పౌరులకు చేరువలో న్యాయసేవలు
వనపర్తి టౌన్: చట్టానికి అందరూ సమానులేనని.. ఎలాంటి వ్యత్యాసాలు ఉండవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని పౌరులందరికి న్యాయ సేవలు చేరువ చేయడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలకు అత్యుత్తమ న్యాయసేవలు అందించడానికి వాలంటీర్లకు చట్టాలపై శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని మాట్లాడుతూ.. బాధితులకు న్యాయ సేవలు చేరువ చేసి తగిన సూచనలు, సలహాలిస్తూ వారిని మానసికంగా సంసిద్ధులను చేయడమే లక్ష్యమన్నారు. న్యాయంపై ప్రతి ఒక్కరిలో ధృడమైన భావన ఏర్పడేందుకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మోహన్‌కుమార్, న్యాయవాదులు నాగేశ్వర్, కృష్ణవర్ధన్‌రెడ్డి, డి.కృష్ణయ్య, శ్రీనివాసాచారి, ఉత్తరయ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment