స్టార్టప్‌ల కోసం దరఖాస్తులు
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ఆధ్వర్యంలో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ పథకం జెనెసిస్ ప్రోగ్రామ్ కింద దేశంలోని టైర్–2, 3 నగరాల నుంచి స్టార్టప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఐడియా స్టేజ్, ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌ల యాజమాన్యాలు ఫిబ్రవరి 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపిక చేసిన స్టార్టప్‌ల ఆవిష్కరణలకు రూ.10లక్షల గ్రాంట్ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల ఔత్సాహికులు పద్మావతి మహిళా వర్సిటీ అధికారిక వైబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
నేడు సివిల్స్ ప్రిలిమ్స్‌కు నోటిఫికేషన్
తిరుపతి సిటీ: దేశానికి అత్యున్నత స్థాయి అధికారులను అందించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. ఉన్నత స్థాయి ఉద్యోగాలైన ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌లను అందించే సివిల్స్ నోటిఫికేషన్ కోసం జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఏటా సివిల్స్ పరీక్షకు జిల్లా నుంచి సుమారు 2వేల మంది అభ్యర్థులకు పైగా దరఖాస్తు చేసుకుంటూ ఉండడం గమనార్హం.
రిపబ్లిక్ డే క్యాంప్‌లో తిరుపతి క్యాడెట్ల ప్రతిభ
తిరుపతి సిటీ: న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే క్యాంప్ సందర్భంగా నిర్వహించిన ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌న్‌షిప్‌లో తిరుపతి 2ఏ ఆర్ అండ్ వీ గ్రూప్‌నకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు అసాధారణ ప్రతిభను కనబరిచారు. పలు విభాగాల్లో ట్రోఫీలను కై వసం చేసుకున్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్ లోకేష్ డ్రెస్సేజ్ ఈవెంట్‌లో బంగారు పతకం, టెత్ పెగ్గింగ్‌లో రజత పతకం సాధించారు. ఢిల్లీ ఎన్‌సీసీ అధికారుల నుంచి ’బెస్ట్ రైడర్ బాయ్స్’ ట్రోఫీ అందుకున్నారు. అలాగే ఎన్‌సీసీ క్యాడెట్ మహిమ రాజు డ్రెస్సేజ్ ఈవెంట్‌లో రజతం, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ఎస్వీ వెటర్నరీ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్ అంజలి చాలెంజింగ్ సిక్స్ బార్ జంపింగ్ ఈవెంట్‌లో ట్రోఫీతో పాటు డ్రెస్సేజ్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అనూప్ ఆర్ మీనా, శిక్షకుడు సుబేదార్ సీబీ కుష్వాహా, సుబేదార్ టీకే గోరై, హవల్దార్ నేత్ర రామ్ తదితరులు క్యాడెట్లను అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులు లోకేష్, మహిమరాజు, అంజలి ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్నారు
25న ప్రకృతి సేద్యంపై వర్క్‌షాప్
తిరుపతి సిటీ : సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై ఎస్వీయూలో నిర్వహించనున్న వర్క్‌షాప్ పోస్టర్‌ను వీసీ అప్పారావు మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 25, 28వ తేదీల్లో వర్క్‌షాపు జరుగుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయంపై యువత, రైతుల్లో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 25న వెయ్యి మంది విద్యార్థులకు, 28వతేదీన వెయ్యి మంది రైతులకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. వర్క్‌షాప్‌కు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, సీడీసీ డీన్ సీఎన్ రాయుడు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కేటీ రామకృష్ణారెడ్డి, నిర్వాహకుడు డాక్టర్ పాకనాటి హరికృష్ణ, వార్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 83,806 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,352 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.59 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment