Alluri Sitarama Raju
-
మన్యంలో కాఫీ సిరులు
కొండాకోనా చదునుచేసి, తుప్పా డొండా తగలబెట్టి పోడు కొట్టి నాలుగు గింజలు పండించి కడుపు నింపుకునే గిరిజనులు ఇప్పుడు పంథా మార్చారు. వాణిజ్య పంటల సాగుతో మైదాన ప్రాంత రైతులకు దీటుగా దూసుకుపోతున్నారు. పోడును పక్కన పెట్టి కాఫీ తోటల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దశాబ్దాల కిందట మన్యంలో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం ఇంతింతై వేల ఎకరాలకు విస్తరించింది. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏల తోడ్పాటుతో గిరి రైతులు అద్భుతాలే చేస్తున్నారు. సాక్షి,పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అడవిని నరికి పోడు వ్యవసాయం చేసుకుని దుర్భర జీవనం సాగించే గిరిజన రైతులు నేడు కాఫీ తోటల సాగుతో ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు.1967లో జి.కే.వీధి మండలం ఆర్.వి.నగర్, అనంతగిరి, మారేడుమిల్లి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కేంద్ర కాఫీ బోర్డు మూడు ఎకరాల్లో అరబికా రకం కాఫీ తోటల సాగు ప్రారంభించింది. గిరిజనులకు భాగస్వామ్యం చేస్తూ కేంద్ర కాఫీ బోర్డు చేసిన ఈ ప్రయత్నం వృథా కాలేదు.గిరిజనులను పోడు వ్యవసాయం నుంచి దూరంగా పెట్టి వారితో కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ మొక్కలు నాటించి అవి బాగా ఎదిగిన తరువాత ఆ మొక్కల మధ్య కాఫీ మొక్కలు నాటించారు. దీంతో 1967 నుంచి ఏటా మన్యంలో కాఫీ తోటలు విస్తరిస్తూ వచ్చాయి. కేంద్ర కాఫీబోర్డుతో పాటు పాడేరు ఐటీడీఏ కాఫీ తోటలు విస్తరించేందుకు గిరిజన రైతులకు మొక్కలతో పాటు ఆవి ఎదిగేంతవరకు ఆర్థిక భరోసా కల్పించాయి. కాఫీ రైతులకు ఫల్పింగ్ యూనిట్లు, ఇతర యంత్రాలు, ఇంటి ముందు సిమెంట్ కళ్లాలు కూడా నిర్మించాయి. 2,59,947 ఎకరాల్లో కాఫీ సాగు పాడేరు డివిజన్లోని 11మండలాలతో పాటు రంపచోడవరం డివిజన్లోని మారేడుమిల్లి ప్రాంతంతో కలుపుకుని ప్రస్తుతం 2,59,947 ఎకరాల్లో కాఫీతోటలు సాగవుతున్నాయి. 2,45,800మంది గిరిజన రైతులు కాఫీ సాగు ద్వారా ఉపాధి పొందుతున్నారు. 1967లో జి.కే.వీ«ధి మండలం ఆర్.వి.నగర్లో కేంద్ర కాఫీ బోర్డు కాఫీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో మూడు ఎకరాలతో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం వేల ఎకరాలకు విస్తరించడం వల్ల గిరిజనులకు ఉపాధి దొరకడంతో పాటు కొండపోడు భూములన్నీ ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఎకరానికి రూ.50వేల వరకు ఆదాయం గిరిజన రైతులు కాఫీతోటలను సేంద్రియ పద్దతిలోనే సాగు చేస్తుండడంతో ఇక్కడి కాఫీ నాణ్యతలో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ఎకరానికి 500 కిలోల వరకు కాఫీపండ్ల దిగుబడి వస్తుంది. వీటిని పల్పింగ్ చేసి 80 నుంచి 160 కిలోల వరకు పాచ్మెంట్ కాఫీగింజలను గిరిజన రైతులు అమ్ముతారు. అలాగే కాయలను నేరుగా ఆరబెట్టి చెర్రీ రకంగాను అమ్ముతుంటారు.ప్రస్తుతం మొత్తం తోటల్లో 2,01,947 ఎకరాల కాఫీ తోటలు మాత్రమే ఏటా ఫలసాయం ఇస్తున్నాయి. 14 వేల మెట్రిక్ టన్నుల పాచ్మెంట్ కాఫీ గింజలను గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయం వస్తుండటంతో గిరిజన రైతులకు ఏటా కాఫీ పంట జీవనోపాధి కల్పించి ఆదుకుంటోంది. గత మూడేళ్లలో సాగు చేసిన కాఫీతోటలు కూడా వచ్చే ఏడాది నాటికి ఫలసాయం ఇవ్వనున్నాయి. ఈ ఏడాది మరింత డిమాండ్ మన్యంలో గిరిజన రైతులు సాగు చేసే నాణ్యమైన కాఫీ గింజలకు బెంగళూరు మార్కెట్లో డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్లో పాచ్మెంట్ కాఫీ గింజలకు కిలో రూ.450 వరకు ధర పలుకుతుండటంతో ఏజెన్సీలోని జీసీసీ, ఐటీడీఏతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎన్జీవోలు, ప్రైవేట్ వ్యాపారులంతా పోటాపోటీగా గిరిజన రైతుల నుంచి కాఫీ పంటను కొనుగోలు చేస్తున్నారు. ఎజెన్సీలో పాచ్మెంట్ కాఫీ గింజల ధర కిలో రూ.350 పలుకుతోంది. దీంతో ఈఏడాది ఎకరానికి అదనంగా మరో రూ.20 వేలు ఆదాయం వస్తుందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పోడు వ్యవసాయం మానేసాం పూర్వం మోదాపల్లి ప్రాంతంలో అడవిని నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లం.1975లో కాఫీ మొక్కలను తమ తండ్రులు నాటుకున్నారు.1980 నుంచి కాఫీతోటల ద్వారా ఆదాయం పొందుతున్నాం. మాకు మూడున్నర ఎకరాల కాఫీతోటలు ఉన్నాయి.నా ఇద్దరు కొడుకులకు.నాకు ఈ కాఫీతోటే ఆధారం. ప్రతి ఏడాది రూ.1లక్షా 50వేల వరకు ఆదాయం వస్తుంది. – డిప్పల హసన్న కాఫీ రైతు, మోదాపల్లి, పాడేరు మండలం మార్కెటింగ్ సేవలు మరింత విస్తరించాలి కాఫీతోటల సాగుతో ఏటా గిరిజన రైతులకు మంచి ఆదాయం వస్తున్నప్పటికీ, మార్కెటింగ్ సేవలను మరింత విస్తరించాలి. బెంగళూరు మార్కెట్లో ఈఏడాది పాచ్మెంట్ గింజలకు కిలో రూ.450 ధర ఉన్నప్పటికీ జీసీసీ, ఇతర సంస్థలన్నీ కిలో రూ.350 తోనే కొనడం వల్ల మరింత ఆదాయాన్ని కోల్పోతున్నాం. బెంగళూరు కాఫీ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని ఏజెన్సీలో కాఫీ గింజలను కొనుగోలు చేయాలి. – పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమం సంఘం నేత, పాడేరు దిగుబడులు పెంచేందుకు చర్యలు ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్దతుల ద్వారానే కాఫీపంట దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాఫీతోటలు గిరిజనులకు వరమనే చెప్పాలి.కాఫీతోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కేంద్ర కాఫీబోర్డు అన్ని విధాల ప్రోత్సహిస్తుంది. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. – సమల రమేష్ సీనియర్ లైజన్ అధికారి, కేంద్ర కాఫీబోర్డు మినుములూరు -
ప్రాజెక్టు వివరాలిలా..
తూర్పుకనుమల్లో మాచ్‌ఖండ్ మొదలుకొని బలిమెల నుంచి సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయిన నీరు శబరి నదిలో కలిసి గోదావరి మీదుగా సముద్రంలో చేరుతుంది. ఈ నీరు వృధా కాకుండా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ద్వారా మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే లక్ష్యంతో ఏపీ జెన్కో చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రూ.13 వేల కోట్లతో సీలేరు సమీప పార్వతీనగర్ వద్ద 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా తొమ్మిది యూనిట్లతో ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ● ఈ ప్రాజెక్టు నిర్మాణం పైభాగంలో మూడు కిలోమీటర్ల పొడవునా సొరంగమార్గం ఏర్పాటుచేసి గుంటవాడ డ్యామ్ నుంచి నీటిని తీసుకువచ్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అనంతరం విడుదలైన నీటిని మరో మూడు కిలోమీటర్ల పొడవైన సొరంగం మార్గం ద్వారా డొంకరాయి జలాశయంలోకి మళ్లిస్తారు. అవసరమైనప్పుడు ఆదే నీటిని రివర్స్ పంపింగ్ విధానంతో ఆదే సొరంగం ద్వారా గుంటవాడ డ్యాంలోకి మళ్లించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్ట్‌ను యాప్‌కో సంస్థ డిజైన్ చేసింది. -
చర్మ వ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం
● రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ● గిన్నెలకోట పంచాయతీలోని ఐదు గ్రామాల్లో పర్యటన పెదబయలు: గిన్నెలకోట పంచాయతీలోని ఐదు గ్రామాల్లో చర్మవ్యాధి సోకిన చిన్నారులకు పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అన్నారు. సోమవారం ఆమె గిన్నెలకోట, లండూలు, ఇనుపతీగల, మెట్టగుడ, గొచ్చంగి గ్రామాల్లో పర్యటించారు. చర్మవ్యాధి ప్రబలిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో వారు తీసుకుంటున్న ఆహారం, తాగునీటిని పరిశీలించారు. చిన్నారులు మందులు సరిగ్గా వాడేలా ప్రతిరోజూ ఆశా కార్యకర్తలు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం పెదబయలులో విలేకరులతో మాట్లాడారు. ఐదు గ్రామాల్లో చర్మవ్యాధి బారిన పడిన 15 మంది పిల్లలకు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని చెప్పారు. వీరిలో ఒకరిని వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నట్టు చెప్పారు. శరీరంపై దద్దుర్లు, జ్వరంతో బాధపడుతున్న మరో చిన్నారిని పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఆమె పేర్కొన్నారు. గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో వారం రోజులపాటు వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి, ప్రతిరోజు మందులు వేయించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా నయం అయ్యేవరకు మిగతా 8వ పేజీలో -
No Headline
సీలేరు ప్రాంతంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మించడం వల్ల పర్యావరణం, అటవీ, జంతు సంపద, ప్రజలకు ఎటువంటి నష్టం నష్టం లేకపోగా ప్రయోజనం ఎక్కువని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా ప్రాజెక్టు ఉండేది. విభజనలో తెలంగాణలోని శ్రీశైలానికి వెళ్లింది. దీంతో ఆ తరహా ప్రాజెక్టు నిర్మించే అనువైన ప్రదేశం సీలేరులోనే ఉందని అధికారులు గుర్తించారు. ● రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో విద్యుత్ కేంద్రాలు ఉన్నా అవసరానికి సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో బయట ప్రాంతాల నుంచి ఒక్కో యూనిట్ రూ.10కు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. దీంతో ఏటా కొన్ని లక్షల కోట్ల రూపాయల భారం ప్రభుత్వాలపై పడుతోంది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే రూ.4లకే యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రయోజనాలివీ.. ప్రాజెక్ట్ నమూనా చిత్రం -
టూరిజంలో ఉమ్మడి విశాఖలో విస్తృత అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తృతమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. నగరంలో నిర్వహించిన టూరిజం రీజనల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను టూరిజం మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీతో పాటు కలెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో ఉన్న టూరిజం అవకాశాలపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యారాడ, భీమిలి, సాగర్‌నగర్ బీచ్‌లతో పాటు బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అరకులో త్వరలోనే సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ అరకు మొదలుకొని లంబసింగి, మారేడుమిల్లి వరకు సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలన్నింటిని కలిపి సర్క్యూట్‌గా చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. మేఘాలయ, మిజోరాంలా అరకును సదరన్ రీజినల్ కల్చర్ హబ్‌గా చేస్తే బాగుంటుందని సూచించారు. ఈనెల 31 నుంచి జరిగే అరకు చలి ఉత్సవ్‌లో ఈ ప్రాంతంలోని కల్చర్‌ను, పర్యాటకంగా అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరిస్తామని తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్ మాట్లాడుతూ జిల్లాలోని తంతడి, సీతపాలెంలో బీచ్ ఫ్రంట్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.. స్థానికంగా 80 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ పర్యాటకులకు అవసరమైన రిసార్ట్స్‌లు, మౌలిక వసతులు లేవన్నారు. ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సదస్సులో జీసీసీ ఎండీ కల్పనాకుమారి, ఏపీటీడీసీ ఈడీ పద్మావతి, జిల్లా టూరిజం అధికారి జ్ఞానవేణి, ఏపీటీటీఏ అధ్యక్షుడు విజయ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో అరకు కాఫీ, డెస్టినేషన్ వెడ్డింగ్‌లు–మైస్ (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు), అడ్వెంచర్ టూరిజం రంగాలపై చర్చలు జరిగాయి. పెట్టుబడిదారులకు వివరించిన మూడు జిల్లాల కలెక్టర్లు -
గోవాడ సుగర్స్‌లో క్రషింగ్‌కు అంతరాయం
చోడవరం : గోవాడ సుగర్స్ క్రషింగ్‌కు ఆదిలోనే అంతరాయం కలిగింది. బాయిలర్‌కు కావలసిన నంత బెగాస్ లేకపోవడంతో 24గంటల పాటు క్రషింగ్ నిలిచిపోయింది. తిరిగి సోమవారం సాయంత్రం క్రషింగ్ ప్రారంభమైంది. ఆర్థిక ఇబ్బందులు, కార్మికుల సమ్మెలతో ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభించడమే ఆలస్యంగా జరిగింది. రోజువారీ క్రషింగ్ 2500 టన్నులకు జరుగుతుందని, అంతా బాగుందనే సమయంలో బెగాస్ కొరత ఏర్పడింది. గత సీజన్‌కు సంబంధించిన బెగాస్ కొంత ఉండడంతో క్రషింగ్, కో జనరేషన్ ఒకేసారి ప్రారంభించిన యాజమాన్యం అందుకు తగ్గట్టుగా కావలసినంత బెగాస్ సమకూర్చుకోకపోవడంతో రెగ్యులర్ క్రషింగ్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఫ్యాక్టరీకి గేటు, కాటాల నుంచి పెద్దసంఖ్యలో చెరకు సరఫరా అయిపోవడంతో ఫ్యాక్టరీ వద్ద రెండు యార్డులు చెరకు బళ్లతో నిలిచిపోయాయి. బాయిలర్ ఆగిపోవడం వల్ల క్రషింగ్ జరగక చెరకు బళ్లతో ఫ్యాక్టరీ ఆవరణ అంతా నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, టిల్లర్లతో చెరకు తెచ్చిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వంట చెరకు, వరి ఊకను సమకూర్చి బాయిలర్‌కు అందించడంతో క్రషింగ్ తిరిగి ప్రారంభమైంది. 24గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన క్రషింగ్ బెగాస్ కొరతతో నిలిచిపోయిన బాయిలర్ -
చర్మవ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం
టులో ఉండాలని ఆదేశించారు. విజయవాడ ల్యాబ్‌కు రక్తనమూనాలు చర్మవ్యాధి సోకిన పిల్లల నుంచి గొంతు, ముక్కు నుంచి నమూనాలు సేకరించి విజయవాడలోని ల్యాబ్‌కు మంపించినట్టు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. దీనిపై నాలుగు రోజుల్లో రిపోర్ట్ వస్తుందని, అప్పటి వరకు ఈ వ్యాధి ఎలా ప్రబలిందనేది నిర్థారించలేమన్నారు. గోమంగి పీహెచ్సీ సందర్శించారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పెదబయలు పీహెచ్‌సీని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 220 వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఆమె వెల్లడించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్ బాషా, ఎన్సీడీసీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రతాప్, డీవీహెచ్ఎన్వో డాక్టర్ భూలోకమ్మ, ఉప్ప పీహెచ్సీ వైద్యాధికారి రేఖ, పెదబయలు,గోమంగి,రూడకోట వైద్యాధికారులు నిఖిల్,చైతన్యకుమార్, సత్యారావు, కిరణ్, కిశోర్ పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నారులకు వైద్యం సాక్షి,పాడేరు: చర్మవ్యాధి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 17మంది చిన్నారులకు స్థానిక జిల్లా సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. లండూలు, గొచ్చంగి. పెదపాడు, పుట్టకోట, మెట్టగూడ గ్రామాల్లో ఐదు నుంచి 15ఏళ్ల లోపు చిన్నారులకు శరీరమంతా దద్దుర్లు,దురదలతో పాటు దగ్గు, జలుబుతో కూడిన జ్వరాలు సోకాయి. వీరందరినీ వైద్యబృందాలు స్థానిక జిల్లా ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చి వైద్యసేవలు అందిస్తున్నారు. రక్తపరీక్షలు నిర్వహించారు. 7వ పేజీ తరువాయి -
ప్రజా సమస్యలపై 105 అర్జీల స్వీకరణ
రంపచోడవరం: ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో సమస్యలకు సంబంధించి అందిన వినతుల్లో కొన్నింటిని తక్షణమే పరిష్కరించామని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో ఆయనతోపాటు సబ్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ 105 అర్జీలు స్వీకరించారు. వై రామవరం మండలం కోట గ్రామం నుంచి వెదుళ్లపల్లి, సిరిమెట్ల నుంచి తాడికోట గ్రామాల మధ్య కన్నేరు వాగుపై సిమెంటు తూరు ఏర్పాటుచేస్తుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు ఫిర్యాదు చేశారు. కాలువపై తూరలు వేసుకునేందుకు అనుమతి ఇప్పించాలని పీసా కమిటీ ఉపాధ్యక్షుడు పల్లాల స్వామిరెడ్డి , కార్యదర్శి పల్లాల సంధ్య కోరారు. కొండపల్లి గ్రామంలో నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించిన మట్టిని పంట కాలువల్లో వేస్తున్నారని, దీనివల్ల సాగునీటికి ఇబ్బంది అవుతోందని గిరిజన రైతులు కోరారు. సిరిగిందలపాడు గ్రామం వెనుక భాగంలో ఉన్న ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని గూడెం బుజ్జిబాబు, సిప్పల శ్రీనివాసరావు కోరారు. చింతలపూడి– కోట రోడ్డులో నిలిచిన వంతెన పనులు ప్రారంభించాలని సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ, గిరిజనులు కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డీఎన్వీ రమణ, ఏడీఎంహెచ్‌వో జి శిరీష, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో గుర్తింపు పొందేలా నిర్మాణం
ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను దేశంలో మంచి గుర్తింపు వచ్చేలా నిర్మాణానికి ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా అధిక ఆదాయం కూడా సమకూరుతుంది. ఐదేళ్ల కాల పరిమితిలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఏపీ జెన్కోలో ఇది అతి పెద్ద ప్రాజెక్టుగా చిరస్థాయిగా నిలుస్తోందని భావిస్తున్నాం. – సుజయ్‌కుమార్, ఏపీ జెన్కో (హైడల్) డైరెక్టర్ -
వెలుగుల దివ్వె
ప్రారంభించేందుకు ఏపీ జెన్కోసన్నాహాలు మరో నెలరోజుల్లో సీలేరు నదిపై నిర్మాణ పనులు సహజ సిద్ధంగా ప్రవహించే నీటితో తక్కువ ఖర్చుతో రూ.కోట్లలో ఆదాయం ఇచ్చేలా మరో జల విద్యుత్ కేంద్ర నిర్మాణం కార్యరూపం దాల్చనుంది. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు (ఎత్తిపోతల పథకం) నిర్మాణ పనులు మరో నెలరోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 845 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా పొల్లూరులో రెండు యూనిట్లు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ పూర్తయితే 2,345 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేరాఫ్‌గా సీలేరు కాంప్లెక్స్ అవతరించనుంది. 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటుసీలేరు: తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒడిశా సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక్కొక్క నీటి బిందువు ప్రవాహంలా మారి ప్రవహించే సీలేరు నదికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సహజ సిద్ధంగా ప్రవహించే ఈ నదిపై ఇప్పటికే సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నాలుగు కేంద్రాల ద్వారా 845 మెగావాట్ల ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తిలో సీలేరు కాంప్లెక్స్‌లోని జలవిద్యుత్ కేంద్రాలు నిరంతరం ముందుంటాయి. మండు వేసవిలో సైతం ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి చేసేలా నీటి నిల్వలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు నాలుగు విద్యుత్ కేంద్రాల ద్వారా 845 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మాచ్‌ఖండ్‌లోని 6 యూనిట్ల ద్వారా 120 మెగావాట్లు, సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లలో 240 మెగావాట్లు, డొంకరాయిలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్లు, మోతుగూడెం (పొల్లూరు)లో 4 యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది. ఇవి కాకుండా 120 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం పొల్లూరు విద్యుత్ కేంద్రంలో శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో నిర్మించబోయే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ద్వారా మరో 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. పొల్లూరులో చురుగ్గా రెండు యూనిట్ల నిర్మాణ పనులురూ.13 వేల కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ నిరంతర ఉత్పత్తిలో.. -
బెల్ట్ జోరు..!
● జిల్లాలో అనధికారికంగా సుమారు 200 బెల్టు షాపులు ● హోంమంత్రి నియోజకవర్గంలోనే 40కు పైగా నిర్వహణ ● బెల్టు షాపులకు తరలిస్తున్న 40 కేసులను పట్టుకున్న స్థానికులు ● బాటిల్‌పై రూ.20 అదనంగా అమ్మకాలు ● గ్రామాల్లో వేలం పాట ద్వారా రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు చెల్లించి ఏర్పాటు ● వీటిలో 30 శాతం సిండికేట్లకు, 20 శాతం ఎకై ్సజ్ అధికారులకు కమీషన్లు ● మిగతా 50 శాతం గ్రామాలకు ఇస్తున్న వైనం ఊరూరా...సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో జిల్లాలో మద్యం ఏరులైపారుతోంది. గత అయిదేళ్లుగా మూతపడిన బెల్టు షాపులు మళ్లీ పల్లెల్లో విచ్చలవిడిగా తెరుచుకున్నాయి. స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల అండతో సిండికేట్ వ్యాపారుల కనుసన్నల్లో బెల్టు షాపులు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లాటరీ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న సిండికేట్లు, ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా గుట్టుచప్పుడు కాకుండా అనధికారికంగా బెల్టుషాపులకు ఆజ్యం పోస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో రూ.3 లక్షల నుంచి రూ.11 లక్షల వరకూ వేలం పాట ద్వారా బెల్టు షాపులు బహిరంగంగా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి అనుచరులే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సగం వాటా స్థానిక కూటమి ప్రజాప్రతినిధులకు, మిగిలిన వాటిలో మద్యం దుకాణదారులకు 30 శాతం, ఎకై ్సజ్ శాఖ అధికారులకు 20 శాతం కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం. జిల్లాలో పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్.రాయవరం, నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి, సబ్బవరం వంటి ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా అనధికారికంగా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని వేలం పాట ద్వారా డబ్బులు చెల్లించి అమ్మకాలు చేస్తుంటే..మరికొన్ని మద్యం సిండికేట్లే తమ అనుచరులు, బంధువుల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకూ అదనంగా అమ్ముతున్నారు. ఏరులై పారుతున్న మద్యం.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పరవాడ పర్యటనలో బెల్టు షాపులు పెట్టినవారి బెల్టు తీస్తానని బహిరంగంగా చెప్పినా..బెల్టు షాపులు వెలుస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అంతంత మాత్రమే అని జనం చర్చించుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్య జిల్లాలో మద్యం విక్రయాలు ఇష్టానుసారంగా జరిగేవి. ఒక్కో వైన్‌షాప్ ఆధీనంలో 4 నుంచి 8 వరకు బెల్టుషాపులు నిర్వహించేవారు. అనధికార వేలం.. లాభసాటి బేరం ●జిల్లాలో 136 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో గతంలో కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. బెల్టు షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా అమ్ముతున్నారు. ●చోడవరం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మొత్తం 40 బెల్టు షాపులు ఉన్నట్టు సమాచారం. వీటిలో వేలం పాట ద్వారా ఏర్పాటు చేసినవి 10 నుంచి 15 ఉంటే..మిగిలినవి మద్యం దుకాణదారులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ●నర్సీపట్నం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 30 వరకూ బెల్టు షాపులు వెలిసినట్టు సమాచారం. వీటిలో వేలం పాట ద్వారా 10 వరకూ ఉంటాయి. ●పాయకరావుపేట ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 30 నుంచి 35 వరకూ బెల్టు షాపులు వెలిచినట్లు సమాచారం. వీటిలో వేలం పాట ద్వారా 10 వరకూ ఉంటాయి. ●యలమంచిలి ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 20 వరకూ బెల్టు షాపులు ఉన్నట్టు సమాచారం. ●అనకాపల్లి ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బెల్టు షాపులు లేవు. వేలం పాట ద్వారా అనధికారికంగా 20 వరకూ గ్రామాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. ‘ఎస్.రాయవరం మండలంలో గుడివాడ గ్రామంలో ఉన్న మద్యం షాపు నుంచి బంగారమ్మపాలెం బెల్టు షాప్‌నకు భారీగా మద్యం ఆటోలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.రాయవరం ఎస్ఐ విభీషణరావు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు, హోంమంత్రి పీఏగా పనిచేసి సస్పెన్షన్ గురైన వ్యక్తి వాటాదారులుగా ఉన్న మద్యం షాపు నుంచి బెల్టు షాపులకు మద్యం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఇందులో రూ.3 లక్షల విలువైన 47 కేసుల మద్యం పైగా ఉన్నట్టు సమాచారం. అయితే 30 కేసులకు పైగా ఉంటే వెంటనే లైసెన్స్ రద్దు చేయాలనేది ఎకై ్సజ్ పాలసీ విధానం. ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంలో గల గ్రామ జాతర ఉండడంతో అధిక మొత్తంలో బెల్టు షాపులకు మద్యం తరలించినట్టు సమాచారం.’ బెల్టు షాపుల ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలే.. జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాదని ఎవరైనా ఏర్పాటు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటివరకూ మా దృష్టికి బెల్టుషాపులు ఏర్పాటు చేసినట్టు రాలేదు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే మద్యం దుకాణదారులు అమ్మాలి. కాదని అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలుంటాయి. – సుధీర్, జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి -
స్టాఫ్ నర్సుల ప్రొవిజినల్ జాబితా విడుదల
మహారాణిపేట (విశాఖ): స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి విడుదల చేశారు. వెబ్సైట్(-https@// nagendrasvst. wordpress. comలో స్టాఫ్ నర్సుల ప్రావిజనల్ జాబితాను పొందుపరిచారు. ఈ జాబితాపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు అభ్యంతరాలను రేసవానిపాలెంలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అందజేయాలని, వాటిని పరిశీలించిన మెరిట్ లిస్టు విడుదల చేస్తామని ఆర్డీ వివరించారు. ఉత్తరాంధ్రలో 106 పోస్టులకు గాను మొత్తం 8,300 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
● రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన స్కీమ్ వర్కర్లు ● బైఠాయింపుతో నిలిచిన ట్రాఫిక్ ● సబ్ కలెక్టర్ కల్పశ్రీ హామీతో విరమణ రంపచోడవరం: అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్కూల్ శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ ఎదుట కార్మికులు బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఐటీడీఏ వద్దకు వచ్చారు. వారి డిమాండ్లపై సంఘ ప్రతినిధులతో చర్చించారు. తమ సమస్యలపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, కార్యదర్శి వెంకట్ తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె.శాంతిరాజు, అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి నిర్మల, రామకృక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
కొత్తపల్లి జలపాతానికి కొత్త హంగులు
● పూర్తయిన ఆధునికీకరణ పనులు ● ప్రారంభించిన పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి కొత్త హంగుల సమకూర్చారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా తీర్చిదిద్దారు. జలపాతానికి వెళ్లే మార్గంలో టైల్స్‌తో మార్గాన్ని నిర్మించారు. గార్డెన్ ఆధునికీకరించారు. వ్యూపాయింట్ నిర్మించారు. పర్యాటకులను ఆకర్షించేలా రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటచేశారు. పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఆధునీకరణ పూర్తయిన నేపథ్యంలో సోమవారం జలపాతం వద్దకు ప్రవేశాలను పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ప్రారంభించారు. ఆయన ఆదివాసీ గిరిజనులతో థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వీఎస్ ప్రభాకర్‌రావు, ఎం వెంకటేశ్వేరరావు, పరిపాలనాధికారి ఎం హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఏఈ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
మావోయిస్టు చందన మిశ్రా అరెస్టు
చింతూరు: మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయి నాయకుడైన చందనమిశ్రా అలియాస్ నగేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చింతూరు ఎస్ఐ పేరూరి రమేష్ సోమవారం తెలిపారు. 2018లో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన చందనమిశ్రా జిల్లా నాయకుడి స్థాయికి ఎదిగినట్లు సమాచారం. 2018లో చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని ఎటపాక పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా జైలు నుంచి విడుదలైన అతను తిరిగి మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతూ ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ పరిధిలోని దండకారణ్యంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అజ్ఞాతంలో ఉంటున్నట్లు తెలిసింది. గతేడాది చింతూరు పోలీసుస్టేషన్ పరిధిలోని మల్లంపేట అటవీప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమర్చిన ఘటనలో చందనమిశ్రా నిందితుడిగా ఉండటంతో అతనిపై చింతూరు పోలీసులు నిఘాపెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న చింతూరులో అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంపెదబయలు: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. పెదబయలు మండలం సీతగుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2 ను సోమవారం ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో చదవాలని సూచించారు. హాస్టల్‌ను పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని వార్డెన్‌కు సూచించారు. ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మాజీ మండల అధ్యక్షుడు సందడి కొండబాబు,హెచ్ఎం చిట్టమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ముంచంగిపుట్టు: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నాణ్యమైన ఆహారం,విద్య అందించాలని, అనారోగ్యంగా ఉన్నవారికి వెంటనే చికిత్స అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు.మండలంలోని బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల కోసం వండిన ఆహారపదార్థాలను పరిశీలించి, పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల చేత చదివించారు.అనంతరం హెచ్ఎం రాజేశ్వరి,ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలో ఉన్న సీహెచ్‌సీని తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సుజనకోటలో ఏళ్ల తరబడి పనిచేయని వాటర్ గ్రిడ్ పథకానికి పరిశీలించారు.సుజనకోట సర్పంచ్‌తో కలిసి మత్స్యగెడ్డ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగబంధు,వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు,పెదబయలు మండల మాజీ వైఎస్సార్సీపీ అధ్యక్షులు కొండబాబులు తదితరులు పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతోమంచి ఫలితాలు
చింతపల్లి: గిరిజన రైతాంగం భూసార పరీక్షల ఆధారంగా సాగుకు అవసరమైన పోషకాలు అందిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త హెచ్ బిందు అన్నారు. సోమవారం స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానంలో ఈ మిర్చా 2.0 ప్రాజెక్టులో భాగంగా హార్టికల్చర్, వ్యవసాయ అసిస్టెంట్లకు పసుపు, మట్టి పరీక్షపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి నమూనా పరీక్షల ద్వారా పంటకు అవసరమైన పోషకాలు అందించవచ్చన్నారు. భూసారంలో లోపాలు ఉంటే సవరించుకునే అవకాశం ఉంటుందన్నారు. మండల ఉద్యానవన అధికారి కర్ణ మాట్లాడుతూ ఉద్యానవన రైతులు చింతపల్లిలో ఉన్న పసుపు ప్రయోగశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిజటల్ గ్రీన్ ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ గిరిజన రైతాంగం పసుపులో మెరుగైన ధరలను పొందేందుకు ఫిబ్రవరిలో కొనుగోలుదారుల తో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, గూ డెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన వ్యవసాయ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ఏకలవ్య భూ దాతలకు న్యాయం చేయండి
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు డుంబ్రిగుడ: మండలంలోని ఏకలవ్య పాఠశాల నిర్మాణం కోసం భూములిచ్చిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కోరారు. ఆదివారం ఆయన కలెక్టర్‌ను కలిసి, ఏకలవ్య పాఠశాల భూ దాతల సమస్య, వారు చేస్తున్న ఆందోళన గురించి వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మద్దతు ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న భూదాతలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు.ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం అన్యాయమని దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురాం తెలిపారు. -
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా తగ్గని చలి
● కొనసాగుతున్న శీతల గాలులు ● జి.మాడుగులలో 9.8 డిగ్రీల నమోదు ● పెదబయలు, అరకులో మంచు వాన చింతపల్లి: మన్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మంచు, చలి తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం జి.మాడుగులలో 9.8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలోని గూడెంకొత్తవీధిలో 11.0, ముంచంగిపుట్టులో 11.5, డుంబ్రిగుడలో 12.0, పెదబయలులో 12.5, పాడేరులో 12.8, అనంతగిరిలో 12.6, అరకువ్యాలీలో 12.6, చింతపల్లిలో 13.0, హుకుంపేటలో 13.4, కొయ్యూరులో 15.0 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం వేళలో వీస్తున్న శీతల గాలులకు మన్యం వాసులు వణికి పోతున్నారు. పెదబయలు: మండల కేంద్రం పెదబయలులో సో మవారం ఉదయం దట్టంగా పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9.30 గంటల వరకు మంచు వానను తలపించింది. పెదబయలు లో జరిగిన వారపు సంతకు వచ్చేవారు ఇబ్బందులు పడ్డారు. మంచు ముసుగులోనే కొనుగోళ్లు జరిగాయి. అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న మంచు వానను తలపించింది. మంచుతెరలు కమ్మేయడంతో స్థానికులు, పర్యాటకులు, వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం పది గంటల వరకు సూర్యోదయం కాలేదు. -
వీడీవీకేలతో మహిళల ఆర్థికాభివృద్ధి
● పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ● అన్నవరంలో హబ్ భవన ప్రారంభం చింతపల్లి: గిరిజన ప్రాంతంలో మహిళల ఆర్థికాభివృద్ధికి వన్‌ధన్ (వీడీవీకే) వికాస కేంద్రాలు ఎంతో దోహద పడతాయని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ అన్నారు. సోమవారం మండలంలోని అన్నవరంలో వీడీవీకే హబ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీడీఏ పరిధిలో 106 వన్‌ధన్ వికాస కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిని ఎనిమిది పీవీటీజీ వర్గాలతో ఏర్పాటుచేశామన్నారు. తమ ఐటీడీఏ పరిధిలోని కొన్ని వన్‌ధన్ వికాస కేంద్రాలను అనుసంధానం చేసి 11 హబ్‌లను ఏర్పాటుచేశామన్నారు. పాడేరులో ముందుగా వన్‌ధన్ వికాస కేంద్రం ఆధ్వర్యంలో అడ్డాకుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించామని, విజయవంతంగా పనిచేస్తుందని పీవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీవోలు ప్రభాకర్‌రావు,ఎం వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ వి.మురళి, ఏవో హేమలత, వెలుగు ఏపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు బాకై ్సట్ లారీల సీజ్
