TS Special
-
మృత్యువు ఎప్పుడో ముందే చెబుతుంది
వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదనేది సామెత. కానీ విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తాయో ముందే తెలుసుకుంటున్నాం. మరి అదే తరహాలో మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలుసుకోగలిగితే.. డెత్ డే ఫలానా రోజు అని ముందే అవగతమైతే ఎలా ఉంటుంది? మరణం ఎప్పుడో తెలిసిపోతే ఆ భయంతోనే సగం చచ్చిపోతాం బాబోయ్ అని అనుకునేవాళ్ల కోసం కాకుండా.. మన జీవితంలో ఆ రోజు ఎప్పుడో తెలుసుకుందాం అనే ఔత్సాహికుల కోసం ఓ వినూత్న యాప్ అందుబాటులోకి వచ్చింది. అన్నీ ముందుగానే అంచనా వేస్తున్నాం.. మరణాన్నీ ముందే తెలుసుకోలేమా అనే ఆలోచనతో బ్రెంట్ ఫ్రాన్సన్ అనే డెవలపర్ ‘డెత్ క్లాక్’పేరుతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. అలా అని.. దీనికి దివ్యమైన శక్తులేమీ లేవు. అది అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా సదరు వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో కచ్చితంగా అంచనా వేసి చెబుతుంది అంతే. ఇందులో కృత్రిమ మేధ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) కీలకపాత్ర పోషిస్తుంది. దాదాపు 1,200 మంది ఆయుర్దాయాలపై వివిధ కోణాల్లో అధ్యయనం జరిపి దీన్ని రూపొందించారు. ఈ ఏడాది జూలైలో డెత్ క్లాక్ అందుబాటులోకి రాగా.. మూడు నెలల్లోనే 1.25 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని తమ చివరిరోజు గురించి తెలుసుకున్నారు.ఇది ఎలా పని చేస్తుందంటేడెత్ క్లాక్ యాప్‌లో వయసు, లింగం, జాతి వంటి ప్రాథమిక సమాచారంతోపాటు కుటుంబ చరిత్ర, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల గురించి సమాధానాలు నమోదు చేయాలి. అలాగే రోజువారీ జీవనశైలి, వ్యాయామం, ధూమపానం, మద్యం అలవాట్ల గురించి అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. ఆహారపు అలవాట్లతో పాటు నిద్రశైలి గురించీ వివరించాలి. అప్పుడు ఆ యాప్.. ఆయా వివరాల ఆధారంగా అధునాతన అల్గారిథమ్‌ల సాయంతో మరణం ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించి చెబుతుందన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎంత కచ్చితమైన వివరాలు నమోదు చేస్తే, అంత కచ్చితమైన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏం ఉపయోగంరేపు ఏదైనా అపాయం జరుగుతుందని ముందు తెలుసుకుంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోవచ్చు.. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే మృత్యువు ఫలానారోజు పలకరిస్తుందని ముందే తెలిస్తే.. జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది కదా అనేది ఈ యాప్ రూపకర్తల వాదన. డెత్ డేట్‌ను చెప్పడమే కాదు.. ఆయుర్దాయం పెంచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ యాప్ ఇస్తుంది. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవడం, ధూమపానం, మద్యపానం మానేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి టిప్స్ చెబుతుంది.వాటిని పాటించడం ద్వారా డెత్డేట్ను పొడిగించుకోవచ్చన్న మాట. కాగా, ఆరోగ్య స్పృహ ఉన్నవారు, ఆర్థిక ప్రణాళికదారులు డెత్ క్లాక్‌పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తమ చివరి తేదీని బట్టి చేయాల్సిన పనులు పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందనే భావన వారిలో ఉండటమే ఇందుకు కారణం. మీకూ ఈ భావన ఉంటే ఓసారి ట్రై చేయండి. పోయేదేముంది? మహా అయితే 40 డాలర్లు (దాదాపు రూ. 3,400). ఎందుకంటారా? ఈ యాప్‌లోని అన్ని ఫీచర్లూ పని చేయాలంటే అంత మొత్తం వెచ్చించక తప్పదు మరి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.కాగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్ ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ కందాడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్ లేవంటూ కొట్టివేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు. -
ఇంటికో సైనికుడు.. ఆర్మీ అంటే వీరికి ప్రాణం
యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం.. అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నేటి యువత కూడా సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతోంది. ఇదీ.. మర్కూక్ మండలం గంగాపూర్ ప్రత్యేకత. ఇక్కడి ప్రజల జీవన విధానంపై ఈ ఆదివారం ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం.. యెన్నెల్లి సురేందర్–గజ్వేల్: రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్‌పుత్’లతో గంగాపూర్ గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం 50కిపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ‘రాజ్‌పుత్’లో దేశభక్తి ఎక్కువ. అందువల్లే ఇక్కడి యువత సైన్యంలో చేరుతుంటారు. ఇప్పటికే 25మంది సైన్యంలో పనిచేస్తుండగా.. కొందరు పదవీ విరమణ పొందారు. గ్రామానికి చెందిన పంచిగారి యశ్వంత్ సింగ్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. నోచోనియా భవానీసింగ్, పంచిగారి నరేష్సింగ్, పంచిగారి రూప్సింగ్, అత్తర్‌సుమ నర్సింగ్, జుగ్రాజ్ గణేష్‌సింగ్, నోన్‌వార్ గణేష్‌సింగ్, నోన్‌వార్ భవానీసింగ్, నోన్‌వార్ సత్యనారాయణసింగ్, రామ్చరణ్సింగ్లు ఆర్మీలో పనిచేస్తున్నారు. యూసుఫ్ఖాన్పల్లిలోనూ... ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న యూసుఫ్ఖాన్పల్లిలోనూ మరో 20కుపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి కూడా మరో 15మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. మిగతావారు వ్యవసాయం, ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గంగాపూర్ ప్రస్తుతం యూసుఖాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకే వస్తుంది. రాజేంద్రనగర్ఎస్ఐగా.. ఇదే గ్రామానికి చెందిన జుగ్రాజ్ నారాయణసింగ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా పంచిగారి రామ్‌సింగ్, అత్తర్‌సుమ అనంతరామ్సింగ్, నోచునోయి హిరామన్, అనంతరామ్సింగ్, అత్తర్‌సుమ రాజారామ్‌సింగ్, ప్రకాష్సింగ్లు సైతం ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరే కాకుండా మరో ఏడుగురికిపైగా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. మరికొంత యువకులు ఇండియన్ ఆర్మీలో చేరడానికి ఉత్సాహంతో ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం వ్యవసాయమే వీరికి జీవనాధారం. తాతముత్తాతల నుంచి సంక్రమించిన భూమిలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. యువత ఆర్మీలో చేరుతుండగా.. కొందరు స్థానికంగా కంపెనీలు, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నిరుపేదలు ఏటా రైతుల వద్ద భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తుంటారు. అలాగే కూలీపనులకు కూడా వెళ్తుంటారు. దేశ సేవంటే ఇష్టం మా ఊరు ఇచ్చిన ప్రేరణతోనే నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి నాకు దేశ సేవంటే మహా ఇష్టం. నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాను. మా గ్రామంలో చాలా మంది ఆర్మీలో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. మా ఊరే అందరికీ ఆదర్శం. – పంచిగారి యశ్వంత్ సింగ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాజస్థాన్ ఇక్కడివారితో కలిసిపోయాం తాతముత్తాలు గంగాపూర్‌కు వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడివారితో కలిసి పోయాం. వారే మాకు ఆత్మీయులు. ఏ వేడుక అయినా అందరం కలిసి చేసుకుంటాం. వ్యవసాయం జీవనాధారం. ఎంతోమంది పిల్లలు ఆర్మీలో చేరడం సంతోషం. – శంకర్‌సింగ్, గంగాపూర్ ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది. 2023లో ఆర్మీలో చేరాను. మా గ్రామంలో నాతోపాటు ఎంతోమంది ఉన్నారు. వారి సలహాలు, సూచనలతో ఉద్యోగంలో చేరి సేవ చేస్తున్నాను. – పంచిగారి నరేశ్ సింగ్, ఆర్మీ పైలెట్ శిక్షణ ఇస్తే మరింత మేలు దేశ సేవ చేసే అదృష్టం ఆర్మీలో దక్కుతుంది. మా గ్రామం నుంచి ఎక్కువ మంది ఆర్మీలో చేరడం గర్వంగా ఉన్నది. వారి స్ఫూర్తితో ప్రతి ఏటా కొందరు యువకుల ఆర్మీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – దుర్జన్‌సింగ్, ప్రైవేట్ లెక్చరర్, గంగాపూర్ -
ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్‌జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్‌సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
ఇక గడువు పొడిగించం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు, తమకు మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం జారీ చేసిన అదనపు విధివిధానాల (టీఓఆర్)పై స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్ఓసీ) దాఖలు చేసేందుకు జూన్ చివరి దాకా గడువు పొడిగించాలన్న ఏపీ విజ్ఞప్తిని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 తిరస్కరించింది. ఈ నెల 29లోగా ఎస్ఓసీని దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాతి నుంచి రెండు వారాల్లోగా ఎదుటిపక్షం దాఖలు చేసే ఎస్ఓసీపై కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ట్రిబ్యునల్ విధించిన మార్చి 20 గడువు నాటికి తెలంగాణ ఎస్ఓసీ దాఖలు చేయగా ఏపీ ఇంకా దాఖలు చేయలేదు. మే 15 నుంచి 17 వరకు తదుపరి విచారణ నిర్వహిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతోపాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణ మధ్య పునఃపంపిణీ కోసం కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలను (టీఓఆర్) జారీ చేస్తూ కేంద్రం 2023 అక్టోబర్ 10న గజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సోమవారం ఢిల్లీలో సమావేశమై అదనపు టీఓఆర్‌పై విచారణ చేపట్టింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు వినిపించారు. ఏపీ గడువు పొడిగింపు అభ్యర్థనను తెలంగాణ వ్యతిరేకించింది. ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి ఉన్నందున స్టేట్మేంట్ ఆఫ్ కేసును దాఖలు చేయలేమన్న ఏపీ వాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లో ఉన్నా ఎస్ఓసీ దాఖలు చేశామని పేర్కొంది. కేసుల విచారణపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, కాలయాపన కోసమే ఏపీ గడువు పొడిగింపు కోరుతోందని ఆరోపించింది. వాదనలు అనంతరం ఏపీ వాదనలను ట్రిబ్యునల్ తిరస్కరించింది. 1,050లో 789 టీఎంసీలు మావే: తెలంగాణ ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల వాటాలో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు సమర్పించిన ఎస్ఓసీలో తెలంగాణ కోరింది. నిర్మాణం పూర్తై వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. -
జర జాగ్రత్త.. అవి ఓఆర్ఎస్లు కాదు.. ప్యాకేజ్డ్ జ్యూస్‌లే!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్ఎస్లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్ఎస్లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే.. ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్ఎస్. అలవాటులో పొరపాటుగా... కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్‌కు గురవగానే ఓఆర్ఎస్లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కనిపించే వాటిని ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్ఎస్గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్ఎస్గా భావించి వాడుతున్నారు. రివర్స్ రిజల్ట్... పండ్ల రసాలను ఓఆర్ఎస్గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్‌ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కీలకం... కేవలం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కల్పించాలి.. ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్ఎస్ను పోలిన లేబుల్స్‌తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్‌లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు -
ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు పొడిగించింది. ఉగాది పండగ నేపథ్యంలో మరో 6 నెలలపాటు ఆఫర్లు పొడిగిస్తున్నట్లు మైదరాబాద్ మెట్రో సోమవారం ప్రకటించింది. కాగా సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లు మార్చి 31, 2024న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కాగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చు. మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అపరిమతంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది. ఇక సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ అంటే ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. . వీటితోపాటు మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీ కూడా అందుబాటులో ఉంది. -
KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే. నాగారం గ్రామం మున్నూరుకాపుల కొటాల్పల్లి... కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు. అయ్యవారిపల్లి గ్రామం ముదిరాజ్‌ల అయ్యవారిపల్లి.... భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు. కొటాల్పల్లి గ్రామం పొలాల మధ్యన నాగారం... లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది. చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్.... గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు. ఎవరి పనుల్లో వారుంటారు... అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది. – బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం అందరం కలిసిమెలిసి ఉంటాం... మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం. – చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం 3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం. – చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం -
Summer Care : నింగి నుంచి నిప్పులు!
భానుడు భగభగా మండుతున్నాడు. నిప్పులు కక్కుతూ.. ప్రతాపం చూపిస్తున్నాడు. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వడగాలులు వీస్తున్నాయి. ఎండలు మండుతుండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈనెల 9 వరకు ఇదేపరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఉదయం 10 గంటలకే కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. ఎండలకు వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లాలోనే నమోదైంది. 18 మండలాల్లోని 20 గ్రామాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిపోయింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. 50 డిగ్రీలకు పెరిగే ప్రమాదం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు తీవ్రమైన వేడిగాలులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలకు తీసుకోవాల్సిన అవసరం వెల్లడించారు. అప్రమత్తమైన యంత్రాంగం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలని పలు చోట్ల కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో వచ్చే సంబంధిత వ్యాధులపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌పోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించే పనిలో పడ్డారు. సంక్షేమ హాస్టళ్లు ,పాఠశాల, కళాశాల విద్యార్థులలో వడదెబ్బ పై అవగాహన కల్పించాలని, పని ప్రదేశాల్లో కూలీలకు తాగు నీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధి కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేసే వారి కోసం తాగునీరు నీడ ఏర్పాటు చేయాలని, మూగ జీవాల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. వడదెబ్బ లక్షణాలు డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింత, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితికి వెళ్లడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకితే చేపట్టాల్సిన చర్యలు వడదెబ్బ తాకిన వారిని వెంటనే నీడ కలిగిన చల్లని ప్రదేశానికి తరలించాలి. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం తాగించాలి. వాంతులు, విరేచనాలు వంటివి సంభవించినా వైద్యులను సంప్రదించాలి. వడదెబ్బతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రోగికి నీరు తాగించవద్దు. వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. ఉదయం సాయంత్రం సమయాల్లోనే బయటకు వెళ్లాలి. బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఎండ వేడిమి తగలకుండా పలుచనైన, వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలి. రోజుకు కనీసం 15 గ్లాసుల నీటిని తాగాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరి నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. భోజనం మితంగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకోవద్దు. ఇంటిని వీలైనంత మేర వీలైనన్ని మార్గాల్లో చల్లగా ఉంచుకోవాలి. చల్లని రంగు పానీయాలను తాగొద్దు రోడ్లపై ఉండే ఆహారం పడకపోవచ్చు మద్యం సేవించవద్దు -
పది పరీక్ష రాశారా? మా కాలేజీలో చేరండి
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి. ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా.. ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టార్గెట్ పెడుతూ.. కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13 మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45 ప్రైవేట్ కళాశాలలు 14 భారీగా ఫీజులు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. – రవీంద్రకుమార్, డీఐఈవో -
తెలంగాణ: దంచికొడుతున్న ఎండలు.. వడగాలుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత తోడవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
వంద రోజుల పాలన పోలీస్ రాజ్యమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద రోజుల కాంగ్రెస్ పాలనలో పోలీసుల రాజ్యమే కనిపించిందని రాష్ట్రంలోని ప్రజా సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంలోనూ పోలీసుల జోక్యం పెరిగిందని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని పదేపదే చెప్పారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశ్రాంత అధ్యాపకురాలు రమా మేల్కోటే అధ్యక్షతన శనివారం ‘నిగాహ్’రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వందరోజుల్లో అనుసరించిన కార్యక్రమాలు, చేసిన పనులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వక్తలు విశ్లేషించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న పౌరహక్కుల నేతలపై గత ప్రభుత్వం ఉపా చట్టాలను అమలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి మార్గాన్నే అనుసరిస్తోందని ఆరోపించారు. పదిరోజులుగా అన్ని మీడియాల్లో పతాకస్థాయిలో వస్తున్న ఎస్ఐబీ దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతోందని, అత్యంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న ఎస్‌ఐబీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని సీనియర్ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బలం పెంచుకునేందుకు బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే పనిలో పడిందని, కానీ ప్రజాసమస్యల పరిష్కారంపై అంతగా దృష్టి పెట్టడం లేదని మరో సంపాదకుడు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన వ్యవస్థ మారినట్లు కాదని, మార్పు కోసం అన్నివర్గాలు ఉద్యమించాలని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, దేవులపల్లి అజయ్, కె.సజయ తదితరులు పాల్గొన్నారు. -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్‌లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈసారి భగభగలు తప్పనట్టే.. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. ‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్‌లో మరింత ఎక్కువ ఎండలు.. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం. – నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.8 25.5 భద్రాచలం 40.0 25.0 నిజామాబాద్ 39.9 25.0 ఖమ్మం 39.6 24.0 నల్లగొండ 39.5 24.2 హైదరాబాద్ 39.2 24.6 మహబూబ్‌నగర్ 39.2 25.0 మెదక్ 39.2 21.1 దుండిగల్ 39.1 22.2 హకీంపేట్ 39.0 20.1 రామగుండం 38.6 24.6 హన్మకొండ 38.0 22.5 ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిత్యం కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్సీ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇజ్రాయిల్‌లో అధునాతన పరికరాలు కొని హైదరాబాధ్‌కు రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ తన పలుకుబడితో రవిపాల్‌తో ట్యాపింగ్ డివైజ్‌లను తెప్పించినట్లు గుర్తించారు. అదే విధంగా ఎస్ఐబీ కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి. ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. చదవండి: ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. -
కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అధికార కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు పగబట్టి కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటది ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని అన్నారు. దానం అవకాశవాది పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడని, ఆయనకు ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదని హితవు పలికారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అనర్హత వేటు వేయకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయన్ను అనర్హుడిగా ప్రకటింపజేస్తామని చెప్పారు. మనకు పోటీ బీజేపీతోటే.. ‘సికింద్రాబాద్ లో మనకి పోటీ బీజేపీతోనే. కాంగ్రెస్ మనకు పోటీ కాదు. కిషన్ రెడ్డి సికింద్రబాద్‌లో ఎంపీగా ఉండి చేసిందేమీ లేదు. అంబర్ పేటలో పోటీ చేయకుండా భయపడి వెళ్ళాడు. ఈ సారి కిషన్ రెడ్డికి సానుభూతి లేదు. కరోనా సమయంలో కుర్ కురేలు పంచాడు. అతన్ని చాలామంది కిషన్ రెడ్డి అనటం లేదు. కుర్ కురె రెడ్డి అంటున్నారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్లో లిఫ్టులు ప్రారంభం చేస్తున్నాడు. అంబర్ పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్లు పూర్తి చేయించలేని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నాడు . బీఆర్ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మళ్లీ ప్రారంభం సికింద్రాబాద్‌లో విఫలమైన ఎంపీ కిషన్ రెడ్డి, ఎటు అధికారం ఉంటే అటు పోయే దానం నాగేందర్, వ్యక్తిత్వం, సాయపడే గుణం ఉన్న పద్మారావు పోటీలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కిషన్ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్ గెలుపుతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని చెప్పారు.. కాంగ్రెస్‌కు 40 కూడా రావు.. బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా.. బీజేపీనా అర్థం కావడం లేదు. చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ బడే భాయ్ అంటారు. నరేంద్ర మోదీ చోటా భాయ్ రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతారు. రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డినే. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని సీఎం ఎందుకు చెప్పడం లేదు? లంకెబిందెల కోసం అర్ధరాత్రి దొంగలు తిరగతారు. పేగులు మెడలో వేసుకుంటా అంటారు.. ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేవారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగే వాళ్ళు పక్కా జేబు దొంగలు. జేబులో కత్తెర ఉంటే ఏమైనా అయితే జాగ్రత్త. భయపడేవాళ్లు లేరు లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారు... కోర్టుకు ఇవ్వండి ఎవరు వద్దన్నారు? పనిచేయ చేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నారు, తప్పు జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోండి. భయపడే వాళ్లు లేరు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు రూ 2,500 కోట్లు సిద్దం చేశారు. అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారు? హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారు... బీఆర్ఎస్ తరపున పోరాడతాం. కాంగ్రెస్ నమ్ముకొన్నది అబద్దాల ప్రచారం మాత్రమే. జై శ్రీరాం ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
పంటల బీమాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి రానుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. పంటల బీమా పథకం ప్రారంభం అనేది ఎంతోమంది రైతులను ప్రభావితం చేయనున్నందున ఈసీ అనుమతి లేనిదే ముందుకు సాగలేమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. క్లస్టర్ల వారీగా అమలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి 2020లో బయటకు వచ్చింది. అయితే ఏదో ఒక పంటల బీమా పథకం ఉండటమే మేలన్న భావన కొందరు రైతుల్లో ఉంది. దీంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాన్నే అమలు చేయనుంది. దీంతో ప్రకృతి వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఈసారి కూడా ముందుకు సాగే అవకాశాలున్నాయి. ప్రీమియం ఇలా... వానాకాలం సీజన్లో సాగుచేసే ఆహారధాన్యాల పంటలకు 2 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. – పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం 5 శాతం రైతులు ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాలను బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీమియం రేటు మారుతుండేది. అయితే ఈసారి రైతు వాటా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. కాబట్టి రైతులంతా ఈ పథకంలోకి వస్తారు. మరోవైపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీమా అమలుకు సూచనలు పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. – బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటేటా భారీగా పెంచుతుంటాయి. ఈ పద్ధతి మార్చాలి. – కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటం లేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. – కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడువారాల్లోగా రైతులకు పరిహారం ఖరారు చేయాలి. గతంలో నెలల తరబడి ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. – రైతుల ఫిర్యాదులు వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్రస్థాయిలో నెలకొల్పాలి. – చిన్నచిన్న అంశాలను ఆధారం చేసుకొని పంటల బీమాను రైతులకు అందకుండా చేస్తున్నారు. ఇది పథకం అమలును నీరుగారుస్తుంది. – వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది. వీటిని మార్చాలి. -
Phone tapping case: బెదిరింపుల దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. అనుకోకుండా దొరికిన అవకాశంతో.. ప్రభాకర్‌రావుతో పాటు హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావు తదితరులు.. విదేశాల నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల వరకు వాటిని కేవలం విపక్షాలపై నిఘా కోసమే వాడారు. అయితే వారి ఫోన్లు రికార్డు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన తర్వాత, వాటిని ఆర్థిక లబ్ధికి అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని దీని కోసం వినియోగించారు. బెదిరింపుల దందా ప్రారంభించేందుకు ప్రభాకర్‌రావు తనవారైన మరింత మందిని ఎస్ఐబీలోకి తీసుకువచ్చారు. ఎలక్టోరల్ బాండ్లూ కొనిపించారు.. ప్రభాకర్‌రావు బృందం టార్గెట్ చేసిన వారిలో పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, బడా బిల్డర్లు, నగల దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరి గురించిన సమాచారం తెలిసిన తర్వాత వారి కార్యాలయాలు, నివాసాల సమీపంలోకి ట్యాపింగ్ ఉపకరణాలతో బృందాలను పంపేవారు. బృందాల్లో ఉన్నవారు బాధితుల ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేసుకుని వచ్చి ప్రణీత్‌రావుకు అప్పగించేవారు. వీటిని విశ్లేషించేందుకు పర్వతనగర్‌లోని వార్‌రూమ్‌లో ఓ ప్రత్యేక బృందం పని చేసేది. ఇలా ఆయా వ్యాపారుల వ్యక్తిగత జీవితాలు, బలహీనతలు తదితరాలను గుర్తించే ప్రణీత్‌రావు.. విషయాన్ని ప్రభాకర్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆపై రంగంలోకి దిగే వీరి సైన్యాలు వారిని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. బెదిరింపులకు లొంగని కొందరు వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్‌లో బయటపడిన సంభాషణల ఆడియోలను పంపి లొంగదీసుకున్నట్లు తెలిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్టోరల్ బాండ్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా చేసినట్లు సమాచారం. ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. సాక్షి, యాదాద్రి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రధాన నింతుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సీఐగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. వీరి దందా వెలుగు చూసిన నేపథ్యంలో వారితో ఆ సమయంలో అంటకాగిన పోలీస్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ వాడకంలో భుజంగరావు దిట్ట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని గుర్తించడంలో అప్పుడు డీఎస్పీగా ఉన్న నాయిని భుజంగరావు ట్యాపింగ్ సహా టెక్నాలజీ వాడకంలో తన నైపుణ్యాన్ని వినియోగించారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా కోర్టు నింతునికి ఉరి శిక్ష విధించింది. 2021లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్ ఫర్ ఎక్స్లెంట్ ఇన్వెస్టిగేషన్ (అద్భుత పరిశోధన)తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. డీజీపీ స్థాయి వారి ఫోన్లూ ట్యాప్ ఈ ట్యాపింగ్ టీమ్ పోలీసు విభాగంలోని వారిని కూడా వదిలిపెట్టలేదు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఆయనకంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. పలువురు ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. నగర పోలీసు కమిషనర్‌గా పని చేసి డీజీపీగా వెళ్లిన ఓ అధికారి సైతం ప్రభాకర్‌రావు చర్యల్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయన ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్‌లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు అప్పట్లో ఐజీలు, డీఐజీలుగా పని చేసిన వాళ్లు కూడా దీని ద్వారానే ఎస్పీలతో సంప్రదింపులు జరిపారంటే వారి అభద్రతా భావాన్ని అంచనా వేయవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను తదుపరి దర్యాప్తు నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
గోవా క్యాంప్‌లో కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తీవ్రంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గోవాకు తరలించారు. ఈ క్రమంలో గోవా క్యాంప్‌లో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ చూసుకుంటుందని హామీ ఇచి్చనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పార్లమెంట్ పోరులో ముందంజలో ఉంటామని.. ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచి్చనట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1,439 ఓట్లు ఉన్నాయని.. ఇందులో వెయ్యికి పైగా ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారేనని.. నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెల 28న పోలింగ్ జరగనుండగా.. ఆయా పారీ్టలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించాయి. బీఆర్ఎస్ గోవా, ఊటీ.. కాంగ్రెస్ గోవాతో పాటు ఏపీ, కర్ణాటకలో శిబిరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. 100 మంది వరకు స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న బీజేపీ సైతం కొడైకెనాల్లో క్యాంప్ ఏర్పాటు చేయడం పోరు తీవ్రతకు అద్దం పడుతోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి పోటీపడుతున్నారు. -
‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మూల్యాంకనంలో 20 వేల మంది ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. పది రకాల పరీక్షల తర్వాతే ఆన్‌లైన్‌లోకి.. సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్లైన్లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.