TS Special
-
మేడారం జాతరను దిగ్విజయం చేయాలి
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత వర్గాలు పార్టీలకు అతీతంగా పనిచేసి మేడారం జాతరను దిగ్విజయం చేయాలని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా ములుగు నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేడారం మహాజాతరకు నిధుల మంజూరులో అలస్యమైందని, కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా వెంటనే ఆయన నిధులు మంజూరు చేశారని తెలిపారు. జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులను శాశ్వతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అలాగే జాతరకు నిధులు కేటాయించాలని కోరామని, ఈసారి కేటాయిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు మేడారంలోని ఐటీడీఏ అతిథిగృహంలో మంత్రి సీతక్క.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గాష్ ఆలం, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీచైర్‌పర్శన్ బడే నాగజ్యోతితో కలసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మేడారం జాతరకు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల తాకిడి జనవరి చివరి వారం నుంచే మొదలవుతున్నందున పనులన్నీ జనవరి 20 నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా రోడ్లు వేయాలని, అవసరమైన చోట మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారంలో పార్కింగ్, వసతుల కల్పనలో ఇబ్బందులు రాకుండా అటవీ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు. ములుగు ప్రజలకు మొదటి ప్రాధాన్యం.. ములుగులో జరిగిన ర్యాలీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు, స్థానిక నాయకులు కుట్రలు చేసి తనను అనేక ఇబ్బందుకు గురిచేశారని గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా వంటి సౌకర్యాలను క ల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ములుగు నియోజకవర్గమే తన ఇల్లని.. మొదటి ప్రాధాన్యం ములుగు ప్రజలకే ఇస్తానని, అవసరం అయితే ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలను కొనసాగిస్తానని సీతక్క చెప్పారు. -
తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద.. భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నా యి. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. పరిమితి ఐదెకరాలా.. పదెకరాలా? కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని.. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మొత్తంగా 68.99 లక్షల మందికి.. రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25లక్షల మంది రైతులకు రూ.5,236 కోట్లు జమచేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ.72,815 కోట్లు జమ చేశారు. 90శాతంపైగా రైతులు ఐదెకరాల్లోపు వారే.. ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. ♦ రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు అయితే ఉండగా.. వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. ♦ ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. ♦ ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. -
TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా?
తెలంగాణ గవర్నర్ తమిళసై శాసనసభలో చేసిన ప్రసంగం పరిశీలిస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయం, భయంగా నడక ప్రారంభించిందన్నది అర్ధం అవుతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం వచ్చినప్పటికీ, మున్ముందు ఎదుర్కోబోయే కష్టాలు కూడా అంతర్లీనంగా ఈ ప్రసంగంలో కనిపిస్తాయి. ఆ విషయాలు నేరుగా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించకపోయినా, ఉపన్యాస సరళిని గమనిస్తే ఆ భావం కలుగుతుంది. ఇంతకాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనను నిర్భంధ పాలనగా, నియంతృత్వ పాలనగా సహజంగానే విమర్శిస్తారు. దానికి కొంతమేర కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. అలాగే ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న విషయంలో విచారణ కొనసాగుతుందని గవర్నర్ వెల్లడించారు. ఇది బీఆర్ఎస్కు ఎంబరాస్మెంట్ కలిగించే అంశమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం కష్టం అయినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉండే విషయాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు అలా వ్యవహరించడం సహజమే. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించామని ఈ స్పీచ్‌లో తెలిపారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే వేల సంఖ్యలో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చి తమ వినతులు అందిస్తున్నారు. వాటన్నిటిని పరిష్కరించడం అంత తేలికకాదు. వాటిలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలే ఉండవచ్చు. వాటిని ఏమి చేయాలన్నదానిపై ఒక విధానం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ వినతులు ఇచ్చినవారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని, నిర్భంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని ప్రభుత్వం భరోసా ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చి దేశాన్ని నియంతగానే పాలించారన్న సంగతి గుర్తుకు వస్తుంటుంది. అయినా ప్రజలకు పూర్థి స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించడం ముదావహమని చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టిన 48 గంటలలో రెండు హామీలను నెరవేర్చడం రేవంత్ రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు. అంతవరకు ఓకే. అవి రెండు తేలికగా అయ్యేవి కనుక చేశారు. అందులో కూడా ఇబ్బందులు లేకపోలేదు. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేర్చింది వాస్తవమే. కాని దీనివల్ల ఆర్టీసీకి కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేసేది కూడా ప్రభుత్వం చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ నష్టం మేరకు మొత్తాన్ని ఆర్టిసికి చెల్లిస్తుందా?లేక దానిని మరింత నష్టాలలోకి నెడుతుందా అన్నది చూడాలి. ఈ హామీ అమలు వల్ల వేలాది మంది ఆటోవాలాలు, క్యాబ్ ల వారు ఉపాధి కోల్పోతున్నారన్న విషయం బాగా ప్రచారం అవుతోంది. దీనిని ఎలా పరిష్కరిస్తారో ఆలోచించాలి. మరో హామీ పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఇప్పటికప్పుడు ప్రభుత్వం మీద పడే ఆర్ధిక భారం పెద్దగా ఉండదు. కాని ఎంతో కొంత బడ్జెట్ పెంచవలసి ఉంటుంది. దాని సంగతి ఏమి చేస్తారో తెలియదు.మిగిలిన హామీలు మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు మొదలైన గ్యారంటీల పేర్లు ప్రస్తావించి వంద రోజుల కార్యాచరణ అన్నారు తప్ప వాటి వివరాల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు.ఇక్కడే వారిలో భయం ఏర్పడిందన్న విషయం అర్ధం అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్ధిక సాయం, గృహజ్యోతి కింద ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం,రైతు భరోసా కింద పదహారువేల సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల సహాయం వంటివాటిని అమలు చేయవలసి ఉంది. వీటన్నిటికి అయ్యే వ్యయం అంచనా వేస్తే కనీసం ఏభైవేల కోట్ల వరకైనా ఉండవచ్చన్నది ఒక అబిప్రాయం. కాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అంచనా వేసిన ప్రకారం లక్ష కోట్లు అవసరం అవుతాయి. ఆ డబ్బు ఎలా వస్తుందన్నది మున్ముందు రోజుల్లో చెబుతారేమో చూడాలి. ఇవి కాకుండా ఆయా డిక్లరేషన్లు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ఊసేమీ ఎత్తలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న రైతు భరోసా ఆగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇస్తూ, తాము అధికారంలోకి రాగానే పదిహేనువేల చొప్పున ఇస్తామని చెప్పారు. దాని సంగతి కూడా చెప్పినట్లు లేదు. ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లోనే ఆమోదిస్తామని అప్పట్లో రాహుల్ గాంధీ చెబుతుండేవారు. ఆ ప్రకారం మంత్రివర్గం ఆమోదించినా, ఆ తర్వాత ప్రక్రియ ఏమిటో ప్రభుత్వం వివరించలేదు. మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని,పౌర సరఫరా సంస్థ 56వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించింది. మంత్రులు కూడా ఈ విషయాలను మీడియాకు చెబుతున్నారు. నిజానికి ఈ పరిస్థితి గురించి ఎన్నికల ముందు కూడా వీరికి తెలుసు. అయినా ఈ వాగ్దానాలు చేశారంటే, పదేళ్లుగా అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్ ను ఎలాగైనా పవర్ లోకి తీసుకురావాలన్న ఆకాంక్ష తప్ప మరొకటి కాదు.రెండు లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామని కూడా ఈ స్పీచ్ లో పేర్కొన్నారు. ఇది కూడా అంత తేలిక కాకపోవచ్చు.మెగా డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కూడా గవర్నర్ పేర్కొన్నారు. నిజంగానే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగితే రేవంత్ ప్రభుత్వానికి మంచి క్రెడిట్టే వస్తుంది. ధరణి పోర్టల్ బదులు భూ మాత పోర్టల్ తెస్తామన్న హామీని కూడా ప్రస్తావించారు. మళ్లీ దీనివల్ల రైతులకు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడితే మంచిది.గత ప్రభుత్వం మాదిరే మూసి నది ప్రక్షాళన చేస్తామని ఈ ప్రభుత్వం కూడా వెల్లడించింది. దానికి తోడు మూసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పన జోన్ చేస్తామని అంటున్నారు. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి.గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ప్రచారానికి మాత్రమే వాడుకుందని, తదితర విమర్శలు కూడా ఈ స్పీచ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులపై శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాని ప్రజలకు కావల్సింది శ్వేతపత్రాలు కాదుకదా! చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కదా! అన్న వ్యాఖ్యలు ప్రతిపక్షం నుంచి వస్తాయి. గత ప్రభుత్వంపై నెపం నెట్టి కాలయాపన చేయడానికి ఇవి పాతరోజులు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పిస్తామని చెప్పడం మంచి విషయమే. తమ ప్రభుత్వం మాటలకన్నా చేతలనే నమ్ముకుందని, మార్పును మీరు చూస్తారని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒకరకంగా చూస్తే ఇది ఆశలు కల్పించి,వాటిని నెరవేర్చడానికి యత్నించే ప్రభుత్వంగా కనిపిస్తుంది.మరో రకంగా చూస్తే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను పరోక్షంగా ప్రస్తావిస్తూ భయం,భయంగా సాగే ప్రభుత్వం అన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
సారూ.. ఉద్యోగం ఇప్పించండి
గోదావరిఖని: సమస్యలు పరిష్కరించాలని గొంతెత్తినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తనను విధుల నుంచి తొలగించిందని, జీవనోపాధి లేకుండా రోడ్డున పడేసిందని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమై.. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ అనేకమార్లు ప్రదక్షిణలు చేసినా, నాయకులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈమేరకు శనివారం సీఎం నిర్వహించే ప్రజాదర్బార్‌కు వెళ్లారు. అక్కడ తన గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగ భధ్రత కోసం ఆందోళన.. సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో 2016లో హోంగార్డులు ధర్నా చేశారు. గోదావరిఖనికి చెందిన హోంగార్డు మామిడి పద్మ ఆందోళనల్లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. పర్యవసనంగా ఆమె తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమెకు తన ముగ్గురు పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది. భర్త వదిలేయడంతో ఏ పనిచేసుకోవాలో తెలియక, తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని సీపీ, డీజీపీ, హోంమంత్రిని వేడుకున్నారు. హోంగార్డు పద్మ 2009లో వేములవాడలో తొలిపోస్టింగ్, రెండేళ్లు పనిచేసిన తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్ఫర్ అయ్యారు. జీతాలు పెంచి ప్రతినెలా చెల్లించాలనే డిమాండ్‌తో ఏడేళ్ల క్రితం వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రి వద్ద హోంగార్డులు ధర్నా చేశారు. ఇందులో పాల్గొన్నందుకు పద్మ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈమెపై అనేక కేసులు బనాయించడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈరోజు తన గోడును కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సమస్య పరిష్కరించి ఉద్యోగం ఇప్పించాలని ఆమె వేడుకున్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్ ఏసీపీ పేరు..!
నిజామాబాద్: జిల్లాలో ఏళ్లుగా తిష్ట వేసిన పోలీస్ అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పైరవీలు షు రూ చేశారు. ప్రస్తుతం ఉన్నవాళ్లంగా బీఆర్ఎస్ ఎ మ్మెల్యేల సిఫార్సుల ద్వారా జిల్లాలో పోస్టింగ్ పొందారు. గతంలో అధికార పార్టీకి అండగా ఉండి ప్రతిపక్షపార్టీలపై కఠినంగా ఉండటంతో కొంత మంది పోలీసు అధికారులకు బదిలీ తప్పదనే ప్రచారం ఉంది. జిల్లాలోని 6 నియోజకవర్గంలో రెండు స్థానా ల చొప్పున బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యేల సి ఫార్సు లేఖలతో ఎస్సైలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలు పోస్టింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సిఫార్సుతో వచ్చినవారే విధుల్లో ఉన్నారు. పదిహేను రోజుల్లో జిల్లాలో పోలీసుల బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతుంది. సిఫార్సులతో వచ్చిన వారిపై ఆరా.. జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిఫార్సులో వచ్చిన పోలీసులకు సంబంధించిన వివరా ల జాబితాను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. వీరు పని చేసిన ప్రాంతంలో ప్రతిపక్షా పారీ్టలపై వ్యవహరించిన తీ రుపై జాబితాను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవ ల అధికార పార్టీ ఎమ్మెల్యేను సీఐతో పాటు ఎస్సైలు వెళ్లి మర్యాద పూర్వకంగా కలవగా ఎన్నికల్లో అప్ప టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై సదరు ప్రజాప్రతినిధి ప్రస్తావించడంతో పో లీసు అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ వద్ద పోలీసుల జాబితా ఎన్నికల సమయంలో గత సీపీ సత్యనారాయణపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫి ర్యాదు చేయడంతో సీపీ కల్మేశ్వర్‌కు ఎన్నికల సంఘం పోస్టింగ్ ఇచ్చింది. ఎన్నికలప్పుడు అధికార పారీ్టకి అండగా ఉన్నారని ఎస్సై, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు, సీపీ కల్మేశ్వర్‌కు జాబితాను అందించినట్లు తెలిసింది. వారికి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది. వ్యక్తిగత సెలవులో బోధన్ ఏసీపీ ఎన్నికల సమయంలో ఎడపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులిశ్రీనివాస్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో జరిగిన సమావేశంలో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ పేరును తన రెడ్‌డైరీలో రాసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 2న జిల్లా పర్యటనకు వచ్చిన ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ నాయకులు కలిసి సదరు పోలీసులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, ఎస్‌హెచ్‌వో ప్రేమ్‌కుమార్ వ్యక్తిగత సెలవులో వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బదిలీవేటు తప్ప దని భావించిన ఏసీపీ, ఎస్‌హెచ్‌వో వ్యక్తిగత సెలవులలో వెళ్లినట్లు పోలీస్వర్గాలలో ప్రచా రం జరుగుతుంది. -
హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
నాగోలు: ఎల్బీనగర్లోని చింతల్‌కుంటలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ముందున్న కారుతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డుపై ఉన్న నలుగురు వ్యక్తులను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి దుర్మరణం చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకీ నందన్ అనే వ్యక్తి తన బీఎండబ్లూ కారులో దిల్సుఖ్నగర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్నాడు. ఎల్బీనగర్ చింతల్‌కుంట వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యాగనార్ కారు ఢీకొట్టాడు. అక్కడే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని.. రోడ్డు పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మల్లేష్ (50)తో పాటు నగరానికి చెందిన పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతమ్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతంరెడ్డిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలియగానే ఎల్బీనగర్ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై ఓవర్ స్పీడ్‌కు సంబంధించి ఇప్పటికే చాలా చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతుర్ని చూసేందుకు వచ్చి.. చింతలకుంటలో ఉన్న కూతుర్ని చూసేందుకు మల్లేష్ నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి వచ్చి బస్సు దిగాడు. సరస్వతీనగర్‌లోని తన కూతురి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుని ఉండగా..ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మల్లేష్ కుమారుడు వినయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రూ. 20 కోట్ల శునకం!!
మియాపూర్: సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌లు.. బడా ఫంక్షన్లలో ప్రదర్శనలు.. ఎక్కడికెళ్లినా విస్తృత మీడియా కవరేజీ.. సెల్ఫీల కోసం ఎగబడే ప్రజలు.. ఇవన్నీ ఏ ప్రముఖుడి లైఫ్ స్టైల్‌ను తెలియజేసే వర్ణన అనుకుంటున్నారా? కానే కాదు.. దేశంలోనే అత్యంత ఖరీదైన, భారత్‌లో అరుదుగా పెంచే కకేషియన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ శునకం అనుభవిస్తున్న విలాస జీవితం తాలూకు ఉదాహరణలు. దీని ఖరీదు రూ. వేలు, రూ. లక్షలు కూడా కాదు.. అక్షరాలా రూ. 20 కోట్లు!! కాడబామ్ హేడర్ అనే ఈ శునకం శనివారం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సందడి చేసింది. దీన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ ఈ శునకాన్ని రూ. 20 కోట్లుపెట్టి ఈ ఏడాది జనవరిలో నగరానికి చెందిన ఓ డాగ్ బ్రీడర్ నుంచి కొనుగోలు చేశారు. తాజాగా నగరంలో పెట్ షో నిమిత్తం దీన్ని బెంగళూరు నుంచి తీసుకురాగా అది మార్గమధ్యలో కాస్త అలసటకు గురైంది. దీంతో మియాపూర్ మదీనాగూడలోని విశ్వాస్ పెట్ క్లినిక్‌లో దీనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో తన శునకం పాల్గొని ఇప్పటివరకు 32 పతకాలు సాధించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతోపాటు సినిమాల్లోనూ నటించిందని వివరించారు. దీనితోపాటు రూ. 10 కోట్ల విలువచేసే టిబెటన్ మాస్టిఫ్, రూ. 8 కోట్ల విలువచేసే అలాస్కన్ మాలమ్యూట్ జాతి శునకాలు తన వద్ద ఉన్నాయన్నారు. మూడేళ్ల వయసున్న కాడబామ్ హేడర్ రోజుకు 3 కేజీల చికెన్‌ను ఆహారంగా తీసుకుంటుందని... ఈ కుక్క కోసం నెలకు రూ. 3 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మరో 1,890 స్టాఫ్ నర్స్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 1,890 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 5,204 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుల కోసం రాత పరీక్ష కూడా పూర్తయింది. 40 వేల మందికి పైగా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 1,890 స్టాఫ్ నర్స్ ఖాళీలను కూడా ప్రభుత్వం కలిపింది. దీంతో ఈ పరీక్ష ద్వారా మొత్తం 7,094 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి తెలిపారు. త్వరలో ఫలితాలు వెలువడతాయని ఆయన పేర్కొన్నారు. -
ఫోన్ల రికవరీలో దేశంలోనే ప్రథమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో 33.71 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో 15,024 మొబైల్ ఫోన్లను గుర్తించడంతోపాటు యజమానులకు అప్పగించినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలందరి కృషితోనే ఇది సాధ్యమైందని మహేశ్ భగవత్ అభినందించారు. -
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు
శంషాబాద్ రూరల్: వచ్చే 25 ఏళ్లలో భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా చిన్నగోల్కొండలో జెండా ఊపి సంకల్ప రథాన్ని ప్రారంభించారు. దేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా.. అర్హులైన వారి చెంతకు పథకాలను ఈ రథం ద్వారా తీసుకెళ్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం వాయిదా పడిందని, ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభించిన యాత్రను జనవరి 25 వరకు కొనసాగిస్తామని, రథాన్ని ప్రతి ఊరుకు తీసుకువెళ్లి కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. అలాగే అర్హులకు పథకాల మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. మోదీ పాలనలో గత 9 ఏళ్లలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు, మహిళా సంఘాలకు రుణాలు, పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య చికిత్స, రైతులకు పెట్టుబడి సాయం, గూడు లేని పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత రేషన్, గ్యాస్ కనెక్షన్లవంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి డ్రోన్ మంజూరు.. రైతులు పంటలకు మందులు పిచికారీ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక మహిళా సంఘానికి డ్రోన్ సౌకర్యం సమకూర్చుతున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 15 వేల డ్రోన్లను ఇవ్వనున్నట్లు చెప్పారు. -
మేడిగడ్డపై ఎల్ అండ్ టీ యూ–టర్న్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకును సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తామని గతంలో చేసిన ప్రకటనపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ యూ–టర్న్ తీసుకుంది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. సొంత ఖర్చుతోనే బ్యారేజీ పునరుద్ధరణ చేపడతామని మరుసటి రోజు ఎల్అండ్టీ జనరల్ మేనేజర్ సురే‹Ùకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. బ్యారేజీ కుంగిన ఘటనపై నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్‌తో అక్టోబర్ 23న జలసౌధలో సమీక్ష నిర్వహించారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ నిబంధనలో భాగంగా బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఎల్అండ్టీ సొంత ఖర్చుతో చేసేందుకు ఒప్పుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. బ్యారేజీకి సంబంధించిన రెండేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్ 29తో ముగిసిన నేపథ్యంలో పునరుద్ధరణ బాధ్యత తమది కాదని తాజాగా ఎల్అండ్టీ సంస్థ మాట మార్చింది. బ్లాకు పునర్నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ నుంచి ఈ నెల 5న తమకు లేఖ అందిందని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే ఎల్ అండ్ టీ నుంచి లేఖ అందినట్టు చెప్పాయి. బ్యారేజీ పునరుద్ధరణ పనుల కోసం తొలుత ఎగువ నుంచి వస్తున్న వరదను దారి మళ్లించడం కోసం రూ.55.75 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుందని, ఈ మేరకు వ్యయం భరించేందుకు ప్రభుత్వం ముందుకొస్తేనే పనులు ప్రారంభిస్తామని లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టం చేయడం గమనార్హం. బ్యారేజీ పునరుద్ధరణ పనులకు మరో రూ.500 కోట్ల వ్యయం కానుందని ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించామని ఎల్ అండ్ టీ పేర్కొంది. లేఖను దాచిపెట్టారు! ఎల్ అండ్ టీ రాసిన లేఖను నీటిపారుదల శాఖ రహస్యంగా ఉంచడంపై ఆరోపణలు చెలరేగాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నెల 11న జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై ఈఎన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఉత్తమ్‌తో సహా మరో నలుగురు మంత్రులు నీటిపారుదల శాఖపై సమీక్ష జరిపారు. వాస్తవాలు దాస్తున్నారని రెండు సమీక్షల్లోనూ ఈఎన్సీలపై మంత్రులు మండిపడ్డారు. మంత్రులు రెండుసార్లు సమీక్షలు నిర్వహించినా, ఎల్ అండ్ టీ లేఖ విషయాన్ని అధికారులు ప్రస్తావించలేదని తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. -
అసత్యాలు, అభూత కల్పనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాస నసభ దద్దరిల్లింది. చర్చ ప్రారంభమైన తొలి రోజే సభలో తీవ్ర రచ్చ జరిగింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ఆరోపణలు, ప్రత్యా రోపణలతో సభలో వాతావర ణం వేడెక్కింది. అరుపులు, కేక లతో పలుమార్లు సభ మార్మోగి పోయింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి కేటీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే ప్రభుత్వంపై దాడికి దిగారు. ‘గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పులతడకగా ఉంది. ఇలాంటి ప్రసంగం వినడానికి సభ్యుడిగా సిగ్గుపడుతున్నా. ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం శాసనసభ చరిత్రలో విని ఉండము. కేవలం పదేళ్లు ప్రభుత్వం నడిపిన వారిపై నెపాన్ని నెట్టి వేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలి పారు. కేటీఆర్ తన ప్రసంగంలో గత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఆరోపణలు చేయగా పలుమార్లు మంత్రులు అడ్డుతగిలారు. తెలంగాణ ఏర్పాటునే ప్రామాణికంగా తీసుకుని 2014 జూన్ 2 నుంచి జరిగిన పరిణామాలపైనే చర్చించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మరో నలుగురు మంత్రులు కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అభ్యంతరం తెలుపుతూ ఎదురుదాడికి దిగడంతో సభలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 55 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడుతాంప్రభుత్వం గత పదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడితే, తాము 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడాలా? వద్దా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో 2014కి ముందు పడావుపడ్డ భూములు, పాడుబడ్డ ఇళ్లు, ఆకలికేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, ఎన్కౌంటర్లు, కరెంట్ కోతలు, కటిక చీకట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు బారిన నేలలు ఉండేవని కేటీఆర్ గత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చింది. మూడు నెలల సమయం ఇద్దాం. ఎలాగో అట్టర్ ఫ్లాప్ అవుతారు’ అని తమ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు తాము పోరాడుతుంటే పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెదవులు మూసుకున్నారని కేటీఆర్ విమర్శించగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత స్నానం చేయడానికి బావుల్లో నీళ్లు, కరెంట్ లేక ఎలా ఇబ్బంది పడ్డారో తెలుపుతూ కాంగ్రెస్ పాలనపై గతంలో సభలో రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. నిర్బంధాలు, నియంతృత్వం తమ పదేళ్ల పాలనలో కాదని, ఇందిరమ్మ పాలనలోనే చోటుచేసుకున్నాయని కేటీఆర్ చెప్పారు. ఎమర్జెన్సీ, ఆర్టికల్ 365తో ప్రభుత్వాన్ని రద్దు చేయడం, ముల్కీ రూల్స్‌కు తూట్లు పొడవడం జరిగాయన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద పొక్క గొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే, హంద్రీ నీవాతో నీళ్లు తీసుకెళ్తుంటే టీ కాంగ్రెస్ నేతలు హారతులు పట్టారని ఆరోపించారు. చర్చల కోసం నక్సల్స్‌ను పిలిచి కాల్చి చంపింది ఎవరని ప్రశ్నించారు. వాస్తవానికి నిర్బంధం జూన్ 2, 2014తో ముగిసిందన్నారు. చీమల పుట్టలో చేరిన పాము ఎవరు? ‘శాసనసభలో మేము 39 మంది ఉండగా, కాంగ్రెస్ నుంచి 64 మంది ఉన్నారు. ఎందుకంత మిడిసిపడుతున్నారు? ఓట్ల తేడా కేవలం 1.85 శాతం మాత్రమే’ అని తన ప్రసంగానికి అడ్డుపడుతున్న అధికారపక్ష సభ్యులనుద్దేశించి కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని రేవంత్‌రెడ్డి ఏక వచనంతో సంబోధించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అచ్చోసిన ఆంబోతు.. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఎవరు? అని ప్రశ్నించారు. భట్టి, దామోదర, శ్రీధర్, ఉత్తమ్, కోమటిరెడ్డి పెట్టిన పార్టీలో దూరి సీఎం పదవి తీసుకున్న వ్యక్తి ఈ విషయాలు మాట్లాడటం చండాలంగా ఉందన్నారు. ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకుంది ఎవరని ప్రశ్నించారు. వంద కోట్ల మంది భారతీయులను కాదని బయటి దేశం నుంచి అధ్యక్షురాలిని తెచ్చుకుంది ఎవరని నిలదీశారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేశామని ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రెండు హామీల్లో అమలు చేసింది పావులా వంతు మాత్రమే అన్నారు. ప్రజావాణిని కొత్తగా ప్రారంభించడమేంటని, అది ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరుగుతోందని పేర్కొన్నారు. ప్రగతిభవన్ ఎదుట 2012లో నాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇనుప కంచెలు వేశారన్నారు. అప్పులపై తప్పుడు ప్రచారం గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆస్తులను రూ.1,37,571 కోట్లకు పెంచామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టి రూ.81,516 కోట్ల అప్పులు చేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. పౌర సరఫరాల సంస్థ వద్ద రూ.30 వేల కోట్ల విలువ చేసే స్టాక్ ఉందని, మరో రూ.17 వేల కోట్లు ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిఉందని, రెండు కలిపితే రూ.47 వేల కోట్లు అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని దాచి సంస్థ తరఫున రూ.56 వేల కోట్ల అప్పులు చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులను వృద్ధిరేటుతో పోల్చి చూడాలన్నారు. అమెరికాలో జీడీపీతో పోల్చితే 123 శాతం, జపాన్‌లో 215 శాతం, భారత్‌లో 57 శాతం అప్పులుండగా, తెలంగాణలో 27.8 శాతమే ఉన్నాయని చెప్పారు. అప్పుల్లో తెలంగాణ దేశంలోనే కింది నుంచి 24వ స్థానంలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. -
మేడిగడ్డపై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీలో బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శాసన మండలిలో ప్రకటించారు. నిష్పక్షపాత విచారణ జరిపించి.. కాంట్రాక్టులు ఎవరిచ్చారో, సమస్యలకు కారణం ఎవరో తేల్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వంలో నచ్చితే నజరానా (పురస్కారం), నచ్చకపోతే జుర్మానా (జరిమానా) ఉండవని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో శనివారం చేపట్టిన ధన్యవాద తీర్మానం చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడ్డాయని.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మాత్రం కళ్లముందే కుంగిపోయాయని వ్యాఖ్యానించారు. అలాంటిది తామేదో గొప్ప ప్రాజెక్టు కట్టామని, చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల ప్రాజెక్టును ఇసుకపై కట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సభ్యులను తీసుకెళ్లి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను చూపిస్తామన్నారు. సాంకేతిక నిపుణులతో పరిశీలించాలి.. సీఎం రేవంత్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం వద్ద ఏదో ఘోరం జరిగిపోయిందంటూ.. ఏదో పర్యాటక ప్రదేశానికి వెళ్లినట్టు శాసనసభ, మండలి సభ్యులను తీసుకెళ్లడం కంటే సాంకేతికంగా నిపుణులతో పరిశీలించడం మంచిదని సూచించారు. తాము ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీనిపై రేవంత్ ప్రతిస్పందిస్తూ.. మేడిగడ్డ పరిశీలనకు బీఆర్ఎస్ వారు రానంటే తమకు అభ్యంతరమేమీ లేదని, మిగతా సభ్యులకు అవకాశం కల్పిస్తే బీఆర్ఎస్ వారికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం వద్ద బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డుపడినా సరే.. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మహాలక్ష్మి పథకం అమలు, పింఛన్లను రూ.4 వేలకు పెంచడం వంటి హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇది తమ గ్యారంటీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక.. ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం మార్పు, టీచర్లు–ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 జీవో, స్కూల్ సర్విసెస్, జీతాలు వంటి అంశాలపై ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని తీసుకొస్తుందని, రైతుబీమా పథకాన్ని కూడా మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. నా భాష ఇలాగే ఉంటుంది..! అసెంబ్లీ ఎదుట ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను తొలగించే విషయంపై అన్నిపార్టీలతో చర్చిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజానికి ఈ ప్రాంగణం ప్రభుత్వ పరిధిలోనిది కాదని.. అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ సమావేశమై ఏ ఆదేశాలిస్తే వాటిని పాటిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో సీఎం సంయమనం, సహనంతో ఉండాలని, పరుష పదజాలంతో భయపెట్టేలా మాట్లాడవద్దని కోరుతున్నామని దేశపతి పేర్కొన్నారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘గ్రామం నుంచి వచ్చాను. రైతుబిడ్డను. ప్రభుత్వ బడిలో చదువుకున్నాను, నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చాను. నా భాష ఇలాగే ఉంటుంది. ఏం అనుకున్నానో అదే చెబుతాను. నా మాటలకు తప్పు చేయనివారు ఎందుకు భయపడాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి నమూనా చేస్తాం హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడే అభివృద్ధి నమూనాగా మార్చుతామని సీఎం రేవంత్ చెప్పారు. మూసీ నదిని శుభ్రమైన నీటితో కళకళలాడేలా చేస్తామని.. మూసీ పరీవాహకం మొత్తం (నల్లగొండ దాకా>) ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. తనకు శాసన మండలిపై ప్రత్యేక అభిమానం ఉందని.. పదిహేనేళ్ల కింద తాను ఎమ్మెల్సీగా అడుగుపెట్టి సీనియర్ సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వంటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాగా.. మైనారిటీలకు ఇచ్చిన రూ.లక్ష సబ్సిడీ చెక్కు బౌన్స్ అయిందని, ఆ సొమ్మును ఇప్పించాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ కోరగా.. గతంలో ఉన్నది నకిలీ ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ సొమ్ముపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కవిత సవరణ.. వెనక్కి.. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో భాషా ప్రయోగం సరిగా లేదని, దానిని మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కోరారు. ఈ మేరకు ధన్యవాద తీర్మానానికి సవరణలు కోరారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు కల్పించుకుని.. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, సవరణ డిమాండ్‌ను ఉప సంహరించుకోవాలని కోరారు. కవిత ప్రతిస్పందిస్తూ.. గవర్నర్ ప్రసంగంలోని భాషతో తాము ఏకీభవించడం లేదని, దానిపై నిరసన తెలుపుతూనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సవరణ డిమాండ్‌ను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. కాగా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల సమయంలో మండలిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి తెచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. -
ఆమెకు అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వొద్దు?: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగారు. నళినికి ఉద్యొగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాలమీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని సీఎం అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో మార్మోగిన పేరు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారామే. అక్కడితో ఆగకుండా తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. అనంతరం ఉద్యమంలో భాగంగా ఆమె ఢిల్లీలో రెండు సార్లు దీక్షకు సైతం కూర్చున్నారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆమె ప్రస్తావన పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇక నళినికి రాష్ట్రం ఏర్పడిని అనంతరం.. గత ప్రభుత్వంలో గానీ ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నళిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమెను డిసెంబర్ 4, 2011న సస్పెండ్ చేయడంతో మీడియాలో సంచలనంగా మారారు. ఆమెను దేశ ద్రోహంకు పాల్పడినట్లు నిందించడంపై అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారని ఆమె గుర్తు చేసుకొంటున్నారు. ఇక ఆమె డిఎస్పీ ఉద్యోగంపై రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి అన్ని ఉద్యమంలో భాగంగానే చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె ఎవరినీ కలవలేదు. -
ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్: సమస్యలను ఏకరువు పెట్టుకునేందుకు నగరంలోని ప్రజా భవన్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులు బారులు తీరుతున్నారు. శుక్రవారం ప్రజావాణిలో దరఖాస్తులనుసమర్పించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో ప్రజాభవన్ సమీపంలోని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కొందరు క్యూలైన్లోనే అల్పాహారం తీసుకున్నారు. సందట్లో సడేమియా వలే ఇక్కడ దరఖాస్తులను రాసేందుకు కొందరు తెల్ల కాగితాలను సైతం విక్రయించారు. మొత్తానికి శుక్రవారం గ్రీన్‌హిల్స్‌లోని ప్రజాభవన్ వేలాది మంది అర్జీదారులతో కిటకిటలాడుతూ కనిపించింది. -
ఏడేళ్లకే పోలీసయ్యాడు!
బంజారాహిల్స్: ఈ చిట్టి పోలీసును చూశారుగా. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్‌తో ఏదో కేసు గురించి సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నాడు కదూ. ఇతడి పేరు మోహన్సాయి. వయసు ఏడేళ్లు మాత్రమే. కానీ పోలీసయ్యాడు. తన చిరకాల కోరికను ఇలా తీర్చుకున్నాడు. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దామా.. ఏపీలోని గుంటూరుకు చెందిన బ్రహ్మం, లక్ష్మి దంపతులకు ఏడేళ్ల కుమారుడు మోహన్సాయి ఉన్నాడు. నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు కేన్సర్ బారిన పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో ఏడాది కాలంగా కుమారుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్ కావాలని ఉందంటూ తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. మోహన్సాయి పరిస్థితి చూసి వారి మనసు చలించేది. కన్నీటి పర్యంతమయ్యేవారు. మోహన్సాయి కోరికను ఆస్పత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్న ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను కలిశారు. మోహన్సాయి అభిలాషను తీర్చేందుకు వారు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీస్ యూనిఫాంలో స్టేషన్లోకి అడుగుపెట్టిన మోహన్‌సాయికి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్ సెల్యూట్ కొట్టి స్టేషన్లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్లో కూర్చోబెట్టి ఠాణా పని తీరుపై ఆయన వివరించారు. -
సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల సాక్షిగా తెలంగాణలో ఇందిరమ్మ పాలన వరి్ధల్లుతుందని కాంగ్రెస్ సర్కారు తరఫున గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి.. హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోందని చెప్పారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని.. వారి విజ్ఞతను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని.. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పేందుకు గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశిస్తూ గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అనుభవం, యువరక్తం మేళవింపుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందని తమిళిసై ఆకాంక్షించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ‘‘ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం. ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచి్చన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కలి్పంచే ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోంది. ఇది ప్రజాపాలన. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉండే పాలన తెలంగాణలో మొదలైందనడానికి నిదర్శనంగా ప్రారంభమైనదే ప్రజావాణి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించే మహాలక్షి్మ, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు.. ఈ రెండు గ్యారంటీల అమలు ప్రారంభమైంది. మొత్తం ఆరు గ్యారంటీలైన మహాలక్షి్మ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతలను వచ్చే 100 రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటాం. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్‌లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్.. అన్నీ అమలు చేస్తాం. సాధ్యమైనంత త్వరలో అమరవీరుల కుటుంబాలను గుర్తించి.. 250 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని, గౌరవ భృతిని అందజేస్తాం. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. ఆదిలాబాద్‌కు సాగునీరు ఇస్తాం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతలోపం, అవినీతి, అవకతవకలపై విచారణ దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేసి ఎగువన ఆదిలాబాద్, ఇతర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం దిశగా సాగుతాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధనకు కట్టుబడి ఉన్నాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. దానికి జాతీయ హోదా సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతాం. త్వరలో మెగా డీఎస్సీ మెగా డీఎస్సీ నిర్వహణతో వచ్చే ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.లక్ష, స్థలం లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇంటి స్థలం ఇస్తాం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రారంభించేలా త్వరలో కార్యాచరణ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. భూసంస్కరణలలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన 25లక్షల ఎకరాల భూమిపై పేదలకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తాం. మాఫియాపై ఉక్కుపాదం రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియాను నిర్మూలించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. డ్రగ్స్ విషయంలో దోషులు ఎంతటివారైనా వదిలేది లేదు. ఐటీ విషయంలో మరింత వేగంగా పురోగతి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నగరాన్ని అన్నిదిశలా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం సంకల్పం. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా భావిస్తూ.. ఔటర్ లోపల ఉన్న నగరం, ఔటర్ రింగురోడ్డు– ప్రతిపాదిత రీజనల్ రింగురోడ్డు మధ్య ఉన్న ప్రాంతం, రీజనల్ రింగు రోడ్డు ఆవల ఉన్న ప్రాంతం.. ఇలా మూడు ప్రాంతాలను నిర్ధారించి వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అప్పుల్లో విద్యుత్ సంస్థలు గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. రూ.50,275 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీని సరిదిద్ది గాడిలో పెట్టాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసి, వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలపై భారం మోపకుండానే ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి సంక్షేమ పాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యక్తుల కోసం విధ్వంసమా? ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు వ్యక్తుల కోసం పనిచేసే పరిస్థితికి దిగజారాయి. ఈ తీరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో విలువలు పునరుద్ధరిస్తాం. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటాం. అభివృద్ధి విషయంలో వివక్ష ఉండదు. పారీ్టలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధి నిధులు పొందుతారు. సచివాలయం అలంకారప్రాయంగా ఉండదు. రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుంది. యువత జాబ్ కేలండర్ విషయంలో కార్యాచరణ ప్రారంభిస్తాం. ప్రతి గ్రామం యూనిట్‌గా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం..’’ అని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాళోజీ, అంబేడ్కర్ మాటలను ఉటంకిస్తూ.. ‘‘మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలె భారతాన..’’ అన్న ప్రజాకవి కాళోజీ మాటలను ఉటంకిస్తూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చివరిగా ‘‘ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వ పాలనా రూపం మాత్రమే కాదు.. వాస్తవానికి అది తోటి మానవుల పట్ల గౌరవాదరాలతో కూడిన ఒక వైఖరి..’’ అన్న అంబేడ్కర్ మాటలను ప్రస్తావించారు. ప్రముఖ కవి దాశరథి పేర్కొన్న ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..’’ అనే మాటలతో ప్రసంగాన్ని ముగించారు. -
‘డీప్’గా పసిగట్టి..‘ఫేక్’ పనిపట్టండి
సాక్షి, హైదరాబాద్: డీప్‌ఫేక్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆన్లైన్లో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ కట్టడికి కఠిన నిబంధనలు విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, డీప్‌ఫేక్‌తో మోసాలకు గురికాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి. ► ఫొటోలు, వీడియోలలో ఉన్న లైటింగ్, నీడలను నిశితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలు గమనిస్తే అది ఫేక్ అని ప్రాథమిక అంచనాకు రావొచ్చు. ► అసహజ ముఖకవళికలు ఉన్నట్టు గమనిస్తే దానిని డీప్‌ఫేక్‌తో తయారు చేసిన వీడియోగా భావించవచ్చు. ► ఆడియోలలో అసమానతలు, ఆడియో అస్పష్టంగా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► ఫొటోలు, వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో అసమానతలు, ఏవైనా వస్తువులు సాధారణానికి భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్‌ఫేక్ అయి ఉండొచ్చు. ► ఫొటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడిన, నడుస్తున్న ప్లాట్‌ఫారమ్‌లు అసాధారణంగా ఉన్నాయా? కదలికలు నిశితంగా పరిశీలిస్తే ఏవైనా అనుమానాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కూడా అవి నిజమైనవా..లేదా? గుర్తించవచ్చు. -
ఉరకలేసేలా.. ఊపునిచ్చేలా..
ఓ వైపు సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే సంప్రదాయ నాట్యాలు.. మరోవైపు అత్యాధునికతకు పట్టం కట్టే అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్స్.. అంబరాన్ని తాకే అద్భుతమైన పెళ్లి వేడుకలు.. రంగుల హంగుల హోలీ వేదికలు.. నగరం అంటే ఇప్పుడో ఈవెంట్ల సాగరం. ఓ వైపు ఈవెంట్స్‌కు పెద్దన్న లాంటి కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. మరోవైపు ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నూతన కాంతులీనాలని నగర ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం ఆకాంక్షిస్తోంది. అందుకు గాను ప్రభుత్వ సహాయ సహకారాలను కోరుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈవెంట్స్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రంగంలో ఈవెంట్ మేనేజర్లు, సౌండ్ లైట్ వీడియో ప్రొవైడర్లు, డెకరేటర్లు, డిజైనర్లు తదితర విభిన్న క్రాఫ్ట్‌లను కలిగి ఉన్న నగర ఈవెంట్ రంగం దేశంలోనే నంబర్ 1గా దూసుకుపోతోంది. పెద్ద సంఖ్యలో కళాకారులు, క్యాటరర్లు, ఈవెంట్ వేదికల యజమానులు, కన్వెన్షన్ కేంద్రాలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలోనే తమ ఈవెంట్ రంగానికి ప్రభుత్వం నుంచి పరిశ్రమ గుర్తింపు కావాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రతినిధులు కోరుతున్నారు. టీసీఈఐలో 400 మంది సభ్యులు, 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అధికారికంగా ఈవెంట్ మార్కెట్ పరిమాణం రూ.800 కోట్ల అసంఘటిత రంగంలో కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ రంగం ఏటా 16% చొప్పున వృద్ధి నమోదు చేస్తోంది. కోర్సులకు శ్రీకారం.. విస్తృత అవసరాలను కలిగి ఉన్న ఈవెంట్ రంగం వైపు నిపుణులను ఆకర్షించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సులను ప్రారంభించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్తో టీసీఈఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సుల పట్ల యువతలో ఆసక్తి పెంచడానికి వీటిని ఉపాధి ఆధారితంగా మార్చడానికి, టీసీఈఐ ప్రభుత్వ సహకారం కోరుతోంది. సింగిల్ విండోతో సమస్యలకు చెక్... ఈవెంట్ నిర్వహణ కత్తిమీద సాము. ముఖ్యంగా ఇందులో సమయం కీలకపాత్ర పోషిస్తుంది. కాలం వృథా వల్ల కలిగే నష్టం ఒక్కోసారి అంచనాలకు అందదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈవెంట్ల నిర్వహణకు కావాల్సిన అనుమతుల కోసం అనేక ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగే అవసరం తప్పించాల్సిందిగా టీసీఈఐ చాన్నాళ్లుగా కోరుతోంది. అన్ని రకాల అనుమతులూ ఒకే చోట క్లియర్ అయ్యేలాగా విండో క్లియరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తోంది. గత ప్రభుత్వం అందించిన సహకారంతో ఈవెంట్స్ రంగం కొత్త పుంతలు తొక్కిందనీ నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం అంతకు మించిన ప్రోత్సాహం అందిస్తుందని, ప్రపంచంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే కృషిలో చేయూత అందిస్తుందని టీసీఈఐ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ సిటీ ఏర్పాటు కావాలి.. నగరంలోని ఈవెంట్స్, మేనేజర్ల టాలెంట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. దీనికి అనుగుణంగా మరిన్ని మార్పులు చేర్పులు అవసరం. ప్రపంచ స్థాయి ఈవెంట్లు – కాన్ఫరెన్స్‌ల నిర్వహణను సులభతరం చేయడానికి, భారీ కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అరేనాలు, అవుట్డోర్ ఈవెంట్ అరేనాలు, మోటర్ స్పోర్ట్స్ రేసింగ్ ట్రాక్‌లు, హోటళ్లు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తుల హౌసింగ్ వంటివన్నీ ఒకే చోట నెలకొల్పే విధంగా ఒక ఈవెంట్ సిటీని ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. దీనిని నగరానికి 80–100 కి.మీ లోపల ఈవెంట్ సిటీని సృష్టించేందుకు వీలుంది. ఇలాంటి ప్రతిపాదనలతో కొత్త ప్రభుత్వ సారధులను త్వరలోనే కలవనున్నాం. – రవి కుమార్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ -
వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశా రు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఉండే, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు చదువుకొనేలా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఆ పాఠశాలలు ఉండాలని.. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంటనే హోంగార్డుల నియామకాలు పోలీసు శాఖలో ఏడెనిమిదేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగమివ్వండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీసుశాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉన్నతాధికారులను సీఎం ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే చేర్చుకోవాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి సంబంధించి అవరోధాలేమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. గతంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ సమీక్ష సమావేశాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన ముస్లిం పెద్దలు శుక్రవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలసి సన్మానించారు. మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలను అందచేశారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులొద్దు తన కాన్వాయ్ ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ జామ్‌లతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రోడ్డు పై మూడు, నాలుగు లేన్లు ఉంటే.. ఒక లేన్‌లో సీఎం కాన్వాయ్ వెళ్లేలా చూడాలని సూచించారు. కాన్వాయ్‌లో ప్రస్తుతమున్న 15 వాహనాల సంఖ్యను 9కి తగ్గించాలన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, తరచూ సమస్య లున్న చోటుకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎం సమీక్ష తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సీసీఎల్ఏ భూమి సైట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు దాటినా రాష్ట్రంలో భూపరిపాలన గాడిలో పడడం లేదు. కోడ్ కారణంగా గతంలో నిలిపివేసిన నాలుగైదు వెబ్సైట్లను పునఃప్రారంభించకపోవడమే ఇందుకు కారణమని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పరిధిలోకి వచ్చే ల్యాండ్ రెగ్యులరైజేషన్ మేనేజ్మెంట్ సిస్టం (ఎల్‌ఆర్‌ఎంఎస్), యూఎల్సీ రెగ్యులరైజేషన్, ఈల్యాండ్స్ టీఎస్, జీవో 58, 59ల ద్వారా ప్రభుత్వ భూముల్లోని కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన వెబ్సైట్లతో సహా ఇతర భూపరిపాలన వెబ్సైట్లు పనిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. వాస్తవానికి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత భూముల క్రమబద్ధీ కరణ నిలిచిపోయింది. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉండి నిర్మాణాలు చేసుకున్న వారికి ఆ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు లక్షలాది మంది జీవో 58, 59 ద్వారా భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోగా, అందులో 30–40 శాతం మాత్రమే దరఖాస్తులను పరిష్కరించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ల లాగిన్లకు మాత్రమే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చాలా చోట్ల ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఎన్ని కలు ముగిసిన తర్వాత క్రమబద్దీకరణ జరుగుతుందని భావించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుండడంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని రెవెన్యూ యంత్రాంగం భావించింది. కానీ, ఎన్నికలకు ముందు మూసేసిన వెబ్సైట్లను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రాష్ట్రంలో భూముల క్రమబద్దీకరణ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందోనన్న ఆలోచనతోనే తాత్కాలికంగా నిలిపివేశామని చెపుతున్నారు. -
‘టీఎస్పీఎస్సీ’పై హైకోర్టు జడ్జితో..న్యాయ విచారణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణస్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ కోణంలోనే కాకుండా ప్రతి విభాగంలో నెలకొన్న లోపాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయముర్తికి లేఖ రాయనున్నారు. విచారణకు ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జిని నియమించాలని ఆ లేఖలో కోరనున్నట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై గత ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేయగా, ఆ దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ పదవికి బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయగా, సభ్యులుగా కొనసాగిన ఐదుగురు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సభ్యులంతా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రాలు పంపించారు. గవర్నర్‌ను అపాయింట్మెంట్ కోరినా, ఆమె సమయం ఇవ్వకపోవడంతో రాజీనామాలు పంపించినట్టు ఓ సభ్యుడు తెలిపారు. దీంతో కమిషన్‌లో చైర్మన్‌తో సహా సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇతర విభాగాల పనితీరు, లోపాలపై దృష్టి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ‘కోరం’వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి 23 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 19 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్–2, గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్–1 ప్రిలిమినరీ పూర్తి చేసిన కమిషన్ మెయిన్ పరీక్షలు చేపట్టాల్సి ఉంది. ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేసి రెండుసార్లు నిర్వహించారు. మరికొన్నింటిని వాయిదాలు వేస్తూ పూర్తి చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీయే ఇందుకు కారణం. అయితే టీఎస్పీఎస్సీలోని ఇతర విభాగాల్లో పనితీరు, లోపాలు గుర్తించాలని రాష్ట్రం ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి విభాగంలో అధికారులు, ఉద్యోగుల పనితీరు, విధి నిర్వహణ, సమాచార వ్యవస్థ, గోప్యత తదితరాలను లోతుగా పరిశీలించనుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ఇతర విభాగాల అలసత్వం, అధికారుల ఉదాసీనతపై సమగ్రంగా విచారించనున్నారు. అక్రమాలకు పాల్పడిన, విధినిర్వహణలో అలసత్వం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ దిశగా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని సీజేకు లేఖ రాయనున్నారు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు... టీఎస్పీఎస్సీలో పదవులన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా కమిషన్‌లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి. కనీసం ఇద్దరు సభ్యులున్నా అందులో సీనియర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎవరూ లేకపోవడంతో ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విచారణకు ముందుగానే కొత్త కమిషన్ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలచిన సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని, కొత్త కమిషన్‌కు నిర్ణయాధికారంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్పీఎస్సీ, సిట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలో నిరుద్యోగులు ఉన్నారు. -
ఆర్ఎన్ఆర్ ధాన్యం @ రూ.3,545
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టించింది. క్వింటాల్ ధర రూ.3,545 పలికింది. మహబూబ్‌గర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయి లో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత్రమే పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,203 ఉండగా... మార్కెట్లో రూ. వెయ్యి నుంచి రూ.1,200 అధికంగా వస్తున్నది. బీపీ టీని అంతగా సాగు చేయకపోవడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోంది. అన్ని మార్కెట్లలోనూ పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరకే ఈ సీజన్లో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్‌కు క్యూ కట్టారు. దీంతో మార్కెట్‌కు ధాన్యం పెద్దఎత్తున అమ్మకానికి వస్తోంది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్ఎన్ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనె శాతం తక్కువ, షుగర్ పేషంట్లకు బాగుంటుందని డిమాండ్ పెరింగింది. గతంలో వేసే బీపీటీ (సోనా రకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు డిమాండ్ అధికంగా వస్తున్నది. అయితే యాసంగిలో ఎక్కువశాతం 1010 దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వచ్చే సీజన్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. -
మెగా డీఎస్సీనేనా?
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మెగా డీఎస్సీ ప్రస్తావన రావడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు చిగురిస్తున్నాయి. 22 వేల ఖాళీలున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అధికారులు 18 వేల పోస్టులే ఉన్నట్టు సర్కారుకు నివేదించారు. మెగా డీఎస్సీ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందిదాకా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క 2017లోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, 8,792 పోస్టులు భర్తీ చేశారు. అప్పటికే 2.5 లక్షల మంది టెట్‌కు అర్హత సాధించి ఉన్నారు. కొత్త నియామకాలపైనే దృష్టి ఉపాధ్యాయ ఖాళీల్లో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. స్కూల్ అసిసెంట్లు(ఎస్ఏ)గా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేసి, 30 శాతం స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ నేరుగా నోటిఫికేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కొన్ని స్కూళ్లలో టీచర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య లేదు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులున్నా, టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్దీకరణ చేయాలని విద్యాశాఖ 2016 నుంచి చెబుతూనే ఉంది. ఈ సమస్యల కార ణంగానే 2022లో డీఎస్సీ ద్వారా కేవలం 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు పదోన్నతులు కల్పించి, హేతుబద్దీకరణ చేపట్టి వాస్తవ ఖాళీలను భర్తీ చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే జరిగితే గత ఏడాది ఆగిపోయిన డీఎస్సీ నోటిఫికేషన్ స్థానంలో కొత్త నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అడ్డంకులెన్నో... ఉపాధ్యాయ నియామకాల ప్రస్తావన వచ్చి నప్పుడల్లా లక్షలాదిమంది కోచింగ్‌ల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. కొంత మంది ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నా, వాటిని విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్లీ కనిపించనుంది. అయితే, విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలుస్తాయి. టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు దీనిని చేపట్టాల్సి ఉంటుంది. వరుసగా స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలున్నాయి. దీనివల్ల కాలయాపన జరిగే వీలుంది. ఇవేవీ అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలి విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయి. లక్షల మంది టెట్ ఉత్తీర్ణులై టీచర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో నియామకాలు చేపడితేనే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి. – రావుల రామ్మోహన్‌రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) -
రెండు గదులు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: శాసససభ ఇన్నర్లాబీలో ఇప్పటికే కేటాయించిన కార్యాలయంతో పాటు, ఆవరణలోనే తమ కోసం విశాలంగా ఉండేలా రెండుగదుల కార్యాలయాన్ని ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీజేపీ శాసనసభాపక్షం (బీజేఎల్పి) విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ పక్షాన 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు ఎంపీలున్నందున సమావేశమయ్యేందుకు, సందర్శకులను కలుసుకునేందుకు వీలుగా రెండుగదులున్న కార్యాలయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం స్పీకర్‌కు బీజేఎల్పీ పక్షాన ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అందుబాటులో ఉన్న గదులు, వీలును బట్టి తప్పకుండా అసెంబ్లీ ఆవరణలోనే కార్యాలయం కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు.