నేటి నుంచి ఎడ్యుకేషన్ ఫెయిర్
తిరుపతి కల్చరల్ : ఫౌండేషన్ ఫర్ యూత్ అడ్వాన్స్‌మెంట్ వారి ఆధ్వర్యంలో ఈనెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు కపిలతీర్థం సమీపంలోని హోటల్ రాజ్ పార్క్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు టి.నందకిషోర్ తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నున్న ప్రముఖ యూనివర్శిటీలు, అంతర్జాతీయ మెడికల్ కోర్సులు అందించే కళాశాలను ఎడ్యుకేషన్ ఫెయిర్‌తో ఒక వేదికపైకి తీసుకొచ్చి తద్వారా విద్యార్థులకు యూనివర్శిటీలు, కళాశాలల కోర్సుల వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, యూజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో నిర్వాహక సంస్థ ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లు వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
భారతీయతకు పట్టం కట్టాలి
తిరుపతి కల్చరల్: వేద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి భారతీయతకు పట్టం కట్టాలని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఉద్ఘాటించారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో కంచి మఠంలో చేపడుతున్న స్మార్త శ్రౌత వేద విద్వన్ మహాసభలు శనివారం రెండో రోజుకు చేరాయి. కార్యక్రమానికి సుబుదేంద్ర తీర్థ ప్రాదుల వారు విచ్చేసి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. 200 మంది వేద విద్యార్థులకు విభుదేంద్ర తీర్థ స్వామి వేద సంభాషణలు అందించి సత్కరించారు.
వేడుకగా హోమాలు
దీనికి ముందు కంచి మఠంలో స్మార్త శ్రౌత వేద విద్వన్ మహాసభల్లో భాగంగా సంతాన వేణుగోపాల, సుదర్శన హోమాలు వేడుకగా చేపట్టారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద పండితులు శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. అనంతరం వివిధ వేద పాఠశాలల్లో వేద విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు స్మార్త ఆగమ, అర్చక పరీక్షలు నిర్వహించారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు కొత్తపల్లి అజయ్‌కుమార్, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు రోలర్‌ను ఢీకొని..
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన తొట్టంబేడు మండలం నెలబల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. తొట్టంబేడు పోలీసుల కథనం మేరకు.. బషీర్ (25) తిరుపతిలోని ఓటేరు గ్రామంలో నివసిస్తుంటాడు. శనివారం సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి నాయుడుపేటకు బయలుదేరాడు. నెలబల్లి వద్ద రోడ్‌రోలర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తొట్టంబేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment