడ్డాయి. అలాగే బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కాళంగి నది కుడి కాలువ పరిధిలోని ఎన్నికలను వాయిదా వేశారు. అదే మండలంలో కరకంబట్టు చెరువు కమిటీని కూడా వాయిదా వేశారు.
జిల్లా సమాచారం
నియోజకవర్గం; కమిటీలు; ఏకగ్రీవం; వాయిదా పడ్డవి
గూడూరు; 105; 103; 01
సూళ్లూరుపేట; 141; 139; 02
వెంకటగిరి; 109; 107; 03
సత్యవేడు; 107; 105; 02
చంద్రగిరి; 39; 39; 0
శ్రీకాళహస్తి; 109; 109; 0
మొత్తం; 610; 603; 08
అల్లంపాడులో ఏకగ్రీవం
కోట : సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు కుయుక్తులు చేసినా కోట మండలంలోని అల్లంపాడులో పోచారెడ్డి రాజారాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అల్లంపాడు చెరువు ఆయకట్టు రైతులు పెద్ద సంఖ్యలో పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ సర్పంచ్ పోచారెడ్డి రాజారాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అయితే అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన వారిని అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు పలు కుట్రలు చేశారు. అయితే రైతులందరూ పోచారెడ్డి రాజారాంరెడ్డికి మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. రాజారాంరెడ్డిని పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి అభినందించారు.
తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. మండలంలోని 13 చెరువులు, కాళంగి ప్రాజెక్టు కాలువ కిందనున్న 9 చెరువుల సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. బుచ్చినాయుడుకండ్రిగలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కాళంగి ప్రాజెక్టు కుడి కాలువకు చెందిన నీర్పాకోట, కాంపాళ్లెం, గాజులపెళ్లూరు చెరువుల టీసీలకు టీడీపీకి చెందిన సత్యనారాయణ, దిలీప్ నామినేషన్ వేశారు. ఇరువురికి చెందిన టీడీపీ శ్రేణులు గొడవపడి బాహాబాహీకి దిగారు. గొడవను పోలీసులు అదుపు చేయలేక ఇబ్బంది పడ్డారు. సత్యనారాయణ నామినేషన్‌ను దిలీప్, ఆయన అనుచరులు బాబు, మునిసుబ్బయ్య చించివేశారు. ఎస్‌ఐ విశ్వనాథనాయు డు రంగప్రవేశం చేసి ముగ్గుర్నీ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కరకంబట్టు చెరువుకు టీడీపీ చెందిన మునెయ్య, శేఖర్ నామినేషన్ వేశారు. గొడవ జరగడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి త్రివిక్రమ్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment