శ్రీకాళహస్తిలో హైటెన్షన్
● రివర్ వ్యూ రిసార్ట్ ప్రహరీ, ప్రవేశద్వార ఆర్చి కూల్చివేత ● నిబంధనలకు తూట్లు పొడిచిన మున్సిపల్, పోలీసు అధికారులు ● అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో హైటెన్షన్ నెలకొంది. బఫర్‌జోన్ పేరుతో మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఓ రిసార్ట్ ప్రహరీ గోడ, ముందుభాగాన్ని కూల్చివేశారు. శనివారం తెల్లవారు జామున పోలీసు బలగాల సాయంతో మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, టౌన్‌ప్లానింగ్ అధికారి శారద తమ సిబ్బందితో కలసి జేసీబీని తీసుకొచ్చి స్వర్ణముఖి కరకట్ట సమీపంలో ఉన్న రివర్ వ్యూ రిసార్ట్ హోటల్ ప్రహరీగోడను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారుల దౌర్జన్యాన్ని ప్రశ్నించారు.
కక్షగట్టి..కూలగొట్టి
శ్రీకాళహస్తి పొన్నాలమ్మ ఆలయం నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్లే మార్గంలో స్వర్ణముఖి నది కరకట్ట సమీపంలో మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి కుమార్తెకు చెందిన రిసార్ట్ ఉంది. ఇది సర్వే నం.218–8లో ఒక ఎకరా స్థలంలో 2007లో రిసార్ట్ నిర్మించారు. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పనిచేశారన్న అక్కసుతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వారిపై కక్షగట్టారు. ఏదో ఒక సాకు చూపి రిసార్ట్‌ను కూల్చేయాలని మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో శనివారం తెల్లవారుజామున ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు జేసీబీతో రిసార్ట్ ప్రహరీగోడను కూల్చివేశారు. సాయంత్రం మళ్లీ వచ్చి ప్రవేశ ఆర్చిని నేలమట్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి మాట్లాడుతూ 17 సంవత్సరాల ముందు నిర్మించిన ఈ రిసార్ట్‌ను ఇప్పుడు బఫర్ జోన్‌లో ఉందని కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.
దౌర్జన్యాలు మితిమీరాయి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను టార్కెట్‌గా చేసుకుని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. భౌతిక దాడులతోపాటు వ్యక్తిగత ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. శ్రీకాళహిస్తిలో ప్రైవేటు రిసార్ట్ ప్రహరీగోడ, ప్రవేశ ద్వారాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
– భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు
నోటీసైనా ఇవ్వాలి కదా?
శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపొందిన రోజు నుంచి జేసీబీకి తన వేళ్లను బిగించుకుని వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయివేట్ పట్టా ల్యాండ్‌లో నిర్మించిన రిసార్ట్‌ను కూడా కూల్చేందుకు పూనుకున్నారు. పొరపాటు ఉంటే కనీసం నోటీసైనా ఇవ్వాలి కదా?. రాజకీయ కక్షలతో నచ్చని వారి ఇళ్లన్నీ కూల్చుకుంటూ పోతే పట్టణంలో ఇకపై ఒక్క ఇల్లు కూడా మిగలదు. – బియ్యపు మధుసూదన్‌రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment