TS Special
-
సరిహద్దు రాష్ట్రాల పోలీసుల అలర్ట్
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్‌జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ అనిల్‌కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘కరువు’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. మూడో వంతు పంటలకు దెబ్బ వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. ► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిన్నయ్య, రైతు, గాధిర్యాల్ గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి నందిగామ బ్రాంచి కెనాల్ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన. – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా రెండు బోర్లూ అడుగంటాయి రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా -
ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు. మరోవైపు ఎస్ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
BRS Party: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను ఎంపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ శనివారం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. కాగా ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చదవండి: Liquor Case: ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. నాగర్‌కర్నూల్ - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. మెదక్ - వెంకట్రామిరెడ్డి. మహబూబ్‌నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్- వినోద్ కుమార్. పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్. జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు. చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. మహబూబాబాద్- మాలోత్ కవిత. మల్కాజ్గిరి - రాగిడి లక్ష్మారెడ్డి ఆదిలాబాద్ - ఆత్రం సక్కు. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్. వరంగల్ - కడియం కావ్య -
Phone Tapping Case: నిఘా ముసుగులో చట్ట వ్యతిరేక పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్‌రావు విచారణతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలకు కర్త, కర్మ, క్రియ.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే అని దాదాపుగా నిర్ధారణ అయ్యింది. నిఘా ముసుగులో ప్రభాకర్&టీం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లు తేలింది. ఇష్టానుసారం ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్‌లు చేయడమే కాకుండా.. పెద్ద ఎత్తున్న బ్లాక్ మెయిలింగ్ దందా నడిపి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత అధికార పార్టీతో అంటకాగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. 2018 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేపిస్తూ వచ్చారు. నల్లగొండ ఎస్పీగా ఉన్న టైంలో తనకు నమ్మకంగా ఉన్న కొందరు అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారాయన. ప్రధానంగా స్పై పోలీసుల ముఠాలో.. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను కీలక సభ్యులుగా చేర్చారు. మరికొందరు పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఇక.. ట్యాపింగ్, ఇతర నిఘా పరికరాలపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్, రష్యాలో సైతం పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ టీంకు రవి పాల్ సాంకేతిక సహకారం అందించారు. రవిపాల్ సూచన మేరకే సూట్‌కేసులో పట్టే పరికరంతో ఆనాటి ప్రతిపక్ష నేత ఇళ్ల వద్ద ఎస్ఐబీ టీం మాటు వేసేది. ట్యాపింగ్ ఎంత పక్కాగా జరిగేదంటే.. కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు నిబంధనల కన్నా తక్కువ సమయంతో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిందా బృందం. మరోవైపు నాటి విపక్ష నేతలే కాకుండా.. వ్యాపారస్తులను సైతం ప్రభాకర్ బృందం టార్గెట్ చేసింది. సుమారు 30 మందికిపైగా వ్యాపారుల ఫోన్లపై నిఘా వేసి.. అక్రమంగా ఫోన్ల ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్‌కి సైతం చేసినట్లు తెలుస్తోంది. అలా.. రూ. 500-600 కోట్ల దాకా వసూలు చేసినట్లు వెల్లడైంది. అందుకే ఆయా మాజీ అధికారుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించే దిశగా తాజా సోదాలు జరిగినట్లు సమాచారం. సంబంధిత వార్త: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ప్రణీత్‌పై వేటుతో అప్రమత్తమై.. ప్రభాకర్‌రావు తెలంగాణ ఏర్పడ్డాక సీసీఎస్ డీసీపీగా పని చేశారు. 2020లో ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఓఎస్డీలో బాధ్యతలు అప్పగించింది. గతేడాది ప్రభుత్వం మారాక ఓడీఎస్ పోస్టుకు ప్రభాకర్ రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావుపై వేటు పడింది. ప్రణీత్‌రావు ప్రభాకర్‌రావుకు బంధువు కూడా. వెంటనే ప్రభాకర్‌రావు అప్రమత్తం అయ్యారు. కుటుంబంతో విహరయాత్ర పేరుతో హైదరాబాద్ దాటారు. అటు నుంచి అటే ఆయన అమెరికా పరారైనట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా.. ప్రభాకర్‌రావు విషయంలోనూ దర్యాప్తు సంస్థ ఓ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో పది చోట్లా.. అదీ మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రణీత్‌రావు వెల్లడించిన సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంటితో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ అధికారి ఇంటి నుంచి 2 లాప్ టాప్ లు, 4 ట్యాబ్ లు, 5 పెన్ డ్రైవ్‌లు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ అధికారులతో పాటు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సహకరించిన వారి అందరి పేర్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణీత్‌రావు ఇచ్చిన స్టేట్మెంట్ను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం. -
Liquor Case: ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు
Updates.. కవిత మేనల్లుడు మేకా శరన్ నివాసంలోనూ కొనసాగుతున్న సోదాలు కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు మేకా శరన్ ద్వార లావాదేవీలు జరిపినట్టు అనుమానం ఇద్దరికి ఉన్న కంపెనీల ద్వారా నగదు బదిలీ అయనట్టు ఈడీ అనుమానాలు అందుబాటులో లేని మేకా శరన్ మేకా శరన్ నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు ఈడీ అధికారులకు ఫోన్లో అందుబాటులో లేని మేకా శరన్ ముడుపుల చెల్లింపులో మేకా శరణ్ కీలక పాత్ర గా భావిస్తున్న ఈడీ లిక్కర్ స్కాంలో తెరపైకి కొత్త పేరు.. లిక్కర్ స్కాం కేసులో తెరపైకి మేకా శరణ్ పేరు. మేకా శరణ్ కవితకు అత్యంత దగ్గరి బంధువు. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో శరణ్ ఫోన్ లభ్యం. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్‌దే కీలక పాత్ర. కవిత కేసులో ఈడీ ఆఫిడవిట్ దాఖలు. రెండు సార్లు పిలిచినా మేక శరణ్ విచారణకు హాజరుకాలేదని కోర్టుకు తెలిపిన ఈడీ. మేకా శరణ్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ. కవిత అరెస్ట్ సమయంలో ఇంట్లోనే ఉన్న శరణ్ లిక్కర్ స్కాంలో మేకా శరణ్‌పై ఈడీ ఫోకస్ జై తెలంగాణ నినాదం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న కవిత కస్టడీ పొడిగింపు తర్వాత ఈడీ ఆఫీస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరలింపు మూడు రోజులు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు తరలించే టైంలో కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేసిన కవిత తన అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించిన కవిత ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్టు కక్ష సాధింపే: కవిత కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి: కవిత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: కవిత ►కోర్టులో వాడీవేడి వాదనల అనంతరం.. కవితకు మరో మూడు రోజుల కస్టడీని పొడిగించింది. కవితకు మూడు రోజుల కస్టడీ పొడిగించిన కోర్టు ఈనెల 26 వరకు కస్టడీ పొడిగించిన కోర్టు. ఈనెల 26వ తేదీన ఉదయం 11:30 గంటలకు కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశం. ►కవితను మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఈడీ.. ►కోర్టులో ముగిసిన ఇరు వర్గాల వాదనలు.. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన కవిత బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదన్న ఈడీ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరిన కవిత తరపు న్యాయవాది కవిత కామెంట్స్.. కోర్టుకు తీసుకెళ్తుండగా మీడియాతో కవిత కామెంట్స్.. నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈడీ అధికారులు అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు అక్రమ కేసులపై కోర్టులో పోరాటం చేస్తాను. ఈడీ వాదనలు.. ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు మరో ఐదు రోజుల కస్టడీ కావాలి నలుగురు స్టేట్మెంట్స్ గురించి కవితని అడిగాం కిక్ బ్యాగ్స్ గురించి అడిగాం ఫోన్ల డేటా డిలీట్ చేశారు కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగాం కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు రేఖా శరణ్‌కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీనే కవితతో కలిపి సమీర్‌ను విచారించాలి. లిక్కర్ స్కాంలో రూ. వందల కోట్లు చేతులు మారాయి. ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయి. కవితకు వైద్య సూచనల మేరకు మందులు, డైట్ ఇస్తున్నాము. కవిత తరపు న్యాయవాది వాదనలు.. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు? కవిత పిల్లలు మైనర్స్.. వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వండి. కస్టడీ పూర్తైన రోజే కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపండి. కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశాం. బెయిల్ పిటిషన్స్‌పై ఈడీకి ఆదేశాలు ఇవ్వండి. ► తనను బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టు కవిత పిటిషన్ దాఖలు. ►రౌస్ ఎవెన్యూ కోర్టుకు చేరుకున్న కవిత. కాసేపట్లో కోర్టుకు కవిత.. కాసేపట్లో కవితను కోర్టులో హాజరుపరుచనున్న ఈడీ అధికారులు. కాగా, కవిత హైబీపీతో బాధపడుతున్నారన్న ఆమె తరఫున నాయ్యవాది కవిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్టు ఇవ్వాలని కోర్టు ద్వారా కోరిన ఆమె న్యాయవాది. కస్టడీలో భాగంగా ప్రతీరోజు హెల్త్ రిపోర్టు కవితకు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచనున్న ఈడీ అధికారులు మరోవైపు కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్న ఈడీ వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత కవితను చూసేందుకు కోర్టుకు వచ్చిన ఆమె భర్త, తనయుడు.. బీఆర్ఎస్ ఎంపీలు వద్ధిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ, పలువురు జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు.. ►ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచే సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు. మాదాపూర్‌లో అనిల్ సోదరి అఖిల నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు. కవిత కాల్ డేటా ఆధారంగా సోదాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. ►ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చనున్నారు. ►ఇక, కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు మరికొన్ని రోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశముంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. కాగా గత ఆరు రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. ►మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. కేజ్రీవాల్‌ను ఆరు రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ. ఈ క్రమంలో కేజ్రీవాల్, కవితను కలిపి విచారించేందుకు రెడీ అవుతున్న ఈడీ. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కాంలో కవితను విచారించిన ఈడీ. ►ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ►ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం(మార్చి 15) ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. కేజ్రీవాల్, కవిత అరెస్ట్‌పై కేసీఆర్ స్పందన.. ►కేజ్రీవాల్ అరెస్ట్‌ను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ►ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్‌కు స్టీల్ షీట్ పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు కాంగ్రెస్ ఆహ్వానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ‘రెండుసార్లు కార్పొరేటర్‌గా బంజారాహిల్స్ డివిజన్ ప్రజలు గెలిపించారు. దీపాదాస్ మున్షీ మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డిలు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేశవరావు ఇంటికి వెళ్లారు. అక్కడే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేశవరావులతో గంటపాటు చర్చించారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా, పార్టీని బలోపేతం చేయా ల్సిందిగా దీపాదాస్ వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
నల్గొండలో యురేనియం ఉందా? ఎందుకింత సెర్చ్?
నాగార్జునసాగర్ : నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైంది. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహంలో బస చేస్తూ.. నాగార్జునసాగర్ రైట్‌బ్యాంక్ సమీపంలో ఆంధ్రా వైపున ప్లైటెక్ ఎరోడ్రమ్‌లో రెండు చాపర్లను పెట్టుకుని ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు. ఇటీవల కృష్ణా తీరాన తెలంగాణలోగల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో చాపర్ల ద్వారా సర్వే నిర్వహించారు. పది రోజులుగా యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో అన్వేషణ కొనసాగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. కృష్ణాతీరంలో యురేనియం నిక్షేపాలు గతంలోనే ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు వేల ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. పెద్దవూర మండలంలోని పులిచర్ల సమీపంలోగల కేకేతండా వద్ద క్యాంపు ఏర్పాటు చేసుకుని పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టుపై డ్రిల్లింగ్ చేసి శాంపిల్స్ తీసి శాస్త్రవేత్తలకు పంపేవారు. ఆ విధంగా సంవత్సరాల తరబడి సర్వేలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గుట్టలు, పెద్దమూల గ్రామంలో వెయ్యి హెక్టార్లలో, పెద్దఅడిశర్లపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీ భూమిలో, 196.71 ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు యూసీఐఎల్ అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఇదే ప్రాంతంలోని మల్లాపురంలో రాతినుంచి యురేనియం వేరు చేసే కార్మాగారాన్ని నెలకొల్పేందుకు భూసేకరణ మొదలుపెట్టారు. ఇక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఈ కర్మాగారాన్ని దేవరకొండ మండలం శేరిపల్లి వద్ద పెట్టేందుకు 200 ఎకరాల భూమిని సేకరించారు. 2003 సంవత్సరంలలో పెద్దఅడిశర్లపల్లిలో ఆనాటి నల్లగొండ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో సద్దుమణిగింది. ప్రజల్లో భయం యురేనియం వెలికితీతతో రేడియేషన్ బయటకు వచ్చి ప్రాణాలకే ప్రమాదం జరుగుతందని ప్రజల్లో భయం ఉంది. ఈ గుట్టల నుంచి వర్షపు నీరంతా నాగార్జునసాగర్ జలాశయంలో కలుస్తుంది. ఇక్కడ యురేనియం తీస్తే తాగు, సాగునీరు కలుషితమై ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. దీంతో యురేనియం వెలికితీతను వ్యతిరేకిస్తూ గతంలోనే పెద్ద ఉద్యమాలు చేపట్టారు. -
టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్ ఈఏపీ సెట్‌తో పాటు ఐసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్ చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4, 5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు చేశారు. -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్‌సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. -
కవిత అరెస్టు కక్ష సాధింపే: బీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి,ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు జరిగిందన్నారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమను సరెండర్ చేసుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే అనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎంపీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించామని, ఇప్పుడు కూడా కేసుల నుంచి క్లీన్‌గా బయటపడతామని చెప్పారు. ఎంపీ వద్దీరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత బాధితురాలే తప్ప, నిందితురాలు కాదన్నారు. ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఎన్నికల్లో తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు -
అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచే నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్‌రావు.. అతని పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును ఐదో రోజైన గురువారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో నలుగురు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీళ్లు గతంలో ‘ప్రభాకర్‌రావు సైన్యం’లో కీలక సభ్యులని సమాచారం. హోదా ఏదైనా బాధ్యత మాత్రం చీఫే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబీకి డీఐ జీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబీ చీఫ్‌గానే కొనసాగారు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్‌రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల నేపథ్యంలోనే అడ్డదారి ఎస్ఐబీలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్ (ఎల్ఐ)గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్‌రావు, అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు.. అక్రమ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారు. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నంబర్లతో సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రభాకర్‌రావు బృందం రష్యా, ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక ట్యా పింగ్, ఇతర నిఘా పరికరాలను పరిశీలించి వచ్చింది. ఏవేవి ఖరీదు చేయాలో చెప్పాల్సిందిగా పేర్కొంటూ కొందరు పెద్దలకు నివేదిక సమర్పించింది. కొనుగోలులో కీలక పాత్ర పోషించిన రవి పాల్ టెక్నికల్ అనుభవం ఉన్న రవి పాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్‌గా పని చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. రవి పాల్ సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఇజ్రాయెల్ నుంచి సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం ఖరీదు చేశారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. ‘ఆదిలాబాద్’కోసం వినియోగించారు 2018లో ఆదిలాబాద్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొన్న సమయంలోనూ ఎస్ఐబీ అధికారులు ఈ బ్రీఫ్‌కేస్ ఉపకరణాన్ని వినియోగించారు. రెండు వర్గాలకు చెందిన కీలక నేతలు ఇద్దరిని పట్టుకోగలిగారు. ఈ వ్యవహారాల్లో ప్రణీత్ రావుకు కుడిభుజంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో ఇద్దరి నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేయగా.. మరో నలుగురికి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులతో గురువారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలా పనిచేశారో.. అదే స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కూడా వివిధ శాఖలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయన్నారు. ఇప్పటివరకు పోలీసు శాఖ రూ.10 కోట్ల నగదు, పలు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను నిల్వ చేసేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ కేంద్రాలపై కూడా నిఘా ఉంచామన్నారు. మద్యం అక్రమ రావాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి మద్యం నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె. జైన్ పాల్గొన్నారు. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్‌వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్‌కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్‌లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్‌ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్‌లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్‌పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్‌తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్‌లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్‌లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్‌రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
బేగంపేటలో దొంగల బీభత్సం.. ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేటలో ఓ ఇంట్లోకి గురువారం తుపాకీతో అగంతకులు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరికి యత్నించారు. అయితే దుండగులును ఇంట్లోని తల్లీ కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురు దాడికి దిగారు. ఊహించని పరిణామంలో దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. -
జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు వస్తే 11 లక్షల మాత్రమే జీహెచ్ఎంసీ కంప్యూటరైజ్ చేసింది. లేని దరఖాస్తులకు ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనీ అన్ని జోన్లలో అభయహస్తం దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది. మ్యానువల్ డాక్యుమెంట్స్‌ను కంప్యూటర్ చేసినట్లు లెక్కలు చూపి ప్రైవేట్ ఏజెన్సీలు నిధులు కాజేసినట్లు సమాచారం. ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సహకరించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు -
ఫోన్ ట్యాపింగ్ కేసు: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయనకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నేడు తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. గురువారం ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్బంగా కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇదిలా ఉండగా.. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ఈరోజు ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.