డ్రైవర్ల చేతిలో ప్రయాణికుల ప్రాణాలు
తిరుపతి మంగళం: ప్రజల ప్రాణాలు డ్రైవర్ల చేతిలో ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని వాహనాలు నడపాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రిపాటి మురళీమోహన్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఎస్‌వీసీఈ, అన్నమాచార్య, శ్రీరామ కళాశాలలతో పాటు వివిధ పాఠశాలల వాహన డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతపై వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భద్రత ప్రధాన ధ్యేయంగా వాహన డ్రైవర్లను నిత్యం అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా రవాణాశాఖ అధికారి మాట్లాడుతూ పేరెంట్స్ కమిటీ తీసుకోవాల్సిన బాధ్యతలను గుర్తుచేశారు. మనసు ప్రశాంతత లేనప్పుడే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఎంవీఐ సుబ్రహ్మణ్యం, శ్రీనివాస రావు మాట్లాడారు. ఎంవీఐలు అతికానాజ్, స్వర్ణలత, మోహన్‌కుమార్, వెంకటరమణనాయక్, ఆంజనేయప్రసాద్ పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ
చంద్రగిరి: పాత కక్షలలో ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో నలుగురు గాయపడ్డ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని నరసింగాపురానికి చెందిన ఆటో డ్రైవర్లకు, శ్రీనివాసమంగాపురానికి చెందిన ఆటో డ్రైవర్లకు గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రెడ్డివారిపల్లిలోని మద్యం దుకాణం వద్ద ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గౌరీశంకర్, పవన్, రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో గౌరీశంకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. ఘర్షణలో అడ్డొచ్చిన ఓ మహిళపై దాడి చేయడంతో గాయాలపాలైంది. శనివారం ఇరువర్గాల ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శతాధిక వృద్ధురాలి మృతి
చిట్టమూరు: శతాధిక వృద్ధురాలుగా గుర్తింపు ఉన్న కోరుటూరు కన్నెమ్మ(105) శనివారం మృతి చెందారు. ఐదు తరాల వారిని చూసిన ఆమె మృతి కుటుంబ సభ్యులును కలచివేసింది. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 1920లో పుట్టిన మునెమ్మ శ్రీహరి కోట ప్రాంతం నుంచి చిట్టమూరుకు వచ్చి స్థిరపడ్డారని, ఐదు తరాల వారిని చూశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment