Latest News
-
అవరోధ శ్రేణి 19,337-19,525
అధికశాతం షేర్లు నిలువునా పతనం అవుతున్నా, కొద్ది నెలల నుంచి స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడేందుకు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు సహకరిస్తూ వచ్చాయి. క్రితం వారం ఐటీ మినహా ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు కూడా కరెక్షన్ బాట పట్టడంతో స్టాక్ సూచీల్లో కూడా పతనవేగం పెరిగింది. రూపాయి క్షీణతను అదుపుచేయడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలేవీ ఫలితాల్ని ఇవ్వకపోవడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఇన్ఫ్రా రంగాల షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లు ఆఫ్‌లోడ్ చేస్తున్నారు. 1998లో ఆగ్నేయాసియా దేశాల్లో సంభవించిన కరెన్సీ సంక్షోభ(కరెన్సీ విలువలు నిలువునా పతనంకావడం) ఛాయలు, ప్రస్తుతం భారత కరెన్సీ మార్కెట్లో కన్పిస్తున్నాయి. అప్పట్లో ఆయా దేశాలతో పాటు మన స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో కీలక రంగాలకు చెందిన పెద్ద షేర్లు పెన్నీ(కారు చౌకగా లభించే) షేర్లుగా మారిపోయాయి. అదేతరహాలో ఇప్పటి మార్కెట్ పతనం కొనసాగుతోంది. -
కెన్యా రియల్టీలోకి రిలయన్స్
కెన్యా రియల్టీ మార్కెట్లోకి ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశించింది. డెల్టా కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్, డెల్టా కార్ప్ ఈస్ట్ ఆఫ్రికా లిమిటెడ్(డీసీఈఏఎల్-ఈ జేవీలో రిలయన్స్‌కు 58.8 శాతం వాటాలున్నాయి) ద్వారా హౌసింగ్, ఆఫీస్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తోంది. కెన్యాలో రూ.200 కోట్ల విలువైన భూములను ఈ కంపెనీ కొనుగోలు చేసిందని డెల్టా కార్ప్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే చౌక ధరల రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒక ఆఫీస్ బ్లాక్ ప్రాజెక్ట్‌ను ఈ జేవీ పూర్తి చేసింది. నైరోబీలోని 10 ప్రైమ్ ప్లాట్లను కొనుగోలు చేసిన డీసీఈఏఎల్ 12 లక్షల చదరపుటడుగుల కమర్షియల్, రెసిడెన్షియల్ అసెట్స్‌ను డెవలప్ చేయనున్నది. జయదేవ్ మోడీ నేతృత్వంలోని డెల్టా కార్ప్ భారత్, శ్రీలంక, కెన్యాల్లో గేమింగ్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, రియల్టీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డెల్టా కార్ప్ అధినేత మోడీ, ముకేష్ అంబానీలు మంచి స్నేహితులు. -
రెండు నెలల్లో రూ. 62,000 కోట్లు వెనక్కి
గత రెండు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి 10.5 బిలియన్ డాలర్ల(రూ. 62,000 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రూపాయి పతనం నేపథ్యంలో ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగవచ్చునని విశ్లేషకులు అంచనా వేశారు. జూన్‌లో రూ. 44,162 కోట్లు(7.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు జూలైలోనూ డెట్, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 18,124 కోట్లు(3 బిలియన్ డాలర్లు) విలువైన అమ్మకాలను నిర్వహించారు. ఈ రెండు నెలల్లోనూ డెట్ మార్కెట్ల నుంచి మొత్తంగా రూ. 45,000 కోట్లను(7.7 బిలియన్ డాలర్లు) వెనక్కి తీసుకోగా, రూ. 17,000 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) విలువైన ఈక్విటీలను విక్రయించారు. -
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔట్?
ముంబై: ఇటీవల వరుసగా పతనమవుతున్న షేర్ల ధరల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల విలువ మార్క్‌ను కోల్పోయే ప్రమాదంలో పడ్డాయ్. ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి పతనంకూడా ప్రభావం చూపుతోంది. నిజానికి ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా 14 ఉన్నాయి. వీటిలో ఇండియాకు సైతం సభ్యత్వం ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్ల విలువ 1.004 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి ఇకపై షేర్ల ధరలు లేదా రూపాయి విలువ పతనమైతే తృటిలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను కోల్పోయే అవకాశముంది. గత వారం అటు స్టాక్ మార్కెట్లు క్షీణించడంతోపాటు, ఇటు రూపాయి విలువ కొత్త కనిష్టానికి పతనమైన నేపథ్యంలో మార్కెట్ల విలువ రూ. 61,36,641 కోట్లకు(ఒక ట్రిలియన్ డాలర్లు) పరిమితమైంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదలు స్టాక్ మార్కెట్లు 4% క్షీణించగా, రూపాయి విలువ 12% పడిపోయింది. అమెరికా టాప్: ప్రస్తుతం ఇండియాసహా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో నమోదయ్యాయి. 20 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అమెరికా టాప్ ర్యాంక్‌లో నిలవగా, తదుపరి స్థానాల్లో యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా తదితరాలున్నాయి. 2007లో తొలిసారి ఇండియా ఈ క్లబ్లో సభ్యత్వాన్ని పొందింది. ఆపై 2008 సెప్టెంబర్‌లో ర్యాంక్‌ను కోల్పోయినప్పటికీ తిరిగి 2009 మే నుంచీ క్లబ్లో కొనసాగుతోంది. -
సివిల్స్ మెయిన్స్ దరఖాస్తు తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 1న జరిగే మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం తెలిపింది. ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 10 వరకూ అభ్యర్థులు తమ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)లను ఆన్లైన్లో సమర్పించాలి. ఇలా సమర్పించిన డీఏఎఫ్ను ప్రింట్ తీసుకోవాలని, ఆ నకలుపై అభ్యర్థి సంతకం చేసి, సంబంధిత డాక్యుమెంట్లు, ఫీజును జత చేసి సెప్టెంబర్ 18లోగా కమిషన్‌కు పంపాలని సూచించింది. అదనంగా 100 ఐఆర్ఎస్ పోస్టులు: ఆదాయపన్ను శాఖను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని కేడర్లలోనూ భారీ సంఖ్యలో కొత్త పోస్టులు భర్తీ చేయనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అదనంగా 100 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాబోయే యూపీఎస్సీ నోటిఫికేషన్లో వీటిని అదనంగా కలుపుతారు. అలాగే ఆదాయపన్ను శాఖలో దిగువ స్థాయి వివిధ కేడర్లలో 20,751 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. -
స్వయంప్రతిపత్తి ఉండాల్సిందే! సుప్రీంకోర్టుకు నివేదించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: దర్యాప్తులో ప్రభుత్వ, రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నా, పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నా తమకు పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తి కల్పించాల్సిందేనని సీబీఐ.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేయనుంది. ఆర్థికపరమైన స్వేచ్ఛ కల్పించడంతోపాటు సీబీఐ డెరైక్టర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని నివేదించ నుంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోవడంతో జాప్యం జరుగుతోందని, దీన్ని నివారించేందుకు సీబీఐ డెరైక్టర్ నేరుగా సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రికి మాత్రమే జాబుదారీగా ఉండాలని కోరనుంది. స్వయంప్రతిపత్తి కల్పించాలన్న తమ డిమాండ్ పూర్తిగా న్యాయబద్ధమేనని కోర్టుకు తెలపనుంది. సీబీఐ డెరైక్టర్‌కు మూడేళ్ల పదవీకాలంతోపాటు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్న సీబీఐ వాదనతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విభేదించిన సంగతి తెలిసిందే. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా అధికారాలు కల్పిస్తే సీబీఐ చీఫ్.. అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉంటుందని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా సమర్పించింది. ఇరుపక్షాల వాదనలపై మంగళవారం సుప్రీం విచారణ జరపనుంది. ఈ సందర్భంగా స్వయంప్రతిపత్తి కల్పించాలన్న తమ వాదనను గట్టిగా వినిపించాలని సీబీఐ నిర్ణయించినట్టు తెలిసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తును పూర్తిచేసేందుకే తమకు మరిన్ని అధికారాలు కల్పించాలని కోరుతున్నట్లు నివేదించనుంది. తమ తరఫున వాదించే న్యాయవాదులను నియమించుకునే అధికారం సీబీఐ డైరె క్టర్‌కు ఉండాలంటోంది. -
నేటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవలి కాలంలో పార్లమెంటు సమావేశాలన్నీ పలు అంశాలపై ఆందోళనలు, గందరగోళాల మధ్య ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఈసారైనా సజావుగా సాగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అత్యంత కీలకమైన ఆహార భద్రత బిల్లుకు ఆమోదం వంటి అంశాలతో భారీ ఎజెండా సమావేశాలు ముందుండగా.. ఆంధ్రప్రదేశ్ విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉభయసభలపైనా ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. తెలంగాణ అంశంతో పాటు.. కొన్ని ఇతర రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల ప్రభావం కూడా ఈ సమావేశాలపై పడనుంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుపట్టటం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న తీరును, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో ఈ నిర్ణయం రాజేసిన ఆగ్రహజ్వాలలను ఉభయ సభల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తీరుపై సమగ్ర చర్చతో పాటు.. ఇకపై దేశంలో మరే రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమనే విస్పష్ట ప్రకటన కోసం పశ్చిమబెంగాల్లో గూర్ఖాలాండ్ ఉద్యమ సెగను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టబోతోంది. అలాగే త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రతిపక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ బొగ్గు కుంభకోణం, రైల్ గేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అన్ని రంగాల్లో ద్వారాలు తెరవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుంచి సర్కారుపై ముప్పేట దాడి తప్పకపోవచ్చు. ఎఫ్‌డీఐ పెంపును వ్యతిరేకిస్తున్న బీజేపీ... బీమా, పెన్షన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన సంస్కరణల బిల్లులపై సహకరించాలని ప్రతిపక్ష బీజేపీకి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం శనివారం నాడే విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్న ఆర్థిక బిల్లులపై బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హాలతో చిదంబరం చర్చలు జరిపారు. సాధారణ, ఆర్థిక కార్యక్రమాలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని.. అయితే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని వారు సంకేతాలిచ్చారు. పెన్షన్ రంగంలోనూ ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆహార భద్రత బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలమే అయినా తాము ప్రతిపాదించిన అనేక సవరణలను ఆమోదిస్తేనే సహకరిస్తామని ఆదివారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ వ్యూహకర్తల బృందం స్పష్టం చేసింది. రూపాయి విలువ పతనం, ధరల పెరుగుదల, ఆర్ధికాభివృద్ధి మందగించటం నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపాలని సుష్మా డిమాండ్ చేశారు. ఇందుకు సర్కారు సమ్మతించింది. -
రాజకీయ లబ్ధి కోసమే ‘విభజన’: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను చేపట్టిందని, తెలంగాణ సమస్య పరిష్కారంలో ఆ పార్టీ దుర్నీతితో వ్యవహరించిందని బీజేపీ ధ్వజమెత్తింది. ఈ అంశంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహకవర్గం ఆదివారం పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ నివాసంలో భేటీ అయింది. అద్వానీ, పార్టీ జాతీయఅధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎం.వెంకయ్యనాయుడు, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్‌సింగ్, రవిశంకర్ ప్రసాద్, షానవాజ్ హుస్సేన్, గోపీనాథ్ ముండే తదితరులు పాల్గొన్న ఈ భేటీలో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటనను పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణను, ప్రత్యేకించి సీమాంధ్రలో నెలకొన్న అశాంతి పరిస్థితులను చర్చించామన్నారు. ఎన్నికలు తరుణంలో రాజకీయంగా లబ్ధి పొందాలన్న కాంక్షతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఆహార భద్రత బిల్లును ఆమోదించడానికి ముందు తమ పార్టీ సవరణలను కోరుతుందని రవిశంకర్ చెప్పారు. ‘‘ఈ బిల్లుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం. దానిపై మేం చెప్పాల్సింది చాలా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో అమలుచేస్తున్న నమూనా ఉంది. రైతుల ప్రయోజనాలున్నాయి. మేం చాలా సూచనలు, సవరణలు ఇవ్వాల్సి ఉంది’’అని అన్నారు. -
సీఎం రాజీనామా చేయాలి: బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కిరణ్ సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారన్నారు. పార్టీ నాయకుడు దాసరి మల్లేశంతో కలిసి ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని చిరంజీవి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కిరణ్, బొత్స కోరుతూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలు సీమాంధ్ర ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి తాము వ్యతిరేకమన్నారు. -
కేంద్ర ఉద్యోగులకు త్వరలో 10 % డీఏ పెంపు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం సెప్టెంబర్‌లో కరువు భత్యాన్ని (డీఏ) ప్రస్తుతమున్న 80 శాతం నుంచి 90 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 1 నుంచి దీన్ని వర్తింపజేయనుంది. దీనివల్ల సుమారు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 30 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపు 10-11 శాతం మధ్య ఉండొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఏను 72 శాతం నుంచి 80 శాతానికి పెంచింది. దీన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేసింది. 2010 సెప్టెంబర్‌లో చివరిసారిగా డీఏ 10 శాతం పెరిగింది. మరోవైపు డీఏను 90 శాతానికి పెంచడంతోపాటు అందులో 50 శాతాన్ని మూలవేతనంలో కలపాలని కేంద్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య సెక్రటరీ జనరల్ కె.కె.ఎన్. కుట్టీ డిమాండ్ చేశారు. డీఏను మూల వేతనంలో కలపడం వల్ల దాని నిష్పత్తిలో ఉండే ఇతర అలవెన్సులు ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తాయన్నారు. 2011 జనవరి 1 నుంచి జీవన వ్యయం వాస్తవ పెరుగుదల 171 శాతంగా ఉండటం వల్ల ప్రతిపాదిత డీఏ పెంపు వల్ల ఉద్యోగులకు పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థుల వలసబాట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 700కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నా ఇక్కడి లక్షలాది మంది విద్యార్థులు వలసబాట పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే లక్ష మంది ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరినట్లు అనధికారిక సమాచారం. ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యమే విద్యార్థులు వలసబాట పడ్డానికి కారణంగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి తరగతులు కూడా మొదలయ్యాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ఇంతవరకూ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు కూడా ఖరారు కాలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కళాశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. కనీసం అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలు కూడా ఖరారు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని, ప్రణాళికా లోపాన్ని విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలకు వెళితే ఫీజు రీయింబర్స్‌మెంటు భారం తగ్గుతుంది..’ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఎంసెట్ ఫలితాలొచ్చి రెండు నెలలైనా: ఎంసెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రభుత్వం ప్రకటించలేదు. జూన్ మొదటి వారంలో ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో సుమారు రెండన్నర లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. జూలై మొదటి వారంలోనే ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారించిన ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తే గత నెలాఖరుకే కౌన్సెలింగ్ పూర్తయి విద్యార్థులు కళాశాలల్లో చేరేవారు. ఈ నెలలో తరగతులు కూడా ఆరంభించడానికి వీలయ్యేది. అయితే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనందున కౌన్సెలింగ్‌కు సంబంధించిన ప్రకటన జారీలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు మొదటి వారంలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా వాటి అమల్లో ప్రభుత్వం విఫలమైంది. మేనేజ్మెంట్ కోటా సీట్లపైనే వివాదం: ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ఏర్పడిన వివాదం మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాలేజీ యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఇది తేలే వరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ వీలుకాదు. గుణపాఠం నేర్వని సర్కారు: గతేడాది కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా లక్షన్నర మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వలసలు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులు వలసబాట పట్టడం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో సీట్లు మిగిలిపోయి కళాశాలల నిర్వహణ భారంగా మారనుంది. సీట్లు భర్తీ కాని కారణంగా గతేడాది లక్షన్నర సీట్లు మిగిలిపోయాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళితే ఫీజు రీయింబర్స్మెంట్ భారం తగ్గుతుందనే భావంతోనే ప్రభుత్వం కన్వీనరు కోటా సీట్ల భర్తీ కోసం చొరవ తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రాష్ట్ర విభజన జరగదు :మాజీ సీఎం నాదెండ్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది జరిగే పనికాదని, తనకున్న రాజకీయ అనుభవంతో ఈ మాటలు చెబుతున్నానని అన్నారు. విభజన పాపమంతా కాంగ్రెస్‌దేనన్నారు. 1999లో రాష్ట్రాన్ని విభజించాలని ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన పార్టీ కాంగ్రెస్సేనన్నారు. ఇందులో కేసీఆర్‌ను తప్పుపట్టాల్సిన అవసరమే లేదని, జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని చెప్పారు. అందుకే జనం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ ‘‘మీరు రాసిపెట్టుకోండి...రాష్ట్ర విభజన జరగదు. ఇప్పుడు పార్టీ స్థాయిలోనే నిర్ణయం జరిగింది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ప్రజాభిప్రాయాన్ని గ్రహించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా నిర్ణయాలను మార్చుకున్న సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అది రాజనీతిలో భాగమే అవుతుందే తప్ప మరొకటిగా భావించొద్దు’’అని అన్నారు. -
విభజనకు నిరసనగా హరికృష్ణ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని ప్రకటన చేసిన మరుసటిరోజే టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాటమార్చారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాకు ఆదివారం ఉదయం 8.46 గంటలకు ముహూర్తంగా నిర్ణయించుకున్న హరికృష్ణ సరిగ్గా అదే సమయానికి రాజీనామా పత్రాలపై సంతకం చేసి తన తండ్రి ఎన్టీఆర్ సమాధిపై ఉంచారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్దే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ ఆ పత్రాలను రాజ్యసభ చైర్మన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పంపిస్తున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని ఒక ప్రశ్నకు పరోక్షంగా జవాబిచ్చారు. ‘‘అన్నదమ్ములను విడగొట్టేందుకు విషప్రయోగం జరిగింది. ఒక్క గడ్డిపోచ ఏమీ చేయలేదు. అనేక గడ్డిపోచలు కలిస్తేనే బలంగా తయారవుతాయి. సమైక్యతలో ఉన్న మాధుర్యం, గొప్పదనం విడిపోతే ఉండదు. కొందరు స్వార్థపరుల నాటకంలో భాగస్వామ్యం అయ్యాం. సోనియాగాంధీ దుష్టశక్తిగా వచ్చి తన కొడుకును ప్రధానమంత్రి చేసేందుకు అన్నదమ్ములను విడదీశారు. ఢిల్లీ ఏసీ రూముల్లో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకున్నవారు విభజనపై నిర్ణయం తీసుకున్నారు. నీటివాటాలు, ఉద్యోగాలు, రాష్ట్ర అప్పులను ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలంగా నిర్ణయం తీసుకుందని గుర్తు చేయగా.. తన రాజీనామా గురించి మాత్రమే మాట్లాడాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారా? అని ప్రశ్నించగా..‘ఎందుకు పాల్గొనకూడదు?’ అని ఎదురు ప్రశ్నవేశారు. -
డాక్టర్ పోస్టుల భర్తీపై విభజన ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న వైద్యుల పోస్టుల భర్తీ ప్రక్రియకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ నెలాఖరుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల డాక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్న తరుణంలో వెలువడిన రాష్ట్ర విభజన ప్రకటన నియామకాలకు ప్రతిబంధకమైంది. ఇప్పుడు నియామకాలు జరిపితే ఎలాంటి చిక్కులు వస్తాయోనని అధికారులు సందేహిస్తున్నారు. ముఖ్యంగా వైద్యపోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులు. ఉదాహరణకు విశాఖ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు మెరిట్ ప్రకారం హైదరాబాద్‌లో పోస్టింగ్ కోరుకుంటే ఆ నియామకాన్ని తెలంగాణ వైద్యులు ఒప్పుకునే అవకాశం లేదు. దీంతో ఇలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా నియామకాల్నే ఆపేయాలనే యోచనలో అధికారులున్నారు. పోస్టుల నియామకాలపై పక్షంరోజుల క్రితమే సీఎం వద్ద సమీక్ష కూడా జరిగింది. మొత్తం 1,980 వైద్యుల పోస్టులు భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో 560 మంది స్పెషలిస్టు డాక్టర్లు కాగా.. మిగతా వైద్యులందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేవారు. డాక్లర్ల పోస్టులతోపాటు నర్సు పోస్టుల భర్తీ కూడా సం దిగ్ధంలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 12 వేల నర్సు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి జోనల్ పోస్టులు. దీంతో ఈ పోస్టులను భర్తీ చేస్తే లేనిపోని సమస్యలొస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఎంసీఐ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున అదనపు సీట్లను కేటాయించింది. అయితే ఎంబీబీఎస్ సీట్లకు, పేషెంట్ల సంఖ్యకు, పడకల స్థాయికి తగినవిధంగా నర్సులుండాలి. ప్రస్తుతం కళాశాలల్లో కావాల్సిన నిష్పత్తిలో నర్సుల సంఖ్య లేదు. ఇప్పుడు నియామకాలకు బ్రేకులుపడటంతో వైద్య సీట్లను కాపాడుకోవడం కష్టమవుతుంది. సౌకర్యాల కొరత వల్ల ఇటీవల విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలకు 50 సీట్లు కోత వేయడం విదితమే. ఇక నిధుల వినియోగంపైనా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ కళాశాలకు నిధులిచ్చి, మరో కళాశాలకు ఇవ్వకపోతే గొడవలవుతాయేమోనన్న పరిస్థితి నెలకొంది. -
మళ్లీ పుత్తడి కళకళ
గత కొన్నాళ్లుగా మెరుపు కోల్పోయిన బంగారం మళ్లీ తళుక్కుమంటోంది. సమీప కాలంలో పుత్తడి ధరలు మరింత పుంజుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి తీవ్ర పతనం కారణంగా ఆర్బీఐ చేపట్టిన చికిత్స చర్యలే దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) కట్టడి కారణంగా అటు స్టాక్ మార్కెట్, ఇటు బాండ్ మార్కెట్ కూడా ‘బేర్’మంటోంది. దీంతో షేర్లు, బాండ్ల నుంచి ఇన్వెస్టర్లు తమ రూట్‌ను మార్చుకుంటున్నారు. మళ్లీ బంగారంలో పెట్టుబడులకు మక్కువ చూపుతున్నారనేది నిపుణుల అభిప్రాయం. పుత్తడికి ‘పండుగే’... నెల రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ఘోరంగా కుప్పకూలిన బంగారం ధర మళ్లీ శరవేగంగా పుంజుకుంది. ఒకానొక దశలో ఔన్స్ పసిడి 1,120 డాలర్లదాకా పడిపోయి... తిరిగి ప్రస్తుతం 1,310 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను ఈ ఏడాది నుంచే తగ్గించడం మొదలుపెడుతుందనే అంచనాలతో డాలరు బలం పుంజుకొని.. బంగారం పెట్టుబడుల్లో అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. అయితే, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకున్న సంకేతాలు అందాకే ప్యాకేజీల కోత ఉంటుందని ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ ఇచ్చిన వివరణతో బంగారం మళ్లీ కొంత రికవరీ అయింది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర కోలుకుంటోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) గత శుక్రవారం రూ.435 ఎగబాకి రూ.28,665 వద్ద స్థిరపడింది. ఇక ఢిల్లీలో కూడా రూ.28,800కు చేరింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఈ నెలనుంచే మొదలవనుండటం కూడా పసిడికి మళ్లీ గిరాకీ పెరిగేందుకు దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో ధర త్వరలోనే మళ్లీ కీలకమైన రూ.30,000 స్థాయికి చేరడం ఖాయమంటున్నారు బులియన్ డీలర్లు. దేశీ మార్కెట్లో బంగారానికి భారీ డిమాండ్ కొనసాగుతుందని జియోజిత్ కామ్‌ట్రేడ్ హోల్‌టైమ్ డెరైక్టర్ సీపీ కృష్ణన్ అన్నారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం రేటు 1,340 డాలర్ల పైన కొనసాగితే... మళ్లీ 1,500 డాలర్ల స్థాయిని అందుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రూపాయి ఎఫెక్ట్ కూడా... డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం కూడా బంగారం ధరల కదలికపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు ఘోరంగా పడిన సమయంలో రూపాయి బలహీనత కారణంగా దేశీ మార్కెట్లో మరీ అంత వేగంగా దిగజారలేదు. ఇప్పుడు విదేశీ మార్కెట్లో పసిడి జోరందుకుంటుండటం... మరోపక్క, రూపాయి విలువ సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టాలకు జారిపోవడంతో దేశీయంగా బంగారం మెరుపులు మెరిపిస్తోంది. పుత్తడి దిగుమతి కోసం గతంతో పోలిస్తే ఎక్కువ రూపాయిలను చెల్లించాల్సిరావడమే దీనికి కారణం. శుక్రవారం రూపాయి ముగింపులో కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.10) నమోదు చేసింది. గత నెల ఇంట్రాడేలో నమోదైన కనిష్టస్థాయి 61.21కి చేరువైంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి అటు ఆర్బీఐ లిక్విడిటీ కట్టడి చర్యలు, ఇటు ప్రభుత్వం ఎఫ్‌డీఐల ఆకర్షణపై దృష్టిపెట్టినప్పటికీ పెద్దగా ఫలితం చేకూరడంలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో స్టాక్స్, బాండ్ల కంటే ఇప్పుడు బంగారమే మళ్లీ సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారని చెబుతున్నారు. స్టాక్మార్కెట్లకూ రూపాయి సెగ... ‘ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతుండటం... రూపాయి పతనం నేపథ్యంలో బంగారంవైపు దృష్టి పెరుగుతోంది. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే భారతీయులు సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇక పసిడిని మాత్రమే ఎంచుకుంటారు’ అని ఇన్వెస్ట్కేర్ డెరైక్టర్ సమర్ విజయ్ వ్యాఖ్యానించారు. గత వారంలో అంతర్జాతీయ మార్కెట్లు జోరుగానే ఉన్నప్పటికీ.. దేశీ స్టాక్మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. శుక్రవారం సెన్సెక్స్ మరో 154 పాయింట్లు కోల్పోయి 19,164 వద్ద స్థిరపడింది. ఎనిమిది రోజుల్లో ఏకంగా 1,138 పాయింట్లు(5.61%) సెన్సెక్స్ నష్టపోయింది. రూపాయి విలువ అడ్డూఅదుపూలేకుండా కొత్త కనిష్టాలకు పడిపోతుండటమే స్టాక్‌మార్కెట్లను కుదిపేస్తోంది. దీనికి అడ్డుకట్టవేయడం కోసం ఆర్బీఐ తీసుకున్న చర్యలు మార్కెట్లను మరింత దెబ్బతీశాయి. దీనికితోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాల బాటలోనే కొనసాగుతుండటం కూడా షేర్లకు శరాఘాతంగా మారుతోంది. ఎఫ్ఐఐలు స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో మళ్లీ బంగారమే మంచి రాబడులందిస్తుందన్న భరోసాతో ఇన్వెస్టర్లు అటువైపు దృష్టిపెడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ప్రత్యేక డిమాండ్లు అంగీకరిస్తే దేశంలో ఉండే రాష్ట్రాలు 50
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు కేంద్రం ఓకే చెబితే.. భవిష్యత్తులో మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో తెలుసా? కనీసం 50. ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ 20కి పైగా ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు అందాయని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో మణిపూర్‌లో కుకీలాండ్, తమిళనాడులో కొంగునాడు, బెంగాల్లో కామ్తాపుర్, కర్ణాటకలో తుళునాడు, గుజరాత్లో సౌరాష్ట్ర వంటివి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో గుర్ఖాలాండ్, బోడోలాండ్, కర్బీ ఆంగ్లాంగ్, విదర్భ వంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇంకా భోజ్‌పూర్, కోసల, కూర్గ్, కొంకణ్, గారోలాండ్, మిథిలాంచల్, దిమాలాండ్ ప్రతిపాదనలూ ఉన్నాయి. అయితే యూపీ ప్రభుత్వం తప్ప మరే రాష్ట్ర ప్రభుత్వమూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలివ్వలేదు. మిగిలిన ‘ప్రత్యేక’ ప్రతిపాదనలన్నీ వివిధ సంస్థలు లేదా వ్యక్తుల నుంచి వచ్చినవే. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ, కాంగ్రెస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఎక్కడెక్కడ ప్రత్యేక డిమాండ్లు..? యూపీలో నాలుగు రాష్ట్రాలు: యూపీని పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమాంచల్ లేదా హరితప్రదేశ్‌గా విభజించాలనే డిమాండ్ ఉంది. మాయావతి సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపారు. గూర్ఖాలాండ్: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ పరిసర ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ప్రస్తుతం ఊపందుకుంది. బోడోలాండ్, కర్బీ ఆంగ్లాంగ్: పశ్చిమ అస్సాంలో బోడో ప్రాబల్య ప్రాంతాలను కలిపి బోడోలాండ్గా ఏర్పాటు చేయాలని తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. అలాగే అస్సాంలోని స్వతంత్ర ప్రతిపత్తి గల కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా పరిధిలో కర్బీ గిరిజన ప్రజలు నివసించే ప్రాంతాలను కలిపి కర్బీ ఆంగ్లాంగ్ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఊపందుకుంది. బ్రజ్ ప్రదేశ్: యూపీలోని ఆగ్రా, అలీగఢ్ డివిజన్లను, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని భరత్పూర్, గ్వాలియర్ జిల్లాలను కలిపి బ్రజ్ ప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విదర్భ: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. భోజ్‌పూర్: యూపీలోని తూర్పు ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి భోజ్పూర్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది. మిథిలాంచల్: బీహార్, జార్ఖండ్‌లలో మైథిలీ భాష మాట్లాడే ప్రాంతాలను మిథిలాంచల్‌గా ఏర్పాటుచేయాలని అక్కడివారు కోరుతున్నారు. దిమాలాండ్: అస్సాం, నాగాలాండ్‌లలో దిమాసా ప్రజలు నివసించే ప్రాంతాలను వేరుచేసి దిమాలాండ్ లేదా దిమారాజి రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కామ్తాపూర్: పశ్చిమ బెంగాల్లో కూచ్ బేహార్, జల్పాయ్గురిలతోపాటు కొన్ని జిల్లాలను కలిపి కామ్తాపూర్ రాష్ట్రం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కోసల్: ఒడిశాలోని కొన్ని జిల్లాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి కోసల్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు. కుకీలాండ్: మణిపూర్‌లోని కుకీ గిరిజనులు నివసించే ప్రాంతాలను ప్రత్యేక కుకీలాండ్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గారోలాండ్: మేఘాలయలోని గారో ప్రాంతాలను కలిపి గారోలాండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సౌరాష్ట్ర: గుజరాత్ నుంచి సౌరాష్ట్రను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని కూడా కోరుతున్నారు. కొంగునాడు: కర్ణాటకలోని ఆగ్నేయ ప్రాంతం, తమిళనాడులోని నైరుతి ప్రాంతం, కేరళలోని తూర్పు ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కొంగునాడు రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్ వినిపిస్తోంది. కూర్గ్: కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఉంది. తుళునాడు: కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతాన్ని తుళు నాడుగా వేరు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కొంకణ్: పశ్చిమ భారత్‌లో అరేబియా సముద్రం తీరప్రాంతం వెంబడి కొంకణి భాష మాట్లాడే ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కొంకణ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లడఖ్: జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. తూర్పు నాగాలాండ్: పై ప్రత్యేక డిమాండ్లే కాకుండా.. నాగాలాండ్‌ను కొన్ని ప్రాంతాలను వేరుచేసి తూర్పు నాగాలాండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
తలసరి ఆదాయంలో హైదరాబాదే తలమానికం
సాక్షి, హైదరాబాద్: తలసరి ఆదాయమే ప్రజల స్థితిగతులకు, ఆయా ప్రాంతాల అభివృద్ధి తీరుకూ నిదర్శనం. ఈ విషయంలో రాజధాని హైదరాబాద్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరల ఆధారంగా కాకుండా కనీసం 5, 6 ఏళ్ల క్రితం నిర్ధారిత సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుంటే గణాంకాల్లో మరింత స్పష్టత ఉంటుందని, అభివృద్ధిని కచ్చితంగా లెక్కగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా 1999-2000 ఆధారంగా తీసుకొని 2007-08కి లెక్కగట్టిన గణాంకాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.26,310. హైదరాబాద్‌లో దీనికంటే 50 % అధికంగా, అంటే రూ.39,145 నమోదైంది. ప్రాంతాలవారీగా చూస్తే రూ.26,665 తలసరి ఆదాయంతో కోస్తా తొలి స్థానం లో ఉంది. తెలంగాణ తలసరి హైదరాబాద్‌తో కలిపితే రూ.27,000, విడిగా లెక్కిస్తే రూ.25,237 ఉంది. ఇక సీమలో అతి తక్కువగా రూ.23,860 తలసరి ఆదాయం నమోదైంది. 1993-94లో హైదరాబాద్ తలసరి ఆదాయం రాష్ట్ర సరాసరితో దాదాపు సమానంగానే ఉండేది. ప్రాంతాలవారీగా అప్పట్లో తెలంగాణదే ఆఖరు స్థానం. కోస్తా, సీమ తొలి, రెండో స్థానాల్లోనిలిచాయి. తలసరి ఆదాయ వృద్ధిలో ఆఖరున కోస్తా.. 2000-01 నుంచి 2007-08 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎనిమిదేళ్లలో రాష్ట్ర సరాసరి తలసరి ఆదాయం 58 శాతం, హైదరాబాద్‌లో తలసరి ఆదాయం 77 శాతం పెరిగాయి. హైదరాబాద్ ఆదాయాన్ని కలపకుండా తెలంగాణలో తలసరి ఆదాయం 60 శాతం పెరిగితే సీమలో 58 శాతం పెరిగింది. 54 శాతం వృద్ధితో కోస్తా ఆఖరు స్థానంలో నిలిచింది. ఇదీ ప్రామాణిక విధానం.. దేశంలో అభివృద్ధికి కొలమానంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)నే సూచికగా తీసుకుంటారు. జీడీపీకి మూలం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ). జీఎస్డీపీని లెక్కగట్టడానికి జిల్లా స్థూల ఉత్పత్తి (డీడీపీ)ని ఆధారంగా తీసుకుంటారు. డీడీపీ ఆధారంగా జిల్లాలు, ప్రాంతాల ఆర్థికస్థితిని, అభివృద్ధిని అంచనా వేయవచ్చు. డీడీపీ ఆధారంగా తలసరి ఆదాయాన్ని లెక్కించవచ్చు. తలసరి ఆదాయాన్ని బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధి తీరును తెలుసుకోవచ్చు. కాలపరీక్షకు నిలిచిన ఈ విధానాన్నే ఆర్థికాభివృద్ధిని లెక్కగట్టడానికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. -
పోలీస్ బాస్ ఆఫీసెక్కడ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో.. పోలీసుశాఖ ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో సచివాలయం తరువాత పోలీసు ప్రధాన కార్యాలయమే కీలకం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తరువాత మాత్రమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వేర్వేరుగా పోలీసు శాఖలు ఏర్పాటయ్యే అవకాశముంది. అప్పటివరకూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగనుంది. అయితే.. అధికారిక ఉత్తర్వులకు ముందుగానే పోలీసు శాఖలో అందుకు సంబంధించిన పరిశీలన అనధికారికంగా సాగుతోంది. హైదరాబాద్ పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకూ రాజధానిగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కార్యాలయాలను ఇక్కడే కొనసాగించే అవకాశముంది. కానీ, వాటిని వేర్వేరు చోట్ల ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం పోలీసు ప్రధాన కార్యాలయం కొనసాగుతున్న భవనాలు తెలంగాణ రాష్ట్ర డీజీపీకే కేటాయించే అవకాశం ఉంది. లక్డీకాపూల్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఇంటెలిజెన్స్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంగా కేటాయించే అవకాశాలున్నాయి. అదే ప్రాంగణంలో ఎస్ఐబీ కోసం కొత్త భవనాల నిర్మాణం కూడా మొదలైంది. దీంతో అక్కడ డీజీపీ కార్యాలయం ఏర్పాటు సులభమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే నూతనంగా నిర్మించిన రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) కార్యాలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ఆ భవనం పక్కనే ఉన్న హైదరాబాద్ రీజియన్ ఐజీ కార్యాలయాన్ని కూడా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఐపీఎస్‌ల కేటాయింపు.. రెండు రాష్ట్రాల పోలీసు శాఖలకు ఐపీఎస్‌ల కేటాయింపు ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో 180 మంది డెరైక్ట్ ఐపీఎస్‌లు, 30 మంది పదోన్నతి పొందిన ఐపీఎస్‌లు ఉన్నారు. మొత్తంగా కేంద్రం కేటాయించిన 258 పోస్టుల్లో వంద నుంచి 120 వరకూ తెలంగాణకు కేటాయించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఐపీఎస్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాడర్లకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారనే అంశంపై చర్చ సాగుతోంది. ఐపీఎస్‌కు ఎంపికైన సమయంలో వారు ఇచ్చిన స్థానికతకు అనుగుణంగా మొదట వేరుచేయనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో పుట్టినవారిని తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినవారిని ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్‌లను రెండింటిలో ఏ రాష్ట్రానికి వెళతారనే అభిప్రాయం కోరే అవకాశం ఉంది. ఏదో ఒక రాష్ట్రం వైపే ఎక్కువమంది మొగ్గుచూపితే.. రోస్టర్ పద్ధతిలో వారిని కేంద్ర హోంశాఖే కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏ విధానాన్ని అనుసరిస్తారనేదానిని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుందని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రస్తుతం ఎక్కువ మంది సీనియర్ ఐపీఎస్‌లు హైదరాబాద్‌లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణకు 120 మంది ఐపీఎస్‌లు.. తెలంగాణ రాష్ట్రానికి వంద నుంచి 120 మంది వరకూ ఐపీఎస్‌లు అవసరమవుతారని అధికారుల అంచనా. ఐపీఎస్ నియామకం సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన డెరైక్ట్ ఐపీఎస్‌లు పదిమందిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, విశాఖపట్నం సీపీ బి.శివధర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి(డీఐజీ) ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ప్రకాశ్‌రెడ్డి, నవీన్‌కుమార్ తదితరులున్నారు. వీరితో పాటు.. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఇతర ప్రాంతాలకు చెందిన వారిలో సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్ జనరల్ అరుణా బహుగుణ, తేజ్‌దీప్‌కౌర్ మీనన్, అవినాష్ మహంతి ఉన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఐపీఎస్‌కు ఎంపికైన వారిని కూడా తెలంగాణ ప్రాంతం వారిగానే పరిగణిస్తారు. -
హైదరాబాద్ సదస్సుపై మోడీ వేగుల ఆరా!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ రథసారథి నరేంద్రమోడీ ఈనెల 11వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన సదస్సు తీరుతెన్నులపై ఆయన వేగులు ఆరా తీస్తున్నారు. ‘ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ’ పేరుతో కొందరు ఐటీ నిపుణులు హైదరాబాద్‌లో వివిధ వర్గాలను కలిసి సమాచారాన్ని సేకరిస్తున్నారు. బీజేపీ జాతీయ కోశాధికారి పీయూష్ గోయల్ ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన బాధ్యుడు రాజేష్‌జైన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం కన్వీనర్ కిరణ్, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డిని ఆది వారం కలిసి ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సామాజిక మీడియాలో సంధించే ప్రశ్నలకు నరేంద్ర మోడీ జవాబు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. హైదరాబాద్‌లో మోడీ సదస్సుకు ఇప్పటివరకు రెండు లక్షల ప్రతినిధి కార్డులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోనే 50 వేల కార్డులను యువతకు జారీ చేశారు. మోడీ పర్యటన ఇలా..: వచ్చే ఆదివారం(11వ తేదీ) మధ్యాహ్నం జరిగే సదస్సులో పాల్గొనేందుకు మోడీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు యువ పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కేశవ్ మోమోరియల్ స్కూల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భోజనానంతరం 3 గంటలకు ఎల్బీ స్టేడియం లో సభలో పాల్గొంటారు. తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో ప్రత్యేకంగా భేటీ అయి, రాత్రి 8.30 గంటలకు అహ్మదాబాద్ వెళతారు. కాగా.. టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి భూంరావ్ ఈనెల 8న బీజేపీలో చేరనున్నారు. ఆయన మోడీ సమక్షంలో చేరాలనుకున్నా అందుకు పార్టీ నేతల అనుమతి దొరకలేదు. -
పరిశోధనల్లో ప్రైవేటుకూ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో శాస్త్ర పరిశోధనలకు మరింత ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతం నిధులను పరిశోధనలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నామని, పరిశోధనల్లో ప్రైవే టు రంగానికీ భాగస్వామ్యం కల్పించేందుకు పలు పథకాలను రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 70వ వార్షికోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన జైపాల్‌రెడ్డి ప్రసంగిస్తూ... శాస్త్రీయ దృక్పథం కేవలం పరిశోధన శాలలకే పరిమితం కారాదని, సామాన్యుడి జీవితంలోని అన్ని పార్శ్వాలనూ స్పృశించాలని ఆకాంక్షించారు. ఐఐసీటీ తన పరిశోధనల ద్వారా సామాన్యుడికి చేరువయ్యే యత్నం చేస్తూనే ఉందని కొనియాడారు. ఓజోన్ పొర విచ్ఛిన్నాన్ని తగ్గించే ‘హెచ్ఎఫ్సీ 134’ రసాయనాన్ని అభివృద్ధి చేసినా, లీటర్‌కు ఏడు పైసల వ్యయంతోనే మంచినీరు అందించే మెంబ్రైన్ సాంకేతికతను సిద్ధం చేసినా, కేన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులకు చవకైన చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. అదంతా ఐఐసీటీకే చెల్లిందని ప్రశంసించారు. సీఎస్ఐఆర్ పరిశోధనశాలలు అభివృద్ధి చేసిన, చేస్తున్న టెక్నాలజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తోడ్పడుతుందని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ సంచాలకులు లక్ష్మీకాంతం, శాస్త్రవేత్తలు అహ్మద్ కమాల్, ఆర్.బి.ఎన్.ప్రసాద్, సంస్థ మాజీ సంచాలకులు పుష్పా ఎం.భార్గవ, కె.వి.రాఘవన్ తదితరులు హాజరయ్యారు. కేన్సర్ పరిశోధనలకు ప్రత్యేక కేంద్రం: ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల్లో భాగంగా సంస్థ ఆవరణలో ఏర్పాటుకానున్న మూడు కొత్త విభాగాలను జైపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. కేన్సర్ చికిత్సకు ఉపయోగపడే సరికొత్త రసాయన మూలకాలను గుర్తించేందుకు కేన్సర్ థెరప్యూటిక్ రీసెర్చ్ సెంటర్ అందులో ఒకటి. దాంతోపాటు.. వ్యాధికారక కీటకాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు, తద్వారా సాంక్రమిక వ్యాధులను నియంత్రించేందుకు ఐఐసీటీ ‘మెటిరిలాజికల్ టవర్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ ఆన్ వెక్టార్ కంట్రోల్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. సామాన్యుడి కోసం కృషిచేస్తాం.. ‘‘పర్యావరణ అనుకూల ఇంధన వనరుల అభివృద్ధి, వేర్వేరు వ్యాధుల చికిత్సకు అవసరమైన మందుల ధరలను అందరికీ అందుబాటులోకి తేవడం, రసాయన పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించి వాటిని సుస్థిర అభివృద్ధి వైపు నడిపించడం ప్రస్తుతం మా ముందున్న లక్ష్యాలు, వీటితోపాటు అత్యాధునిక పదార్థాల అభివృద్ధి, వ్యవసాయ సంబంధిత పరిశోధనలూ కొనసాగిస్తాం. సామాన్యుడికి అవసరమైన పరిశోధనలు చేసేందుకు పునరంకితమవుతాము’’ - లక్ష్మీకాంతం, ఐఐసీటీ హైదరాబాద్ సంచాలకులు -
నేడు నగరానికి షర్మిల
సాక్షి, సిటీబ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కును నిరసిస్తూ.. తొమ్మిది నెలల పాటు పద్నాలుగు జిల్లాల మీదుగా 3112 కి.మీ. మేర సాగిన పాదయాత్రను ఆదివారం సాయంత్రం ఇచ్ఛాపురంలో ముగించిన జగనన్న సోదరి వైఎస్ షర్మిల.. సోమవారం ఉదయం నగరానికి చేరుకోనున్నారు. ఆమె ఉదయం పది గంటలకు విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుని తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను ఆమె నేరుగా జగన్మోహన్రెడ్డికి వివరించనున్నారు. భారీ స్వాగత సన్నాహం ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కి.మీ.ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ నగర పార్టీ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, యువజన విభాగం అధ్యక్షులు పుత్తా ప్రతాప్‌రెడ్డిలు తెలిపారు. తరలిరండి: జనార్దన్‌రెడ్డి సోమవారం నగరానికి చేరుకోనున్న షర్మిలకు దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అత్తాపూర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విమానాశ్రయం నుంచి చంచల్‌గూడ జైలు వరకు షర్మిలకు అడుగడుగునా స్వాగ తం పలికే కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. -
'ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ కోసమే చెన్నై ఎక్స్ ప్రెస్'
'చెన్నై ఎక్స్ ప్రెస్' ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రం అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్య పరిస్థితి సహకరించకున్నా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజిబిజీగా ఉన్నారు. ఓం శాంతి ఓం చిత్రం తర్వాత దీపికా పదుకోనే, షారుఖ్ లను కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం ఆగస్టు 9 తేదిన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీవానా, డర్, బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాల్లాగే అటు ఫ్యామిలీ, ఇటు మాస్ అభిమానులను చెన్నై ఎక్స్ ప్రెస్ ఆకట్టుకుంటుందని షారుఖ్ ధీమా వ్యక్తం చేశాడు. గత పదేళ్లుగా రోహిత్ శెట్టి చిత్రాలను నిర్మించడంతోపాటు గోల్ మాల్ చిత్రంతో విజయాన్ని సాధించాడని.. ఇక చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత సూపర్ హిట్ అందించిన దర్శకుల జాబితాలో ఆయన చేరడం ఖాయమన్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కామెడీ, డ్రామా, రొమాన్స్ , యాక్షన్ తోపాటు అన్ని రకాల వెరైటీలతో రోహిత్ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని అందించాడని షారుఖ్ అభినందించాడు. ఇటీవల భుజానికి గాయం కారణంగా చేయించుకున్న సర్జరీని లెక్క చేయకుండా షారుఖ్... శెట్టి, దీపికా పదుకోనెలతో కలిసి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
ఉండవల్లి, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు
రాజమండ్రి: జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యతిరేకంగా సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో సమైక్య వాదులు గందర గోళ సృష్టించారు. సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను పెట్టాలని ఆందోళన కారులు నిరసనకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. జై సమైక్యాంధ్రా నినాదంతో ఆ ప్రాంతమంతా హోరుత్తెంది. ఈ సదస్సులో సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రా కోరుతూ నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఐదు రోజులుగా చేస్తున్న సమైక్యాంధ్ర హోరు ఉధృతమైంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి. -
భారత జట్టును అభినందించిన దాల్మియా!
జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ లో ఘన విజయాన్ని దక్కించుకున్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ప్రశంసలతో ముంచెత్తారు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ ను 5-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. 'విదేశీ గడ్డపై క్లీన్ స్పీప్ చేసిన భారత జట్టుకు నా శుభాకాంక్షలు. యువకులతో కూడిన భారత జట్టు విశ్వాసాన్ని నింపింది. పట్టుదలతో ఆడింది' అని దాల్మియా ఓ ప్రకటనలో తెలిపారు. బులవాయోలో జరిగిన ఐదవ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో 5-0 తేడాతో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే జట్టుపై విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో భారత జట్టు నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది. -
కిరణ్, బొత్స పథకం ప్రకారమే ఉద్యమం: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల పథకం ప్రకారమే సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు విమర్శించారు. సీమాంధ్ర ప్రజల అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వారు పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణకే కట్టుబడి ఉన్నారని వారు స్సష్టం చేశారు. సీమాంధ్రుల హక్కుల కోసమే తమ పార్టీ నేతల రాజీనామాలు చేశారని వివరణ ఇచ్చారు. రెచ్చగొట్టే ధోరణి సరికాదని, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని వారు హితవు పలికారు.