TS Special
-
కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో గురుకులాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడానికి వేచిచూడాల్సిందేనని విద్యారంగ నిపుణులు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా గురుకుల సొసైటీల అంశాన్ని ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత మేనిఫెస్టోలోని హామీల అమలుపై దృష్టి సారించి. కొత్త గురుకులాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని బీసీ గురుకుల సొసైటీని ఆదేశించింది. ఇందులో భాగంగా కొత్త గురుకులాల ఏర్పాటు అవసరమున్న మండలాల వారీగా బీసీ గురుకుల సొసైటీ ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 292 బీసీ గురుకులాలు.. రాష్ట్రంలో 594 మండలాలున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 594 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 292 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బాలుర, ఒక బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో 302 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు తగినట్లుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న 292 బీసీ గురుకుల పాఠశాలలను మండలాల వారీగా విభజించి.. కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే కోణంలో పరిశీలన జరిపిన అధికారులు, మండలాల వారీగా ప్రాధాన్యత క్రమంలో జాబితాను తయారు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో కూడా ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించారు. ప్రస్తుతం గురుకులాల ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ భవనాల గుర్తింపు, నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త గురుకులాల ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు చెబుతున్నారు. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్ రావుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. చదవండి: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు సంచలనాలతో రాజకీయ ప్రకంపనలకు సిద్ధం కాబోతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అయితే.. ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారికి ‘టచ్’లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుపై వేటు.. అరెస్ట్ తర్వాత పత్తా లేకుండా పోయిన ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారితో సంభాషణ జరిపినట్లు తాజా సమాచారం. మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు? అని ఆ సందర్భంలో ఆయన సదరు ఉన్నతాధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘‘ఎంతైనా మనం మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశాం’’ అని ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని.. జూన్ లేదంటే జులైలో తిరిగి హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభాకర్‌రావు అడిగిన కొన్ని ప్రశ్నలకు సదరు ఉన్నతాధికారి స్పందించకుండా.. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్‌కు సమాధానం రాసి పంపాలని సూచించారట. దీంతో.. ప్రభాకర్‌రావు సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాల ప్రకారం.. నాటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డిపై నిఘా వేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించడంతో ఎస్ఈబీ డీఎస్పీ ప్రణీత్‌రావు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి సమీపంలోనే ప్రణీత్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆరాలు తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతన్న, భుజంగరావు(తాజాగా అరెస్టైన అదనపు ఎస్పీలు) కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఆ డేటాను ఎప్పటికప్పుడు ప్రభాకర్‌రావుకు పంపించారు. అయితే.. ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు రావడంతో మొత్తం హార్క్డిస్క్లు, సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు ప్రభాకరే సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడం.. ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడడంతో అప్రమత్తమైన ప్రభాకర్‌రావు ఫ్యామిలీ ట్రిప్ పేరిట చెన్నైకి చేరి.. అటు నుంచి అటే అమెరికాకు వెళ్లారు. ఇక.. ప్రభాకర్‌రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ మాజీ పోలీస్ అధికారిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కూడా. ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలక సంస్థ దారులు... ఆ ఇద్దరూ చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు అందించేవారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఇచ్చేవారని తేలింది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు పేరును ఏ2గా చేర్చింది దర్యాప్తు బృందం. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రభాకర్ రావు అండ్ టీం.. కేవలం విపక్ష నేతల ఫోన్లే కాదు.. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసింది. ఈ జాబితాలో 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రముఖ జ్యువెల్లరీ వ్యాపారులతో పాటు హవాలా వ్యక్తులు సైతం ఉన్నారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావులు వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి.. బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు గుంజినట్లు నిర్ధారణ అయ్యింది. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరించింది. ఏడు రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు.. ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో ప్రణీత్‌రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి పశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని.. వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు నడిపించిన ట్యాపింగ్ రాకెట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక.. ఇప్పటికే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంతో అంటకాగిన మాజీ పోలీస్ బాస్‌లు పరారీలో ఉండగా.. ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ్‌రావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. -
ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 43.2%
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూలవేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటిఅద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తాజా వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం తెలిసిందే. హెచ్ఆర్ఏ భారీగా తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల, కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండటంతో.. ఆ వెలితి కొంత తీరినట్టేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమలులోకి తెస్తున్నందున, అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూల వేతనంలో కలిసి పోతుంది. అది పోయిన తర్వాత 51.5 శాతం డీఏ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మూలవేతనంపై లెక్కించరని తెలుస్తోంది. వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డీఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం.. తాజా డీఏ 43.2 శాతంగా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనుండటం విశేషం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషి ఫలితంగా తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది. కొన్ని విడతలు మిగిలి ఉండగా, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాటిని కూడా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయిలు క్లియర్ అయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తాజా విడత కరువు భత్యం కూడా అందబోతోంది. -
గురుకుల బోర్డుకు కొత్త సారథులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లో మార్పులు జరగనున్నాయి. కీలకమైన చైర్మన్, కన్వినర్ పోస్టుల్లో త్వరలోనే కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా ఉన్న మల్లయ్య బట్టును రా ష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీచేసింది. సొసైటీ నూత న కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులను నియమించింది. దీంతో గత వారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. అయితే టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా వ్యవహరించిన మల్లయ్య బట్టు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో కన్వినర్ సీటు ఖాళీ అయ్యింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అత్యంత కీలకంగా వ్యవహరించే కన్వినర్ సీటు ఖాళీ కావడంతో బోర్డు పరిధిలో పలు నియామకాలకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో పడిపోయాయి. ఈ క్రమంలో వాటి భర్తీతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే బో ర్డుకు కన్వినర్ నియామకం అనివార్యం కానుంది. బోర్డు సభ్యులుగా సొసైటీల కార్యదర్శులు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా టీఆర్‌ఈఐఆర్‌బీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల కార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉంటారు. గురుకుల సొసైటీల్లో సీనియర్ కార్యదర్శి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో సభ్యుడు కన్వినర్‌గా ఉంటారు. బోర్డు సభ్యుల అంగీకారం, ప్రభుత్వ ఆమోదంతో సొసైటీల్లోని అదనపు కార్యదర్శుల్లో ఎవరినైనా కూడా కన్వినర్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. ప్రస్తుత చైర్మన్‌గా ఆయేషా మస్రత్ ఖానమ్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానమ్ ఉన్నారు. కన్వినర్‌గా కొనసాగిన మల్లయ్య బట్టును టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా బి.సైదులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న గురుకుల సొసైటీ కార్యదర్శుల్లో ఈయనే సీనియర్ అధికారి. బోర్డు చైర్మన్‌గా సీనియర్ అధికారిని నియమించాల్సి ఉండటంతో ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మస్రత్ ఖానమ్‌కు కూడా స్థాన చలనం తప్పదని అధికారులు అంటున్నారు. కన్వినర్ పోస్టు కూడా ఖాళీ కావడంతో చైర్మన్, కన్వీనర్ రెండు పోస్టుల్లోనూ కొత్త వారినే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు అధికారులు ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శుల సీనియారీ్ట, తదితర పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత చైర్మన్, కన్వినర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్‌రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
ఫిరాయింపులకు కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరవాలి
దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపునకు గేట్లు తెరవకుండా, అన్నదాతల పంటల రక్షణకు ప్రాజెక్టుల గేట్లు తెరవాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, కడియం శ్రీహరి హితవు పలికారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతబాయితండాలో బోర్లు ఎత్తిపోయి, సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బృందం రైతులతో మాట్లాడింది. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు శివశంకర్ అనే రైతు అప్పులు చేసి మూడు నెలల్లో 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నర్సింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేశారు. అయినా ఫలితం లేదని రైతులు వాపోయారు. హరీశ్‌రావు, ఎర్రబెల్లి, కడియం వీరి కష్టాలను ప్రస్తావిస్తూ, సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి.. రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పలకరించిన పాపానపోలేదన్నారు. గోదావరి నదిలో నీళ్లున్నా ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసిందని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా నెరవేర్చలేదని, రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. గతంలో తామిచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని, కౌలు రైతులను సైతం దగా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాల్వలకు పుష్కలంగా నీళ్లు ఇవ్వగా రెండు పంటలు పండించుకుని రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు, కరెంటుకు కష్టాలు ప్రారంభమయ్యాయని, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడమే కాకుండా.. వడగళ్ల వానలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. అయినా ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టడం లేదన్నారు. సత్వరమే దెబ్బతిన్న వరి పంటకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామిరెడ్డి వారి వెంట ఉన్నారు. -
సార్.. గిరాకీల్లేవ్!
కరీంనగర్ టౌన్: ‘సార్ మూడు నెలలుగా గిరాకీల్లేవు. ఫైనాన్స్ తెచ్చి ఆటో నడుపుతున్నాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. గిరాకీ అంతంత మాత్రమే వస్తోంది. బడి పిల్లలను తీసుకెళ్తుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఎండాకాలం సెలవులొస్తున్నాయి. ఇక ఆ గిరాకీ కూడా ఉండదు. అప్పుల బాధ దేవుడెరుగు.. ఎట్లా బతకాలో అర్థం అయిత లేదు’అంటూ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎదుట కరీంనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు మొర పెట్టుకున్నారు. బండి సంజయ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు. వారితో కలసి చాయ్ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్సూరెన్స్ చెల్లించే పరిస్థితి లేదన్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. రాబోయే రెండు నెలలపాటు స్కూళ్లు కూడా ఉండవని, ఇల్లు గడవడం కష్టమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బండి మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే అయినా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని వెల్లడించారు. -
అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతాం
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగతంగా తనతోపాటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న చానళ్లపై ఇప్పటికే యూట్యూబ్, గూగుల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. ఈ తరహా చానళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరిట పచ్చి అబద్ధాలను చూపిస్తున్నాయి. మాపై గుడ్డి వ్యతిరేకత లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలు, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోంది. ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యలుగా వీటిని భావిస్తున్నాం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వారిపై చర్యలు తప్పవు ‘గతంలో మాపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. కొన్ని యూట్యూబ్ చానల్స్ ప్రస్తుతం చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పటికైనా ఈ చానళ్లు తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. -
789 టీఎంసీలు మాకే కావాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల్లో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టబోయే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్(కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణల మధ్య పునః పంపిణీకి కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలు (టీఓఆర్) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 10న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై తమ వాదనలతో స్టేట్ ఆఫ్ కేసు (ఎస్ఓసీ) దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నెల 20తో గడువు ముగియగా, అదేరోజు తమకు 798 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఎస్ఓసీ దాఖలు చేసింది. నది పరీవాహక ప్రాంతం(బేసిన్)ను ప్రామాణికంగా తీసుకుంటే 68 శాతం క్యాచ్మెంట్ ఏరియా తమ రాష్ట్రం పరిధిలో ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలో 2 కోట్ల జనాభాతో పాటు అత్యధిక శాతం కరువు పీడిత ప్రాంతాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయమైన వాటాగా 789 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని నివేదించింది. భవిష్యత్‌లో కట్టే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు భవిష్యత్‌లో కోయిల్‌కొండ, గండీడ్, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉందని, వీటికి 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. 1050 టీఎంసీల్లో సగానికి పైగా... ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అదనంగా 194 టీఎంసీలు కేటాయించడంతో ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇవికాక పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా, నాగార్జునసాగర్ ఎగువన ఉండే రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే వెసులుబాటు గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. అందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలు కలుపుకొని మొత్తం 1050 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ట్రిబ్యునల్ నివేదికకు 15 నెలల గడువు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్–3 కింద విచారణ జరిపి, నివేదిక ఇచ్చేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును ఇటీవల కేంద్రం మరో 15 నెలలు పొడిగించింది. 2025 జూలై 31లోపు ట్రిబ్యునల్ నివేదిక అందించాలి. ఏపీ సైతం తమ స్టేట్ ఆఫ్ కేస్‌ను దాఖలు చేస్తే ట్రిబ్యునల్ విచారణ ముందుకు సాగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ విచారణ చేసినందున, తీర్పు కూడా 15 నెలల్లోపే వస్తుందనే ఆశతో తెలంగాణ ఉంది. -
తడారిన తండాలు ..ఏజెన్సీ ప్రజల పాట్లు
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ నీరు వారం, పది రోజులకోసారి సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వేకువనే కాలినడకన వెళ్లి తెచ్చుకోవలసిన దుస్థితి. పూనగూడ గ్రామస్తులు ఎడ్లబండిపై నాలుగైదు కి.మీ. దూరంలోని చెరువు, బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారం వేకువజామున కనిపించిన దృశ్యాలివి. – ఆదిలాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
రేవంత్.. రైతులకు లీగల్ నోటీసులా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలను మర్చిపోయారని మండిపడ్డారు. రైతుల పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం వహిస్తూ.. రైతన్నలకు లీగల్ నోటీసులను పంపుతోందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పచ్చి దగా, నయవంచనతో మోసం చేస్తోందన్నారు. ‘ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు. నేడు.. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని ఎమ్మెల్యే కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టారు. ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.👇 ▶️బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. ▶️డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ▶️ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా… pic.twitter.com/hxKapf2DYW — KTR (@KTRBRS) March 24, 2024 -
ఈ సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాపులు బంద్
హైదరాబాద్: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నారు..ఎందుకంటే..రేపు సోమవారం 2024, మార్చి25న హోలీ సందర్భంగా నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 26 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. -
రసవత్తరంగా మారనున్న లష్కర్ పోరు
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను ఆ పార్టీలు ప్రకటించగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్ పేరును ప్రకటించారు. ముగ్గురూ ప్రజాబలంతో ఎదిగిన నేతలే. నాగేందర్, పద్మారావులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువనే పేరుంది. ఇటీవలీ దాకా ఒకే పారీ్టలో, ఒకే నాయకత్వం కింద కలిసి పని చేసిన వారిద్దరు ఇప్పుడు నువ్వా? నేనా? అని తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. దానం నాగేందర్ అనగానే ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్లుగానే ప్రజలకు గుర్తుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిసినప్పటికీ, ఇంకా బలంగా నమోదు కాలేదు. దీంతో నాగేందర్, పద్మారావు అనగానే ఇద్దరూ ఒకే పార్టీ కదా .. అంటున్న వారు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సిందే. గెలుస్తాం: కేసీఆర్ ధీమా పార్టీ అభ్యరి్థగా పద్మారావును ప్రకటించే సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పోటీలో ఉన్నారని వెరవాల్సిన పనిలేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2004లో తొలిసారిగా పద్మారావు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అప్పటి రాష్ట్ర కేబినెట్ మంత్రి పైనే (తలసాని శ్రీనివాస్‌యాదవ్) అయినా ఆయనను ఓడించారని గుర్తు చేసినట్లు తెలిసింది. పద్మారావు గురించి మీకు తెలియంది కాదు. ఇటీవలి ఎన్నికల్లో మీరంతా మీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింట (నాంపల్లి మినహా) మనమే గెలిచాం. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కోసం మరింత ఎక్కువగా కష్టపడి గెలిపించాలని హితబోధ చేసినట్లు సమాచారం. పద్మారావు అభ్యరి్థత్వానికి అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆయన పేరు ప్రకటించారు. ఐదింట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అంబర్‌పేట, ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లిలో మాత్రం ఎంఐఎం అభ్యర్థి గెలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన పద్మారావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తలపడుతున్నారు. త్వరలోనే ప్రచారంలోకి.. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పద్మారావు ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. సోమవారం హోలీ ముగిశాక మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో జనరల్ బాడీ సమావేశ తేదీని నిర్ణయించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్‌మెంట్‌ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు. కరువు భత్యంపై సందిగ్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేడ్ పే కొనసాగింపు.. ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన.. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది. ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్ఆర్ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్ఆర్ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్ఆర్ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్ఆర్ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు. -
వోల్వో.. వద్దు
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది. సామర్థ్యానికి మించి నడపటంతోనే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు. అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది. పోటీని తట్టుకోగలదా..? ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్‌ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్‌ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్‌ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్‌ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్‌సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
సరిహద్దు రాష్ట్రాల పోలీసుల అలర్ట్
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్‌జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ అనిల్‌కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘కరువు’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. మూడో వంతు పంటలకు దెబ్బ వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. ► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిన్నయ్య, రైతు, గాధిర్యాల్ గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి నందిగామ బ్రాంచి కెనాల్ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన. – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా రెండు బోర్లూ అడుగంటాయి రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా