మంత్రి సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి
మంత్రి సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి
‘గీసుకొండ’ ఘటనపై టీపీసీసీ చీఫ్ ఆరా!?
ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి
దసరా ఉత్సవాల్లో ఫ్లెక్సీ వివాదంతో మరింత అగాథం
ఠాణాకు చేరిన అధికార నేతల వివాదం.. కేడర్‌లో అయోమయం
తాజా పరిణామాలపై ఆరా తీసిన బొమ్మ మహేశ్‌కుమార్
సాక్షిప్రతినిధి, వరంగల్ : మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న ఫ్లెక్సీల వివాదం పార్టీలో కుంపటి రాజేసింది. దీంతో ఓరుగల్లులో అధికార కాంగ్రెస్ పార్టీ తాజా రాజకీయాలపై టీపీసీసీ అధిష్టానం దృష్టి సారించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయ లోపంపై దృష్టి సారించింది. ప్రధానంగా దసరా ఉత్సవాల సందర్భంగా పరకా ల నియోజకవర్గం పరిధి గీసుకొండ మండలం ధర్మారంలో చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీస్తోంది. ఈ ఘటన అటు పార్టీ అధిష్టానం.. ఇటు కేడర్‌లో గందరగోళానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ఆరా తీసినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ సీనియర్లతో పాటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరితో ఆయ న సోమవారం మాట్లాడినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపింది. వరంగల్ తూర్పుతో పాటు పరకాల నియోజకవర్గం సీట్లను కొండా సురేఖ దంపతులు ఆశించారు. అయితే వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పార్టీ అవకాశం కల్పించగా ఆ ఇద్దరూ గెలుపొందారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా.. గీసుకొండ మండలంలో ఆధిపత్య రాజకీయాలు ఈ ఇద్దరు నేతల మధ్య విబేధాలు పొడచూపడానికి బీజం వేశాయి. భౌగోళికంగా గీసుకొండ పరకాల నియోజకవర్గంలో ఉండగా అక్కడ తనకు ఎన్నికల్లో సహకరించే ధోరణిలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉండగా.. తమ సొంత మండలంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ, ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో తమ అనుచరుడు గౌడ భరత్‌ను కాదని.. తాజా మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, వీరగాని రాజ్‌కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డితో గొడవ పడ్డా రు. ఇందుకు సంబంధించి ఆ ఇద్దరు నేతల సెల్‌ఫోన్ సంభాషణల ఆడియో కూడా బయటకు వచ్చింది. ఆతర్వాత కూడా ప్రొటోకాల్, ఫ్లెక్సీల వివాదాలు ఈ రెండు వర్గాల మధ్య జరిగాయి. రోజురోజుకూ గ్యాప్ పెరిగి కొండా సురేఖ, రేవూరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ధర్మారం ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఫొటోలను విస్మరించిన విషయమై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం, ఘర్షణ గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరగా.. అక్కడికి ఆటోలో వెళ్లిన మంత్రి సురేఖ అరెస్టయిన తన అనుచరులను విడుదల చేయాలని డిమాండ్ చేయడం కొత్త వివాదానికి తెరతీసింది. దసరా ఉత్సవాల సందర్భంగా ధర్మారంలో అసలు ఏం జరిగిందనే కోణంలో పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది.
అసలేం జరిగింది..!
దసరా వేడుకల సందర్భంగా మంత్రి కొండా సురేఖ అనుచరులు వేయించిన ఫ్లెక్సీలలో ఆ నియోజకవర్గం(పరకాల) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు వేయలేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, మద్దతుదారులు కొండా సురేఖ తీరు, ఆమె అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొండా సురేఖ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే తన అనుచరులను అరెస్ట్ చేయడంతో ఆగ్రహం చెందిన కొండా సురేఖ గీసుకొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. ఏకంగా సీఐ చాంబర్‌లోకి వెళ్లి కుర్చీలో కూర్చొని పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీసీపీ, ఏసీపీ, పోలీసులతో రంగంలోకి దిగిన పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గీసుకొండలో పరిస్థితి చక్కబడేలా చూశారు. అయితే అధికార పార్టీకి చెందిన మంత్రి ధర్నా చేయడంతో పాటు పోలీస్ స్టేషన్‌లో వాగ్వాదానికి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గీసుకొండ టోటల్ ఎపిసోడ్‌తో పాటు ఓరుగల్లు కాంగ్రెస్ తాజా రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ ఆరా తీస్తుండడం.. మరోవైపు ప్రభుత్వం సైతం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఓరుగల్లులో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment