రబీ సాగుపై అవగాహన
పెనుమంట్ర : మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం వరినాట్లు పూర్తయ్యాయని, గత సంవత్సరం అనుభవాలు దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇవ్వాలని కోరారు. నారుమడి, ప్రధాన పొలం నాటిన నెల రోజుల వరకు కాండం తొలిచే పురుగు, ఆకుముడుత పురుగు ఆశించకుండా ప్రతి సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బొప్యూరాన్ 3 జీ గుళికలు వేయాలని కోరారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 50 శాతం విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయని, ఈ నెలాఖరు వరకు దాదాపు 90 శాతం నాట్లు పూర్తవుతాయని అన్నారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గిరిజారాణి దాళ్వాలో ఎంటీయూ 1121, పీఆర్ 126 రకాలకు ప్రత్యామ్నాయమైన ఎంటీయూ 1293, ఎంటీయూ 1273 రకాలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు.కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త ఎంవీ కృష్ణాజీ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
జ్యూయలరీ షాపులో అగ్ని ప్రమాదం
తణుకు అర్బన్: తణుకులో జయంతి జ్యూయలర్స్ బంగారు దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, మధ్యాహ్నం వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో దుకాణం లోపల ఉన్న రెండు ఏసీల నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్మేశాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకుని వచ్చిన అగ్నిమాపక వాహన సిబ్బంది మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రెండు ఏసీలు కాలిపోయాయని ఇతర నష్టమేమీ జరగలేదని యజమాని కాన్‌రాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment