Anakapalle
-
36,123 గృహాల్లో పశుగణన పూర్తి
● వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పశువుల వివరాలు నమోదు ● జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రామ్మోహన్ అనకాపల్లి: జిల్లాలో పాడి రైతులు 21వ పశుగణనలో తప్పనిసరిగా పశువులను నమోదు చేసుకోవాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రామ్మోహన్ సూచించారు. మండలంలో తుమ్మపాల, వెంకుపాలెం గ్రామాల్లో పశుగణన సర్వే వివరాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ జిల్లాలో 36,123 గృహాల్లో పశువుల నమోదు కార్యక్రమం పూర్తి చేశామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకూ పశుగణన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సర్వే వల్ల పశువులకు సకాలంలో వైద్యం, మందులు, ప్రభుత్వ రాయితీలు పొందవచ్చన్నారు. పశువులు వ్యాధుల బారిన పడినప్పుడు సకాలంలో వైద్య సేవలు అందడమే కాకుండా మృతిచెందిన సమయంలో సకాలంలో బీమా మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్ బి.సౌజన్య, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
చీడికాడ : తనకు దారిలో దొరికిన నూతన వస్త్రాలను జాగ్రత్తగా వాటి సొంతదారుకు అందించిన ఆటోడ్రైవర్ నిజాయితీని అందరూ అభినందిస్తున్నారు. వివరాలివి. మండలంలోని మంచాల గదబూరుకు చెందిన ఎంగిలి నరసమ్మ కుమారుడి వివా హం కోసం కుటుంబ సభ్యులు మంగళవారం అనకాపల్లి వెళ్లి రూ.15 వేల విలువ చేసే నూతన వస్త్రాలను కొనుగోలు చేసి రాత్రి 8 గంటల సమయంలో ఆటోలో చోడవరం నుంచి తమ గ్రామానికి వెళ్లిపోయారు. అయితే మార్గమధ్యంలో వారి నూతన వస్త్రాల బ్యాగు రోడ్డుపై పడిపోయింది. వారు అది గమనించకుండా వెళ్లిపోయారు. అదే మార్గంలో చీడికాడకు చెందిన వేచలపు నాయుడు తన ఆటోలో చీడికాడ వస్తుండగా వరహాపురం, దామునాపల్లి మధ్యలో రోడ్డుపై పడి ఉన్న బట్టల బ్యాగును గుర్తించారు. ఆ బ్యాగులో ఉన్న బట్టల బిల్లుపై గల ఫోన్ నెంబర్‌కు ఫోన్‌చేసి పోగొట్టుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం మంచాల గదబూరు వెళ్లి నరసమ్మ కుటుంబ సభ్యులకు ఆ వస్త్రాల బ్యాగును అందించాడు. పెళ్లి వస్త్రాలు పోగొట్టుకోవడం అశుభంగా తలచి బాధపడుతున్న సమయంలో ఆటో డ్రైవర్ నాయుడు ద్వారా నూతన వస్త్రాలు తిరిగి తమ చెంతకు చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాయుడు నిజాయతీని గ్రామస్తులు అభినందించారు. -
మెగా డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు
తుమ్మపాల : ఈ నెల 25 వరకు మెగా డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగించినట్టు శిక్షణ కేంద్రం డైరెక్టర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి కె.రాజేశ్వరి ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టు, టీటీసీ, బీఎడ్, టెట్‌లో అర్హత సాధించిన మార్కుల జాబితా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం (తల్లిదండ్రుల వార్షిక అదాయం రూ.లక్ష లోపు మాత్రమే), ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం, జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతపరచి అందజేయాలని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ నెలకు రూ.1500, స్టడీ మెటీరియల్‌కు రూ.1000 చెల్లిస్తారని తెలిపారు. పట్టణంలో రఘురామ కాలనీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ జూనియర్ కాలేజీ వీధి, డోర్ నెం.10–06–31/7, అనకాపల్లి, చిరునామాలో గల కార్యాలయానికి నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నెం: 9885845743 కు సంప్రదించాలని సూచించారు. -
పోలి పాడ్యమికిప్రత్యేక ఏర్పాట్లు
సింహాచలం: వచ్చేనెల 2న పోలి పాడ్యమిని పురస్కరించుకుని సింహగిరి దిగువ వరాహ పుష్కరిణి వద్ద దీపాలు విడిచిపెట్టేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. పుష్కరిణి నీటిలోకి ఎవరూ దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెట్ కూడలి నుంచి పుష్కరిణికి వెళ్లే మార్గంలో పోలీస్ బందోబస్తుతో పాటు దేవస్థానం కమ్యూనిటీ గార్డులను ప్రత్యేకంగా బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ కూడలి నుంచి వరాహ పుష్కరిణి వరకు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వర్తిస్తారని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యేక డ్యూటీలు వేసినట్లు వివరించారు. -
క్యాన్సర్‌ను జయిద్దాం..!
● ముందస్తు పరీక్షలతో ప్రాణాలు పదిలం ● ఆయుష్మాన్ ఎన్సీడీ–3.0 పథకంలో ఇంటింటికీ క్యాన్సర్ స్క్రీనింగ్ ● 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా పరీక్షలు ● గుర్తించిన రోగులకు ఫాస్ట్ ట్రాక్ చానెల్ ద్వారా చికిత్ససాక్షి, అనకాపల్లి: క్యాన్సర్.. ఆ మాట వింటే ఒకప్పుడు వెన్నులో వణుకు పుట్టేది. ఆ రుగ్మత సోకితే ఇక చావే గతి అన్న భయం ఉండేది. వ్యాధి కన్నా ఆ భయంతోనే ఎక్కువగా కుంగిపోయేవారు. అప్పటితో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం వైద్య రంగం సాధించిన ప్రగతితో క్యాన్సర్‌ను కూడా జయిస్తున్నారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే ఆ మహమ్మారిని ఇట్టే పారదోలవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అలా క్యాన్సర్‌ను జయించి పునర్జన్మ పొందిన వారు చాలామంది ఉన్నారు. వైద్య నిపుణుల సాయంతో, సాంకేతిక సహకారంతో, అన్నింటినీ మించి బతికి తీరాలన్న బలమైన కాంక్షతో.. క్యాన్సర్‌పై విజయం సాధించిన వారు ఉన్నారు. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో తొలి దశలో గుర్తించకపోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో సీ్త్రలు ఎక్కువగా రొమ్ము, గర్భాశయం, పెద్ద పేగు క్యాన్సర్ల బారిన పడితే.. వారిలో సగానికి పైగా అవగాహన లేక వ్యాధి ముదిరి మృత్యువాత పడుతున్నారు. పురుషుల్లో ఊపిరిత్తులు, నోటి, కాలేయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ ఎన్సీడీ–3.0 పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి క్యాన్సర్ పరీక్షలు చేసే విధంగా ఈ నెల 14 నుంచి మూడు నెలలపాటు సర్వే జరుపుతోంది. సర్వేతోపాటు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్‌ను కూడా చేర్చి.. ఆ పథకంలో రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందించడంతో రాష్ట్రంలో క్యాన్సర్ మరణాలు తగ్గాయి. ప్రత్యేకించి అనకాపల్లి జిల్లాలో సత్ఫలితాలు వచ్చాయి. -
పెద్దేరు నీటిమట్టం తగ్గుముఖం
మాడుగుల : మండలంలో అత్యంత జలవనరులు గల పెద్దేరు జలాశయం నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుంది. జలాశయంలోకి ఇన్ ఫ్లో కూడా బాగా తగ్గిపోయింది. జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 134 మీటర్లకు తగ్గిపోయింది. గతంలో 200 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో ప్రస్తుతం 50 క్యూసెక్కులకు తగ్గిపోయింది. పెద్దేరు ప్రధాన పంట కాలువలైన రాచకట్టు కాలువలకు 10 క్యూసెక్కులు, ఆర్ఎంసీ పంట కాలువలకు 60 క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేస్తున్నారు. ఇకపై వర్షాలు అనుకూలించకపోతే రబీ పంటలకు సాగునీరు ఆయకట్టు భూములకు అందవేమోనని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. -
కంప్యూటరీకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● సహకార సంఘాల సభ్యుల వివరాలు 22లోగా అప్లోడ్ చేయాలి ● సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశంసహకార శాఖ, ఆప్కాబ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల కంప్యూటరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాల ని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోఆపరేటివ్, డీసీసీబీ, ఆప్కాబ్ అధికారులతో సమావేశం నిర్వహంచి కంప్యూటరీకరణ పనుల పురోగతిని సమీక్షించారు. కంప్యూటరీకరణ పనులు పూర్తిచేయకపోవడం, రాష్ట్ర స్థాయి సూచీలలో జిల్లా వెనుకబడటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కంప్యూటరీకరణ పనులలో నిర్లక్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సహకార సంఘాల సభ్యుల పూర్తి వివరాలు సేకరించి కంప్యూటరీకరించాలన్నారు. డేటా సేకరణ, అప్లోడ్ పనులను ఈనెల 22 నాటికి పూర్తిచేయాలన్నారు. సహకార శాఖ జిల్లా అధికారి ఎ.ప్రేమ స్వరూపరాణి, జిల్లా కోఆపరేటివ్ అకౌంట్స్ అధికారి జి.గోవిందరావు, డీసీసీబీ సీఈవో వర్మ, ఆప్కాబ్ డీపీడీఎం రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
చెరకు రస నాణ్యత పరీక్షలు ప్రారంభం
● గోవాడ సుగర్స్‌లో క్రషింగ్‌కు చకచకా ఏర్పాట్లు చోడవరం: ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌కు గోవాడ సుగ ర్ ఫ్యాక్టరీ సర్వం సిద్ధం చేసింది. మరో 20 రోజుల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముందుగా ఓవరాయిలింగ్ జరిగిన యంత్రాల పనితీరుపై ట్రయల్ రన్ పనులు చేపట్టారు. బుధవారం చెరకు నాణ్యత పరీక్షలను ప్రారంభించారు. చెరకు తోటల్లో పక్వానికి వచ్చిన పంటకు రసనాణ్యత పరీ క్ష చేసిన తర్వాత కటింగ్ పర్మిట్లు ఇస్తారు. ముందు గా చెరకు గడల రస నాణ్యత పరీక్షలు విస్తృతంగా చేయాల్సి ఉండటంతో ఆ పరీక్షలను ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వి.వి.సన్యాసినాయుడు ప్రారంభించారు. ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌ను డిసెంబరు రెండో వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్రషింగ్ ప్రారంభించే సమయానికి రోజుకు కనీసం 1000 నుంచి 2000 టన్నుల చెరకు ఫ్యాక్టరీకి సరఫరా కావాల్సి ఉంది. రెగ్యులర్ క్రషింగ్ జోరందుకుంటే రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల వరకు చెరకు అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరకుకు రసనాణ్యత పరీక్షలు చేసి కటింగ్ పర్మిట్లు ఇవ్వాలని ఫీల్డ్ సిబ్బందికి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. పక్వానికి వచ్చిన తోటలను వ్యవసాయ ఫీల్డ్ సిబ్బంది గుర్తించి రసనాణ్యత పరీక్షలకు తరలించే పనులకు శ్రీకారం చుట్టామని ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులు
జంగాలపల్లిలో రైతులు అడ్డుకోవడంతో ఆగిన ఇసుక ట్రాక్టర్లు మాకవరపాలెం: ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను రైతులు అడ్డుకున్నారు. మండలంలోని జంగాలపల్లి సమీపంలో సర్పానదిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి నుంచి నెల రోజులుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల వల్ల సమీప జిరాయితీ భూములకు ముప్పు ఉందని రైతులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు, స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదులు చేశారు. అయినా రాత్రి పగలూ తేడా లేకుండా ఇసుక తవ్వకాలు జరగడంతో బుధవారం రైతులు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ లోతున జరుగుతున్న తవ్వకాలను వెంటనే నిరోధించాలని అధికారులను డిమాండ్ చేశారు. లేకుంటే భారీ వర్షాలు పడినప్పుడు సర్పానది కారణంగా తమ భూములకు ముప్పు తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. -
అవగాహనతో క్యాన్సర్ తగ్గుముఖం
దేశవ్యాప్తంగా ప్రతి 15 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటోంది. చాలామంది అవగాహన లేక, త్వరగా గుర్తించక క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే సరైన చికిత్స తీసుకుంటే ఈ ప్రాణాంతక వ్యాధిని జయించవచ్చు. శిక్షణ పొందిన వైద్యులు, వైద్య సిబ్బంది వారంలో మూడు రోజులపాటు సర్వేలో పాల్గొంటారు. మూడు నెలల్లోగా సర్వే పూర్తి చేయాలన్నదే లక్ష్యం. ఇప్పటికే సర్వే మ్యాపింగ్ చేశాం. స్క్రీనింగ్ పరీక్షలు కూడా ప్రారంభించాం. తొలి వారంలో 500 మందిని పరీక్షించాం. – డాక్టర్ బాలాజీ, డీఎంహెచ్‌వో -
వేధింపులు ఆపండి.. ‘వెలుగు’ చూపండి
మహిళలపై అఘాయిత్యాలు.. ఎన్నాళ్లీ ఘాతుకాలు? ● కొవ్వొత్తులతో ఎస్ఎఫ్ఐ నిరసన● సమస్యల పరిష్కారానికి వీవోఏల ఆందోళన యలమంచిలి రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని, దిశా చట్టాన్ని అమలు చేసి వారికి రక్షణ కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి ఎం.రమణ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యలమంచిలి టౌన్లో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిస్థి తి దారుణంగా ఉందన్నారు. తాజాగా విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరగడంతో బాధితురాలు ఆత్మహత్య కు యత్నించిందని, ఈ ఘటన బాధాకరమన్నారు. ఇంతకుముందు రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ప్రేమోన్మా ది చేతిలో దక్షిత అనే అమ్మాయి హత్యకు గురయ్యిందన్నారు. మహిళలు రక్షణ కల్పించడంలో హోం మంత్రి వంద శాతం ఫె యిలయ్యారని, తక్షణం తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.తుమ్మపాల: తమ సమస్యలను పరిష్కరించాలని, మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని, వేధింపులు ఆపాలని, బకాయివేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వెలుగు శాఖలో పనిచేస్తున్న వీవోఏలు బుధవారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి అమలు చేయడం వల్ల 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వీవోఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వీవోఏలను తొలగిస్తున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. అంతకుముందు డీఆర్వో బి.దయానిధికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సూరిబాబు, కోశాధికారి కె.లక్ష్మీ ప్రసన్న, వై.లక్ష్మీరాజేష్, మాణిక్యం, పద్మ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
జిల్లాలో 6 ఇసుక స్టాక్ యార్డులు
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో ఆరు ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఇసుక కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు లేకపోవడం.. రెండే డిపోలు ఉండడంతో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ చర్య తీసుకున్నట్టు బుధవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకువచ్చి, నిల్వ చేసి విక్రయించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. నాలుగు ఎకరాల స్థలంలో స్టాక్ యార్డులను ఏర్పాటు చేయాలని, వాహనాలు వెళ్లేందుకు మార్గం ఉండాలని సూచించారు. జిల్లా గనుల శాఖ వీరికి మినరల్ డీలర్ లైసెన్స్ మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి, చోడవరం, మాడుగుల, అచ్యుతాపురంలలో ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనకాపల్లిలోని గనుల శాఖ కార్యాలయంలో ఈనెల 22 నుంచి 29వ తేదీ లోగా దరఖాస్తు ఇవ్వాలన్నారు. దరఖాస్తుతోపాటు ఒక్కో ఇసుక స్టాక్ యార్డుకు డిస్ట్రిక్ట్ లెవల్ శాండ్ కమిటీ పేరిట రూ.5 వేల డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలని పేర్కొన్నారు. జిల్లా ఇసుక కమిటీ నిర్దేశించిన ధరకే ఇసుక విక్రయించాలన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. ఈ మేరకు డీఈవో కార్యాలయంలో డీఈవో జి.అప్పారావు నాయుడుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. టెన్త్ విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులను ఆదివారం, సెలవు రోజుల్లో రద్దు చేయాలని, పీడీ ప్రమోషన్ కోసం ఉన్నత విద్యను అభ్యసించే ఎస్టీటీలకు స్టడీ లీవ్ మంజూరు చేయాలని కోరారు. పదోతరగతి స్పాట్ వాల్యుయేషన్ చేసిన కొంతమంది ఉపాధ్యాయులకు నేటికీ రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, వారికి వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, జిల్లా కార్యదర్శి జి.ఎస్.ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.వి. అప్పారావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి బాబూరావు, నాతవరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
హుండీల చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
● అనకాపల్లిలోని పలు ఆలయాల్లో హుండీల చోరీ ● నిందితుడి నుంచి నగదు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం సబ్బవరం: మండంలోని రాయపుర అగ్రహారం శ్రీకృష్ణుడి ఆలయంలో అక్టోబర్ 9న జరిగిన హుండీ చోరీ కేసును సబ్బవరం పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి నుంచి రూ.11,554 నగదు, బైక్, ఒక సెల్‌ఫోన్‌తో పాటు చోరీకి వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, అనకాపల్లి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ పిన్నింటి రమణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశం వివరాలను వెల్లడించారు. సబ్బవరం మూడు రోడ్ల కూడలి సమీపంలోని సినిమాహాల్ జంక్షన్ టీ స్టాల్ వద్ద ఒక వ్యక్తి చిల్లర కాయిన్స్ ఇచ్చి నోట్లు అడుగుతుండటంతో అక్కడే తన సిబ్బందితో ఉన్న ఎస్ఐ సింహాచలం అనుమానం వచ్చి స్టేషన్‌కు తరలించి విచారించారు. అతడిని శెట్టి నాయుడుగా గుర్తించారు. నాలుగేళ్లుగా బెలూన్ల డెకరేషన్ పనిచేస్తూ అనకాపల్లి గూండాల వీధిలో నివాసం ఉంటున్నాడు. అక్టోబర్ 9న రాయపుర అగ్రహారంలోని శ్రీకృష్ణ ఆలయంలో హుండీ తాళం పగులగొట్టి అందులోని నగదును సంచిలో వేసుకుని, హుండీని పక్కనే ఉన్న తుప్పల్లో పడేసి పోయాడు. ఈ నెల 9న జీ కోడూరు మండలం, వారాడలోని దుర్గాలమ్మ గుడి హుండీని, 2022 మార్చిలో దేవరాపల్లి మండలంలోని కలిగొట్ల గ్రామంలో పైడితల్లమ్మ గుడి హుండీని కూడా శెట్టి నాయుడే చోరీ చేసినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. నిందితుడు నాయుడుని ఆరెస్టు చేసి, అనకాపల్లి కోర్టుకు తరలించామన్నారు. సమావేశంలో సీఐతోపాటు ఎస్ఐ సింహాచలం పాల్గొన్నారు. -
No Headline
సాక్షి, విశాఖపట్నం : యావత్ ప్రపంచానికి దేశ రక్షణ శక్తిని చాటిచెప్పేలా సమర సన్నద్ధ ప్రదర్శన (సీవిజిల్–2024) దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. భారత నౌకాదళం, తీరగస్తీ దళం, మైరెన్ పోలీస్ వ్యవస్థలు ఉగ్రవాదులకు సవాల్ విసురుతూ.. తీర ప్రాంతంపై భారత రక్షణ దళ పట్టును ప్రదర్శించేందుకు 2018 నుంచి ఏటా రెండు రోజుల పాటు ‘సీ విజిల్’ పేరుతో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సీవిజిల్–2024 యుద్ధ విన్యాసాల్లో భాగంగా తొలిరోజున సముద్ర తీర రేఖ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, పుదుచ్చేరి సహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 7,516.6 కిలోమీటర్ల పొడవునా సమర సన్నద్ధ ప్రదర్శన నిర్వహించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం, షిప్పింగ్, పెట్రోలియం, సహజ వాయువులు, కస్టమ్స్, మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. అంతర్రాష్ట్ర ఏజెన్సీల సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించి ఔరా అనిపించేలా తీర రక్షణ శక్తిని ప్రపంచానికి చెప్పారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 50 నౌకలతోపాటు 100 పెట్రోలింగ్ బోట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటుగా యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, సబ్మైరెన్లు.. ఇలా మొత్తం 500 వరకు ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. విశాఖ సహా ప్రతి తీరానికి ఐదు మైళ్ల దూరం వరకూ నిఽఘా వ్యవస్థను పటిష్టం చేసి మాక్ డ్రిల్ తొలి రోజున నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నాగభూషణం మృతదేహం అగనంపూడి: రోడ్డు ప్రమాదంలో చేప ల వ్యాపారి దుర్మరణం చెందాడు. దువ్వాడ పోలీస్టేషన్ పరిధి అగనంపూడి టోల్‌గేటుకు సమీపంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీడికాడ గ్రామం ఐటీఐ కాలనీకి చెందిన జనానాగభూషణం (52) చేపల వ్యాపారం చేస్తుంటాడు. గాజువాకలో బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో నాగభూషణం గాజువాక ద్విచక్రవాహనంపై వస్తున్నారు. అగనంపూడి టోల్‌గేటు దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా పడిన నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందాడు.హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ మృత్యు వాత తప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. -
No Headline
రైలు ప్రస్తుత కొత్త నంబర్ నంబర్ కటక్–గుణుపూర్ మెము 08421 68433 గుణుపూర్–కటక్ మెము 08422 68434 విశాఖపట్నం–కిరండూల్ పాసింజర్ 08551 58501 కిరండూల్–విశాఖపట్నం పాసింజర్ 08552 58502 విశాఖపట్నం–రాయ్‌పూర్ పాసింజర్ 08528 58528 రాయ్‌పూర్–విశాఖపట్నం పాసింజర్ 08527 58527 విశాఖపట్నం–కోరాపుట్ పాసింజర్ 08546 58538 కోరాపుట్ –విశాఖపట్నం పాసింజర్ 08545 58537 విశాఖపట్నం–బ్రహ్మపూర్ పాసింజర్ 08531 58532 బ్రహ్మపూర్–విశాఖపట్నం పాసింజర్ 08532 58531 విశాఖపట్నం–గుణుపూర్ పాసిజంర్ 08522 58506 గుణుపూర్–విశాఖపట్నం పాసింజర్ 08521 58505 విశాఖపట్నం–భవానిపట్న పాసింజర్ 08504 58504 భవానిపట్న–విశాఖపట్నం పాసింజర్ 08503 58503 కింద పేర్కొన్న రైళ్లు 2025 మార్చి నుంచి మారిన నంబర్లతో నడుస్తాయి రైలు ప్రస్తుత కొత్త నంబర్ నంబర్ విశాఖపట్నం–కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ 17488 18521 కడప–విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ 17487 18522 విశాఖపట్నం– గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 22701 22875 గుంటూరు –విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 22702 22876 భువనేశ్వర్ – రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ 20896 20895 రామేశ్వరం – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 20895 20896 భువనేశ్వర్ – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ 12898 12897 పుదుచ్చేరి – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 12897 12898 భువనేశ్వర్– చైన్నె సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ 12830 12829 చైన్నె సెంట్రల్ –భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 12829 12830 -
ప్రకృతి వైపరీత్యాలపై అప్రమత్తం
రాంబిల్లి (యలమంచిలి): ప్రకృతి వైపరీత్యాలు,విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తతంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కమాండర్ సత్యనారాయణ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించింది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుంచి 27వ తేదీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం రెవెన్యూ,పోలీసు,యలమంచిలి అగ్నిమాపకశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మాక్‌డ్రిల్ నిర్వహించి తుపాన్లు, వరదలు సంభవించినప్పుడు, పిడుగులు పడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యక్షంగా వివరించారు. గ్యాస్ లీకై నప్పుడు,అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యలు, గాయాలు తగిలినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో రాంబిల్లి తహసీల్దారు శ్రీనివాసరావు,రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, సీఐ సీహెచ్. నర్సింగరావు,యలమంచిలి అగ్నిమాపకశాఖ అధికారి డి.రాంబాబు, రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, వీఆర్వోలు, వీఆర్ఏలు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్‌డ్రిల్ -
చిన్నారుల ప్రదర్శన అ‘ద్వితీయ’ం
డాబాగార్డెన్స్(విశాఖ): సందడిగా జానపద నృత్యాలు.. ఆకట్టుకునే నృత్య రూపకాలు.. పులి వేషాల్లో బాలల హంగామాతో విశాఖ బాలోత్సవం ఆకట్టుకుంది. మహారాణిపేటలోని సెయింట్ ఆంథోనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న బాలోత్సవంలో రెండో రోజు బుధవారం సాంస్కృతిక, జానపద ప్రదర్శనల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవడం, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను కాపాడుకోవల్సిన బాధ్యత వంటివి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ కార్యదర్శి జీఎస్ రాజేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు కె.రమాప్రభ, కమిటీ సభ్యులు ఎం.ఎల్లాజీ, వై.సత్యనారాయణ, ఎం.గుణశంకర్, సంతోష్ పాల్గొన్నారు.రెండో రోజు ఉత్సాహంగా బాలోత్సవాలు -
తవ్వుకో.. అమ్ముకో.. మనల్ని ఆపేదెవరు ?
● తాండవలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా ● పట్టించుకోని అధికారులు ● లోతుగా తవ్వేయడంతో వంతెనలకు పొంచి ఉన్న ప్రమాదం ● చమ్మచింత వద్ద ఆక్విడెక్టు కూలితే నీటి సరఫరాకు ఇబ్బందులు ● రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకమేఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. తాండవ నదిలో విచ్చలవిడిగా తవ్వేస్తూ ఇసుక దందా సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రతిరోజూ ట్రాక్టర్లల్లో ఇసుక తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పట్టపగలే ట్రాక్టర్లలో తరిలించేస్తున్నా అధికారుల చూసీచూడనట్టు ఉన్నారు. ఇసుకను తోడేస్తుండడంతో వంతెనలకు ప్రమాదం పొంచి ఉంది. అక్విడెట్ కూలితే వేలాది ఎకరాలకు సాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారుతుంది. నాతవరం: మండలంలో చమ్మచింత, పొట్టినాగన్నదొరపాలెం, తాండవ, కె.వి.శరభవరం, గుమ్మడిగొండ, కొవడటిపూడి అగ్రహారం, చిక్కుడుపాలెం, రాజుపేట అగ్రహారం మీదగా తాండవ నది కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోకి ప్రవహిస్తుంది. నాతవరం మండలంలో చిక్కుడుపాలెం, గుమ్మడిగొండ, చమ్మచింత గ్రామాల వద్ద రాకపోకలు సాగించేందుకు తాండవ నదీపై సుమారుగా రూ.12 కోట్ల వ్యయంతో మూడు వంతెనలు నిర్మించారు. చమ్మచింత వద్ద తాండవ రిజర్వాయర్ నుంచి కుడికాలువు ద్వారా నాతవరం మండలంతో పాటు కాకినాడ జిల్లా కోటనందురు, రౌతులపూడి మండలాల్లో ఉన్న ఆయకట్టు భూములకు నీరు ప్రవహించేందుకు నదీలో వంతెన నిర్మించి, అక్విడెట్ ఏర్పాటు చేశారు. చమ్మచింత వద్ద నదిలో నిర్మించిన వంతెన సిమెంటు స్తంభాలు చుట్టూ లోతుగా ఇసుక తవ్వేయడంతో రాళ్లు తేలి ఐరన్ ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. రెండు సిమెంటు స్తంభాల ఊచలు పాడైపోవడం కూలేందుకు సిద్ధం ఉన్నాయి. ఇక్కడ నదిలో నిర్మించిన అక్విడెట్ కూలిపోతే రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగు నీరు అందించే కూడి కాలువకు నీటి ప్రవాహం నిలిచిపోతుంది. చమ్మచింత ప్రాంతంలో నదిలో లోతుగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో నది ఒడ్డున ఉన్న రైతులు భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో రైతులు తవ్వకం దారులను అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా కూటమి ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చమ్మచింత గ్రామానికి చెందిన కొందరు రైతులు ధైర్యం చేసి నదిలో ఇసుక తవ్వకాలు అడ్డుకుని, కూలేందుకు సిద్ధంగా ఉన్న వంతెన సిమెంటు స్తంభాల చుట్టూ రాళ్లు, మట్టి వేసి, దిమ్మగా కట్టారు. ఇసుక తవ్వకాలతో నదిలో ప్రమాదకరంగా ఏర్పడిన గోతులను పూడ్చారు. 50 ట్రాక్టర్లలో తరలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాండవ నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు.అయినా యథ్చేచ్ఛగా తవ్వుతూ రోజూ 50 పైగా ట్రాక్టర్లతో రాత్రీపగలనే తేడా లేకుండా ఇసుక తరలించేస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు రోజుకు 5నుంచి 6 ట్రిప్పులు తిరుగుతోంది. నాతవరం మండలంతో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీకి, ఇతర ప్రాంతాలకు పట్టపగలే దర్జాగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వాస్తవంగా ఉచిత ఇసుక తరలిచేటప్పుడు విధిగా ట్రాక్టరుకు బ్యానర్ ఉండాలి, ఇసుక రవాణా చేసే ఏ వాహనానికి ఉచిత ఇసుక బ్యానర్ కనిపించడం లేదు.కూటమి నేతలకు భయపడి అన్ని శాఖలు అధికారులు పట్టనట్టగా వ్యవహరిస్తున్నారు. వంతెనలు కాపాడండి తాండవ నదీలో ఇసుక తవ్వకాలు కొనసాగితే వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంది. వంతెనల నిర్మాణం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి ఆందోళనలు చేశాం. ఆక్విడెక్టు సిమెంటు స్తంభాలు కూలిపోతే రెండుజిల్లాలకు ప్రవహించే తాండవ కుడి కాలువు నీరు నిలిచిపోతుంది, రైతులకు ఊహించని నష్టం జరిగే ప్రమాదం ఉంది. అడిగర్ల రాజు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు -
వాల్తేరుకి వచ్చేదెవరో?
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన డీఆర్ఎం సౌరభ్ కుమార్ ●● వ్యవస్థను సౌరభ్ నిర్వీర్యం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు ● పోస్ట్ ఖాళీ అయినా విశాఖ వచ్చేందుకు జంకుతున్న అధికారులు సాక్షి, విశాఖపట్నం: దాదాపు ఏడాదిన్నర కిందట వరకు రైల్వే వ్యవస్థలో వెలుగు వెలిగిన వాల్తేరు డివిజన్‌కు చీకటి రోజులు దాపురించాయి. డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సౌరభ్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కుంటుపడింది. తన స్వలాభం కోసం మాత్రమే సౌరభ్ పనిచేశారన్న విషయం సీబీఐ దాడులతో సుస్పష్టమైంది. చేయి తడిపితేనే పనులకు పచ్చజెండా ఊపుతామన్న రీతిలో డీఆర్ఎం స్థాయి అధికారి వ్యవహరించడంతో.. అభివృద్ధిలో డివిజన్ వెనుకపడింది. ఆయన స్థానంలో కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై ఇప్పుడు అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌కు దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 21 పాసింజర్ హాల్ట్‌లతో కలిపి మొత్తం 115 రైల్వే స్టేషన్లు డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్ జోన్లో సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకల ఆదాయంలోనూ నంబర్‌వన్‌గా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే పరువును డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ పట్టాలు తప్పించేశారు. సెంట్రల్ రైల్వే జోన్లో పీసీఎంఈగా పనిచేస్తున్న సమయంలోనే ఆయప వివాదాస్పదుడిగా పేరొందారు. అక్కడి నుంచి డీఆర్ఎంగా గతేడాది జూలైలో వచ్చిన తర్వాత.. అవినీతి వ్యవహారాలను వేగవంతం చేసేశారు. డివిజన్ పరిధిలో చిన్న టెండర్ కావాలన్నా.. లంచం డిమాండ్ చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.25 వేల నుంచి రూ.కోట్ల వరకూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందినకాడికి పిండుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ సౌరభ్‌కుమార్ అనుచరవర్గం బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో డివిజన్ పరిధిలో పనులకు టెండర్లు ఆహ్వానించినా.. ఎవరూ ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాల్తేరు పరిధిలో పనులన్నీ నిలిచిపోయాయి. డివిజన్ అభివృద్ధి ఎక్కడ? డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత అజెండాపైనే దృష్టి సారించిన సౌరభ్‌కుమార్ విశాఖ రైల్వేస్టేషన్, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. ఆయన హయాంలో వచ్చిన కొత్త రైళ్లన్నీ గతంలో ప్రతిపాదన చేసినవే.. ఆయన మార్కు అంటూ ఎక్కడా చూపించలేకపోయారు. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల విషయంలోనూ డీఆర్ఎం తన హస్తలాఘవాన్ని చూపించినట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ.390 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన మొదలైన పనులు చేపట్టాల్సి ఉన్నా.. భారీగానే ముడుపులు ఇవ్వాలంటూ కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే దువ్వాడ లాంటి స్టేషన్లో దాదాపు 50 శాతం పనులు పూర్తయినా.. వైజాగ్ రైల్వేస్టేషన్లో మాత్రం 10 శాతం కూడా పూర్తి కాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన ఉద్యోగుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 16 నెలల పాటు డీఆర్ఎంగా వెలగబెట్టిన సౌరభ్‌కుమార్.. వాల్తేరు పరువును దిగజార్చేశారు. అథపాతాళానికి పడిపోయిన డివిజన్‌కు కొత్త డీఆర్ఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రైల్వే బోర్డు పలువురు అధికారులను సంప్రదించగా.. విముఖత చూపినట్లు సమాచారం. కాగా.. గత అనూప్ సత్పతిని మళ్లీ డీఆర్ఎంగా నియమించాలని సోషల్ మీడియా ద్వారా పలువురు రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నారు. అభివృద్ధి ఆగిపోయింది ఏడాది కాలంలో కొత్త రైళ్లేవీ రాలేదు. విశాఖ స్టేషన్ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. గతంలో అనూప్‌కుమార్ సత్పత్తి డీఆర్ఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు, కొత్త రైళ్లను తీసుకురావడం వల్ల వైజాగ్ స్టేషన్‌కు ఎన్ఎస్జీ–1 గుర్తింపు వచ్చింది. సౌరభ్ వచ్చిన తర్వాత ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా.. అవి దువ్వాడ మీదుగానే వెళ్తున్నాయి. వీటిని వైజాగ్ తీసుకురావాలని కోరినా.. సౌరభ్ పట్టించుకోలేదు. పైగా అవినీతికి పాల్పడి సీబీఐకి చిక్కడం డివిజన్‌కు సిగ్గు చేటు. – డేనియల్ జోసఫ్, రైలు ప్రయాణికుల ప్రతినిధి సౌరభ్ పనితీరుపై అప్పుడే అనుమానాలు వైజాగ్ రైల్వే వ్యవస్థ పరువును సౌరభ్‌కుమార్ రోడ్డున పడేశారు. డీఆర్ఎం స్థాయి ఉన్నతాధికారి లంచాలు తీసుకోవడం నిజంగా అవమానకరం. ఆయన హయంలో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. కనీసం దానిపై సమగ్ర విచారణ కూడా చేపట్టలేదు. అప్పుడే డీఆర్ఎం పనితీరుపై అందరిలోనూ అనుమానాలు వచ్చాయి. రైళ్ల కోసం అడిగినా ఏ ఒక్కరోజూ పట్టించుకోలేదు. బ్రింగ్బ్యాక్ అనూప్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నాం. – రఘువంశీ, రైలు ప్రయాణికుల ప్రతినిధి -
అయ్యన్నను గెలిపిస్తే.. రౌడీరాజ్యమేనని ఆనాడే చెప్పా..
నర్సీపట్నం: నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తే రౌడీలు రాజ్యమేలుతారని ఎన్నికల ప్రచారంలో తాను ఆనాడే చెప్పానని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన మంగళవారం డీఎస్పీ మోహన్‌ను కలిసి శాంతిభద్రతలను కాపాడాలని, రౌడీయిజాన్ని అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ అనుచరులైన రౌడీలు హత్యలు, దాడులకు తెగబడడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో నియోజకవర్గంలో తరుచూ ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. నాతవరం మండలం చుక్కా రాము అనే వ్యక్తిపై దాడి చేశారని, డి.ఎర్రవరంలో సబ్బవరపు వెంకునాయుడికి చెందిన జీడి తోట నరికేశారన్నారు. చీడిగుమ్మల్లో పాకలు తగులబెట్టి ఇళ్లపై దాడి చేశారని, మాకవరపాలెం మండలం యరకన్నపాలేనికి చెందిన కొల్లు అప్పలనాయుడిపై దాడి చేశారన్నారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఐదు నెలల కాలంలో నియోజకవర్గంలో 250 కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. నర్సీపట్నం టౌన్లో మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావుపై రౌడీ షీటర్ పప్పలనాయుడు హత్యాయత్నం చేశాడరన్నారు. కొత్తవీధిలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బండారు కొండబాబు, రౌడీ షీటర్ బండారు సంతోష్ రెండు రోజుల క్రితం ఓ సామాన్య వ్యక్తిని హత్య చేశారన్నారు. వీరంతా స్పీకర్ అయ్యన్నపాత్రుడి ముఖ్య అనుచరులు కావటం గమనార్హమన్నారు. ఇందుకు సాక్ష్యంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అతని కుటుంబ సభ్యులతో నిందితులు ఉన్న ఫొటోలను ప్రదర్శించారు. స్పీకర్ అనుచరుల చేతిలో హత్యకు గురైన మృతుడు నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, భార్యకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. టౌన్లో సూర్యోదయానికి ముందే వైన్ షాపులు తెరవటం వల్ల ఆకతాయిలు మద్యం సేవించి రెచ్చిపోతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని, మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, టెంపుల మాజీ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, పార్టీ నాయకులు మళ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పీకర్ ఇలాకాలో రౌడీయిజాన్ని అరికట్టాలని డీఎస్పీకి వినతి -
ఉత్సాహంగా యువజనోత్సవాలు
డాబాగార్డెన్స్ (విశాఖ): జాతీయ స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలను మంగళవారం స్థానిక ఏవీఎన్ కళాశాలలో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్ యువజనోత్సవాల పోటీలు ప్రారంభించి మాట్లాడారు. యువత యువజనోత్సవాల్లో పాల్గొని వారిలో నిబిడీకృతమైన కళలను బయటకు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి జి.మహేశ్వరరావు మాట్లాడుతూ సాంస్కృతిక పోటీలు (జానపద కళా రూపాలు), వక్తృత్వ, ఫొటోగ్రఫీ, చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్టు చెప్పారు. హైస్కూల్ విద్యార్థులతో సైంటిఫిక్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో వివిధ స్కూళ్ల విద్యార్థుల ద్వారా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఏవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పీసీ మహలనోబిస్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
ఎంవీపీకాలనీ (విశాఖ): ప్రపంచ ప్రఖ్యాత గణాంకవేత్త ఆచార్య పీసీ మహలనోబిస్ పేరిట అందించే అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సెట్విన్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.సత్యపద్మ తెలిపారు. ఈ అవార్డు స్టాటస్టిక్స్‌లో విస్తృత పరిశోధనలు, గణాంక పద్ధతులను ప్రోత్సహించిన వారికి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు ద్వారా రూ.10 వేల యూఎస్ డాలర్స్ నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, మెమెంటో అందిస్తామన్నారు. https:// www.isi-web.org పోర్టల్ ద్వారా డిసెంబర్ 31వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
స్మార్ట్ మీటర్లు షాక్ కొడతాయి జాగ్రత్త!
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న దేవరాపల్లి: విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న పిలుపునిచ్చారు. దేవరాపల్లిలో స్మార్ట్ మీటర్ల బిగిస్తున్న వారిని మంగళవారం ఆయన ప్రశ్నించారు. దేవరాపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా స్మార్ట్ మీటర్ల బిగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటరు విశాఖలో బిగించి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలకు ప్రభుత్వం పూనుకుందని ఆయన విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలు కొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారని వెంకన్న గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శరవేగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తుండడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలతో డబ్బులు ఉంటేనే ఇకపై పేద ప్రజల ఇళ్లలో లైట్లు వెలుగుతాయని లేకుంటే అంధకారంలో మగ్గిపోవాల్సిందేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే దళిత గిరిజనుల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం మంగళం పాడే అవకాశం ఉందని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.