మొక్కజొన్నలో కత్తెర పురుగు
దుగ్గొండి: యాసంగి మొక్కజొన్నను కత్తెరపురుగు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొలక భూమి పొరలు దాటిన మరుసటి రోజు నుంచే దాడిచేస్తోంది. దీంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కత్తెర పురుగు ఐదేళ్ల క్రితం ఆఫ్రికా, అమెరికా దేశాల నుంచి భారతదేశానికి ప్రవేశించింది. ప్రస్తుతం యాసంగి మొక్కజొన్న పంటను జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పరిశీలించారు. కత్తె ర పురుగును నివారించడానికి తీసుకోవాల్సిన జా గ్రత్తలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను ఆమె వివరించారు.
● మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు 30 నుంచి 90 రోజుల పాటు దాడిచేసే అవకాశం ఉంది. తల్లి పురుగు మొక్కజొన్న కింది ఆకులు, కాండంపై 100 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లను పొదిగాక మొక్కజొన్న ఆకు తెల్లని మచ్చలుగా మారుతుంది. పిల్ల పురుగులు 2, 3 లార్వా దశల్లో మొక్కజొన్న కర్ర సుడుల్లోకి వెళ్లి ఆకులను తింటాయి. పంట వేసిన వెంటనే ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తే కత్తెర పురుగుల ఉధృతి తెలుస్తుంది. గుడ్ల సముదాయాన్ని గుర్తించిన వెంటనే ఆ కర్రలను పీకి నాశనం చేయాలి. 1500 పీపీఎం వేప మందు ఒక లీటరును సరిపడా నీళ్లలో కలిపి ఎకరాకు చేయాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు పిల్లలుగా మారకుండా ఉంటాయి.
● లార్వాల నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పెనోసాడ్ 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల పరిమాణం ఇంకా ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరాట్రినిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందు కలిపి పిచికారీ చేయాలి. కత్తెర పురుగు లార్వా చివరి దశలో ఉంటే ఽథయోమిథాక్సామ్, లామ్డాసైలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలని ఆమె సూచించారు.
విషపు ఎరతో..
● 10 కిలోల పాలిష్ తవుడు, 2 కిలోల బెల్లాన్ని కలిపి 2 నుంచి 3 రోజులపాటు పులియబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమానికి 100 గ్రాముల థయోడియోకార్బ్ మందును కలిపి ఉండలుగా చేసి మొక్కజొన్న పంట సుడుల్లో వేయాలి.
● పంటలు తీసివేసిన అనంతరం కత్తెర పురుగు కోశస్థ దశ భూమిలో ఉంటుంది. దీనిని నాశనం చేయడానికి లోతు దుక్కులు చేయాలి.
● మొక్కజొన్న పంటలో అంతరపంటగా పప్పు దినుసుల పంట వేస్తే కత్తెరపురుగు ఉధృతి చాలా వరకు తక్కువగా ఉంటుంది..
● కంకిచుట్టూ బిగుతు పొరలు కలిగి ఉండే హైబ్రిడ్ మొక్కజొన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. ఇలా బిగుతు పొరలు కలిగి ఉన్న రకాల్లో కత్తెర పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది.
పురుగు మందులు వాడకుండా కత్తెర పురుగుల నివారణ..
మొక్కజొన్న పంటలో సిపార్సు మేరకు యూరియాను ఒకేసారి కాకుండా మూడు దఫాలుగా వేయాలి.
పంటపై ఎక్కువ సాంద్రతగల పురుగు మందులు వాడితే మిత్ర పురుగులు చనిపోతాయి. కత్తెర పురుగులను నాశనం చేసే బదనికలు నశిస్తాయి. పురుగు మందు డబ్బాలపై ఎరుపు రంగు గుర్తులు ఉన్న మందులు ప్రమాదకరం. అవి పిచికారీ చేస్తే బదనికలు చనిపోతాయి.
పక్షిస్థావరాలు, పంగకర్రలు ఏర్పాటు చేయడం వల్ల పక్షులు కత్తెర పురుగులను తింటాయి.
పురుగు ప్రాథమిక దశలో ఉంటే 9 పాళ్ల ఇసుకకు ఒకపాలు సున్నం కలిపిన మిశ్రమాన్ని మొక్కజొన్న కర్రల సుడుల్లో వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment