అందరికీ ఆదర్శం సావిత్రిబాయి
వనపర్తి: సావిత్రిబాయి ఫూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలకు కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంట్లో ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందన్నారు. జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులు ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది చదువులో చెరగని ముద్ర వేయాలని కోరారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. సమసమాజ నిర్మాణానికి మహిళల చదువు చాలా ముఖ్యమని ఆనాడు సావిత్రిబాయి గట్టిగా నమ్మిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అమలుచేస్తూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోందని వివరించారు. జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరైందని.. విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జనవరి చివరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఉంటుందని.. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని చెప్పారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఎందరో మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజ నిర్మాణానికి దోహదపడిందని గుర్తు చేశారు. సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు బాలభవన్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున 15 మంది మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్, ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ అబ్దుల్ ఘని, మార్కెట్‌యార్డు చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, స్థానిక కౌన్సిలర్ సుజాత, దిశ కమిటీ సభ్యుడు శంకర్ నాయక్, కౌన్సిలర్లు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment