నిరసన ర్యాలీ
ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలిచి అక్రమాలపై ప్రశ్నించే మీడియాపై దాడులు చేయడం సిగ్గుచేటని, దాడికి పాల్పడ్డ అధికారం పార్టీ నేత పార్థసారథి అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని పలువురు జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టుల సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పులివెందుల నియోజకవర్గం, వేముల మండలం కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామన్ రాము, సాక్షి దినపత్రిక రిపోర్టర్ రాజారెడ్డిపై టీడీపీ నేత పార్థసారథి అనుచరులు చేసిన మూకుమ్మడి దాడిని ఖండించారు.
ఈ మేరకు శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మీడియాపై దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రెస్‌క్లబ్ కమిటీ అధ్యక్షుడు ఆర్.మురళీకృష్ణ, కార్యదర్శి బాలచంద్ర, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.గిరిబాబు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో దాడులు మితిమీరాయన్నారు.
ఇలాగే దాడులు చేస్తే జర్నలిస్టుల యూనియన్లు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. అనంతరం జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్‌రెడ్డి మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాక్షి టీవీ, సాక్షి పత్రిక మీడియా ప్రతినిధులు, ప్రెస్‌క్లబ్ కార్యవర్గ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. – తిరుపతి కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment