రైతు కుటుంబం ఆత్మహత్య పట్టదా?
సింహాద్రిపురం: రైతు కుటుంబం ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. సింహాద్రిపురం మండలం దిద్దికుంట గ్రామంలోని రైతు కొమెర నాగేంద్ర, శ్రీవాణి, వారి పిల్లల ఆత్మహత్యపై పౌర హక్కుల సంఘం జిల్లా కమిటీ నిజ నిర్ధారణ చేపట్టింది. దిద్దికుంట గ్రామానికి ఆదివారం వెళ్లి మృతుల బంధువులతో మాట్లాడింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ నాయకులు వాస్తవ విషయాలు వెల్లడించారు. నాగేంద్ర శుక్రవారం రాత్రి పొలం వద్ద మొదట భార్య, తర్వాత పిల్లలకు ఉరి వేశారని, అనంతరం అతను కూడా ఉరి వేసుకుని బలవన్మరణం పొందారని తెలిపారు. అప్పులే వారి ఉసురు తీశాయని పేర్కొన్నారు. నాగేంద్ర తనకు ఉన్న ఒకటిన్నర ఎకరా పొలంతోపాటు 13 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశారని తెలిపారు. ఆరేడు ఏళ్ల నుంచి పంట పెట్టుబడుల కోసం రూ.30 లక్షలు పైగా అప్పు చేశాడన్నారు. దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రుణ దాతలు ఒత్తిడి చేయడం.. అప్పుల నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతు కుటుంబం బలవన్మరణం పొందడం బాధాకరమన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే రైతులకు వ్యవసాయానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. కానీ ప్రభుత్వాలు ఇలా చేయకపోవడంతో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కడప జిల్లా కార్యదర్శి రాయచోటి రవిశంకర్, ఉపాధ్యక్షుడు పి.రెడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎం.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం బాధ్యత వహించాలి
పౌర హక్కుల సంఘం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment