Corporate
-
క్యాన్సర్‌కు కొత్త మందు.. డాక్టర్ రెడ్డీస్ ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. పునరావృతమయ్యే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్స కోసం భారత్‌లో తొలిసారిగా టోరిపాలిమాబ్ అనే ఇమ్యునో–ఆంకాలజీ ఔషధాన్ని విడుదల చేసింది. నాసోఫారింజియల్ కార్సినోమా అనేది తల, మెడ క్యాన్సర్‌కు సంబంధించింది. ఇది గొంతు పైభాగంపై చోటుచేసుకుంటుంది. తరువాతి తరం ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ప్రొటీన్ 1 (పీడీ–1) అయిన టోరిపాలిమాబ్ సంప్రదాయ చికిత్సతో పోలిస్తే అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించిందని రెడ్డీస్ వెల్లడించింది. భారత్‌లో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు తెలిపింది. ఇమ్యునో–ఆంకాలజీ అనేది ఒక క్యాన్సర్ చికిత్స విధానం. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి, నియంత్రించడానికి, తొలగించడానికి రోగనిరోధక వ్యవస్థ శక్తిని ఉపయోగిస్తుంది. చైనా, యూఎస్ తర్వాత ఈ ఔషధం అందుబాటులోకి వచ్చిన మూడవ దేశం భారత్ కావడం విశేషం.ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ.. పునరావృతమయ్యే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్సకై యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదించిన ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం ఇదేనని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. టోరిపాలిమాబ్ కోసం 2023లో కంపెనీ షాంఘై జున్షి బయోసైన్సెస్‌తో లైసెన్స్, వాణిజ్యీకరణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, లాటిన్ అమెరికాతో సహా 21 దేశాల్లో టోరిపాలిమాబ్‌ను అభివృద్ధి చేయడానికి, అలాగే వాణిజ్యీకరించడానికి డాక్టర్ రెడ్డీస్ ప్రత్యేక హక్కులను పొందింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర తొమ్మిది దేశాల్లో అందుబాటులోకి తేవడానికి లైసెన్స్ పరిధి విస్తరణకు సైతం ఈ ఒప్పందం అనుమతిస్తుందని కంపెనీ వివరించింది. -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు వ్యాపారం సాధించాలని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియం రూ. 1,352 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1,655 కోట్లు నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ గురువారమిక్కడ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో గత అయిదేళ్లలో రూ. 3,330 కోట్ల క్లెయిమ్స్ చెల్లించామని, ప్రస్తుతం 100 శాఖలు, 1,350 మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం రూ. 15,284 కోట్ల వ్యాపారం సాధించగా, ఈసారి సుమారు రూ. 18,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సనత్ కుమార్ చెప్పారు. ఇంటి వద్దే వైద్య సేవలు పొందే విధంగా హోమ్ హెల్త్‌కేర్, టెలిమెడిసిన్ వంటి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో హోమ్ హెల్త్‌కేర్ సేవలు ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్ తదితర 8 నగరాల్లో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. -
బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..
రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లలో కొనుగోలు చేయవచ్చు.రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లను ఎంచుకునే వారికి, ఫైనాన్స్ భాగస్వాములైన బజాజ్ ఫిన్సర్వ్.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో రూ.22,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఓ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16ను ఇప్పుడు రూ. 70,900లకు, ఐప్యాడ్లను 1,371 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే రూ.25,000 తక్షణ తగ్గింపుగా పొందవచ్చు. అదే సమయంలో రూ.8,995 విలువైన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 1,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.బీపీఎల్ 1.5 టన్స్ 3 స్టార్ ఏసీను రూ. 29,990కే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీలపై కూడా సూపర్ కూల్ ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ల మీద కూడా అద్భుతమైన తగ్గింపులను పొందవచ్చు. ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై రూ. 26000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 8990 విలువైన సోనీ సీ510 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ. 3990కే సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల కొనుగోలుపై కూడా తగ్గింపును పొందవచ్చు.ట్రెండ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కస్టమర్లకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి.. ట్రెండ్స్ కూడా ప్రత్యేక చొరవను అమలు చేస్తోంది. ఇక్కడ 3,499 రూపాయలకు షాపింగ్ చేస్తే.. రూ.2,000 విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. ట్రెండ్స్ స్టోర్లు.. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో తగ్గింపు ధరలతో మంచి షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. -
రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?
చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ఆఫీసులో తాము ఎదుర్కుంటున్న పని ఒత్తిడి, బాస్ టార్చర్ వంటి సమస్యలను గురించి పేర్కొంటూ ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా ఒక ఉద్యోగి ఆఫీసులో సృష్టించిన అల్లకల్లోలం గురించి.. కంపెనీ ఓనర్ వెల్లడించారు.ఇటీవల ఉద్యోగంలో చేరిన లిలీ అనే 26ఏళ్ల ఉద్యోగి.. ప్రారంభంలో చాలా చురుగ్గా ఉండేది. అయితే కొన్ని సార్లు ఆఫీసులో పాటించాల్సిన నియమాలను పాటించేది కాదు. అయితే ఓ పనిమీద నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో లిలీ ఆఫీసులోని అందరికీ పార్టీ ఇచ్చింది. దీనికోసం కంపెనీ క్రెడిట్ కార్డును ఉపయోగించి 2000 డాలర్లు (దాదాపు రూ. 1.70 లక్షలు) ఖర్చు చేసింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, అందుకే అందరికీ ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాను, అందరూ తప్పకుండా రావాలని లిలీ మెయిల్ చేసి.. అందరికీ పార్టీ ఇచ్చిందని ఆ కంపెనీ మహిళా ఓనర్ రెడ్డిట్ వేదికగా వెల్లడించింది.ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని పార్టీ ఇచ్చిన లిలీ.. జాబ్‌కు రిజైన్ చేయలేదు. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చాక.. ఆఫీసులో జరిగిన అల్లకల్లోలం గురించి తెలుసుకున్నాను. దీనికి కారణమైన లిలీని పిలిచి.. ఆఫీసులో పార్టీ ఏంటి? దీనికి కంపెనీ డబ్బును ఎందుకు ఉపయోగించావని అడిగాను. దీనికి ఆమె బదులిస్తూ ఇదొక 'సోషల్ ఎక్స్పర్మెంట్' అని చెప్పింది.ఆఫీసులో ఎక్స్పర్మెంట్ ఏమిటి? అని అడిగితే.. నేను రాజీనామా చేసి వెళ్లే సమయంలో పార్టీ ఇస్తే ఎంతమంది వస్తారో అని తెలుసుకోవడానికి అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలతో చిర్రెత్తిపోయిన బాస్.. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించేసింది.నేను లిలీను తొలగించడం కరెక్టేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లను అడిగింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. లిలీపై దొంగతనం, చీటింగ్ కేసు పెట్టమని కొందరు చెబుతున్నారు. ఆమె నమ్మక ద్రోహం చేసిందని మరికొందరు పేర్కొన్నారు. కంపెనీ డబ్బుతో లిలీ ఎంజాయ్ చేసింది.. మీరు కాబట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారు. మరో కంపెనీలో అయితే ఆమెపై కఠినమైన చర్యలు తీసుకుని ఉండేవారని ఇంకొందరు పేర్కొన్నారు. -
ఎనిమిది కంపెనీలకు రూ.7300 కోట్ల పెనాల్టీ!.. కారణం ఇదే..
హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్‌కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. -
డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..
Bank Holidays in December 2024: నవంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో డిసెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఏయే రోజుల్లో మూతపడతాయి అన్న వివరాలతో డిసెంబర్ బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను ఇక్కడ అందిస్తున్నాం..ఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. డిసెంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అధిక మొత్తంలో వరుస సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, ప్రాంతీయ, జాతీయ విశేష సందర్భాల నేపథ్యంలో బ్యాంకులు కొన్ని రోజులే పనిచేయనున్నాయి.డిసెంబర్లో బ్యాంకులకు వారాంతపు సెలవులతో సహా కనీసం 17 లిస్టెడ్ సెలవులు ఉన్నాయి. కొన్ని దీర్ఘ వారాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకుకు మీ సందర్శనలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ సెలవులు దేశంలోని రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.డిసెంబర్లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాడిసెంబర్ 1 - ఆదివారండిసెంబర్ 3 - శుక్రవారం - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ (గోవా)డిసెంబర్ 8 - ఆదివారం డిసెంబర్ 12 - మంగళవారం - పా-టోగన్ నెంగ్మింజ సంగ్మా (మేఘాలయ)డిసెంబర్ 14 - రెండవ శనివారండిసెంబర్ 15 - ఆదివారండిసెంబర్ 18 - బుధవారం - యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)డిసెంబర్ 19 - గురువారం - గోవా విమోచన దినం (గోవా)డిసెంబర్ 22 - ఆదివారండిసెంబర్ 24 - మంగళవారం - క్రిస్మస్ ఈవ్ (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 25 - బుధవారం - క్రిస్మస్ (దేశమంతా)డిసెంబర్ 26 - గురువారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 27 - శుక్రవారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 28 - నాల్గవ శనివారండిసెంబర్ 29 - ఆదివారండిసెంబర్ 30 - సోమవారం - యు కియాంగ్ నంగ్బా (మేఘాలయ)డిసెంబర్ 31- మంగళవారం - నూతన సంవత్సర వేడుక/లాసాంగ్/నామ్సూంగ్ (మిజోరం, సిక్కిం) -
హైదరాబాద్ నుంచి విస్తారా విమానాలు!
ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్వేస్కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్‌లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్‌తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. -
మరింత పటిష్టంగా ‘దివాలా’ పరిష్కార వ్యవస్థ!
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ ప్రక్రియలను వేగవంతం చేయడంలో సహాయపడేలా తగిన వాతావారణం నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) జాయింట్ సెక్రటరీ అనితా షా అకెల్లా తెలిపాయి.ఎనిమిది సంవత్సరాల క్రితం– 2016లో అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ (ఐబీసీ) సంబంధిత ఆస్తులకు మార్కెట్–లింక్డ్ అలాగే టైమ్–బౌండ్ (మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, సకాలంలో సమస్య పరిష్కారం జరిగేలా చర్యలు) పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిష్కార ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.ఐబీసీ రికవరీ మెకానిజం కాదు: అనితా షా అకెల్లా అనితా షా అకెల్లా ఈ విషయంపై మాట్లాడుతూ, ఐబీసీ రికవరీ మెకానిజం కాదని, రెస్క్యూ మెకానిజం అని ఉద్ఘాటించారు. ఐసీఏఐకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎనిమిదో వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో జరిగిన ఒక సదస్సులో ఆమె మాట్లాడుతూ, ఐబీసీ పరిష్కార యంత్రాంగాన్ని మరింత మెరుగుపరచడానికి తీసుకున్న వివిధ చర్యలను ప్రస్తావించారు. అయితే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దివాలా పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడానికి ఒక సమగ్ర ‘ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్’ ఏర్పాటుకు కృషి చేస్తోందన్నారు. ప్లాట్పామ్ ఇలా... ప్రతిపాదత ఇంటిగ్రేడెడ్ ఫ్లాట్‌ఫామ్.. ఒక ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ అనీ, ఇది అవసరమైనప్పుడు తగిన డేటాను అందించగలుగుతుందని అనితా షా అకెల్లా తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్‌తో పాటు సంబంధిత అన్ని వర్గాలనూ ఒకే వేదికలాగా కలిపి ఉంచుతుందన్నారు. యాప్‌లో ఆలస్యం, హెచ్చరికల వంటి సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్‌లు వంటి వివిధ ఫీచర్లు ఇందులో ఉంటాయని ఆమె తెలిపారు. ప్రస్తుత దివాలా కేసుల తీరిది... కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్‌సభ తెలిపిన సమాచారం ప్రకారం, మొత్తం 1,963 సీఐఆర్‌పీ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కేసులు కొనసాగుతున్నాయి. వాటిలో 1,388 కేసులు నిర్దేశిత (కేసుల పరిష్కారానికి) 270 రోజుల కాల పరిమితిని మించిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 1,068 కేసుల పరిష్కారం అయ్యాయి. తద్వారా బ్యాంకింగ్ సుమారు రూ. 3.55 లక్షల కోట్లను రికవరీ చేసింది. -
రైల్వే కొత్త యాప్.. ఎవరి కోసమంటే..?
ఇండియన్ రైల్వే ఫ్రంట్‌లైన్ భద్రతా సిబ్బంది కోసం భద్రతా శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే మొబైల్ అప్లికేషన్ 'సంరక్ష'ను ప్రారంభించింది. లక్షలాది మంది రైల్వే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్లిష్టమైన కార్యాచరణ శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తెలిపింది.ఈ 'సంరక్ష' యాప్‌ను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రూపొందించారు. రైల్వే ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే సమర్థవంతమైన వ్యవస్థను అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఏఐ భవిష్యత్తులో సాధ్యాలతో, రైల్వే డొమైన్ పరిజ్ఞానంతో ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని డీఆర్ఎం నమితా త్రిపాఠి పేర్కొన్నారు.రైల్వే రూపొందించిన ఈ యాప్ స్మార్ట్ లెర్నింగ్, ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లను కలిగి ఉంటుంది. ఇది మల్టీ లెవల్, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్, పర్యవేక్షణను సాధ్యం చేస్తుంది. -
గ్రీన్‌ఫ్యూయల్ కొనుగోలు పూర్తి: లుమాక్స్
ముంబై: గ్రీన్‌ఫ్యూయల్ ఎనర్జీ సొల్యూషన్స్‌కు చెందిన ప్రత్యామ్నాయ ఇంధన బిజినెస్‌లో 60 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేసినట్లు లుమాక్స్ రిసోర్స్ వెల్లడించింది. ఇందుకు రూ. 153 కోట్లకుపైగా వెచ్చించింది. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమీకరించినట్లు కంపెనీ వెల్లడించింది.ఆటోమోటివ్ సిస్టమ్స్, విడిభాగాల తయారీ దిగ్గజం లుమాక్స్ ఆటో టెక్నాలజీస్‌కు సొంత అనుబంధ కంపెనీ లుమాక్స్ రిసోర్స్. తాజా ఈ కొనుగోలు ద్వారా లుమాక్స్ ఆటో టెక్నాలజీస్ సీఎన్జీ, హైడ్రోజన్ తదితర గ్రీన్, ఆల్టర్నేట్ ఇంధన విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటికి పటిష్ట డిమాండ్ కారణంగా రానున్న కాలంలో అత్యుత్తమ వృద్ధిని అందుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. -
అదానీపై లంచం ఆరోపణల్లేవు!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్జైన్పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్‌సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్జైన్పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.అదరగొట్టిన అదానీ షేర్లు...అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్‌సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 12%, ఎన్డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది. -
జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో జొమాటో ఒకటి. ఈ కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' మరో రెండేళ్లు (2026 మార్చి 31 వరకు) జీతం తీసుకోనని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) డాక్యుమెంట్లలో వెల్లడించారు.దీపిందర్ గోయల్ 2021లోనే 36 నెలలు లేదా మూడేళ్లు జీతం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనిని మరో రెండేళ్లు పొడిగించారు. అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరం వరకు (మొత్తం ఐదేళ్లు) గోయల్ జీతం తీసుకోకుండా ఉంటారు. జీతం వద్దనుకున్నప్పటికీ గోయల్ జొమాటో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.దీపిందర్ గోయల్ జీతాన్ని వదులుకున్నప్పటికీ.. ఈయనకు కంపెనీలో భారీ వాటా ఉంది. నవంబర్ 25 నాటికి, జొమాటో ముగింపు షేరు ధర ఆధారంగా కంపెనీలో అతని వాటా విలువ సుమారు రూ.10,000 కోట్లు. జొమాటో షేర్స్ ఈ ఏడాది మెరుగ్గా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 శాతం పుంజుకుంది. -
నారాయణమూర్తి అడిగితే.. కొండపై నుంచి దూకేవాడిన: నందన్ నీలేకని
నందన్ నీలేకని అనగానే.. ఆధార్ సృష్టికర్త అని వెంటనే గుర్తొస్తుంది. కానీ ఈయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులలో ఒకరు కూడా. ఇటీవల ఈయన రోస్లాన్‌స్కీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి వెల్లడించారు.నందన్ నీలేకని 1978లో మొదటిసారి ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కలిసిన తరువాత తనలో మార్పు వచ్చిందని చెప్పారు. అంతకంటే ముందు ఐఐటీ బాంబేలో చేరడానికి తన తండ్రిని ఎదిరించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. నాన్న నన్ను కెమికల్ ఇంజినీరింగ్‌లో చేరమని చెబితే.. నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాను. అప్పట్లో అది ఓ చిన్నపాటి తిరుగుబాటు చర్య అని అన్నారు.నేను చదువుకునే రోజుల్లో ఇంజినీర్ లేదా డాక్టర్ అనే రెండు ఉద్యోగాలను మాత్రమే తల్లిందండ్రులు పిల్లలకు చెప్పేవారు. నేను డాక్టర్ కావాలని కోరుకోలేదు, అందుకే ఇంజినీర్ అయ్యాను అని నందన్ నీలేకని చెప్పుకొచ్చారు. 1978లో ఐఐటీ బాంబే నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ పట్టా పొందాను. ఆ తరువాత గ్రేడ్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష రాయ్లకున్నాను, కానీ ఆరోజు అస్వస్థతకు గురవ్వడం వల్ల పరీక్ష మిస్ అయ్యాను. తరువాత ఏం చేయాలో తోచలేదు.ఆ సమయంలో కొత్త టెక్నాలజీని, మినీ కంప్యూటర్లను ఉపయోగిస్తున్న ఓ చిన్న సంస్థ పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ గురించి విన్నాను. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సంస్థకు సాఫ్ట్వేర్ హెడ్‌గా ఉన్న నారాయణమూర్తి ఆఫీసుకు వెళ్ళాను. ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, అదృష్టవశాత్తు వాటన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చాను. ఇదే నా జీవితాన్ని మలుపుతిప్పిన అసాధారణ జాబ్ ఆఫర్ అని నీలేకని అన్నారు.నారాయణమూర్తి ఆకర్షణీయంగా, చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేవారాని నీలేకని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి అని ఆయన నారాయణమూర్తిని కొనియాడారు. ఆయన అడిగితే ఏమైనా చేస్తాను. కొండపై నుంచి దూకమంటే.. తప్పకుండా దూకుతాను అని నీలేకని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. 25ఏళ్ల వయసులో నా లీడర్ నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్ స్థాపించమని గుర్తుచేసుకున్నారు.ఇదీ చదవండి: అలా ఆమె మనసు గెలుచుకున్నా.. 30 ఏళ్లకే మాటపై నిలబడ్డా: ఎన్వీడియా సీఈఓఇన్ఫోసిస్ ప్రస్తావన గురించి మాత్రమే కాకుండా.. ఆధార్‌ను రూపొందించే తన ప్రయాణాన్ని కూడా వివరించారు. ఆధార్‌లో చేరిన ఒక నెలలోపే, నేను వైదొలిగే సమయానికి మేము 600 మిలియన్ల ఐడీలను సాధిస్తామని ప్రకటించాను. ఇది చాలా పెద్ద లక్ష్యం, ప్రజలు నన్ను వెర్రివాడిగా భావించారు. అయితే ఈ లక్ష్యం నా జట్టును ఉత్తేజపరిచింది. ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల మిగతావన్నీ కనుమరుగయ్యేలా చేశాయని నందన్ అన్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌కు మాటిచ్చి! ‘సీఈవో’గానే మనువాడి..
ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈయన ఇటీవల హాంగ్ కాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో తన భార్య 'లోరీ హువాంగ్'ను ఎలా ఆకట్టుకున్నారనే విషయాలను వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో మొదటిసారి లోరీని కలుసుకున్నప్పుడు ఆమెను ఆకట్టుకోవడానికి.. ఆమె వద్దకు వెళ్లి, మీరు నా హోంవర్క్ చూడాలనుకుంటున్నారా?.. అని అడిగినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రతి ఆదివారం నాతో కలిసి హోంవర్క్ చేస్తే.. తప్పకుండా మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు, అని వాగ్దానం చేశారు. నిజానికి అప్పుడు హువాంగ్ వయస్సు కేవలం 17, లోరీ వయస్సు 19 సంవత్సరాలు.జెన్సన్ హువాంగ్ మాటలు విన్న లోరీ.. అతన్ని తెలివైనవాడిగా భావించిందని, ఆ తరువాత ఇద్దరూ కలిసి హోంవర్క్ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు.. నేను 30 ఏళ్ల వయసుకే సీఈఓ అవుతానని జెన్సన్ చెప్పినట్లు వెల్లడించారు. చెప్పినట్లుగానే సీఈఓ అయ్యాను, దీంతో లోరీకి నమ్మకం కుదిరింది.సీఈఓ అయిన తరువాత ఐదేళ్లకు లోరిని పెళ్లి చేసుకున్నట్లు జెన్సన్ తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతురు మాడిసన్ (ఎన్విడియాలో మార్కెటింగ్ డైరెక్టర్), కుమారుడు స్పెన్సర్ (ఎన్విడియాలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్). ప్రస్తుతం జెన్సన్ హువాంగ్ నికర విలువ రూ. 9 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. -
'ఆలోచిస్తే ఆశ్చర్యపోతుంటాను': భారత్‌పై నితిన్ కామత్ వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. జెరోధా సీఈఓ 'నితిన్ కామత్' భారత్ చాలా వైవిధ్యంగా ఉందని అన్నారు. ఇటీవలే ఐరోపాలోని చాలా దేశాలను సందర్శించాను. అక్కడన్నీ చిన్న తేడాతో అంతా కట్, కాపీ.. పేస్ట్ మాదిరిగా అనిపించాయని అన్నారు.భారతదేశం మాత్రం చాలా వైవిధ్యంగా ఉంది. మనది ఒక దేశం అయినప్పటికీ.. వైవిధ్యంలో ఓ ఖండం లాంటిదని నితిన్ కామత్ అన్నారు. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో భాష, ఒక్కో ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు.. ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఇన్ని భిన్నమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశం మొత్తం ఏకతాటిపై ఉంది. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతుంటానని కామత్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఎన్ని భాషలు, ఆచార & సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరినీ ఏకీకృతం చేయగలిగిన సత్తా ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందని కామత్ దేశాన్ని కీర్తించారు. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ.. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేకంగా నిలుస్తోంది అంటే.. దానికి కారణం ఈ ఏకీకృతమే అని ఒకరు అన్నారు.భారతదేశానికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నా.. ఎన్నెన్ని దేశాలు ఇండియాను ఆదర్శంగా తీసుకుంటున్నా.. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ప్రగతి కుంటుపడుతోంది. వీరు కూడా సవ్యంగా నడుచుకుంటే.. ప్రపంచానికి మన దేశం మకుటాయమానంగా నిలుస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.I recently returned from visiting several countries in Europe. Everything feels like a cut, copy, and paste with very small differences.In contrast, India is more like a continent than a country. The diversity in terms of languages, food, culture, etc., between the 28 states… pic.twitter.com/6er6J4IvVB— Nithin Kamath (@Nithin0dha) November 26, 2024 -
రిటైర్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయనివారు ఎంతమందో తెలుసా?
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (మ్యాక్స్ లైఫ్) తన రిటైర్మెంట్ సర్వే నాల్గవ ఎడిషన్ & ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (IRIS) ఫలితాలను.. ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ కాంతర్ భాగస్వామ్యంతో వెల్లడించింది. ఫలితాల ప్రకారం సౌత్ ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ 48 వద్ద ఉందని తెలుస్తోంది. ఈ స్కోర్ నార్త్ ఇండియాతో సమానంగా ఉంది.మ్యాక్స్ లైఫ్ స్థిరత్వాన్ని కొనసాగించినప్పటికీ.. పదవీ విరమణ సంసిద్ధతలో దక్షిణ భారతదేశం ప్రత్యేకమైన సవాళ్లను & అవకాశాలను ఎదుర్కొంటుంది. దాని ఫైనాన్సియల్ ఇండెక్స్ 49 వద్ద, హెల్త్ ఇండెక్స్ 45 వద్ద & ఎమోషనల్ ఇండెక్స్ 60 వద్ద ఉన్నాయి.దక్షిణ భారతదేశంలో ఆర్థిక సవాళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక సంసిద్ధత అన్ని ప్రాంతాలలో అత్యల్పంగా ఉంది. ఇది గణనీయమైన ఆర్థిక అభద్రతను సూచిస్తుంది. చాలా ఫైనాన్షియల్ ఉత్పత్తుల స్థిరంగా ఉన్నప్పటికీ.. దక్షిణ భారతదేశంలోని 42 శాతం మంది ప్రజలు పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టడం ఇంకా ప్రారంభించలేదు. పదవీ విరమణ సంబంధిత ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.81 శాతం మంది వైద్య ఖర్చుల ద్వారా పొదుపును కోల్పోతున్నట్లు, మరో 80 శాతం మంది ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, జీవిత బీమా అనేది పదవీ విరమణ పెట్టుబడికి అనుకూలమైన ఎంపికగా మిగిలిపోయింది. 62 శాతం మంది తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి దీనిని ఎంచుకున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ స్కామ్: రూ.13 లక్షలు కాపాడిన ఎస్బీఐదక్షిణ భారతదేశంలో.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) గురించి అవగాహన చాలా ఎక్కువగా ఉంది. 10 మందిలో 7 మందికి దీని గురించి బాగా తెలుసు. ఈ అవగాహన ప్రధానంగా టీవీ, వార్తా కథనాలు, సోషల్ మీడియా ప్రకటనలు, సహోద్యోగులు, స్నేహితులు ద్వారానే పెరుగుతోంది. అయినప్పటికీ 14 శాతం దక్షిణ భారతీయులు మాత్రమే ఎన్పీఎస్ కలిగి ఉన్నారు. ఈ సంఖ్య పశ్చిమ భారతదేశంలో చాలా తక్కువగా ఉంది.ఆరోగ్య అవగాహన మిశ్రమంగా ఉంది. దక్షిణ భారతీయులలో కేవలం 32 శాతం మంది మాత్రమే వార్షిక పరీక్షలు చేయించుకుంటున్నారు. 48 శాతం మంది ఆరోగ్య పరీక్షలను పెడచెవిన పెడుతున్నారు. 45 శాతం స్వంత ఆరోగ్య భీమా కలిగి ఉన్నారు. -
150 గంటల్లో ఫ్యాక్టరీ భవనం: ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఘనత
భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈప్యాక్ ప్రిఫ్యాబ్, కేవలం 150 గంటల సమయంలో ఒక నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం.మొత్తం 1,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణం పూర్తిగా లేటెస్ట్ ప్రిఫ్యాబ్రికేషన్ అండ్ పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్.. 120వ గంటకు క్లాడింగ్ పూర్తయింది. మొత్తం మీద ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్మాణం పూర్తయింది. ఈ విజయం గొప్ప ప్రపంచ రికార్డును నెలకొల్పింది, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.150 గంటల సమయంలో ఒక నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఈప్యాక్ ప్రిఫ్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింఘానియా మాట్లాడుతూ.. పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. పీఈబీ అనేది నిర్మాణం భవిష్యత్తు. పీఈబీ పరిష్కారాలు ఎక్కువ ఆమోదం పొందడంతో పరిశ్రమలో మరిన్ని బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖెల్ బోత్రా మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన నిర్మాణం పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీష్ విష్ణోయి.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిరంతర అన్వేషణను అభినందించారు. -
గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం: ఉద్యోగులకు 85 శాతం బోనస్
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఉద్యోగులకు పర్ఫామెన్స్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన వారికి 85 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఈమెయిల్స్ కూడా ఉద్యోగులకు పంపించింది. కాబట్టి నవంబర్ జీతంతో పాటు ఈ బోనస్ కూడా పొందనున్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం.. డెలివరీ, సేల్స్ వర్టికల్లో జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మెరుగైన లాభాలను పొందింది. ఈ నేపథ్యంలో సంస్థ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. బోనస్ అనేది కేటగిరి వారీగా చెల్లించే అవకాశం ఉంది. అయితే ఏ కేటగిరి ఉద్యోగులకు ఎంత శాతం బోనస్ ఇస్తుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..సెప్టెంబరుతో ముగిసిన Q2FY25లో.. ఇన్ఫోసిస్ వరుసగా రెండవ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 4.7 శాతం పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో రాబడి 5.1 శాతం పెరిగి రూ. 40,986 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద ఈ ఆర్ధిక సంవత్సరంలో టెక్ దిగ్గజం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని స్పష్టమవుతోంది. -
రిఫైనింగ్ మార్జిన్లు పెరిగినా.. రిటైల్‌పై అనిశ్చితి
రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. రిటైల్ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్ విభాగాల లిస్టింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.నివేదిక ప్రకారం జూన్ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కు ఛాతీ నొప్పిరిలయన్స్లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్ రిఫైనింగ్.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్ సెగ్మెంట్. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం. -
ఆకాశవీధిలో 1.36 కోట్ల మంది
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 అక్టోబరులో 1.36 కోట్లు నమోదైందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్యాసింజర్ల సంఖ్య 5.3 శాతం పెరిగిందని వివరించింది.డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 అక్టోబరులో 1.26 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు విమాన ప్రయాణాలు సాగించారు. 2024 అక్టోబరులో బడ్జెట్ క్యారియర్ ఇండిగో 86.40 లక్షల మందిని వివిధ గమ్య స్థానాలకు చేర్చింది. తద్వారా 63.3 శాతం మార్కెట్ వాటాను సాధించింది. టాటా గ్రూప్ నడుపుతున్న ఎయిరిండియా 26.48 లక్షలు, విస్తారా 12.43 లక్షల మందికి సేవలు అందించాయి. ఎయిరిండియా గణాంకాల్లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ల సంఖ్య కలిసే ఉంది.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..ఎయిరిండియా తన అనుబంధ సంస్థ ఏఐఎక్స్ కనెక్ట్‌ను తన అంతర్జాతీయ బడ్జెట్ విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో 2024 అక్టోబర్ 1న విలీనం చేసింది. గత నెలలో టాటా గ్రూప్ విమాన సంస్థ మార్కెట్ వాటా 19.4 శాతం కాగా, విస్తారా 9.1 శాతంగా ఉంది. గతంలో టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య 51:49 శాతం జాయింట్ వెంచర్ అయిన విస్తారా కూడా నవంబర్ 12న ఎయిరిండియాలో విలీనం అయింది. రెండు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ (ఎయిరిండియా, విస్తారా) గత నెలలో మొత్తం దేశీయ ప్రయాణికుల రద్దీలో 28.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆకాసా ఎయిర్ 6.16 లక్షల మందితో 5.4 శాతం, స్పైస్‌జెట్ 3.35 లక్షల మందితో 2.4 శాతం వాటా దక్కించుకున్నాయి. -
ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూత
ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశికాంత్ రుయా(81) వృద్ధాప్య కారణాలతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎస్సార్ గ్రూప్ సంతాపం తెలియజేసింది. ‘రుయా జీవితకాలంలో లక్షల మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పునకు కారణమయ్యారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. తన వినయం, ఆప్యాయతతో అసాధారణ నాయకుడిగా ఎదిగారు’ అని ఎస్సార్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.శశి రుయా 1943లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ గ్రూప్ ద్వారా విభిన్న రంగాల్లో సేవలిందిస్తున్నారు. మొదట ఈ గ్రూప్ చేపట్టిన ప్రముఖ ప్రాజెక్ట్‌ల్లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ ఔటర్ బ్రేక్ వాటర్ నిర్మాణం ప్రధానమైంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2.5 కోట్లు. దీన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఎస్సార్ గ్రూప్‌నకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.మొదట కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్‌పై దృష్టి సారించిన ఎస్సార్ గ్రూప్ క్రమంగా వంతెనలు, ఆనకట్టలు, పవర్ ప్లాంట్లతో సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. 1980ల నాటికి ఇది చమురు, గ్యాస్ రిజర్వ్‌లను కొనుగోలు చేసి ఇంధన రంగంలోకి విస్తరించింది. 1990ల్లో స్టీల్, టెలికమ్యూనికేషన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. క్రమంగా ఎస్సార్ గ్రూప్ స్టీల్ ఇండస్ట్రీ, చమురు శుద్ధి కర్మాగారాన్ని అభివృద్ధి చేసింది. అప్పట్లో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ను రూపొందించడానికి ‘హచిసన్(హచ్)’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తర్వాతి కాలంలో టెలికాం వ్యాపారాన్ని విక్రయించింది. చమురు శుద్ధి కర్మాగారాన్ని రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆధ్వర్యంలోని కన్సార్టియంకు మళ్లించింది.ఎస్సార్ గ్రూప్ ఆధ్వర్యంలోని వ్యాపార విభాగాలుఎస్సార్ ఆయిల్ యూకేఎస్సార్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ప్లోరేషన్ & ప్రొడక్షన్ఎస్సార్ పవర్ఎస్సార్ పోర్ట్స్ఎస్సార్ షిప్పింగ్ఎస్సార్ స్టీల్ఎస్సార్ మిన్మెట్మెసాబి మెటాలిక్స్ఎస్సార్ ప్రాజెక్ట్స్బ్లాక్ బాక్స్ కార్పొరేషన్‌ది మొబైల్ స్టోర్ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్ (ఈజీఎఫ్ఎల్)ఎస్సార్ క్యాపిటల్ఎక్స్పెన్షియా వెంచర్స్ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..పలు హోదాల్లో గుర్తింపుశశి రుయా దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థల్లో కీలక పాత్ర పోషించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మేనేజింగ్ కమిటీలో భాగమయ్యారు. ఇండో-యూఎస్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ (ఐఎన్ఎస్ఏ)కు నాయకత్వం వహించారు. ప్రధానమంత్రి ఇండో-యూఎస్ సీఈఓ ఫోరమ్, ఇండియా-జపాన్ బిజినెస్ కౌన్సిల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో రుయా అంతర్జాతీయ సమస్యలపై పని చేస్తున్న ‘ది ఎల్డర్స్’ కౌన్సిల్ చేరారు. ఇందులో డెస్మండ్ టుటు, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్ వంటి ప్రముఖులున్నారు.