మాకవరపాలెం : పరిమితికి మంచి బాకై ్సట్ ఖనిజం తరలిస్తున్న ఆరు లారీలను సీజ్ చేశామని ఎస్ఐ దామోదర్‌నాయుడు తెలిపారు. మండలంలోని జి.వెంకటాపురం సమీపంలో ఉన్న ఆన్‌రాక్ (పైనీర్) అల్యూమినియం రిఫైనరీకి నిత్యం అధిక సంఖ్యలో లారీలతో విశాఖ పోర్టు నుంచి బాకై ్సట్ ఖనిజం తరలిస్తుంటారు. అయితే పరిమితికి మించి తిరుగుతున్న లారీల కారణంగా విశాఖ–నర్సీపట్నం ప్రధాన రహదారి అధ్వానంగా మారుతోంది. దీంతో అధిక లోడుతో వస్తున్న మూడు లారీలను ఆదివారం రాత్రి నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పట్టుకుని సీజ్ చేసినట్టు ఎస్ఐ సోమవారం తెలిపారు. సీజ్ చేసిన లారీలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించామన్నారు. -
గంజాయి కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయాలి
ఎస్పీ అమిత్ బర్దర్ పాడేరు: గంజాయి కేసుల్లో పరారైన నిందితులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వెంటనే పూర్తి చేసి చార్జి షీట్లను కోర్టులో సమర్పించాలని, గంజాయి సాగుపై అనుమానం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లతో విస్తృతంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గంజాయి సాగును గుర్తించి, ధ్వంసం చేయాలన్నారు. మత్తు పదార్థాలు,సైబర్ నేరాలపై గ్రామాల్లో విస్తృత్తంగా అవగాహన కల్పించాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నందున పోలీసు స్టేషన్ల్లో భద్రత పెంచాలని, మావోయిస్టుల కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.త్వరలో జరిగే అరకు చలి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ ఎస్పీ ధీరజ్, ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా,చింతూరు డీఎస్పీ నవజ్యోతి మిశ్రా,చింతపల్లి డీఎస్పీ సాయి ప్రశాంత్,రంపచోడవరం డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరావు,ఎస్బీ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
మద్యం తాగొద్దంటే..పురుగుమందు తాగాడు
కోటవురట్ల : మద్యం తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపం చెందిన ఓ రిక్షా కార్మికుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి. రాట్నాలపాలేనికి చెందిన బుంగా అప్పారావు(50) రిక్షా తొక్కి జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులతో తరచూ మద్యం తాగుతుండడంతో భార్య బుంగా ఈరమ్మ ఆరోగ్యం చెడిపోతుందని మందలించింది. దాంతో మనస్తాపం చెందిన అప్పారావు సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఈరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. -
నేడు ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు సోమవారం జరగనుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.జ్ఞానవేణి తెలిపారు. బీచ్ రిసార్టులు, అడ్వెంచర్, క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, అరకు కాఫీ, 2024–29 పర్యాటక పాలసీ తదితర అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలో టూరిజం శాఖకు సంబంధించి 15 ల్యాండ్ పాకెట్స్ ఉన్నాయని.. టర్నోవర్‌ను బట్టి ఆసక్తి గల సంస్థలకు భూ కేటాయింపులు జరుగుతాయని.. ఈ అంశంపైనా సదస్సులో చర్చించనున్నామన్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు భాగస్వామ్యం కానున్న ఈ సదస్సును పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించనున్నారని తెలిపారు. సమ్మిట్‌కు ఏపీటీడీసీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులు హాజరుకానున్నారని వెల్లడించారు. -
పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్ల పరిశీలన
మురళీనగర్(విశాఖ) : కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లను తిరుపతి ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎ.నిర్మల్ కుమార్ ప్రియ ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు ఆయన కాలేజీని సందర్శించి ప్రిన్సిపాల్ కె.నారాయణరావు, ఇతర సిబ్బందితో చర్చించారు. పోటీల్లో తలపడాల్సిన టీమ్‌లకు సంబంధించి లాటరీని తీసి ప్రకటించారు. అనంతరం క్రీడా మైదానాన్ని పరిశీలించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌ల మార్కింగ్‌లపై పలు సూచనలు చేశారు. స్టేజీ ఏర్పాట్లతోపాటు క్రీడాకారుల వసతి కల్పనకు ఎంపిక చేసిన భవనాలు, వాటి గదుల్లోని సౌకర్యాలను పరిశీలించారు. డిప్యూటీ సెక్రటరీ కె.లక్ష్మిపతి, గేమ్స్ అండ్ స్పోర్ట్సు మీట్ కన్వీనర్ డాక్టర్ కె.నారాయణరావు, కో–కన్వీనర్ డాక్టర్ బి.జానకీరామ్, హెవోడీలు కేడీవీ నరసింహారావు, కె.మధుకుమార్, డాక్టర్ రత్నకుమార్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.