Latest News
-
శ్రీలంక విజయలక్ష్యం 146
హాంబన్‌టోటా: శ్రీలంకతో జరుగుతున్న రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు డేవిడ్స్ (7), కాక్ (19) పరుగులకే పెవిలియన్ కు చేరగా, అనంతరం ప్లెస్సీ(12) పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో సఫారీలు కష్టాలు కొనితెచ్చుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో డుమినీ(30), మిల్లర్(36) స్కోరు బోర్డును చక్కదిద్దే యత్నం చేశారు. దీంతో సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. లంక బౌలర్లలో సేననాయకే, కులశేఖరలకు తలో రెండు వికెట్లు లభించగా, మలింగాలకు ఒక వికెట్టు దక్కింది. ఇప్పటికే తొలి ట్వంటీ -20 గెలిచి మంచి ఊపు మీద ఉన్న సఫారీలు ఈ మ్యాచ్‌ను కూడా గెలిస్తే సిరీస్‌ను చేజిక్కించుకుంటారు. ఇరుజట్ల మధ్య మూడో ట్వంటీ 20 మ్యాచ్ మంగళవారం జరగనుంది. -
'మారియన్'పై తెలుగు నిర్మాతల కన్ను
హైదరాబాద్: భారత్ బాల దర్శకత్వంలో ధనుష్ -పార్వతీమీనన్ నటించిన తమిళ చిత్రం 'మారియన్'పై టాలీవుడ్ చిత్ర నిర్మాతల కన్నుపడింది. గత నెల 19న విడుదలైన ఈ చిత్రంకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్ల కనక వర్షం కురిపించిందని కోలీవుడ్ సమాచారం. వేణు రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ అద్భుతంగా నటించాడని అభిమానులు పొంగిపోతున్నారు. ఈ చిత్రం చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటనను మెచ్చుకున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించారు. తమిళంలో హిట్టు కొట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచనతో ఓ పెద్ద నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారా లేక డబ్బింగ్ చేస్తారా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది. -
హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి మృతి
హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి (83) ఆదివారం మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైకోర్టులో పలు కీలక కేసులను ఆయన వాదించారు. పద్మనాభరెడ్డి క్రిమినల్ న్యాయశాస్త్రంలో నిష్ణాడుతుడిగా పేరు గడించాడు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన న్యాయ సేవలందించారు. ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం హైకోర్టుకు జడ్జిగా వ్యవరిస్తున్నారు. -
రేపు కడప దిగ్బంధనం
వైఎస్ఆర్ జిల్లా: సమైక్యాంధ్రా నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా, కడప పట్టణాన్ని సోమవారం దిగ్బంధిస్తున్నట్లు సీమాంధ్ర ఆందోళన కారులు హెచ్చరించారు. రోడ్డుపైనే వంటా వార్పూ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజక కేంద్రాల్లోనూ ఆందోళనలు దిగనున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో కూడా నిరసనల హోరు ఉధృతమైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురంలో ఎస్కే యూనివర్శిటీలోని అధ్యాపక బృందం తమ కుటుంబసభ్యులతో ఆదివారం యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేయనుంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి. -
మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎన్జీవోలు
విజయవాడ: సమైక్యాంధ్రా సెగ అంతకంతకూ రాజుకోంటుంది. ఏపీఎన్జీవోలు మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. సీమాంధ్రాలో ఉన్న ప్రజా ప్రతినిధులు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు సమర్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ లోపు రాజీనామాలు చేయకుంటే రాష్ట్రంలో పాలన స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా సీమాంధ్ర జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రా ప్రభుత్వానికి వెళ్లిపోవాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలు నేపథ్యంలో ఏపీఎన్జీవోలు విధులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. ప్రస్తుతం తాము చేపట్టిన నిరసన కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని వారు తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను కూడా బహిష్కరిస్తామన్నారు. ఆగస్టు 12వ తేదీ తరువాత హైదరాబాద్‌లో సమైక్య సభ ఉంటుందని వారు తెలిపారు. మంత్రులకు పదవులు కావాలో, ప్రజలు కావాలో తేల్చుకోవాలని ఏపీఎన్జీవోలు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే తప్ప..తమకు వేరే ఆప్షన్లు వద్దని హెచ్చరించారు. హైదరబాద్ మహా నగరం రాష్ట్రంలో అంతర్భాగమన్నారు. నిర్ణయం జరిగిపోయింది..సర్దుకు పొమ్మంటే కుదరదన్నారు. రెండు రోజుల్లో సీఎస్‌కు సమ్మె నోటీసు అందజేస్తామని వారు తెలిపారు. -
మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభ: జనసంద్రమైన ఇచ్చాపురం
ఇచ్చాపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన భారీ బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇచ్చాపురం జనసంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే జనం. మేడలు, మిద్దెలు ఎక్కి జనం షర్మిల ప్రసంగం విన్నారు. షర్మిల తన ప్రసంగంలో ఒక్క మనిషి వెళ్లిపోతే ఆంధ్రరాష్ట్రమే అతలాకుతలమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ బతికుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేది కాదని ప్రజల నమ్మకం అని చెప్పారు. ఇది విజయయాత్ర కాదని, నిరసన యాత్రని ఆమె తెలిపారు. ప్రభుత్వ పనితీరును, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్న తీరును వివరించారు. ఉద్యోగులను కేసీఆర్ వెళ్లిపోవాలంటున్నారంటే అర్థమేంటి? అని ప్రశ్నించారు. విభజన నిర్ణయంపై చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. అంతవరకు ప్రజల తరఫున వైఎస్ఆర్సిపి ప్రజల తరపున పోరాడుతుందని చెప్పారు. సీఎం, బొత్స, కేంద్రమంత్రులు ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఈ సమయంలో ప్రజల తరఫున నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఎందరు కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు? అని ప్రశ్నించారు. ప్రజల కన్నా పదవులే ముఖ్యమని కాంగ్రెస్, టీడీపీ నాయకులు నిరూపించుకున్నారన్నారు. తెలుగు ప్రజల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా జగన్మోహన్రెడ్డి ఊరుకోరని చెప్పారు. న్యాయం చేసే సత్తా కాంగ్రెస్‌కు లేకపోతే విభజన చేసే అధికారం కూడా ఆ పార్టీకి లేదన్నారు. ఆమె ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. 3వేల కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేసిన చరిత్ర సృష్టించిన షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, చుట్టు పక్కల గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభించారు. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా షర్మిల ఇచ్చాపురం చేరుకున్నారు. ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్ ప్రజాప్రస్థాన స్థూపం వద్ద వైఎస్ఆర్కు ఘన నివాళుర్పించారు. ఆ తరువాత మరో ప్రజాప్రస్థానం విజయస్థూపంను ఆవిష్కరించారు. -
ఫాలో ఆన్ తప్పించుకున్న ఇంగ్లండ్
మాంచెస్టర్: యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ ఫాలో ఆన్ తప్పించుకుంది. ఓల్ట్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 139 ఓవర్లలో 368 పరుగులు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో 70 పరుగులు చేసింది. కెవిన్ పీటర్సన్(113) చలవతో ఇంగ్లండ్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. చక్కటి షాట్లతో అభిమానులను అలరించిన కేపీ, స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్ కట్ ద్వారా... 165 బంతుల్లో టెస్టుల్లో తన 23వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (25) తర్వాతి స్థానంలో పీటర్సన్ నిలిచాడు. అతనికి బెల్ (60) పరుగులతో తోడ్పడటంతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ తప్పించుకుంది. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ వికెట్టు నష్టానికి 24 పరుగులతో ఆడుతోంది. అంతకు ముందు ఆస్ట్రేలియా ఏడు వికెట్లు నష్టానికి 527 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. -
వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజాప్రస్థానం: షర్మిల
ఇచ్చాపురం: వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగిందని వైఎస్.జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల తెలిపారు. ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. జగన్ వదిలిన బాణం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం చేరుకుందన్నారు. కాంగ్రెస్-టీడీపీ కలిసి చేస్తున్న ద్రోహం ఇక సాగదని చెప్పేందుకు చేసిన యాత్ర ఇదని షర్మిల తెలిపారు. ఆ మనసున్న మా రాజు రాజన్న ఇక లేడని తెలిసి కోట్లాది గుండెలు అల్లాడిపోయాయని, వందల గుండెలు బద్దలయ్యాయని షర్మిల అన్నారు. ఇది విజయయాత్ర కాదని, జగనన్నను జైలుకు పంపించినందుకు నిరసనగా 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ‘జగనన్న విడుదలను ఆపడం కాంగ్రెస్-టీడీపీల తరం కాదని, ఒక్కడినే లక్ష్యంగా చేసుకుని వంద మంది కుట్రలు పన్నారని’ షర్మిల తెలిపారు. జగనన్న జననేతగా ఎదుగుతుంటే కాంగ్రెస్-టీడీపీల్లో వణుకు పుట్టిందన్నారు. జగన్ జైలుకు ఎలా ఎళ్లారన్నది ఎవ్వరికీ తెలియని అంశంగానే మిగిలిందన్నారు. ‘ 230 రోజులు, 3 వేల కిలో మీటర్లు ఆయా ప్రాంతాలు, ఆయా జిల్లాలో మాతో పదం కలిపాయన్నారు. పజలిచ్చే విజయమే జగన్‌ను నిర్దోషిగా బయటకు తెస్తుందని’ షర్మిల తెలిపారు. ఒక్క మనిషి వెళ్లిపోతే ఆంధ్రరాష్ట్రమే అతలాకుతలమైపోయిందని , వైఎస్ బతికుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేది కాదన్నారు. బతికున్నంత కాలం వైఎస్‌ను కాంగ్రెస్ పొగిడి, చనిపోయాక అభాండాలు వేశాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మీద రాళ్లు వేసిందని, వేధించిందని.. వైఎస్ తర్వాత ప్రజలకు కాంగ్రెస్ వాళ్లు ఏం చేశామని చెబుతారని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యవసాయాన్ని దండగ చేసి బాబు పాలన తెచ్చామని చెబుతారా?, ఉపాధిహామీ పేరిట ప్రజల శ్రమ దోపిడీ చేశామని చెబుతారా?, రూ. 32 వేల కోట్ల విద్యుత్ సర్ఛార్జ్ వేశామని చెబుతారా?, 8 గంటల విద్యుత్, 30 కిలోల బియ్యం హామీ నిలబెట్టుకోలేకపోయామని చెబుతారా?, 108, 104లను నిర్వీర్యం చేశామని చెబుతారా?, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక మోసం చేశామని చెబుతారా? వైఎస్ రెక్కల కష్టంపై అధికారంలోకొచ్చి ఆయన పథకాలను ఎత్తేశామని చెబుతారా?, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక మోసం చేశామని చెబుతారా?, వైఎస్ రెక్కల కష్టంపై అధికారంలోకొచ్చి ఆయన పథకాలను ఎత్తేశామని చెబుతారా? అని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతోందని షర్మిల విమర్శించారు. కింది భాగం వారికి సాగు, తాగు నీరు ఉండదని తెలిసీ విభజన చేస్తోందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీళ్లెక్కడి నుంచొస్తాయని ఆమె ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సముద్రం నీరు తప్ప మంచి నీళ్లు లేవన్నారు. సీమాంధ్ర ఇక సహారా ఎడారి అవుతుందని విడగొడుతున్నారా? అని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై షర్మిల మండిపడ్డారు. ఆంధ్రా ఉద్యోగులను వెళ్లిపోవాలంటున్నారంటే అర్థమేమిటన్నారు. హైదరాబాద్ లో బతకడం అంటే పాకిస్థాన్ లోబతికినట్లేనని కేసీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రులకు భాగం లేదా? అని షర్మిల విమర్శించారు. విభజన నిర్ణయంపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని, అంతవరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాడుతుందన్నారు. : సీఎం, బొత్స, కేంద్రమంత్రులు ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని, ఈ సమయంలో ప్రజల తరఫున నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామా చేసి ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. ప్రజల కన్నా పదవులే ముఖ్యమని కాంగ్రెస్, టీడీపీ నాయకులు నిరూపించుకున్నారని ఆమె ఎద్దెవా చేశారు. -
ప్రజలతో మా అనుబంధం పెరిగింది: విజయమ్మ
శ్రీకాకుళం: ప్రజలతో తమ అనుబంధం పెరిగిందని ని వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఉద్ఘాటించారు. ప్రజలకు తోడునీడగా తమ కుటుంబం ఉంటుందన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఇచ్చాపురం ముగింపు సభకు హాజరైన విజయమ్మ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల చల్లని దీవెనలను షర్మిల కోరుతోందని ఆమె తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి , జగన్మోహనరెడ్డిల పాదయాత్రను ప్రజలు ఆదరించారని, ఇప్పుడు షర్మిల మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను కూడా ప్రజలు అక్కున చేర్చుకున్నారని విజయమ్మ తెలిపారు. షర్మిల పాదయాత్రతో తమ అనుబంధం పెరిగిందన్నారు. రికార్డుల కోసం చేసిన యాత్ర కాదని.. మంచి రోజులు వస్తాయని ప్రజలకు భరోసా కల్పించే యాత్ర,కాంగ్రెస్-టీడీపీ పార్టీలు కుతంత్రాలను ఎండగట్టడానికి చేసిన యాత్ర, జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్న కుట్రలపై నిరసనగా చేసిన యాత్రని విజయమ్మ తెలిపారు. ఓ దశలో ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైయ్యారు. ‘బిడ్డను వైఎస్ఆర్ అపురూపంగా పెంచకున్నారని, అన్నకు ఇచ్చిన మాటకు నిలబడి కష్టాలను ఓర్చుకుంటూ యాత్రను పూర్తి చేసిందన్నారు. గత రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఘట్టాలను ఆమె గుర్తు చేసుకున్నారు. షర్మిలను పులి బిడ్డ అంటుంటే కష్టాలను మర్చిపోయానన్నారు. వైఎస్ అనే ఒక పదం ఈ రాష్ట్రాన్ని మలుపు తిప్పిందని, వైఎస్ అనే పదం రాజకీయాలకు కొత్త అర్ధం చెప్పిందని, వైఎస్ అనే పదం రైతులు గర్వంగా తలెత్తుకునేలా చేసిందని, వైఎస్ అనే పదం బీసీ, ఎస్సీ, మైనార్టీలను రుణ విముక్తులను చేసిందని విజయమ్మ తెలిపారు. జగన్‌ను ప్రజలు దగ్గరగా రాకుండా ఏ జైలు గోడలు అడ్డుకోలేవని ఆమె ఆన్నారు. ఈ ప్రజాభిమానం చూస్తుంటే ప్రభుత్వానికి, ప్రతి పక్షానికి కాలం దగ్గర పడినట్లేనన్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: శరద్‌పవార్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయకుడదని నిర్ణయించుకున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరత్ పవార్ వెల్లడించారు. ఇంకా ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఎలా ఉంటాను అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సీఎన్ఎన్-ఐబీఎన్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నారా అని ఆ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు శరత్ పవార్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుడదని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయితే రాజ్యసభకు వెళ్లవచ్చు అని ఆయన ఈ సందర్భంగా చమత్కరించారు. అది ఒక్కటే ఉన్న ఎకైక మార్గమని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నిడివి లేకుండా పార్లమెంట్ లేదా లోక్‌సభ సభ్యునిగా 46 ఏళ్లుగా కొనసాగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన మంత్రి పదవి రేసులో ఎందుకు లేరు అన్న ప్రశ్నకు శరద్‌పవార్ స్పందిస్తూ... సమాజంలో అన్ని వర్గాల నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే వారితో మంచి స్నేహం కూడా ఉందని ఆయన చెప్పారు. ఆ అత్యున్నత పదవిని ఆశించడం లేదన్నారు. తాను వాస్తవిక రాజకీయవాదినని శరద్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 1967లో మహారాష్ట అసెంబ్లీకి సభ్యునిగా ఎన్నికై శరద్‌పవార్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే కేంద్రంలో రక్షణ, ఆహార మంత్రిత్వశాఖలను నిర్వహించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ సర్కార్‌లో ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుల్లో శరద్ పవార్ ఒకరు. అయితే 1991లో రాజీవ్‌గాంధీ హత్యానంతరం ఆయన ప్రధాన పదవికి రేసులో ఉన్నారు. అయితే ఆ పదవి పీ.వీ.నరసింహరావును వరించింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ క్రమంలో మాజీ లోక్‌సభ స్పీకర్ పీ.ఏ.సంగ్మా, తారీఖ్ అన్వర్లతో కలసి ఎన్సీపీని స్థాపించారు. 1999లో కాంగ్రెస్‌పార్టీ,ఎన్సీపీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. -
రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి
ఇచ్చాపురం: రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా తన లోక్‌సభ సభ్యత్వానికి రేపే రాజీనామా చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుంరలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విభజనకు అనుసరించే పద్దతికి నిరసన తెలుపుతూ లోక్‌సభ స్పీకర్‌కు రేపు రాజీనామా లేఖను పంపుతానని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు నిబద్ధత ఉందని చెప్పారు. ఇప్పటికే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ హడావుడిగా నిర్ణయం తీసుకోవడం, హైదరాబాద్ విషయంలో అనుసరించే విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. -
కాంగ్రెస్ నేతల మధ్య బాహాబాహి
కాకినాడ: పట్టణంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు అనుచురుడు అచ్యుతరామయ్యపై రూరల్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ దాడికి పాల్పడ్డారు. ఇరువురు కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కాస్తా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గత నాలుగు రోజుల కిందట పంతం గాంధీమోహన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు తాళం వేయడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వేసిన తాళంను రెండు రోజుల కిందట కి అచ్చుతరామయ్య పగులగొట్టారు. ఈ ఘటనపై గుర్రుగా ఉన్న పంతం గాంధీ మోహన్ అవకాశం కోసం వేచి చూసి అతనిపై దాడికి దిగాడు. ఆదివారం కాపు సంఘం సమావేశం జరుగుతుండగా అచ్చుతురామయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న అనంతరం పంతం గాంధీ మోహన్ అచ్చతురామయ్యపై చేయి చేసుకున్నాడు. దీంతో జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో పలువురు కాంగ్రెస్ నేతల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి -
చంద్రబాబు పాదయాత్ర.. పాతాళ యాత్ర
శ్రీకాకుళం:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర పాతాళయాత్రగా మారిపోయిందని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భంగపాటు తప్పదన్నారు. సోనియా గాంధీ ఓడిపోయి జగన్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. కాగా, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. షర్మిల పాదయాత్ర రికార్డు సాధించడం కోసం కాదని.. ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆమె పాదయాత్ర చేపట్టిందని తెలిపారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని పాలకపక్షం, ప్రజల తరపున నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కైయాయని ఆయన చురకలంటించారు. టీడీపీ ప్రజల పక్షం నిలబడటం మాని..అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని ఆయన విమర్శించారు. -
చరిత్ర పుటల్లో నిలిచిపోనున్న షర్మిల పాదయాత్ర: జూపూడి
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. పాదయాత్ర నేటితో ముగియనున్న సందర్భంగా ఆ పార్టీ నేతలందరూ ఇచ్చాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ ప్రజల కోసం షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారన్నారు. కష్టాల్లో ఉన్న జగన్‌ను ఆదరిస్తున్న ప్రజల అభిమానం చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజన చేసి కేంద్రం చారిత్రక తప్పిదం చేసిందని జూపూడి అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయన్నారు. ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు కార్యకర్తలు ఇచ్చాపురం చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. షర్మిల 9 నెలల్లో 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాల మీదుగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ రాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డు సృష్టించారు. -
కొత్త రాష్ట్రాల డిమాండ్లు పెరిగాయి: కేంద్ర హోం శాఖ
కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలంటూ దేశావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లు పెరిగాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయా డిమాండ్లకు సానుకులంగా స్పందిస్తే భారత్‌లో మరో 20కి పైగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారత్‌లో రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని పేర్కొంది. ఇప్పటికే మణిపూర్‌లో కూకీలాండ్, తమిళనాడులో కొంగునాడు, కర్ణాటకలో తుళునాడు, ఉత్తర బెంగాల్లో కామత్పూర్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు చేస్తున్నాయని చెప్పింది. అయితే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా... అవధి ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, పశ్చిమాంచల్గా విభజించాలని ఆ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్న సంగతిని ఈ సందర్బంగా కేంద్రహో మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. వీటితోపాటు ఉత్తరప్రదేశ్‌లోని అగ్రా డివిజన్, రాజస్థాన్‌లోని భరత్పూర్, గ్వాలియర్లను కలపి బ్రజ్ ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలపి ఓ రాష్ట ఏర్పాటు చేయాలంటూ పలు సంఘాలు, సంస్థలు తమకు వినతి పత్రాలు అందజేశాయని తెలిపింది. అలాగే మహారాష్టలో విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గత ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతిని ప్రస్తావించింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. దాంతో తమకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ దేశంలోని అసోం, డార్జిలీంగ్ తదితర ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. కాగా విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మహారాష్టలోని అమరావతి జిల్లా పరిషత్ ఆదివారం తీర్మానం చేయడం గమనార్హం. -
ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాల్లో 'ప్రత్యేక' హింస
ఈశాన్య, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రత్యేక హింస రగులుతూనే ఉంది. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా శనివారం నుంచి ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది. డార్జిలింగ్, కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. రామమ్-రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు. మరోవైపు... అసోంలో ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. దిపు-దోల్డోలి స్టేషన్ల మధ్య పట్టాలను తొలగించడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రత్యేక బోడోలాండ్ ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అసోంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. -
'వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు'
హైదరాబాద్: ముందుముందు రాష్ట్రం మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని విశాలాంధ్ర మహాసభలో ప్రసంగించిన వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న విశాలాంధ్ర మహాసభలో పలువురు మాట్లాడుతూ వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదన్నారు. వేర్పాటు వాదాన్ని తిప్పి కొడతామని శపధం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. సమైక్యరాష్ట్రం కోరుకునే వారి సంఖ్య ఇక్కడ కూడా ఎక్కువగానే వుందని తెలిపారు. తెలంగాణలోని ప్రజలందరూ ప్రత్యేకవాదులు కాదని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఏ త్యాగానికైనా తాము సిద్దమని ప్రతిన బూనారు. రాష్ట్ర విభజన ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల్లోని సమైక్య గళం వినిపించే నాయకులు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర విభజనకు ఒప్పుకునేదిలేదని స్పష్టం చేశారు. -
ప్రత్యేక 'విదర్భ'పై జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం
ప్రత్యేక రాష్ర్టం కావాలని కోరుతూ మహారాష్ట్రలో విదర్భ వాసుల చేపట్టిన ఉద్యమం మరో ముందడుగు వేసింది. ప్రత్యేక రాష్టంపై అమరావతి జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. చికాల్దరాలో శనివారం జరిగిన జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ తీర్మానాన్ని తీసుకువెళ్లగా, ఏకగ్రీవ ఆమోదం లభించింది. పలుచోట్ల ప్రత్యేక రాష్ట్ర సెగలు ఊపందుకున్న నేపథ్యంలో విదర్భను ప్రత్యేక రాష్ర్టంగా ప్రకటించాలంటూ వారు జిల్లా స్టాండింగ్ కమిటీకి నివేదించారు. జిల్లా పరిషత్ సభ్యుల్లో ఒకరైన అభ్యంకర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సురేఖకు విదర్భ ప్రత్యేక తీర్మానాన్నినివేదించారు. ప్రత్యేక రాష్ర్టం రాదనే భయంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సహజ సిద్ధమైన వనరులున్న తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో పలుచోట్ల రాష్ట్ర డిమాండ్లు ఊపందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విదర్భ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తేమ్వర్ విమర్శించారు. తెలంగాణ కంటే విదర్భ సమస్య పురాతనమైందన్న విషయాన్ని షిండే మరిచారా అంటూ ప్రశ్నించారు. -
జలదిగ్బంధంలో పలు లంక గ్రామాలు
గోదావరి ఉగ్రరూపం దాల్చడంలో పశ్చిమ జిల్లాలో పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆచంట, యలమంచలి మండలంలోని పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. రోడ్డుపై పది అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, మంచి నీటి బోర్లు, కొబ్బరి చెట్లు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు దిక్కుతోచని స్థితిలో కాలం గడుపుతున్నారు. కనకాయలంక కాజ్ వే మునకతో తూర్పు గోదావరి-పశ్చిమగోదావరి జిల్లాలోని మధ్య రాక పోకలు నిలిచి పోయాయి. బోట్లు పడవల సాయంతో ప్రజలు బయటకు వస్తున్నారు. దీంతో స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు గ్రామాల మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు ఎప్పటికప్పడూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, మరోమారు కొవ్వూరు గోపాద క్షేత్రం నీట మునిగింది. చుట్టు ప్రక్కల గిరిజన గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. జిల్లాలోని వరద పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. కొవ్వూరు మండలం మద్దరూ లంకలో వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ఏలూరు సహా అన్ని డివిజన్ లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. -
ఏయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థుల చేపట్టిన దీక్షనుపోలీసులు భగ్నం చేశారు. కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయ తీసుకున్న అనంరతం సీమాంధ్ర ప్రాంతంలో నిరసనల సెగ రాజుకుంది. దీంతో దీక్ష చేపట్టిన విద్యార్థులను అరెస్టు చేసి దీక్షను భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించిన విద్యార్థులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా గోదావరి జిల్లాలలో పలు చోట్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. వరుసగా అయిదోరోజూ పశ్చిమగోదావరి జిల్లాలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఏలూరు నగరంలో వాణిజ్య, వర్తక దుకాణాలన్నీ మూతబడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. వట్లూరు గ్రామస్ధులు కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఫైర్ స్టేషన్ సెంటర్లో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ వేషధారణతో ఓ వ్యక్తిని అలకరించి, ఊరేగించారు. బొత్స, చిరంజీవి బ్యానర్లను ప్రదరిస్తూ ... సమైక్యాంధ్ర కావాలని నినదించారు. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
16 భాషల్లో సిల్క్‌స్మిత జీవితకథ
నటి సిల్క్‌స్మిత జీవిత చరిత్ర చాలా ప్రాచుర్యం పొందింది. శృంగారతారగా ఆమె దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో రాణించారు. అయితే అర్ధాంతరంగా కన్నుమూశారు. సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో బాలీవుడ్లో ది దర్టీ పిక్చర్ పేరుతో రూపొందిన చిత్రం ఘన విజయం సాధించింది. ఆమె పాత్రను పోషించిన విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. సిల్క్ జీవిత కథతో ఇటీవల మలయాళంలో క్లైమాక్స్ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. స్మిత పాత్రను సానాఖాన్ పోషించింది. ఈ చిత్రం తమిళంలో ఒరునడిగైయిన్ డైరీ పేరుతో అనువాదం అయింది. తాజాగా కన్నడంలో సిల్క్ జీవిత కథతో సిల్క్ సక్కత్ మగ పేరుతో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పాకిస్తాన్ నటి వీణామాలిక్ నటిస్తోంది. త్రిసూల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 16 భాషలలో అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారని త్రిసూల్ తెలిపారు. -
హైదరాబాద్ నుంచి వెళ్లమనే హక్కు ఎవరికి లేదు
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చెప్పే హక్కు ఎవరకి లేదని బొత్స స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో నాయకులు సమయమనం పాటించాలని సూచించారు. రాజధాని ఎక్కడ అనేది అసలు సమస్యే కాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వస్తుంది, ఆ సమయంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెలిపేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు సభలో ఉండాలని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తీర్మానానికి పార్టీ పరంగా విప్ అనేది ఉండదని ఆయన తెలిపారు. పార్లమెంట్లో కూడా మెజార్టీ ఉంటేనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం, శాంతిభద్రతలు, నదీ జలాల పంపిణీ, విద్యా, ఉద్యోగాలు తదితర అంశాలపై సీమాంధ్ర ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. వాటిని నివృత్తి చేయాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజల నివాసానికి, వారి ఆస్తులకు రాజ్యాంగపరమైన భరోసా ఉందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది: కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని తాను భావిస్తున్నట్టు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేదని అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఉద్యమం విజయం సాధించడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఈ ఉద్యమస్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అసమానతలు, అంతరాలు తగ్గాలని అన్నారు. తెలంగాణలో అద్భుత వనరులున్నాయని చెప్పారు. ప్రకృతి వరంగా ఇచ్చిన సింగరేణి గనులు తమ ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు భవిష్యత్‌లో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని పారిశ్రామికవేత్తలు చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాతావరణం కూడా బాగా అనుకూలమని తెలిపారు. ప్రపంచంలో పెట్టుబడులకు అనుకూల నగరం హైదరాబాద్ అని చెప్పారు. నిజాం కాలంలోనే హైదరాబాద్‌లో వందకుపైగా పరిశ్రమలున్నాయని వెల్లడించారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేస్తానని కేసీఆర్ హామీయిచ్చారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు. -
విభజనపై కేంద్రమంత్రులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం హైదరాబాద్‌లో విమర్శించారు. సీఎం,పీసీసీ అధ్యక్షుడు, ఎంపీలు,ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రం దిగొస్తుందన్నారు. రాష్ట్ర విభజనపై చర్చ లేకుండా విభజన జరిగితే ప్రాజెక్ట్‌లు ఏడారులుగా మారతాయని అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉన్న రహస్య చాఫ్టర్‌ను బహిర్గంతం చేయాలని యూపీఏ సర్కార్‌ను మరో సారి డిమాండ్ చేశారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పుండుమీద కారం జల్లే విధంగా ఉన్నాయన్నారు. -
హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: సాయిప్రతాప్
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని రాజంపేట లోక్‌సభ సభ్యుడు సాయి ప్రతాప్ ఆదివారం కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. 9 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నామని న్యూఢిల్లీలో ఏ నాయకుడు తమకు చెప్పలేదన్నారు. అలాగే రాష్ట విభజనకు తాము సిద్దమని కూడా అధిష్టానం వద్ద చెప్పలేదని పేర్కొన్నారు. అయితే విభజనపై ఎవరితో మాట్లాడారో మాకు తెలియదని సాయి ప్రతాప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ జిల్లాలో ఆందోళనలు ఆదివారం కూడా ఉధృతంగా సాగుతున్నాయి. కడప నగరంలోని పొట్టిశ్రీరాముల విగ్రహానికి సమైక్యవాదులు పాలభిషేకం చేశారు. అనంతరం నగరంలో మానవహారం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతుంది. అలాగే పులివెందుల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సమైక్యవాదులతో కిక్కిరిశాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా కడపజిల్లా కోర్టు ముందు న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరాయి. జమ్మలమడుగులో సమైక్యాంధ్ర కోసం భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అదే జిల్లాలోని రైల్వేకోడూరులో సమైక్యవాదులు నిరసనలు మిన్నంటాయి. సీమాంధ్ర నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక రంగాలకు చెందిన ఐక్యకార్యాచరణ కమిటి ధర్నా నిర్వహించింది.