Devotion
-
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్‌లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్‌లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
డియోర్ బ్యాగ్‌పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఛానెల్‌కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
సిద్ధ గురువులు ప్రసాదించిన వరం యోగం
మన దేహం ఆలయం లాంటిది. అందుకే తమ దేహాన్నే ఒక పవిత్ర క్షేత్రంగా చేసుకుని సాధన చేసుకున్నారు చేసుకున్నారు యోగులు. శరీరమనే ఈ క్షేత్రంలో సుషుమ్న అనే ఏకైక దైవనాడి ఉంటుంది. శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటే అందులో సుషుమ్న నాడి ఒక్కటే దైవనాడి. నాడులు అంటే శరీరమంతటికీ శక్తిని ప్రసారం చేసే వాహికలు. యోగ శాస్త్రం మూడు శరీరాలను గురించి వివరిస్తుంది. భౌతిక దేహం, శక్తి దేహం, కారణ దేహం. ఈ మూడూ కలిసి పని చేస్తూ ఉంటాయి. భౌతిక శరీరానికి ఆహార అసమతౌల్యం కారణంగా అనేక రుగ్మతలు వచ్చినట్లు, శక్తి శరీరంలో లోపాల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ప్రధానమైన అవయవాల పనితీరుకు, శక్తి శరీరానికి ప్రగాఢమైన సంబంధం ఉంటుంది. ఈ సకల సృష్టి విశ్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది. జీవులన్నీ నిద్రావస్థలో విశ్వం నుంచి శక్తిని గ్రహిస్తాయి. అయితే మానవులకు నిద్రలో స్వీకరించే శక్తి మాత్రమే సరిపోదు. ఇప్పటి వేగయుగంలో అదనపు శక్తి అవసరం. ఆ శక్తి కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది. వెన్ను పాము అడ్డంగా ఉన్న జీవులను తిర్యక్ జీవులని, వెన్నెముక నిలువుగా ఉన్న జీవులను మానవులనీ తెలియజేస్తుంది యోగ శాస్త్రం. జీవులన్నింటిలోకీ మానవుడు అగ్రగణ్యుడు. వజ్ర సమానమైన వెన్నెముక వల్లే మానవుడికి పరమోన్నతమైన స్థితికి చే రుకోగలిగే అద్భుతమైన శక్తిని, అవకాశాన్నీ ఈ సృష్టి ప్రసాదిస్తుంది. నిద్రాణంగా ఉన్న సుషుమ్న నాడి ఉత్తేజితమై, ఈ దివ్య నాడిలో కుండలిని జాగరణ జరిగి, మూలాధార చక్రం నుండి సహస్రారం చేరినప్పుడు మనిషికి దివ్యానంద స్థితి అనుభవంలోకి వస్తుంది. ఈ విధంగా జరిగినప్పుడు మానవ శరీరమే ఒక మహాÔ¶ క్తి క్షేత్రంగా మారుతుంది. భగవత్ తత్త్వాన్ని బాహ్యంగా గాక అనుభవ పూర్తిగా అర్థం చేసుకునే ఏకైక మార్గమే ధ్యానసాధన. సుషుమ్నా క్రియా యోగసాధన ద్వారా తక్కువ సమయంలోనే అ΄ారమైన శక్తిని స్వీకరించవచ్చు. సుషుమ్నా క్రియ యోగధ్యానం నాలుగు ప్రక్రియల కలయిక. ఈ సాధనకు ఎటువంటి కఠిన నియమాలూ లేవు. ఈ ధ్యానం మానవులందరి కోసం సిద్ధ గురువులు ప్రసాదించిన గొప్ప వరం. – ఆత్మానందమయి -
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
కార్యసాధన
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం ‘‘పుల్లయ్య వేమవరం’’ – రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించబడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.‘‘రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి’’ అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కుని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు. వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది. అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టేవారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం. ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆ యా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అని నిశ్చయించుకున్నాక మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ‘‘చూడబడినది నా చేత సీత’’ అని చెప్పగానే ‘‘ఆమె ఎట్లా ఉన్నది? ఏ మన్నది?’’ అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడ లేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకో లేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
Dream Wedding Destination ఇక్కడ పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి!
హరహర మహదేవ శంభో అంటూ చార్ధామ్ యాత్రలో పరవశించిపోతారు భక్తులు. ఈ మార్గంలో చాలా తక్కువ మందికి తెలిసిన మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలామందికి డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం రండి.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది సుందరమైన గ్రామంలో కొలువు తీర ఉన్నది త్రియుగినారాయణ ఆలయం.దీని విష్ణువు అని భావిస్తున్నారు. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూడముచ్చటగా ఉండే పవిత్ర వైష్ణవ దేవాలయం. చార్ధామ్ ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఈ ఆలయంలో స్వామివారి నుండి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు, గర్వాల్ హిమాలయాల ఉత్కంఠ భరితమైన దృశ్యాలను వీక్షించవచ్చు. త్రియుగినారాయణ ఆలయం వెనుకున్న కథ ఏమిటి?మూడు యుగాలుగా లేదా "త్రియుగం"గా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం ఇది. పార్వతి దేవి , శివుడు వివాహం చేసుకున్న ప్రదేశంగా ఇది ప్రతీతి. ఇక్కడ విష్ణువు ముందు శివపార్వతుల కళ్యాణం జరిగిందట. అందుకే వారి గౌరవార్థం త్రియుగి నారాయణ్ ఆలయం నిర్మించారని చెబుతారు.శ్రీ మహావిష్ణువు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా, తల్లిగా విష్ణుమూర్తి వ్యవహరిస్తే, బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్రను పోషించాడట. హోమగుండం, బ్రహ్మశిలపార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా నిర్విరామంగా వెలుగుతోంది. ఈ ఆలయం ముందు పవిత్రమైన అగ్ని అనంతంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు పెళ్లి చేసుకునే జంటలు ఏడడుగులు వేసి (సాత్ ఫేర్)పవిత్ర బంధంతో ఏకమవ్వాలని ఎదురు చూస్తారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటారట. ఇక్కడ కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. త్రియుగినారాయణ ఆలయంలో బ్రహ్మ శిల ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇదే శివపార్వతుల కళ్యాణానికి వేదిక. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.దేవతలు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైన,గౌరవప్రదమైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలని ఎవరు కోరుకోరు? దేశ విదేశాలకు చెందిన జంటలు ఇక్కడ ఏడు అడుగులువేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతారు. అలాగే కొత్త జంటలు, వేలాదిమంది భక్తులు, పర్యాటకులు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. కేదార్‌నాథ్‌కు సుమారు 25 కి.మీ.దూరం. అలాగే రుద్రప్రయాగ నుండి 70 కిలోమీటర్ల దూరం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. -
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే..!
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు? ఈ సందేహాలకు సమాధానమిస్తుంది పుష్కర్ పుణ్యక్షేత్రం, ఆ క్షేత్ర స్థలపురాణం. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్‌కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు చెంతనే ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆలయం. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్ధాల్లో ఒకటైన పుష్కర్‌ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనని పెద్ద లంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత, రామాయణాల్లోనూ ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందట. స్థలపురాణంపద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోనే తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ తామరపూపు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ట పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్టపుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగిడినప్పుడు తన చేతి (కరం)నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు పెట్టినట్లు మరో కథనం కూడా వినిపిస్తుంది.సరస్వతీదేవి శాపం.. ఏకైక ఆలయంవజ్రనాభ సంహారం అనంతరం లోకకల్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట సృష్టికర్త. సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. కానీ నారదుడి కలహప్రియత్వం కారణంగా బయలుదేరేందుకు తాత్సారం చేస్తుంది సావిత్రీ దేవి. (ఈమెనే సరస్వతీ దేవి అని కూడా పిలుస్తారు) ఇవతల ముహూర్తం మించిపోతుండటంతో, అనుకున్న సమయానికే యజ్ఞం పూర్తి కావాలన్న తలంపుతో ఇంద్రుడి సహకారంతో గాయత్రిని పెళ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.యజ్ఞం సమాప్తం అవుతుండగా అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మ దేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుడి అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి కారణం ఇదేనట. పుష్కర్‌లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్య సుమంగళి వరాన్నిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.ఇతర విశేషాలుపుష్కర్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్జీ, ఏకలింగజీ దేవాలయాలు. వీటిలో రంగ్జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్‌జీగా పూజలందుకుంటున్నాడు. రాజస్తాన్‌లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏకలింగజీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం. ఇవి కాక గోవిందాజీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్ దర్గా, అధాన్ దిన్ కా జూన్ ప్రా, అనాసాగర్, జగ్‌నివాస్ భవనం, జగదీష్ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోథ్‌పూర్ పట్టణం, అజ్మీరు, ఉదయ్‌పూర్, అబూశిఖరం, పింక్‌సిటీగా పేరుగాంచిన జైపూర్లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.ఎలా వెళ్లాలంటే..?పుష్కర్‌కు వెళ్లడానికి దగ్గరలోని అజ్మీర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఢిల్లీ, జోద్పూర్, జైపూర్, ఆగ్రా, ముంబాయ్. అహ్మదాబాద్‌ల నుంచి రైళ్లున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బెస్ట్. అజ్మీర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని పుష్కర్‌కు చేరుకోవాలంటే లోకల్ బస్సులు, ఆటోలు ఉన్నాయి. విమాన మార్గం సంగనీర్ ఏర్పోర్ట్. అయితే అక్కడినుంచి పుష్కర్ వెళ్లాలంటే 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అన్ని ప్రధాన నగరాలనుంచి పుష్కర్‌కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఏటా పుష్కరమే..! బ్రహ్మ దేవుడి క్షేత్రం
బ్రహ్మదేవుడంటే... ఈ సమస్త భూమండలంలో ఆలయం లేని దేవుడనే అసంతృప్తిని రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ తీర్చింది. అజ్మీర్‌కి 11 కి.మీల దూరంలో పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. పుష్కర్ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం కావడంతో ఈ పట్టణానికి కూడా అదే పేరు స్థిరపడింది. రాజస్థాన్ అంటేనే ఎడారులు, ఒంటెలు. ఇక్కడ ఏటా జరిగే క్యామెల్ ఫెయిర్ ప్రపంచ ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే వేడుకకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ప్రదేశం పేరు పుష్కరే కానీ వేడుకలు పుష్కరానికొకసారి కాదు ఏటా జరుగుతాయి.పుష్కర్ మేళాప్రపంచ ప్రసిద్ధి చెందిన వేడుక కావడంతో ఇది క్యామెల్ ఫెయిర్‌గా వాడుకలోకి వచ్చింది. పుష్కర్మేళా సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వారోత్సవాల్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీత ప్రదర్శనలను, నాట్య ప్రదర్శనలతో΄ాటు సాముగారడీలు, పాములనాడించేవాళ్లు కూడా వస్తారు. స్థానిక హస్తకళలు, దుస్తుల దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ సీజన్లో పుష్కర్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పగలు ఏదో ఒక సమయంలో 22 డిగ్రీలకు చేరుతుంది, కానీ సూర్యకిరణాలు మబ్బును చీల్చుకుని మనిషిని తాకి వెచ్చదనాన్నివ్వడం కష్టమే. రాత్రి టెంపరేచర్ ఎనిమిది డిగ్రీలకు పడి΄ోతుంది. పాశ్చాత్యదేశీయులకు అనువుగా ఉంటుంది. ఈ ఏడాది వేడుకలు నవంబర్ 9 నుంచి మొదలై 15 వరకు కొనసాగుతాయి. -
కలసి ఉంటేనే కలదు విజయం
ఈ భూమి మీద విజయం సాధించిన వారంతా కేవలం తామొక్కరుగానే ఆ విజయాన్ని సాధించలేదు. వారందరికీ ఏదో సమయంలో అనేక మంది సహకరించడం వల్లనే ఆ విజయం సం్రపాప్తించిందన్నది జగమెరిగిన సత్యం. ఏ మనిషైనా ఎన్ని ప్రతిభా సామర్ధ్యాలున్నప్పటికీ, ఎంతటి పండితులైనప్పటికీ, అపారమైన మేధో సంపత్తి ఉన్నప్పటికీ, ఆయా సామర్థ్యాలను సాధించడానికి వారు చేసిన కృషి ఒక ఎత్తయితే, ఆ కృషి చేయడానికి సహకరించిన చేతులు అనేకం అని చెప్పక తప్పదు.ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి గురించి మాట్లాడినపుడు వారు పడిన శ్రమను, కష్టం గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప, వారికి అంతర్లీనంగా సహకరించిన పెద్దలను, మహనీయులను, గురువులను, స్నేహితులను, మిత్రులను గాలికి వదిలేస్తాం. నిజానికి వారందరి సహకారం లేనిదే ఆ వ్యక్తి అంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉండేవారు కాదన్నది వాస్తవం. ఒకవేళ ఆ వ్యక్తి తనకు తానుగా గొప్పవాడిగా భావించుకుని అందరినీ దూరంగా జరిపితే ఆయా విజయాల దరిదాపుల్లోకి వెళ్ళేవాడు కాదన్నది అక్షరాల నిజం. అందుకే కలిసుంటే కలదు సుఖమే కాదు... అది జీవిత సత్యంగా కూడా ఆకళింపు చేసుకోవాలి. మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఏ ఒక్క యుగ పురుషుడు కూడా ఐకమత్యం సాధించకుండా విజయ బావుటా ఎగురవేయలేదన్న విషయంలో ఎంత వాస్తవం ఉందో, ఐకమత్యం లేకపోతే ఆ విజయాలు సాధ్యం కావన్న విషయంలోనూ అంతే నిజం ఉంది.అందువల్ల ఏదైనా ముఖ్యమైన విజయాన్ని సాధించడానికి, అత్యంత అవసరమైన అంశం ఐకమత్యం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐకమత్యం అండగా నిలుస్తుంది. కనుక మన భవిష్యత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అన్ని శక్తులు, సామర్థ్యాలు, వనరులు వాడుకోవాలి. ఇవన్నీ ఏ ఒక్కరిలోనో ఉండవు. సహాయం, సహకారం అవసరమున్నప్పుడు అర్ధించడం బలహీనతకు సూచన కాదు. అది వివేకవంతుల లక్షణం కూడా.దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయడానికి సాక్షాత్తు ఆ జగన్మాతే ఐకమత్యంతో అసురులపై విజయం సాధించింది. చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి జగజ్జేతగా నిలిచింది. ఆ జగన్మాతకు విజయం దక్కడానికి ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు. తమకు కంటకంగా మారిన అసురులను సంహరించడానికి ఆ తల్లికి సహకరించారు. సృష్టి స్థితి, లయాలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో పాటు, ముక్కోటి దేవతలు ఆ తల్లికి తమకున్న శక్తులన్నింటినీ ధారపోశారు. తమకున్న అపార యంత్ర, తంత్ర, అద్వితీయ శక్తులను జగన్మాతకు ఇచ్చి, ఆ తల్లిని శక్తి స్వరూపిణిగా నిలబెట్టారు. చివరకు అసుర సంహారం చేశారు. అందువల్ల మన నిజమైన సామర్థ్యాలు మన ఒక్కరిలో ఉన్నవే కాదు. మన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటేనే అవి సర్వశక్తిమంతులుగా మార్చుతాయి. ఇది ఐకమత్యంతోనే సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకుని విజయులమవుదాం.ఐకమత్యమే మహాబలం, మహాభాగ్యం అన్నారు పెద్దలు. అవును నిజమే.. మన పెద్దలు చెప్పినట్టు ఐకమత్యంగా ఉంటే ఎన్నో పనులు చెయ్యచ్చు.. శత్రువులను సైతం తరిమి తరిమి కొట్టచ్చు. ఎలాంటి దుస్సాధ్యమైన పనైనా సునాయాసంగా చేయచ్చు. ఐకమత్యం బలాన్ని, ప్రేమను, అనురాగాలను పెంచుతుంది. ఇది నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఏకత్వాన్ని సూచిస్తుంది, ఆనందాన్నిస్తుంది. కష్టాలలో పాలు పంచుకునే అవకాశాన్నిస్తుంది. శక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఏకత్వాన్ని కలిగిస్తుంది. వ్యక్తుల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. జీవితంలోని సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ఇది మనకు ఎంతగానో దోహదం చేస్తుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
నిమి–వసిష్ఠుల పరస్పర శాపాలు
నిమి మహారాజు ఇక్ష్వాకుని పుత్రుడు. మిథిలానగరం రాజధానిగా గల విదేహ రాజ్యానికి మొదటి మహారాజు. గొప్ప ధర్మజ్ఞుడు, పరిపాలకుడిగా ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. నిమి మహారాజు అనేక యజ్ఞాలు చేశాడు. గౌతమ ఆశ్రమ సమీపంలో పురోహితుల కోసం ప్రత్యేకంగా ‘జయం’ అనే పట్టణాన్ని నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించే పురోహితులంతా జయంలో చేరి, నిత్యం యజ్ఞ యాగాదులు చేసుకుంటూ, జపతపాదులతో, నిరంతర వేదాధ్యయనంతో సుఖంగా జీవించసాగారు.ఒకనాడు నిమి మహారాజు అట్టహాసంగా బహుకాలం కొనసాగే మహాయజ్ఞం చేయాలని సంకల్పించాడు. యజ్ఞ నిర్వహణకు తండ్రి ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు. మహర్షులతోను, పురోహితులతోను సంప్రదించి, యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాడు. వసిష్ఠ, వామదేవ, భృగు, అంగిరస, పులహ, పులస్త్య, ఋచీక, గౌతమాది మహర్షులందరినీ ఆహ్వానించాడు. యజ్ఞకోవిదులైన వేదపండితులను రప్పించాడు. కులగురువు వసిష్ఠుడికి పాదపూజ చేసి, ‘గురూత్తమా! నువ్వు సర్వజ్ఞుడివి. యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాను. దయచేసి, నాతో ఈ మహాయజ్ఞం చేయించు. ఇది ఐదువేల ఏళ్ల పాటు సాగాలి. అటువంటి యజ్ఞదీక్షను ఇప్పించి, నాతో యజ్ఞం చేయించు. ఇది దేవీయజ్ఞం. జగజ్జనని ప్రీతి కోసం ఈ యజ్ఞాన్ని తలపెట్టాను. కాదనక ఆధ్వర్యం వహించు’ అని ప్రార్థించాడు.‘నిమి మహారాజా! నీ సంకల్పం ప్రశస్తం. కాని ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని తలపెట్టి, నన్ను ఆధ్వర్యం వహించమని కోరాడు. ఐదువేల సంవత్సరాల దీక్ష చేపట్టాడు. నేను అంగీకరించి, అతడికి మాట ఇచ్చాను. అందువల్ల ముందు ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేయించి, ఆ తర్వాత నీతో యజ్ఞం జరిపిస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఆ పని పూర్తికాగానే క్షణమైనా ఆలస్యం చేయకుండా నీ దగ్గరకు వస్తాను. అయినా, దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా!’ అని బదులిచ్చాడు వసిష్ఠుడు.‘గురుదేవా! నేను యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాను, మహర్షులు, ఋత్విక్కులందరినీ ఆహ్వానించాను. వారందరూ వచ్చేశారు. ఇప్పుడు తలపెట్టిన యజ్ఞాన్ని వాయిదా వేసి, ఐదువేల ఏళ్లు ఆగడమంటే ఎలా? నువ్వు మా ఇక్ష్వాకుల కులగురువువు. మా పనిని కాదని, మరొకరి పనికి వెళ్లడం నీకు భావ్యమేనా? బహుశా, ధనాశకు లొంగిపోయినట్లు ఉన్నావు. కాస్త ఆలోచించు’ అని నిష్ఠూరంగా ప్రాధేయపడ్డాడు నిమి.నిమి మాటలకు వసిష్ఠుడు బదులివ్వకుండా, ఇంద్రుడి యజ్ఞం జరిపించడానికి వెళ్లిపోయాడు. వసిష్ఠుడి ప్రవర్తనకు నిమి కలత చెందాడు. ఏది ఏమైనా తలపెట్టిన యజ్ఞం నిర్వహించాలని అనుకున్నాడు. వెంటనే, గౌతమ మహర్షిని యజ్ఞానికి ఆధ్వర్యుడిగా ఉండమని అభ్యర్థించి, ఒప్పించాడు. హిమాలయాల సన్నిధిలో గౌతముడి ఆధ్వర్యంలో దేవీ మహాయజ్ఞాన్ని వైభవోపేతంగా ప్రారంభించాడు. ఋత్విక్కులకు, పురోహితులకు, వేదపండితులకు భూరిదక్షిణలు ఇచ్చాడు. గో భూ సువర్ణదానాలతో వారిని సంతృప్తులను చేశాడు. ఐదువేల ఏళ్ల దీక్ష చేపట్టి, మహాయజ్ఞం చేశాడు. నిమి చేపట్టిన యజ్ఞం పూర్తి కావస్తుండగా, వసిష్ఠుడు దేవేంద్రుడి చేత యజ్ఞాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేయించాడు. వెంటనే ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకుని, నిమి వద్దకు బయలుదేరాడు.స్వర్గం నుంచి బయలుదేరిన వసిష్ఠుడు నేరుగా నిమి మహారాజు ప్రాసాదానికి వచ్చాడు. అప్పటికే యజ్ఞం ముగించుకున్న నిమి మహారాజు అలసి సొలసి అంతఃపురంలో నిద్రపోతూ ఉన్నాడు. మహారాజు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి, సేవకులు వసిష్ఠుడిని కూర్చుండబెట్టారు. అయితే, వారెవరూ నిమి మహారాజును నిద్రలేపడానికి సాహసించలేదు.కొన్ని గంటలు కూర్చుని ఎదురుచూసిన వసిష్ఠుడికి ఇదంతా అవమానంగా తోచింది. సహనం నశించింది. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడి కోపంగా లేచాడు.‘కులగురువునైన నన్ను కాదని, వేరొకరిని గురువుగా స్వీకరించి యజ్ఞం నిర్వహించడమే నాకు అవమానం అనుకుంటే, ఇంటికి వచ్చిన నాకు దర్శనం ఇవ్వకుండా ఇలా అవమానిస్తావా? అహంకారంతో కన్నూ మిన్నూ కానని నీకు తగిన శాస్తి జరగాల్సిందే! శరీరం రాలిపోయి, నువ్వు విదేహుడివి అగుదువు గాక!’ అని శపించాడు. వసిష్ఠుడి శాపం విన్న రాజభటులు భయభ్రాంతులయ్యారు. పరుగు పరుగున వెళ్లి, నిమి మహారాజును నిద్రలేపారు. కోపోద్రిక్తుడై ఉన్న వసిష్ఠుడు శపించిన సంగతి చెప్పారు.నిమి మహారాజు ఒక్క ఉదుటన బయటకు వచ్చాడు. వసిష్ఠుడికి నమస్కరించాడు.‘గురువర్యా! ఇందులో నా దోషం ఆవగింజంత అయినా లేదు. నువ్వు సర్వజ్ఞుడివి. ధర్మజ్ఞుడివి. నీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్లావు. నేనెంత ప్రార్థించినా కనికరించకుండా, యజమానుడినైన నన్ను వదిలేశావు. ఆహ్వానితులను నిరీక్షణలో ఉంచడం తగని పని కాబట్టి, నేను యజ్ఞం తలపెట్టిన విధంగా పూర్తి చేశాను. ఇటువంటి పని చేసినందుకు సిగ్గుపడవలసినది పోయి తిరిగి నన్ను శపిస్తావా? వేదవేదాంగవేత్తవు, బ్రాహ్మణోత్తముడవు అయిన నువ్వు నిరపరాధిని దండించరాదనే సూక్ష్మ బ్రాహ్మణధర్మాన్ని మరచి, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు. ఎదురుదాడి చేస్తున్నావు. నిష్కారణ క్రోధం ఎవరికీ పనికిరాదు. నీవంటి జ్ఞానులకు అసలు పనికిరాదు. విప్రుడివై ఉండి, నిరపరాధిని అయిన నన్ను శపించావంటే, నువ్వు కూడా ప్రతిశాపానికి అర్హుడివే! నేను నీకు ప్రతిశాపం ఇవ్వడంలో ఎలాంటి దోషమూ ఉండదు. అందువల్ల నేను కూడా శపిస్తున్నాను. క్రోధంతో రగిలిపోతున్న నీ శరీరం రాలిపోవుగాక! నువ్వు కూడా దేహరహితుడవు అగుదువు గాక!’ అని శపించాడు.పరస్పర శాపాల వల్ల నిమి మహారాజు, వసిష్ఠుడు ఇద్దరూ విదేహులయ్యారు.∙సాంఖ్యాయన -
సప్త మోక్షపురి..మాంగళ్య గౌరికాలయం..
మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు, ఫల్గుణీ నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మంగళ గౌరీ ఆలయం గురించిన ప్రస్తావన పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, ఇతర గ్రంథాలు, తాంత్రిక రచనలలో తప్పక కనిపిస్తుంది. మంగళగౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప–శక్తి పీఠాన్ని కలిగి ఉంది. శ్రీ సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలుగా కొలుస్తారు. వాటిలోని కీలకమైన వాటిని 51 శక్తిపీఠాలుగా, తిరిగి వాటిలోని అత్యంత కీలకమైన వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తారు. వాటిలో అమ్మవారి ఎడమ స్తనం పడిన ప్రదేశమే గయలోని మాంగళ్య గౌరికా ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, శ్రీ సతీదేవి రొమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మాంగల్య గౌరీ మందిరం. ఈ మందిరంలో రెండు గుండ్రని రాళ్లు ఉన్నాయి, ఇవి సతీదేవి స్తనాలను సూచిస్తాయి. ఇక్కడ శక్తి రొమ్ము రూపంలో పూజించ బడుతుంది, ఇది పోషణకు చిహ్నం. ఎవరైతే కోరికలు, ప్రార్థనలతో అమ్మ దగ్గరకు వస్తారో, వారు అన్ని కోరికలు తీరి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు. సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడు అంటారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మితమైంది. గుడికి చేరుకోవాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. మెట్ల మార్గం స్థానిక ప్రజల నివాసాల మధ్య ఉంటుంది. మెట్ల మార్గం ప్రారంభంలో, భీముని ఆలయం ఉంది. అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భీముడు శ్రాద్ధకర్మ చేసాడు, అందుకే దీనిని భీమవేది గయ అని పిలుస్తారు.కొండపై కూర్చున్న అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వారి భర్తలు విజయం, కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు. ఈ పూజలో మంగళ గౌరీ దేవికి 16 రకాల కంకణాలు, 7 రకాల పండ్లు, 5 రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. మంగళ గౌరీ ఆలయంలో శివుడు, దుర్గ, దక్షిణ–కాళి, మహిషాసుర మర్దిని, సతీదేవి వివిధ రూపాలను చూడవచ్చు. ఈ ఆలయ వివరణ పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణాలలో కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో కాళి, గణపతి, శివుడు, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. ఆశ్వీయుజ మాసంలో జరిగే లక్షలాది మంది భక్తులు ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆలయానికి వస్తుంటారు.ఈ క్షేత్రంలోని ప్రసిద్ధ పండుగ ’నవరాత్రి’, ఇది అక్టోబర్‌లో జరుగుతుంది. ఈ మందిరం ‘మరణానంతర క్రతువులకు’ (శ్రాద్ధము) ప్రసిద్ధి చెందింది. ‘మహా–అష్టమి’ (ఎనిమిదవ రోజు), భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళ గౌరీ వ్రతం (వ్రతం), దీనిని మహిళలు తమ కోరికల సాఫల్యం కోసం చేస్తారు. మంగళవారాలలో ఉపవాసం ఉండి, స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు. ఇవే కాకుండా, ఈ ఆలయంలో దీపావళి, హోలీ, జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన పండుగలను కూడా బాగా జరుపుకుంటారు. ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఎలా వెళ్లాలి?గచ రైల్వే జంక్షన్ ఆలయానికి 4 కిమీ దూరం, బస్ స్టాండ్ ఆలయం నుండి 4.7 కిమీ దూరంలో ఉంది. -
మాతృవందనమ్
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మొదటిది అధ్యాపనం కాగా రెండవది– పితయజ్ఞస్య తర్పణం. మనకు ముందుపుట్టి మనకు జన్మనిచ్చిన వాళ్లున్నారు... తల్లిదండ్రులు. లోకంలో ఎవరి రుణం అయినా తీర్చుకోగలమేమో కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం అంటారు రామచంద్రమూర్తి రామాయణంలో. . సౌత్రామణి అని ఒక యాగం. అది చేస్తే పితరుణం తీరుతుంది. కానీ మాతరుణం ? ఎవ్వరికీ సాధ్యం కాదు.రుణం తీరడం లేదా తీర్చుకోవడమంటే ??? నీ జన్మ చరితార్థం కావాలంటే... గహస్థాశ్రమంలో తల్లిదండ్రులకు నమస్కరించి సేవచేయడమే. శంకరో తీతి శంకరః..శంకరుడు ప్రతి ఇంటా ఉన్నాడు... తండ్రి రూపంలో.. అంటే కన్న తండ్రి సాక్షాత్ పరమ శివుడే. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే పరమశివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించినట్లే. తల్లికయినా అంతే...‘‘భూప్రదక్షిణ షష్టే్కన కాశీయాత్రాయుతేనచ /సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతవందనే’’ అంటూ గహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంత వెసులుబాటు కల్పించింది శాస్త్రం. అమ్మకు నమస్కరిస్తే... ఆరుసార్లు భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్లు, 10వేల సార్లు కాశీయాత్ర చేసినట్లు, నూరు పర్యాయాలు సేతుస్నానం చేసినంత ఫలం దక్కుతుందన్నది. అందువల్ల కంటిముందు కనిపించే దేవతలయిన అమ్మానాన్నల విషయంలో గహస్థు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తే ఈశ్వరుడు ప్రీతి పోందుతాడు. ఎవరు ఏది చేయాలో అది నిజాయితీగా చేయాలి.తల్లిదండ్రులు ఉన్నప్పుడో లేనప్పుడో నీ వాటా ఆస్తులు లేదా వారికోసం నీవు పెట్టే ఖర్చులు లెక్కలు వేసుకోవడం కాదు... వారు నీకిచ్చిందేమిటన్నది ద్రవ్య రూపంలో లెక్కలేసుకోకు. సంతోషంగా నువ్వు నూరేళ్ళు పిల్లా΄ాపలతో హాయిగా ఉండాలని తప్ప వారు నీనుంచి ఆశిందేముంటుంది ? నాకు తెలిసిన ఒక మిత్రుడి తల్లి చనిపోతే ... ఆస్తుల వాటా ప్రస్తావన వచ్చినప్పడు నీవాటాకేం వచ్చిందంటే... రాలేదు.. నేనే తీసుకున్నా..అన్నాడు. ఏమిటవి అని అడిగితే.. అమ్మ వాడిన చెప్పులు, కళ్ళద్దాలు.. అన్నాడు... అమ్మ వాడిన అద్దాలు నా గుండెమీద పెట్టుకుంటే అమ్మ నన్ను చూస్తూ ఉన్నట్టే ఉంటుంది.. అమ్మ వాడిన అరిగిపోయిన చెప్పులు... నాకోసం ఆమె అరగదీసుకున్న, కరగదీసుకున్న జీవితాన్ని గుర్తుకు తెస్తుంటుంది... అన్నాడు... ఇవి చాలవూ నాకు... అమ్మ పోయినా ఆమెను రోజూ చూసుకోవడానికి.. అన్నాడు. అదీ కతజ్ఞత. అందుకే వారు చనిపోయిన రోజున పరమ భక్తితో, గౌరవంతో తోడబుట్టినవారందరూ కలిసి తల్లిదండ్రులను స్మరించుకోవడానికే శ్రాద్ధం, తద్దినం ఆచారంగా మారింది. అది శ్రద్ధతో చేయాల్సిన పని కాబట్టి శ్రాద్ధం అయింది. అంతేగానీ దానికి ఫలానా వస్తువులే ఉండితీరాలన్న నియమాలేమీ లేవు...రామాయణంలో...రాముడు గారపిండి ముద్దలు తీసుకెళ్ళి తండ్రి దశరథుడిని స్మరించి పితదేవతలకు పిండం పెట్టాడు. కౌసల్యాదేవి అటుగా వెడుతూ చూసి భోరున ఏడ్చింది. అంటే యజమాని ఏది తింటే పితదేవతలకు అదే పెట్టాలంది శాస్త్రం. రాముడు ఆ సమయంలో అదే తింటున్నాడు కాబట్టి అదే పెట్టాడు. కావలసింది శ్రద్ధ. అందువల్ల గహస్థు తన విహిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అది తర్పణం. అది మహా యజ్ఞం. గృహస్థు చేయాల్సిన పంచమహా యజ్ఞాలలో ఇది ఒకటి. -
జీవన్ భద్రాణి పశ్యంతు
మన పూర్వులు పిల్లలకి జీవితం మీద ఆశని కలిగించి ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా సానుకూల దృక్పథం పెం΄÷ందే విధంగా మనసులని మలచేవారు. అందుకే ఒకప్పుడు ఆత్మహత్యల వంటివి అంతగా కనపడేవి కావు. ఎక్కడో ఒకటి జరిగితే అదేదో వింత అన్నట్టు అందరూ కంగారు పడేవారు. ఇప్పుడు అవి అతి సామాన్యమై ΄ోయాయి. అది చాలా మామూలు విషయంగా పరిగణించి పెద్దగా పట్టించుకోవటం కూడా లేదు. ప్రతిస్పందించే సున్నితత్వాన్ని కూడా కోల్పోయాం. ‘‘బ్రతికి యుండిన సుఖములు బడయ వచ్చు’’ అన్నది భారతీయుల విశ్వాసం. ఇటువంటి భావాలని అతి సామాన్యమైన మాటలలో అందరి మనస్సులలో నాటుకునేట్టు చేశారు. బ్రతుకుని అంతం చేసుకోవాలనే ఆలోచనే రాకుండా వాతావరణాన్ని ఉంచేవారు. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చావో రేవో అన్నంత తీవ్రంగా తీసుకునే వారు కాదు. ‘‘కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా?’’ అని తేలిక చేసేవారు, మనం అందరం మనుషులం అని గుర్తు చేస్తూ. ఈనాడు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది చిన్నతనంలో కడుపునిండా తిండి కూడా లేనివారు అని వారి జీవితచరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ‘‘బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అని చెప్పి సాంత్వన కలిగించే వారు. పైగా, ఆ రోజుల్లో అనుకున్నది సాధించక ΄ోవటం, పరాజయాల పాలు కావటం జరిగి, తాత్కాలికంగా నిరాశ కలిగినా వెంటనే తేరుకుని రెట్టించిన ఉత్సాహంతో లేదా కసితో అనుకున్న దానిని సాధించటానికి ప్రయత్నం చేసేవారు. తాము విఫలం కావటానికి కారణం ఏమిటి? అని విశ్లేషించుకునేవారు. ఇది కార్యసాధకుల లక్షణం. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, పూల పానుపూ కాదు. ఈ ఆలోచనా విధానం నేటి యువతరంలోను, మధ్యవయస్కులలోనూ మృగ్యం అయింది. తక్షణం అనుకున్న ఫలితం రావాలి, తన ప్రయత్నంతో సంబంధం లేకుండా. అపజయాన్ని, ఓటమిని అసలు ఎదుర్కో లేరు. కొంచెం కూడా ఆగలేరు. నిర్ధారణ చేసుకునే ఓపిక కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో ΄÷రపాటు పడే అవకాశం కూడా ఉంది. మనం చూస్తూనే ఉంటాం. మొదటి వంద స్థానాల్లో ఉండవలసిన అభ్యర్థి ఉత్తీర్ణుడు కాలేదని ప్రకటన రాగానే తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్న మరునాడు ఆ ప్రకటన తప్పు అని సరి చేసుకోటం తెలుసు కదా! మనసుని ఆ మాత్రం అదుపులో ఉంచలేక ΄ోవటం వల్ల వచ్చిన ప్రమాదం అది. ప్రాణాలు అర్పించి సాధించారు, బలిదానం చేశారు అంటూ ΄÷గిడితే వారికి ఒరిగేది ఏముంది? మిగిలిన వారు అనుభవించ వచ్చు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. సమయం పట్టవచ్చు. మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్పే మాట ఏమంటే, ప్రాణత్యాగం చేయదల్చుకున్న వారిని ఒక్క క్షణం ఆపగలిగితే చాలు నట. క్షణికావేశం చల్లారుతుంది అంటారు. ఆ పనిని ఎవరు చేయగలరు? అసలు ఎవరికైనా తెలియాలి కదా! అందుకే ఎవరికి వారే తమను తాము సముదాయించుకుని, పరిస్థితులతో ΄ోరాడి గెలవాలి. కలిగిన మేలు అనుభవించటానికి బ్రతికి ఉండాలి కదా!ఈ బతుకుని అంతం చేసుకోవాలనే భావన ఎవరికీ రాదా? సీతమ్మకి, హనుమకి, రామచంద్రమూర్తికి, దుర్యోధనుడి వంటి వారికే వచ్చింది. కాని విచక్షణ వారిని ఆపని చేయకుండా కాపాడింది. సీతమ్మ కనపడలేదని హనుమ ఏ విధంగా శరీరం వదలాలి అని ఆలోచిస్తూ సీతారామలక్ష్మణులకి, సుగ్రీవాదులకి నమస్కారం చేయగానే అశోకవనం కనపడింది. దైవాన్ని, పెద్దలని స్మరిస్తే మార్గం కనపడుతుంది. సీత కూడా జుట్టుతో చెట్టు కొమ్మకి ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉండగా త్రిజట మాటలు, హనుమ దర్శనం కలిగాయి. తొందర పడితే? రాముడు కూడా సీత లేకుండా ఉండలేనని అనుకుని, అరణ్యవాసం చేయలేదనే చెడ్డపేరు వస్తుందని ఆగాడు. ఆవేశ పడకుండా కొద్దిగా ఆలోచిస్తే మంచి జరిగి తీరుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
శమీ వృక్షానికీ, దసరా పండుగకు సంబంధం ఏంటి?
శమీ వృక్షానికీ, విజయదశమి పండుగకూ సన్నిహిత సంబంధం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ‘శమీ’ అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని అదృశ్యంగా శమీవృక్షంలో నిక్షిప్తమై ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. యజ్ఞాల లాంటి పవిత్ర కార్యాలలో జమ్మి కర్రలు మథించి, అగ్ని పుట్టించి, హోమాలు చేస్తారు. శమీవృక్షం ప్రస్తావన రుగ్వేదంలో, అధర్వ వేదంలో కనిపిస్తుంది. ఇక పురాణ ఇతిహాసాలలో సరేసరి. అంటే, అతి ప్రాచీన కాలం నుంచి భారతీయులు శమీవృక్షాన్ని పవిత్రమైన వృక్షాలలో ఒకటిగా భావిస్తూ వస్తున్నారు.ఇక, ‘విజయ’ అంటే శ్రవణా నక్షత్రంలో కలిసివచ్చే దశమి తిథి. ఇలా కలవటం ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షంలో జరుగుతుంది. ఆ ‘విజయ’ దశమి రోజు సర్వదా శుభదినం. అంటే, మీనమేషాలూ, గోచార, గ్రహచారాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి శుభకార్యాలకైనా విజయదశమి మంచి రోజే!విజయదశమి దసరా నవరాత్రులలో ఆఖరి రోజు. చండముండులూ, మహిషాసురుడూ వంటి రాక్షసులందరినీ 9 రోజుల భీషణ యుద్ధంలో సంహరించిన దుర్గాదేవి, విజయదశమి నాడు విజయిగా, అపరాజితగా నిలిచింది. ఈ అపరాజిత రాజాధి రాజులను కూడా శాసించే శ్రీమహారాజ్ఞి కనుక, విజయదశమినాడు దుర్గాదేవిని రాజరాజేశ్వరిగా అలంకరించడం ఆనవాయితీ. విజయ దశమినాడు అపరాజితా పూజ చేయడం ఇక్ష్వాకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శ్రీరాముడు జమ్మి చెట్టును అపరాజితా దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావించి, శమీపూజ ద్వారా దేవి అనుగ్రహం పొంది రావణ సంహారం చేశాడని దేవీ భాగవతం చెబుతోంది. రాజులకు యుద్ధ జయమూ, ఇతరులకు కార్య విజయమూ ఇవ్వగలదు గనక జమ్మి చెట్టు ‘విజయద–శమీ’ వృక్షం. అందుకే ఆబాలగోపాలం విజయదశమి నాడు శమీ పూజ చేసే ఆచారం కొనసాగుతూ వస్తున్నది.చదవండి: దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?పూజ తరవాత అపరాజితా ప్రసాదంగా జమ్మి ఆకులను కోసి తెచ్చుకొని, వాటిని ‘బంగారం’లా దాచుకోవటం, కొన్ని ఆకులను పెద్దల చేతిలో ఉంచి, నమస్కరించి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం, దసరా పూజల సందడిలో భాగం. పనిలో పనిగా, ఆ పరిసరాలలోనే ఎగురుతుండే పాలపిట్టను చూసి, దాని నిసర్గ సౌందర్యాన్ని మెచ్చుకోవటం కూడా శుభకరం అని ఆస్తికుల నమ్మకం. విజయదశమి సందర్భంగా అపరాజితా దేవి ఆశీస్సులు అందరికీ అంది, ఆనందం కలిగించాలని ఆకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
సరిగ్గా గమనించారా.. అమ్మవారి విగ్రహాలు కాదు.. మనుషులే అలా!
Live durga utsav: దసరా ఉత్సవాల్లో మండపాలలో దుర్గామాత విగ్రహాలు కనిపించడం సాధారణ దృశ్యమే. అయితే కోల్‌కతాలో బ్రహ్మ కుమారీస్ నిర్వహించే ‘లైవ్ దుర్గా ఉత్సవ్’లో 30 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని గంటల పాటు కదలకుండా విగ్రహాల్లా కూర్చుంటారు!‘జీవకళ ఉట్టిపడుతుంది’ అనుకునే వాళ్లకు దగ్గరకు వచ్చి చూస్తేగానీ అసలు విషయం తెలియదు.‘ఇది సహనానికి పరీక్ష. కదలకుండా కూర్చోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. పెద్ద సవాలు. ఈ సవాలు కోసం ప్రతి సంవత్సరం ఇష్టంగా ఎదురు చూస్తుంటాను’ అంటుంది 32 ఏళ్ల సులేఖ.గత పదిహేను సంవత్సరాలుగా లక్ష్మి, సరస్వతితో సహా వివిధ దేవతల రూపంలో మండపంలో కూర్చుంటూ ఉంది సులేఖ. సందర్శకులు నాణేలు, పువ్వులు వేదికపై విసురుతుంటారు.‘ఒక్కో దేవతకు ఒక్కో రకమైన ముఖకవళికలు ఉండాలి. దుర్గ ముఖంలో కోపం, శక్తి, ప్రశాంతత మిళితమై ఉంటాయి. నేను వేదికపై ధ్యానముద్రలో ఉంటాను కాబట్టి ఏ విషయంపైనా నా దృష్టి మళ్లదు’ అంటుంది ‘లైవ్ దుర్గా’గా పేరుగాంచిన సులేఖ. చదవండి: దురితాలను పోగొట్టి.. మన చుట్టూ రక్షణకవచంలా నిలబడే దుర్గమ్మ -
Dussehra 2024: అమ్మలగన్న అమ్మ... మన రక్షణ దుర్గం
శివుడు స్థాణువు. కదలడు. అమ్మవారు కదలిక. సైన్సు పరిభాషలో అయితే అయ్య స్టాటిక్ ఎనర్జి. అమ్మ కైనెటిక్ ఎనర్జీ. జగతి గతికి రెండు శక్తులూ కావాలి. ఇద్దరూ కలిస్తేనే మన మనుగడ కు కావాల్సిన జడ శక్తి; చిత్ శక్తి దొరుకుతున్నాయి.శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపిం అని అంటాడు శంకరాచార్యులు సౌందర్యలహరిలో. శక్తితో కలిసి ఉంటేనే శివుడు ఏదైనా చేయగలుగుతాడు. శివుడు– శక్తి వేరు కాదని శంకరుడు సౌందర్యలహరి మొట్టమెదటి శ్లోకంలోనే సూత్రీకరించాడు.‘కలాభ్యాం చూడాలంకృత–శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం’’ అంటూ శివుడిని పొందడానికి పార్వతి; పార్వతిని పొందడానికి శివుడు తపస్సు చేయడాన్ని అనన్యసామాన్యంగా ఆవిష్కరించాడు శంకరులు శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో. ఒకరినొకరు కలవడానికి, కొలవడానికి వారిది నిజమైన తపోఫలం. ఆధునిక జీవనంలో మన మనుగడ సుఖంగా ఉండడానికి ఈ రెండు శ్లోకాలను పట్టుకుంటే చాలు. వీటి అర్థాన్ని, అంతరార్థాన్ని ఆకళింపు చేసుకుని... ఆచరిస్తే చాలు– శోకాలన్నీ మాయమవుతాయి. ఆధ్యాత్మిక కోణంలో శక్తిగా మనం అమ్మవారిని కొలుచుకుంటాం. లౌకిక విషయాల్లో మహిళల శక్తిని కొలిచేప్పుడు చిన్నచూపు చూస్తాం. అమ్మవారి శక్తి లేకపోతే అంతటి శివుడే కనీసం అటు గడ్డి పోచను ఇటు జరపలేడని శంకరుడన్న మాటను నోరు నొవ్వంగ స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ... ఆచరణలో ఎంతవరకు పాటిస్తున్నామన్నది ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.‘సర్వతీర్థాత్మికే; సర్వమంత్రాత్మికే; సర్వయంత్రాత్మికే; సర్వతంత్రాత్మికే; సర్వచక్రాత్మికే; సర్వశక్త్యాత్మికే; సర్వపీఠాత్మికే; సర్వవేదాత్మికే; సర్వవిద్యాత్మికే; సర్వయోగాత్మికే; సర్వవర్ణాత్మికే; సర్వగీతాత్మికే; సర్వనాదాత్మికే; సర్వశబ్దాత్మికే; సర్వవిశ్వాత్మికే; సర్వవర్గాత్మికే...’ అంటూ శ్యామలాదండకం చివరిలో కాళిదాసు అందరిలో, అన్నిటిలో, విశ్వమంతా అమ్మవారినే దర్శించాడు.‘అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ...’ అన్నాడు బమ్మెర పోతన. లక్ష్మి, పార్వతి, సరస్వతి– ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆదిపరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపు కోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం.ఇంతకుమించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ... ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే–మహత్వం – ఓం,కవిత్వం– ఐం,వశిత్వం– క్లీం పటుత్వం– హ్రీమ్,సంపద– శ్రీమ్ అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి– వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. ‘చాల పెద్ద’ అద్భుతమయిన ప్రయోగం. సంస్కతంలో ‘మహా శక్తి’ అన్న మాటకు తెలుగు అనువాదం. చదవండి: లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే?దురితాలను పోగొట్టేది; దుర్గంలా మన చుట్టూ రక్షణకవచంలా నిలబడేది దుర్గ. మనలో, మన చుట్టూ ఉండి నడిపించే శక్తిని కాళిదాసు దర్శించినట్లు మనం కూడా సర్వవిశ్వాత్మికగా దర్శించగలిగితే మనకు కూడా దుర్గ కట్టని కోటగా నిలబడి రక్షణనిస్తుంది.– పమిడికాల్వ మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు -
ఖాన్లు చేస్తున్న రావణ బొమ్మ
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లోని ఒక ముస్లిం కుటుంబానికి దసరా వస్తుందంటే చాలు... చేతి నిండా పని ఉంటుంది. తరతరాలుగా ఈ కుటుంబం దసరాకు రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారు చేస్తోంది. ఈ ఏడాది ప్రత్యేకత విషయానికి వస్తే 80 అడుగుల ఎత్తులో రావణాసురుడి దిష్టి బొమ్మను తయారుచేశారు.‘తాతముత్తాతల కాలం నుంచి ఈ పనిలో ఉన్నాం. మా తాత చేసిన పనిని మా నాన్న చేశాడు. నాన్న చేసిన పనిని నేను చేస్తున్నాను. నేను చేసిన పనిని పిల్లలు చేస్తున్నారు. ఈ పనివల్ల పెద్దగా డబ్బు సం΄ాదించక΄ోయినా మా తాతలు చేసిన పనిని మేము కొనసాగించడం సంతృప్తిగా, సంతోషంగా ఉంది’ అంటున్నాడు ముంతాజ్ ఖాన్.ఖాన్ కుటుంబం తయారు చేసిన దిష్టి బొమ్మల కోసం మొరాదాబాద్, ఫతేపూర్, హపూర్...లాంటి ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ సంవత్సరం హరియాణా, పంజాబ్‌ల నుంచి కూడా దిష్టిబొమ్మల కోసం ఆర్డర్లు వస్తున్నాయి‘దిష్టిబొమ్మల తయారీలో మేము ఉపయోగించే గన్ ΄ûడర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలుష్య రహితంగా ఉంటుంది. పెద్ద అధికారులు ఈ దిష్టిబొమ్మలను తనిఖీ చేసిన తరువాతే విక్రయిస్తాం’ అంటున్నాడు ఖాన్.రావణుడి దిష్టి బొమ్మలను తయారు చేయడం అనేది ఒక ముస్లిం కుటుంబం చేసే పని అనుకోవడం కంటే మన దేశంలో మతసామరస్యానికి ఉదాహరణ అని సగర్వంగా చెప్పుకునే పని. -
ప్రతి అమ్మా దుర్గమ్మే
విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...పదవరోజుతో ఎందుకు ముగించాలి...లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.అమ్మ చేతిలో మారణాయుధాలా?మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు. -
విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారం..!
శరన్నవరాత్రి మహౌత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. పలు చోట్ల ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భకుల్తకు వరాలూగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచ్తెతన్యాన్నిఈ రాజరాజేశ్వరి దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత.ఆ పేరు ఎలా వచ్చిందంటే..దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం వచ్చింది ఈ విజయదశమి రోజే అని పురాణ కథనం. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది .ఈ విజయదశమి నాడు తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైన వాటితో నిమిత్తం లేకుండా కార్యం చేపట్టొచ్చు. పైగా తప్పక విజయం వరిస్తుంది. ఈ పర్వదినాన చేసే 'శమీపూజ' చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి.. తిరిగి ఆయుధాలను వస్త్రములను పొందారు. శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కురుక్షేత్రంలో కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయాన్ని పొందాడు. ఇక తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.“శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||"ఈ అపరాజితాదేవిని పసుపు పచ్చని పూలతో పూజించాలి. ఆ తర్వాత శక్త్యానుసారం సువాసినీ పూజ చేయాలి. ఈ రోజు జపించాల్సిన మంత్రం..."ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. వీలైతే లలిత సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. నైవేద్యం: లడ్దూలు, బూర్లు, భక్ష్య భోజ్యాలు నివేదించాలి.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
శరన్నవరాత్రులు..తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా అలంకారం..!
అమ్మవారి ఆరాధనలతో సాగిన ఈ నవరాత్రులు అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అత్యంత మహిమాన్వితమైంది. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్ధినీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారు భక్తులు. మహిషాసురుడనే రాక్షసుడుతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా హోరాహోరీగా పోరు సలిపి.. ఆశ్వయుజ శుక్ల నవమి రోజున ఉగ్ర రూపంలో అంతమొందించిందని పురాణ కథనం. అందువల్లే దుర్గమ్మను మహిషాసుర మర్దినిగా కొలుచుకుంటున్నారు భక్తులుమరికొన్ని చోట్ల చివరి రోజున దుర్గమ్మను సిద్ధిధాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది. ఈ మాతకు నాలుగు చేతులు ఉన్నాయి. కుడి చేతిలో శంఖం, చక్రం, ఎడమవైపున చేతిలో తామరపువ్వులు ఉంటాయి. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రీ మాత అణిమ, ఇషిత్వ, వశిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని, పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. అంతేగాదు ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారు.నైవేద్యంగా..వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం, చక్కెర పొంగలి నివేదిస్తారు.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!
దేశమంతటా పెద్దఎత్తున జరుపుకొనే పండగల్లో ఒకటైన ‘దసరా’ను పదిరోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఆ అమ్మను సేవించడం, ఆమె కొలువు తీరి ఉన్న ప్రాంతాలను దర్శించుకుని భక్తితో తన్మయులం కావడం సహజం. అందుకే ఈ పండుగ రోజులలో దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రాలుగా మారతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి నామాల మీదుగా ఏకంగా కొన్ని నగరాలు... ఆ మాటకొస్తే మహానగరాలే వెలశాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది ముమ్మాటికీ నిజం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పేర్ల మీద వెలసిన కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం..కాళీ ఘాట్ పేరు... కోల్కతామామూలుగానే కోల్‌కతా పేరు చెప్పగానే కాళీమాత నిండైన విగ్రహమే మనో ఫలకంలో మెదులుతుంది. ఇక దసరా సందర్భంగా అయితే కోల్‌కతా మహా నగరంలో అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. ఇంతకూ కోల్‌కతాకు ఆ పేరు రావడానికి కారణమేమిటో తెలుసా? కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను దయతో కా΄ాడుతుంది. అలాగే ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీమాత కొలువైన ‘కాళీఘాట్ కాళీ దేవాలయా’నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం.ముంబయి – ముంబాదేవిముంబాయికి దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఆలయంలోని ముంబాదేవి పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని ప్రతీతి. వెండి కిరీటం, బంగారు కంఠసరి, ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది అమ్మవారు. పార్వతీమాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. మత్స్యాంబ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు ‘ముంబా దేవి’గా మారినట్లు స్థల పురాణం చెబుతోంది.శ్యామలా దేవి పేరే సిమ్లాకుసిమ్లా.. సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా వెలసిన నగరం కాబట్టే సిమ్లాకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.చండీ మందిర్...చండీగఢ్చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన ‘చండీ మందిర్’ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి అదనపు సొబగులు.మంగళూరు... మంగళాదేవికర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన మంగళూరుకు ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళాదేవి ఆలయాన్ని పరశురాముడు నెలకొల్పినట్లు తెలుస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపారాజ వంశస్థుడు కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్పకళా రీతిలో కట్టించాడు. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.పటన్ దేవి పేరుతో పట్నాపట్నాకు ఆ పేరు రావడానికి శక్తి స్వరూపిణి అయిన ‘పతన్ దేవి’ అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానంద కారి పతనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు ‘పతనేశ్వరి’గా, ఇప్పుడు ‘పతన్ దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది.నైనాదేవి పేరుతో నైనితాల్ నగరందక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థలపురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవిని, మహిషపీత్ అని కూడా పిలుస్తారు. అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు ‘‘నైనా దేవి’గా పూజలందుకుంటోందట. శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.మరికొన్ని ప్రదేశాలుత్రిపుర – త్రిపుర సుందరి మైసూరు – మహిషాసుర మర్దిని కన్యాకుమారి – కన్యాకుమారి దేవి తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)– డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..)