కనులపండువగా గజేంద్రమోక్ష ఉత్సవం
● వరదరాజస్వామి అలంకరణలో
దర్శనమిచ్చిన సింహాద్రి అప్పన్న
● గజవాహనంపై విశేషంగా గ్రామ తిరువీధి
● పరవశించిన భక్తజనం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మకరవేట (గజేంద్ర మోక్షం) ఉత్సవం బుధవారం రాత్రి కనుల పండువగా జరిగింది. సింహాచలం దేవస్థానం వైదికులు కొండదిగువ పూలతోటలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా వరాహ లక్ష్మీనృసింహస్వామి వరదరాజస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని కనులారా తిలకించిన భక్తులు పరవశించారు. ముందుగా స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామికి వరదరాజస్వామిగా అలంకరించి.. సాయంత్రం సింహగిరి నుంచి మెట్లమార్గం ద్వారా కొండదిగువకు తీసుకొచ్చారు. తొలిపావంచా వద్దకు చేరుకున్న స్వామికి అడవివరం గ్రామస్తులు, దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని ఆయన సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి ఆలయం వద్ద స్వామికి మహిళలు మంగళహారతులిచ్చారు. అక్కడి నుంచి స్వామిని పూలతోటకి తీసుకెళ్లి ప్రధాన మండపంలో అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, షోడషోపచార పూజలు నిర్వహించారు. అనంతరం భాగవత పురాణ విన్నపం, గజేంద్ర మోక్షం ఘట్ట విన్నపం చేశారు. తదుపరి స్వామిని అక్కడి నుంచి పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి గజవాహనంపై అధిష్టించి..విశేషంగా తీరువీధి నిర్వహించారు. తమ ఇళ్ల ముందుకి వచ్చిన స్వామికి గ్రామస్తులు విశేషంగా హారతులిచ్చారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు రాజీవాచార్యులు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవొ త్రినాథరావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పూలతోటను పెద్ద ఎత్తున విద్యుద్దీపకాంతులతో అలంకరించారు. గోపాలపట్నం సీఐ గొలగాని అప్పారావు ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కాగా.. ఉత్సవం పురస్కరించుకుని పూలతోటలోని శ్రీకృష్ణ కొలను వద్ద మూడుసార్లు వెలిగించిన జువ్వలు.. తిరిగి రావడంతో ఈ ఏడాది వరి, అపరాలు, మెట్ట పంటలు బాగా పండుతాయని భక్తులు విశ్వసించారు.
Comments
Please login to add a commentAdd a comment