అనితర సాధ్యం!
● టీడీపీలో డెప్యూటీ మేయర్ దుమారం ● డబ్బు బలంతో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన అనిత ● ఆది నుంచి పార్టీనే నమ్ముకున్న ఆర్సీ మునిక్రిష్ణకు రిక్తహస్తం ● డబ్బులుంటేనే డెప్యూటీ మేయర్ ఇవ్వాలని పార్టీ కీలక నిర్ణయం ● మంత్రి మాటలతో అలిగి వెళ్లిన పార్టీ విధేయుడు
సాక్షి, టాస్క్ ఫోర్స్: ‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎన్నిక కూటమిలో చిచ్చురేపింది. డెప్యూటీ మేయర్ పదవికి సరిపడా బలం లేకున్నా అధికారం, ఆర్థిక బలంతో ఆ సీటు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. అధికార పార్టీ కావడంతో కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎలాగైనా తమ పార్టీ తరఫున బరిలో నిలిచే డెప్యూటీ మేయర్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచించింది. ఇందులో భాగంగానే జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం తిరుపతి నగరానికి చేరుకుని స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సమాచారం లేదట. అనుచరుల ద్వారా విషయం తెలుసుకొని ఆయన మంత్రికి ఫోన్ చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రి సమావేశినికి ఆహ్వానించినట్లు తెలిసింది. అనంతరం సమావేశానికి వెళ్లాక అక్కడ జరిగిన చర్చల్లో జనసేనకు విలువ ఇవ్వడం లేదని ఆరణి సమావేశంలోనే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆరణిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారని దాంతో ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయారని జనసేన వర్గీయులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా సమావేశంలో ముందుగా టీడీపీ తరఫున డెప్యూటీ మేయర్ పదవికి పోటీ పడుతున్న వారితో మాట్లాడి ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం.
ఆశలు ఆవిరేనా?
నిన్న, మొన్నటి వరకు టీడీపీ డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా తనకే అవకాశం వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన కార్పొరేటర్ ఆర్సీ.మునిక్రిష్ణకు ఆ సమావేశంలో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత అన్నా రామచంద్రయాదవ్ కుమార్తె అనిత డెప్యూటీ మేయర్ పదవికి ఆస్తకి చూపడంతో అనూహ్యంగా ఆమె పేరు తెరమీదకు వచ్చింది. టీడీపీ నుంచి ఆర్సీ మునిక్రిష్ణ, అనితల మధ్య పోటీ రావడంతో ఆ పంచాయితీ మంత్రి అనగాని వద్దకు చేరింది. నిజానికి డెప్యూటీ మేయర్ అవడానికి కావలసిన బలం టీడీపీకి లేనందున అక్కడ గెలవాలంటే కార్పొరేటర్లను ప్రలోభ పెట్టాల్సి ఉంటుంది. ఆ మేరకు అవసరమైన డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వారికే ఆ పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయానికి సమావేశంలో మంత్రి తీర్మానించినట్టు సమాచారం. దీంతో పార్టీనే నమ్ముకున్న ఆర్సీ మునిక్రిష్ణ అనగాని వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి అలిగి వెళ్లినట్లు సమాచారం.
పార్టీలో పైసలే ముఖ్యం!
మంత్రి అనగాని సత్యప్రసాద్ డబ్బున్న వారికే డెప్యూటీ మేయర్‌గా అవకాశం ఇస్తామని చెప్పడం పార్టీలో దుమారం రేపింది. అందులోనూ గత ప్రభుత్వంలో నిర్వహించిన తిరుపతి మేయర్ ఎన్నికల్లో టీడీపీ బీఫాం మీద గెలిచిన ఒకే ఒకవ్యక్తి ఆర్సీ మునిక్రిష్ణ. ఆయన డెప్యూటీ మేయర్ పదవి కావాలని కోరుకోవడంలో తప్పులేదు. వైఎస్సార్‌సీపీ బీఫాం మీద గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించిన అనితకు ఆ పదవిని కట్టబెట్టాలని చూడడంలో అర్థం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు బలం లేని చోట డెప్యూటీ మేయర్ స్థానానికి పోటీలో నిలవడమే తప్పుగా భావిస్తున్న తరుణంలో పార్టీనే నమ్ముకున్న వ్యక్తిని కాదని, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం ఇస్తుండడం పట్ల పలువురు తెలుగు తమ్ముళ్లు భగ్గు మంటున్నారు.
కార్పొరేటర్లపై పోలీసుల నిఘా!
తిరుపతి తుడా: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు సమీపిస్తుండడంతో కార్పొరేటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు టీడీపీ వేగవంతం చేసింది. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు అనుకున్నంత సులువు కాకపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులను రంగంలోకి దించింది. తమకు అనుకూలంగా రాని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టాలని, ఆ వివరాలు తమకు తెలియజేయాలని ఆదేశాలు రావడంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కొంతమంది పోలీసులు ఏకంగా కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ఎక్కడ ఉన్నారు, మీరు ఇబ్బందులు పడకూడదు అనుకుంటే టీడీపీకి అనుకూలంగా మనసు మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక కార్పొరేటర్లకు సంబంధించి ఏదైనా భూ వివాదాలు ఉన్నట్లయితే వాటిని బూచీగా చూపించి రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బలం లేకున్నా అడ్డదారిన గెలవడానికి వ్యూహాలు రచిస్తున్న టీడీపీకి కార్పొరేటర్ల ఓటు కీలకం కావడంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కదలికలపై నిఘా పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment