పాఠం పట్టాలెక్కేదెట్టా? | - | Sakshi
Sakshi News home page

పాఠం పట్టాలెక్కేదెట్టా?

Published Sun, Dec 15 2024 1:00 AM | Last Updated on Sun, Dec 15 2024 7:20 PM

రేణిగుంట గిరిజన గురుకుల పాఠశాల

రేణిగుంట గిరిజన గురుకుల పాఠశాల

సమ్మెలో అవుట్‌ సోర్సింగ్‌ బోధనా సిబ్బంది 

గతనెల 16 నుంచి సమ్మెబాట 

వేతనాలను పెంచాలని డిమాండ్‌

గిరిజన గురుకులాల్లో పూర్తి కాని సిలబస్‌ 

పదో తరగతి విద్యార్థుల ఆందోళన 

పట్టని ప్రభుత్వం

రేణిగుంట: రేణిగుంటలో గిరిజన గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాల ఉంది. ఇందులో ఐదు నుంచి పదో తరగతి వరకు 400 మందికి పైగా పిల్లలు చదువుతున్నారు. ఒక ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌, ఇద్దరు రెగులర్‌ టీచర్లు, 16 మంది అవుట్‌సోర్సింగ్‌ బోధనా సిబ్బంది పని చేస్తున్నారు. గత నెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. దీంతో 400 మంది విద్యార్థులు, ఆరు క్లాసులు, 12 సెక్షన్లకు ముగ్గురు ఉపాధ్యాయులే బోధించాల్సి వస్తోంది. ఇటీవల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సెలవు పెట్టడంతో ఇద్దరే దిక్కయ్యారు. దీంతో తరగతి గదుల్లో విద్యార్థులకు నాలుగు గోడలే గురువైన దుస్థితి నెలకొంది. ఈ సమస్య ఒక్క రేణిగుంటకే పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 199 గిరిజన గురుకుల విద్యాలయాల్లోనూ ఇవే అవస్థలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుండడంతో పేద విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు సిలబస్‌ పూర్తి కాకపోవటం, పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తుండడంతో కలత చెందుతున్నారు.’

సమ్మెబాట

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల విద్యాలయాల్లో 1,650 మంది అవుట్‌సోర్సింగ్‌ బోధనా సిబ్బంది పని చేస్తున్నారు. వారిలో టీజీటీ(ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) కు నెలకు రూ.14,800 వేతనం ఇస్తున్నారు. కటింగ్‌లు పోను రూ.12 వేల వరకు వేతనమందుతోంది. ఇక పీజీటీ(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌)లకు నెలకు రూ.16,100 వేతనం ఇస్తుండగా,కటింగ్స్‌పోను రూ.14 వేలు చేతికొస్తుంది. ఒక్కొక్క సారి రెండు, మూడు నెల లకు వేతనాలు వచ్చే దుస్థితి. ఐదో తరగతి అటెండర్‌ బేసిక్‌ వేతనం కంటే పీజీలు, డిగ్రీలు చేసిన వీరి వేతనా లు తక్కువగా ఉండడంతో మనుగడ కష్టసాధ్యమని అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది మదనపడుతున్నారు.

సమ్మెబాటలో బోధన సిబ్బంది

గిరిజన గురుకులాల్లో గత నెల 16వ తేదీ నుంచి అవుట్‌ సోర్సింగ్‌ బోధనా సిబ్బంది సమ్మెలో ఉండడంతో విద్యార్థుల చదువులు అటకెక్కాయి. పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తి కాలేదు. పరీక్షలెట్టా రాయాలంటూ కలత చెందుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వపెద్దలు ప్రేక్షకపాత్ర వహిస్తోండడం గమనార్హం.

మా డిమాండ్లను పరిష్కరించండి

నేను పుత్తూరు గిరిజన గురుకుల పాఠశాలలో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిన టీజీటీగా గణిత సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాను. చాలీ, చాలని వేతనాలతో చాలా ఇబ్బందిపడుతున్నాం. జీతాలు పెంచాలని ఆనేకసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మేము గత్యంతరం లేక సమ్మెబాట పట్టాము. దీంతో పిల్లల చదువులు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పెద్ద మనస్సుతో పరిష్కరించాలి.

– కె.రాధ, గిరిజన గురుకుల రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల, పుత్తూరు

అంపశయ్యపై చదువులు

గత ప్రభుత్వంలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చి, ప్రపంచంతో పోటీ పడే అధునాతన కరికులం తీసుకొచ్చి పిల్లల చదువులు గొప్పగా సాగేందుకు గట్టి పునాది వేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యావ్యవస్థ పతనావస్థ దిశగా పయనిస్తోంది. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ ఛాత్రోపాధ్యాయులకు ఆశ చూపి కుంటిసాకులు చెప్పి వాయిదా వేసుకుంటూ ముందుకు సాగుతుండడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి.

చాలా భయమేస్తోంది

నేను పదో తరగతి చదువుతున్నాను. 25 రోజులుగా మాకు క్లాసులు సరిగా జరగడం లేదు. కేవలం సైన్స్‌, గణితం సబ్జెకులు మాత్రమే బోధిస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు సమ్మెలో ఉండడంతో మాకు క్లాసులు జరగడం లేదు. సిలబస్‌ పూర్తి కాలేదు. తెలుగు మొదట్లో సీబీఎస్సీ సిలబస్‌ అన్నారు. మళ్లీ ఎస్సీఈఆర్‌టీ సిలబస్‌ అని చెప్పి చాప్టర్లు సగం కూడా పూర్తి కాలేదు. సోషియల్‌, ఆంగ్లం, హిందీ కూడా అదే పరిస్థితి. పబ్లిక్‌ రాయనున్న మాకు ఈ పరిస్థితి ఏమిటి, తలచుకుంటుంటే చాలా భయంగా ఉంది. ప్రభుత్వం పట్టించుకుని మాకు టీచర్లను ఏర్పాటు చేసి సిలబస్‌ పూర్తి చేయించాలి. 

– బి.రుషికేశ్‌ నాయక్‌, పదో తరగతి, ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, రేణిగుంట

చాలీ, చాలని జీతాలతో వెట్టి చాకిరీ

నేను రేణిగుంట గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలలో తెలుగు టీజీటీగా అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నాను. నాకు నెలకు రూ.14,800 వేతనం. అందులో చేతికొచ్చేది రూ.12 వేలే. ఐదో తరగతి చదివిన అటెండర్‌కు ఇచ్చే కనీస వేతనం కన్నా మా జీతం చాలా తక్కువ. దీంతో జీవనం చాలా దుర్భరంగా ఉంది. ప్రభుత్వ పెద్దలు మా మొర ఆలకించి మా డిమాండ్లను నెరవేర్చి తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. 

– ఎం.చంద్రశేఖర్‌, రేణిగుంట గిరిజన గురుకుల పాఠశాల

No comments yet. Be the first to comment!
Add a comment
టీచర్లు లేకుండా ఉన్న 10వ తరగతి గది1
1/1

టీచర్లు లేకుండా ఉన్న 10వ తరగతి గది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement