గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి తొండవాడ సమీపంలోని హ్యాపీ దాబా వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి తలపై వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు మృతదేహానికి పంచనామా పూర్తి చేసి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు చంద్రగిరి పోలీసులను సంప్రదించాలని కోరారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
పాకాల: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్టు సీఐ సుందర్శన్‌ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆవివరాలను విలేకరులకు వివరించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు వచ్చిన సమాచారం మేరకు నెల్లూరు రూరల్ మండలం, మేకలవారితోటకు చెందిన సాన విష్ణుమోహన్‌రెడ్డి(24), తమిళనాడు రాష్ట్రం, తేనె జిల్లా, ఉత్తమపాళెం తాలూకా, కంభం గ్రమానికి చెందిన పాండియన్(31)ని పాకాల రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 13 కిలోల గంజాయిని, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయిలు ఇద్దరూ విజయవాడ నుంచి మదురైకి గంజాయిని తరలించడానికి పాకాల రైల్వే స్టేషన్‌కి చేరుకున్నట్టు వెల్లడించారు. అదే రోజు మదురైకి రైలు లేకపోవడంతో కాట్పాడికి వెళ్లి అక్కడి నుంచి మదురైకి వెళ్లడానికి నిశ్చయించుకున్నారని తెలిపారు. పక్కా సమాచారంతో సీఐ, ఎస్‌ఐ సంజీవరాయుడు, తహసీల్దార్ సంతోష్‌సాయిలు రెల్వే స్టేషన్‌కి చేరుకుని ముద్దాయిలను అరెస్టు చేసినట్టు చెప్పారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 75,706 మంది స్వామివారిని దర్శించుకోగా 23,340 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment