Expert Advice
-
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
డబ్బుల్ని ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది? ఎంత ఆదాయం వస్తుంది?
మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిశీలించాలి?– శశాంక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోని చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – గోపాల్ రామ్ ఇన్వెస్టర్లలో చాలా రకాలు ఉంటారు. కొందరు కేవలం రాబడుల వృద్ధిని చూస్తుంటారు. కొందరు పెట్టుబడి ద్వారా పన్ను తగ్గించుకోవాలని భావిస్తుంటారు. కొందరు క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొందరు స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెడుతుంటారు. అయితే స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు ప్రధానంగా తమ పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. ఈ విషయంలో ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి (3 శాతం) కంటే ఎఫ్డీలో వచ్చే రాబడే ఎక్కువ. ఎఫ్డీలు ఎంతో సురక్షితమైనవి. బ్యాంకులు సంక్షోభంలో పడినా, ఒక్కో డిపాజిట్ దారునికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై వచ్చే రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. ఒకవేళ 30 శాతం పన్ను పరిధిలో ఉంటే, అటువంటి వారికి ఎఫ్డీ మెరుగైన సాధనం అని చెప్పలేం. ఎందుకంటే వచ్చే 7 శాతం రాబడిలో 30 శాతం పన్ను చెల్లించడానికే వెళుతుంది. ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం మరో మార్గం డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్‌లో పెట్టుబడిని మూడేళ్ల వరకు ఉంచితే వచ్చే లాభంపై పన్ను 20 శాతంగా ఉండేది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే అవకాశం కూడా ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉంది. కానీ, ఈ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కనుక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతన్న దానితో సంబంధం లేకుండా వచ్చే రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక పన్ను పరంగా ఎఫ్డీలకు సమానంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా కేంద్రం మార్చేసింది. కనుక ఇన్వెస్టర్లు వీటిల్లో తమకు ఏది సౌకర్యం అనిపిస్తే దానినే ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అయితే అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. అందుకని ఒక వేళ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అధిక నాణ్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్ ఎక్కువ. డిఫాల్ట్ రిస్క్ కూడా ఉంటుంది. -
స్కూల్‌కి వెళ్లనని పిల్లలు మారాం చేస్తున్నారా? ఇలా చేసి చూడండి
ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పేరెంట్స్‌కు పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా నిద్ర లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను తొందరగా నిద్ర లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.... సమస్యను అర్థం చేసుకోవాలి.. ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గమనించాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా... అసలు నిద్రపట్టలేదా... ఇంకేదైనా సమస్య ఉంటే అనునయంగా అడిగి తెలుసుకోవాలి. సరిపోయిందా లేదా? స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి. ప్రేమతో లేపాలి ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చే మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమతో చెప్పాలి. ఇష్టమైన ఫుడ్ పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరగా నిద్ర లేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య తీరినట్టే. -
రాంబాబు.. ముగ్గురితో పెళ్లిళ్లు, విడాకులు.. విషయం ఏంటంటే..
ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, మెంటల్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాళ్లు తమ సమస్యలను పంచుకున్నా ఇదేమంత సమస్య కాదులే అని కొట్టిపారేస్తాం. మరికొన్ని సార్లు దాన్ని అసలు సమస్యగా కూడా గుర్తించం. అలాంటి వాటిలో బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఒకటి. రాంబాబు ప్రవర్తన చిన్నప్పటినుంచి భిన్నంగా ఉండేది. దాంతో ‘మావాడు కొంచెం తేడాలే, వాడికి తిక్క ఎక్కువ’ అని కుటుంబ సభ్యులే అంటుండేవారు. సరిగా చదవడం లేదని.. మందలించారని ఇంటర్మీడియట్లో ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. సకాలంలో చూసి కాపాడారు. కొన్నాళ్లు హుషారుగా ఉంటే, మరికొన్నాళ్లు దిగులుగా గదికే పరిమితమయ్యేవాడు. పాతికేళ్ల వయసులో నీరజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వద్దంటే ఏం చేసుకుంటాడోనని ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ అతని మూడ్ స్వింగ్స్‌ని, కోపాన్ని భరించలేక ఏడాదికే నీరజ పుట్టింటికి చేరింది. ఆమెకు విడాకులిచ్చాక రేణుకను పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కన్నాడు. పదేళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చి అనూషను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఆమెనూ వదిలేశాడు. బాగా నడుస్తున్న వ్యాపారాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగి భారీగా నష్టపోయాడు. దాంతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో ఇంట్లో అరుస్తుండేవాడు. రాంబాబు బాధ చూడలేక, పడలేక అతని పేరెంట్స్ ఫోన్ చేసి సమస్యను వివరించారు. అతని సహకారం లేకుండా ఏమీ చేయలేమని చెప్పాక, నచ్చజెప్పి కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. మొదటి సెషన్లో అతనితో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. బాధాకరమైన బాల్యం బీపీడీ సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమవుతుంది. పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న వ్యక్తులు, పర్యావరణ పరిస్థితులు వంటివి బీపీడీకి దారితీసే అవకాశం ఉంది. ఇది జన్యుపరమైన సమస్య. కుటుంబంలో ఎవరైనా ఇలాంటి మానసిక సమస్యల బారిన పడినవారు ఉంటే వంశపారంపర్యంగా రావచ్చు. బాల్యంలో చూసిన, అనుభవించిన బాధాకరమైన సంఘటనలు ఈ రుగ్మతను మరింత ఎక్కువ చేస్తాయి. బీపీడీ ఉన్న వ్యక్తుల్లో 70శాతం మంది బాల్యంలో లైంగిక, భావోద్వేగ, శారీరక వేధింపులను అనుభవించి ఉంటారు. తల్లిదండ్రులతో సరైన అనుబంధం లేకపోవడం, కఠినమైన నిబంధనలు, కుటుంబంలో ఆల్కహాల్ వినియోగం కూడా కారణాలై ఉంటాయి. బీపీడీ ఉన్నవారి మెదడులో భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించే భాగాలు సరిగా కమ్యూనికేట్ చేయవు. అది మెదడు పని విధానాన్ని ప్రభావితం చేస్తుంది. నాటకీయ ప్రవర్తన, అస్థిర బంధాలు బీపీడీ వ్యక్తిత్వసంబంధమైన ఒక మానసిక రుగ్మత. విపరీతమైన మూడ్ స్వింగ్స్, మానవ సంబంధాల్లో అస్థిరత, ఇంపల్సివిటీ దీని ప్రధాన లక్షణాలు. మీ గురించి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఇతరులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనేదాన్ని ప్రభావితం చేస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, విడిచిపెడతారని భావిస్తుంటారు. అలాంటప్పుడు వారిని ట్రాక్ చేస్తారు. ఆ వ్యక్తికి దగ్గరగా ఉండేందుకు అందరినీ దూరంగా ఉంచుతారు. తిరస్కరణ, నిర్లక్ష్యం ఎదురైనప్పుడు స్వీయ హాని, బెదిరింపులు, ఆత్మహత్య ఆలోచనలు ఉండవచ్చు. ఇతరులపై తమ అభిప్రాయాలను ఆకస్మికంగా, నాటకీయంగా మార్చుకుంటారు. దీనివల్ల స్నేహాలు, వివాహాలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు తరచుగా అస్తవ్యస్తంగా, అస్థిరంగా ఉంటాయి. వారి గురించి వారికే సరైన ఇమేజ్ ఉండదు. దానివల్ల తరచూ గిల్టీగా ఫీలవుతుంటారు. తనను తానే చెడుగా చూస్తారు. వృత్తిని, లక్ష్యాలను, స్నేహితులను అకస్మాత్తుగా మార్చడం ద్వారా తమ సెల్ఫ్ ఇమేజ్‌ని మార్చి చూపించాలని ప్రయత్నిస్తారు. అదుపు చేసుకోలేని కోపం, భయం, ఆందోళన, ద్వేషం, విచారం, ప్రేమ తరచుగా, వేగంగా మారతాయి. కోపాన్ని నియంత్రించుకోలేక వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఈ మూడ్ స్వింగ్స్ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకూ ఉంటాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఫైటింగ్, జూదం, డ్రగ్స్ వినియోగం, అతిగా తినడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాలు సాధారణం. విచారంగా, విసుగుగా, శూన్యతగా భావిస్తారు. విపరీతమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మతిస్థిమితం లేని ఆలోచనలు, కొన్నిసార్లు భ్రాంతులు ఉంటాయి. ఒంటరిగా వదిలేయొదు. బీపీడీలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను ఎవరికి వారు గుర్తించలేరు. స్నేహితులో, సన్నిహితులో, కుటుంబ సభ్యులో గుర్తించాలి. మీకు తెలిసిన వారిలో బీపీడీ లక్షణాలు కనిపించినప్పుడు ఒంటరిగా వదిలేయకుండా సైకాలజిస్టును సంప్రదించండి. సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. చికిత్సకు ఏడాదికి పైగా సమయం పట్టవచ్చు. అందువల్ల సహకారం, సహనం, నిబద్ధత అవసరం. · కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా చికిత్స ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. మీ భద్రత ప్రమాదంలో ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ, స్కీమా ఫోకస్డ్ థెరపీ, సైకోడైనమిక్ సైకోథెరపీ లాంటివి బీపీడీ చికిత్సలో ఉపయోగపడతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, బాధలను తట్టుకోవడం, సంబంధాలను మెరుగుపరచుకోవడం ఎలాగో నేర్పుతాయి. ప్రతికూల జీవన విధానాలకు దారితీసిన పరిస్థితులను గుర్తించి, సానుకూల జీవన విధానాలను ప్రోత్సహిస్తాయి. -
అనిత ఈ కాలం పిల్ల కాదని మెచ్చుకునేవారు.. కానీ భర్తకు అసలు విషయం తెలిసి..
షాపింగ్‌కి ఆడవాళ్లు ముందుంటారని అందరూ అంటుంటారు. కానీ అనితకు షాపింగ్ అంటే చిరాకు. తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా వెళ్లేది కాదు. ఇల్లు, కాలేజీ తప్ప మరోచోటికి కదలదు. ఎక్కడికైనా వెళ్లినా అక్కడేమీ తినదు. ఎంత అవసరం వచ్చినా పబ్లిక్ రెస్ట్ రూమ్‌లకు వెళ్లదు. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏంటంటే కనీసం సెల్‌ఫోన్ కూడా వాడదు. దాంతో అందరూ ‘అనిత ఈ కాలం పిల్ల కాదమ్మా’ అని మెచ్చుకునేవారు. ఇంజినీరింగ్ ఫైనలియర్లో ఉండగానే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి వేడుకల్లో కూడా బిడియంగానే ఉంది. పెళ్లి కూతురుకు సిగ్గు ఎక్కువ అనుకున్నారు అందరూ. ఆ తర్వాత బెంగళూరులో కాపురం పెట్టారు. వీకెండ్స్‌లో హరి బయటకు వెళ్దామన్నా వద్దనేది. కొత్తదనం వల్ల అనుకున్నాడు. కానీ కూరగాయలకు కూడా బయటకు వెళ్లకపోవడం, దగ్గర్లోని షాపింగ్ మాల్కి వెళ్లాలన్నా వణికిపోవడం గమనించి.. సమస్య ఏమిటని అడిగాడు. కొత్త వ్యక్తులను కలవాలన్నా, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలన్నా తనకు భయమని, అలాంటి సందర్భాల్లో గుండె వేగం పెరుగుతుందని, ఆందోళనగా ఉంటుందని చెప్పింది. అది సిగ్గు కాదని, ఏదో మానసిక సమస్య అని హరి అర్థం చేసుకుని ఆన్లైన్ కౌన్సెలింగ్ కోసం సంప్రదించాడు. అనితతో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె సోషల్ ఫోబియా లేదా సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ లేదా అఈతో బాధపడుతోందని అర్థమైంది. అది సిగ్గు, బిడియం కాదు.. సిగ్గు కంటే అఈ భిన్నంగా ఉంటుంది. సిగ్గు పదిమందిలో కలవడానికి మాత్రమే అడ్డుపడితే, అఈ షాపింగ్, జాబ్ లాంటి రోజువారీ కార్యకలాపాలనూ కష్టతరం చేస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారికి తమ భయాలు అహేతుకమని తెలిసినా, వాటిని అధిగమించ లేరు. తమను ఇతరులు గమనిస్తుంటారని, తమ గురించే మాట్లాడుకుంటారని ఆందోళన చెందుతుంటారు. టీనేజ్‌లో ప్రారంభమయ్యే ఈ సమస్య దాదాపు 8 నుంచి 10 శాతం మందిలో ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అఈకి కచ్చితమైన కారణం తెలియదు. అయితే భౌతిక, జీవ, జన్యుపరమైన కారకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడే సెరటోనిన్, డోపమైన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. అలాగే బాల్యంలో శారీరక, మానసిక హింస, తల్లిదండ్రుల అతి నియంత్రణ, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులూ కారణం కావచ్చు. జనాల్లోకి వెళ్లాలంటే వణుకు ► అఈని నిర్ధారించడానికి ఎలాంటి వైద్య పరీక్ష లేదు. కుటుంబ చరిత్ర, వ్యక్తి లక్షణాలను బట్టి నిర్ధారిస్తారు. ప్రతి ఒక్కరూ కొన్ని సమయాల్లో ఆందోళనకు గురవుతారు. అఈ ఉన్న వ్యక్తులు ఇతరులు తమను ఏమైనా అనుకుంటారేమో, అవమానిస్తారేమో నిరంతరం భయపడుతుంటారు. ► మొహం ఎర్రబడటం, వికారం, చెమటలు పట్టడం, వణుకు, కండరాలు పట్టేయడం, తల తిరగడం, గుండెవేగం పెరగడం, మైండ్ బ్లాంక్ అయినట్లు అనిపించడం, మాట్లాడటం కష్టమవ్వడం లాంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. ► తన భయాందోళనలను ఇతరులు గమనిస్తారనే ఆందోళన, దీన్నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ తీసుకోవాలని భావించడం, ఆందోళన కారణంగా స్కూల్ లేదా కాలేజీ లేదా వర్క్ ఎగ్గొట్టడం వంటి మానసిక లక్షణాలు ఉంటాయి. మనిషిని బట్టి థెరపీ అఈతో బాధపడుతున్న వ్యక్తుల్లో మూడింట ఒక వంతు మంది కనీసం పదేళ్లపాటు దీన్ని సమస్యగా చూడరు. చూసినా సహాయం కోరరు. దీన్ని అధిగమించేందుకు రకరకాల థెరపీలు సహాయపడతాయి. అయితే ఏ థెరపీ ఎంత బాగా పనిచేస్తుందో వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి ఒక రకమైన చికిత్స మాత్రమే అవసరమైతే కొందరికి వివిధ థెరపీల కలయిక అవసరం కావచ్చు. కౌన్సెలింగ్, సైకోథెరపీ, లైఫ్ స్టైల్ మార్పులు, మందులతో దీన్ని ఎదుర్కోవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, మెడిటేషన్, యోగా లాంటివి ఒత్తిడిని మేనేజ్ చేయడానికి సహాయపడతాయి రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం, నిద్ర వంటివి ఆందోళనను కొంతవరకు తగ్గిస్తాయి. మనసైన వారితో మనసు విప్పి మాట్లాడటం కూడా ఆందోళన, ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలను సానుకూలమైన వాటితో భర్తీ చేయడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) సహాయం చేస్తుంది. ప్రతికూల భావాలు ఉన్నప్పటికీ విలువలతో ఎలా జీవించాలో acceptance and commitment థెరపీ ద్వారా తెలుసుకుంటారు. సామాజిక సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి గ్రూప్ థెరపీ సహాయ పడుతుంది. గ్రూప్‌లో పనిచేయడం వల్ల మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. సామాజిక పరిస్థితులను నివారించే బదులు క్రమంగా ఎదుర్కొనేందుకు ఎక్స్పోజర్ థెరపీ సహాయపడుతుంది. ఇవన్నీ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో జరగాలి. కౌన్సెలింగ్, థెరపీలతో రుగ్మత తగ్గకపోతే సైకియాట్రిస్ట్‌ని కలసి మందులు వాడాల్సి ఉంటుంది. -సైకాలజిస్ట్ విశేష్ -
తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు.. ఏం చేయాలి?
వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’ ► అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్రూమ్కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. ► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. ► మల్టిపుల్ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది. ► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది. ► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి. ► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. వెరీ డేంజర్!! చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. ధైర్యమే ఆయుధం వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు. కుటుంబం ప్రవర్తన మారాల్సిందే! కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే. మందలించాల్సిందే! ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే. ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్ని కలవడానికి ఇబ్బంది పడకూడదు. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ -
సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న యూత్.. ఇలా తయారయ్యారేంటి?
నేటి తరం.. ఒక కన్ఫ్యూజన్. తానేంటో తనకే తెలియదు. తనకు ఎలాంటి లైఫ్ పార్టనర్ కావాలో తెలియదు. అవతలి వ్యక్తి పర్సనాలిటీని కనిపెట్టలేరు. ఉద్రేకంతో మోహించి , అదే ప్రేమ అని భ్రమించి పెళ్ళాడి , మోజు తీరగానే కొట్లాడి పెటాకులు తెచ్చుకొని, ఇక పెళ్లి యుగం అయిపోయిందని తీర్పులు ఇస్తున్న చదువుకొన్న నాగరికులు. అయినా తప్పు వీళ్లది కాదు వీళ్ల చదువులది. అది అమెరికాలో ఉద్యోగం అయితే ఇప్పించింది. కానీ ఎలా బతకాలో చెప్పలేదు. ఇంకేముంది బతుకు బస్టాండ్ ,ఆపై డిప్రెషన్లు, సూసైడ్లు... పెళ్ళయితే ?.. భార్య భార్య / భర్త , పిల్లలే సంసారం. పెళ్లికి లీవ్, హనీమూన్‌కి లీవ్, మెటర్నిటీ లీవ్.. పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే రెండు, మూడు రోజులు లీవ్. భార్య,భార్తల్లో ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా మరొకరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అదేమంటే, ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే ఉద్యోగం అంటారు. ఇప్పుడప్పుడే పెళ్లి గట్రా వద్దంటున్నారు ఈ బ్రహ్మచారులు. 30దాటినా.. అప్పుడే పెళ్లికి, లివ్ఇన్కి తొందరేముంది? అంటూ నిర్మొహమాటంగానే చెప్పేస్తున్నారు. ఆపై ఉద్యోగమే సర్వస్వం అనుకొని కంపెనీ బానిసలుగా బతుకీడుస్తున్నారు. ఆఫీస్ జిందాబాద్, పెళ్లి, కుటుంబం డౌన్డౌప్ అంటూ పిచ్చి వాగుడు వాగేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి కుటుంబం ఛిన్నాభిన్నమేనా? మావోయిస్టుల కాలంలో చైనాలో.. “కుటుంబ వ్యవస్థ మనిషిలో స్వార్థాన్ని పెంపోందిస్తుంది.. కానీ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తేనే అసలుసిసలు కమ్యూనిజం వస్తుంది” అని పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ కొన్నాళ్లకే అది తస్సుమంది. యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కాపిటలిస్ట్ అమెరికాలో బహుళ జాతి కంపెనీలు.. కంపెనీ బానిసలను తయారుచేయడం కోసం ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాయి. మన దగ్గర్నుంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మనోళ్లు(కొత్తతరం) ఈ ట్రాప్‌లో పడిపోయి పెళ్లి శకం ముగిసింది అని బ్రహ్మచారి జీవితానికి సిద్ధమయిపోతున్నారు. -ఈ వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడు మన దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇంకా ఈ ట్రెండ్ ముదిరిపోక ముందే వేకప్ కాల్ అనుకొని పరిస్థితులను సమీక్షిస్తే మంచిది. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!
సునీత, సురేష్ అందమైన జంట.. వాళ్లకొక పాప. ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో పార్టీలు, నెలకోసారి విహారయాత్రలు, ఏడాదికోసారి విదేశీ యాత్రలు.. అంతా బాగానే ఉంది. కానీ నెలకో, రెణ్నెల్లకో గొడవ గ్యారంటీ. కారణాలు చాలా చిన్నవి..గొడవలు మాత్రం పెద్దవి. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. లాయర్‌నూ సంప్రదించారు. చివర్లో మిత్రుడి సలహా మేరకు మ్యారిటల్ కౌన్సెలింగ్‌కు వచ్చారు. సునీత, సురేష్‌లతో రెండు గంటలపాటు మాట్లాడాక.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. సునీత శాలరీ ఎంతో కూడా సురేష్‌కు తెలియదు. అడిగినా చెప్పదు. అది నీకు సంబంధంలేని విషయం అంటుంది. ఏ మాటంటే సురేష్‌కు కోపం వస్తుందో సునీతకు తెలియదు. ఏం చేస్తే సునీత సంతోషపడుతుందో సురేష్‌కు తెలియదు. పగలు ఎన్ని గొడవలున్నా.. రాత్రికి ఒకటైతే.. అన్ని గొడవలూ సర్దుకుంటాయని వారు బలంగా భావిస్తున్నారు. కానీ బంధం బలపడటానికి, నిలబడటానికి ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరమని వారికి తెలియదు. అందువల్ల వారెలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఫలితమే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. విడాకుల ప్రయత్నాలు. జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా అనేక మందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. వైవాహిక బంధంలో ఇది మరింత అవసరం. అయితే సాన్నిహిత్యం అనగానే చాలామంది సునీత, సురేష్లలా శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బంధాలు బలపడాలంటే ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరం. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. శారీరక సాన్నిహిత్యం: చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, తాకడం.. శారీరక సాన్నిహిత్యానికి ఉదాహరణలు. అయితే దీన్ని బహిరంగంగా ప్రదర్శించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సురేష్‌కు కూడా. భావోద్వేగ సాన్నిహిత్యం: భవిష్యత్తులో దంపతులిద్దరూ ఏం కోరుకుంటున్నారు, మీరు ఆందోళన చెందుతున్న విషయాలు, పని ఒత్తిడితో కూడిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సునీత, సురేష్‌ల మధ్య ఇది శూన్యం. మేధా సాన్నిహిత్యం: చదివిన పుస్తకం గురించి మాట్లాడటం, ఆలోచనలు, అనుభవాలు, ప్రశ్నలు పంచుకోవడం లాంటివి ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్‌కు నాన్ ఫిక్షన్ ఇష్టమైతే, సునీతకు ఫిక్షన్ అంటే ప్రాణం. అనుభవ సాన్నిహిత్యం: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలసి పంచుకునే అనుభవాలు ముఖ్యం. కలసి సమయాన్ని గడపడం, పనులు చేసుకోవడం వంటివి ఎక్స్‌పీరియెన్షియల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్, సునీతల మధ్య ఇది ఫర్వాలేదు. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం స్పిరిచ్యువల్ ఇంటిమసీ. సునీత భక్తురాలు. సురేష్ నాస్తికుడు. నిరంతరం ప్రయత్నించాలి.. ఎంతకాలం కలసి ఉన్నా, సాన్నిహిత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. సునీత, సురేష్‌లకు వారి మధ్య విభేదాలను వివరించడంతో పాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కౌన్సెలింగ్ చేశాను. అలాగే మీ జీవితంలో సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. శారీరక సాన్నిహిత్యమంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి· భాగస్వామి చెప్పే మాటలు వినడానికి, భావాలను పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమాయాన్ని కేటాయించడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది· భోజనం చేస్తున్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో కలసి ప్రదర్శనను చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్‌ను దూరంగా పెట్టండి · ఇద్దరూ కలసి కొత్త విషయాలను ఆస్వాదించడం సరదాగా ఉంటుంది. అందుకే ఇద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి· కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం మేధో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది· భాగస్వామి నమ్మకాల మేరకు ఆధ్యాత్మిక సందర్శనలు ప్లాన్ చేసుకోవాలి. ఆత్మీయతకు ఆటంకాలు ప్రతి బంధంలోనూ విభేదాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో భాగస్వామితో నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఆత్మీయతను దెబ్బతీస్తుంది పని, అనారోగ్యం, ఆర్థిక, పిల్లలు, ఇతర సమస్యల వల్ల కలిసి ఒత్తిడి కూడా దంపతుల సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది · భాగస్వామితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఆత్మీయత పెంపొం దించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా వ్యక్తీకరించలేకపోతే అది సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది· కొన్నిసార్లు, కొంతమంది గత అనుభవాలు, గాయాల వల్ల భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటారు. సునీతలో ఇది కనిపించింది. (చదవండి: ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న ప్రమాదమే..!) -
పిల్లల్ని ఎప్పుడు కనాలి? సైంటిస్టులు తేల్చేశారు.. అదే సరైన సమయమట
30ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వాళ్లు చాలామందే ఉన్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే.. అప్పుడేనా? ఏమిటంత తొందర అన్నట్లు సమాధానమిస్తుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీది ప్లానింగ్ చేసుకోక తప్పదు. పెళ్లి దగ్గర్నుంచి చివరకు పిల్లల విషయంలో కూడా ప్లానింగ్‌తోనే ఉంటున్నారు ఈ కాలం దంపతులు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా వాళ్ల దగ్గర ఓ థియరీ ఉంటుంది. కానీ వయసైపోయాక పిల్లల్ని కనాలంటే డెలీవరీకి ఇబ్బందులుంటాయని, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏంటన్నది నిర్థారించారు. ఈ జనరేషన్లో భార్యభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదించడానికి పెట్టిన శ్రద్ధ ఫ్యామిలీ ప్లానింగ్‌పై పెట్టడం లేదు. లైఫ్‌లో సెటిల్ అయ్యాక తీరిగ్గా పిల్లల్ని కనవచ్చులే అని లైట్ తీసుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ పిల్లల్ని కనేందుకు మహిళలకు 23 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసు సరైన సమయం అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ వయసులో బిడ్డలకు జన్మనిస్తే అసాధారణ పిండాలు లాంటి నాన్క్రోమోజోమల్ వంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 32 దాటాక పిల్లల్ని కంటే డెలీవరీ సమయంలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని హంగేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
ప్రెగ్నెన్సీ ఐదో నెల..సిజేరియన్‌కి వెళ్లొచ్చా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు అయిదవ నెల. ఎలాంటి పరిస్థితిలో సిజేరియన్‌కి వెళ్లొచ్చో చెప్తారా? – సీహెచ్. రమోల, చెన్నై మీకిప్పుడు అయిదవ నెల అంటున్నారు. సాధారణంగా సుఖ ప్రసవమా? లేక సిజేరియనా అనేది తొమ్మిదవ నెలలో అయితే కచ్చితంగా చెప్పగలుగుతాం. తల్లీ, బిడ్డ కండిషన్‌ను ఫిజికల్ ఎగ్జామ్, స్కానింగ్ ద్వారా చెప్పవచ్చు. కానీ కొన్ని కండిషన్స్‌లో మాత్రం తప్పకుండా సిజేరియనే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంతకుముందేమైనా గర్భసంచికి సంబంధించిన సర్జరీ, రెండు లేదా ఎక్కువసార్లు సిజేరియన్ అయినా, మైయోమెక్టమీ (ఫైబ్రాయిడ్‌ను తొలగించే శస్త్రచికిత్స) సర్జరీ అయినా, యూటరైన్ అనామలీస్ (పుట్టకతోనే గర్భసంచీకి సంబంధించిన సమస్య) ఉన్నా, తొమ్మిదోనెలలో మాయ కిందకి ఉన్నా, పొట్టలో బిడ్డ ట్రాన్స్వర్స్ పొజిషన్ లేదా బ్రీచ్ పొజిషన్లో ఉన్నా, కవలలు, ట్రిప్లెట్స్ ఉన్నా. బిడ్డ రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉన్నా, బిడ్డ నాలుగున్నర కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్నా, బీపీతో ఫిట్స్ వచ్చినా, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, తొమ్మిదవనెలలో 38–39 వారాల మధ్య ముందుగానే అనుకుని సిజేరియన్ చేస్తారు. ఒకవేళ సాధారణ కాన్పులో నొప్పులు వస్తున్నప్పుడు.. బిడ్డ హార్ట్ బీట్ తగ్గినా, రక్తస్రావం అధికంగా అవుతున్నా.. ప్రోగ్రెస్ సరిగా లేనప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ఈ మధ్య మెటర్నల్ రిక్వెస్ట్ మీద కొంతమందికి ఆపరేషన్ చేస్తున్నారు. ఇది తల్లి ఆరోగ్యానికి అంత మంచిదికాదు. పేషంట్, కుటుంబానికి కౌన్సెలింగ్ చేసి.. సాధారణ కాన్పుతో ఉన్న ఉపయోగాలను, ఆపరేషన్ వల్ల కలిగే ఇబ్బందులను వివరించి అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లను ఆపుతున్నారు. -
7లక్షలు అప్పు చేసి కారు కొన్నా.. లోన్ త్వరగా తీర్చేందుకు ఏమైనా ఫండ్స్ ఉన్నాయా?
నేను ఇటీవలే ప్రత్యామ్నాయ రుణ సాధనాల గురించి వింటున్నాను. ముఖ్యంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలిసింది. వీటికి మంచి చరిత్ర ఉందా? అవి 12 శాతం వరకు రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. వీటితో ఏదైనా రిస్క్ ఉంటుందా? – శ్రీరామ్ రామనాథన్ ఈక్విటీలన్నవి సంపద సృష్టికి అనుకూలమైనవి. ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలు పెట్టుబడి రక్షణ, క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఉద్దేశించినవి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ (ప్రత్యామ్నాయ సాధనాలు) సంప్రదాయ ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్, నగదుకు అదనపు వ్యూహాలు మాత్రమే. ఇవి ప్రధానంగా ఐదు విభాగాలు. హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్యాపిటల్, నేచురల్ రీసోర్సెస్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటన్నింటిలోనూ లిక్విడిటీ తక్కువ. నియంత్రణలు తక్కువ. పారదర్శకత తక్కువ. వ్యయాలు ఎక్కువ. రిస్క్, రాబడులకు సంబంధించి చారిత్రక డేటా తక్కువగా ఉంది. అందుకుని ఈ అస్సెట్ క్లాస్ (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) అనేది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సూచనీయం కాదు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారాలకు స్వల్పకాల రుణ సదుపాయమే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. సాధారణంగా వీటిని బ్యాంకులు సమకూరుస్తుంటాయి. ప్రైవేటు క్యాపిటల్ పరిధిలోకి ఇవి వస్తాయి. ఇది చాలా పూర్వం నుంచి ఉన్న సాధనం. బ్యాంకులే దీనికి సారథ్యం వహిస్తున్నాయి. ఇందులో రాబడులు పరిమితం. నూరు శాతం నష్టానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఏదైనా కంపెనీకి రుణంపై వస్తువులు సరఫరా చేశారనుకుందాం. దానికి బిల్లు జారీ చేస్తారు. రుణ కాల వ్యవధి ముగిసిన తర్వాత ఆ బిల్లు మొత్తాన్ని కొనుగోలుదారుడు చెల్లిస్తాడు. ఈ రుణం కాల వ్యవధి సాధారణంగా 30–90 రోజులుగా ఉంటుంది. అంటే మీరు సరఫరా చేసిన వస్తువుల బిల్లు మొత్తం మీకు తిరిగి వచ్చేందుకు ఇన్ని రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లోపే మీకు డబ్బులు అవసరపడ్డాయని అనుకుంటే అప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లి ఈ బిల్లును ఇచ్చి దాన్ని నగదుగా మార్చుకోవచ్చు. మరి బ్యాంకులకు ఇందులో ప్రయోజనం ఏమిటి? బ్యాంకులు ఈ బిల్లు మొత్తంలో కొంత తగ్గించి మిగిలినది ఇస్తాయి. అందుకే దీనికి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనే పేరు వచ్చింది. నూరు సంవత్సరాలకు పైగా బ్యాంకులు ఈ వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం ఇది అందుబాటులోకి వచ్చింది. పలు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వాయిస్కు మీరు ఫండ్ సమకూర్చిన తర్వాత, డబ్బులు తిరిగి రాకపోతే పరిస్థితి ఏంటి? అన్నది ఆలోచించుకోవాలి. ఇన్వెస్టర్‌గా రాబడుల కంటే రిస్క్‌ను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. అదే బ్యాంకులు అయితే డిఫాల్ట్ ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. ఇందులో లిక్విడిటీ ఉండదు. మీరు విక్రయించాలనుకుంటే కొనుగోలు చేసే వారు లభించడం కష్టం. వీటికంటే ఈక్విటీలు మెరుగైన సాధనం. కారు కొనుగోలుకు రూ.7 లక్షల రుణం తీసుకున్నాను. దీన్ని ఏడేళ్ల కంటే ముందుగా తీర్చేసేందుకు ఏవైనా ఫండ్స్‌ను సూచించగలరా? – ఆదిత్య కారు రుణాన్ని ముందుగా చెల్లించేయాలన్న మీ ఆలోచన మంచిది. అయితే కారు వంటి తరిగిపోయే ఆస్తి కొనుగోలుకు రుణం తీసుకోవడాన్ని సాధారణంగా ప్రోత్సహించం. మీరు ఏడేళ్లలోపు రుణం తీర్చేయాలని అనుకుంటున్నారు కనుక.. మీరు స్వల్పకాలం నుంచి మధ్యకాలిక మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల మీరు పెట్టుబడిని రక్షించుకోవడంతోపాటు రాబడులు సొంతం చేసుకోగలరు. మూడు నుంచి నాలుగేళ్ల తర్వాత కారు రుణాన్ని చెల్లించేద్దామని అనుకుంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఇవి ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేసి, అచ్చమైన డెట్ కంటే మెరుగైన రాబడులు ఇస్తాయి. మూడు నాలుగేళ్లలోపే తీర్చేయాలని భావిస్తే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. -
కూతురిపై ఉన్న నమ్మకం గెలిచినా!..బయటపడ్డ మరో నిజం ఆ తల్లిని..
పాపం నిండా 15 ఏళ్లు నిండని ఓ టీనేజర్.. శరీరంలో ఏదో మార్పు. అర్థం కాలేదు. విపరీతమైన వెన్ను నొప్పి. కూర్చొలేదు, నుంచోలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక వైద్యులను సంప్రదించింది. పలు వైద్య పరీక్షల తర్వాత బయటపడ్డ నిజం విని నమ్మలేకపోయింది. తల్లిదండ్రులు ఏం అంటారో తెలియక తల్లడిల్లింది. వైద్యులు చెప్పింది నిజం కాదని ఆ అమ్మాయి నమ్మకం. కానీ చివరికి పరీక్షలు తర్వాత బయటపడ్డ మరో నిజం మరింత ఘోరంగా, దారుణంగా ఉంది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న హాలీ అనే టీనేజ్ అమ్మాయి 2019 జనవరిలో వెన్ను నొప్పితో తల్లడిల్లింది. దీంతో ఆస్పత్రి వెళ్లింది. పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ప్రెగ్నెంట్ అని తేల్చారు. దీంతో ఆ అమ్మాయికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైయ్యింది. ఆమెకు గట్టి నమ్మకం తాను ప్రెగ్నెంట్ కాదని. ఎందుకంటే ఆమె అప్పుడు 15 ఏళ్ల మాత్రమే. ఈ విషయం విని తన తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని చాలా భయపడింది. ఐతే ఆమె తల్లి దీన్ని నమ్మలేదు. మరోవైపు ఆమె బరువు తగ్గిపోవడం, తలనొప్పి, అలసట వంటి విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె తల్లిదండ్రలు జోక్యంతో ఆమెకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి అల్ట్రాసౌండ్ పరీక్షలో ఆమె కడుపులో బిడ్డ లేదని తేలింది. ఐతే రిపోర్ట్ల్లో గుండె పగిలే మరో నిజం బయటపడింది. ఈ నిజం ఆమెను, తల్లిదండ్రులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ఆ వైద్య పరీక్షల్లో ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉందని తేలింది. ఆ కణుతులు ఊపిరితిత్తుల వరకు వ్యాపించి..స్టేజ్ 4దశలో ఉన్నట్లు వెల్లడైంది. చివరికి పలు చికిత్సలు అనంతరం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది హాలీ. (చదవండి: డయాబెటిస్ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నారని అర్థం!) -
Q & A: ఇల్లు కొందామనుకుంటున్నా.. డౌన్‌పేమెంట్ కోసం ఈక్విటీ ఫండ్స్ కరెక్టేనా?
నేను వచ్చే 15 ఏళ్లలో రూ.2.5–3 కోట్ల వరకు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. డౌన్‌పేమెంట్ సమకూర్చుకునేందుకు... టాటా స్మాల్‌క్యాప్ లేదంటే ఎడెల్వీజ్ స్మాల్‌క్యాప్, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అన్నవి మంచి ఎంపికలేనా? – ఆదిత్య బి మీరు ఇప్పటి నుంచి 10–15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికతో ఉంటే సరైన ట్రాక్‌లో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత వ్యవధి ఉంది. ఈక్విటీ ఫండ్స్‌లో మోస్తరు రాబడులకు ఇంతకాలం అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో మీ ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి కొనుగోలుకు అయ్యే ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అంచనా వేస్తునట్టు అయితే, దీనికి రియల్ ఎస్టేట్‌లో ఉండే సగటు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని జోడించాల్సి ఉంటుంది. అప్పుడు వాస్తవ కొనుగోలు ధరపై అంచనాకు రావాలి. దీనివల్ల డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు నెలవారీగా ఎంత మేర సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై స్ప ష్టత సాధించొచ్చు. సిప్ మొత్తాన్ని రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పథకాలను కూడా జోడించుకోవచ్చు. కాకపోతే వీటిల్లో 25–30 శాతానికి మించి కేటాయింపులు చేసుకోవద్దు. మీ రిస్క్ సామర్థ్యం, ఈక్విటీ ఫండ్స్ పట్ల మీకు ఉన్న గత అనుభవం ఆధారంగా కేటాయింపులపై నిర్ణయానికి రావాలి. గృహ రుణానికి చెల్లించే ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. ఇందుకు గాను కావల్సినంత డౌన్ పేమెంట్‌ను ముందే సమకూర్చుకోవాలి. మరోవైపు ఇంటిని పెట్టుబడిగా చూడడం మంచి ఆలోచన కాదు. రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ చాలా తక్కువ. ఇంటిని కొనుగోలు చేయడం, విక్రయించడం అంత సులభం కాదు. కనుక ఇంటి కొనుగోలు నివాసం కోణం నుంచే చూడాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సొంతిల్లు ఏ వయసుకు సమకూర్చుకోవాలి..?
మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి మారకం విలువను హెడ్జ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు. – ప్రవీణ్ షా ఐదు, పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే ఇప్పటికి చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చి న్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. సామర్థ్యం, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకో వాలి. మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీ మ్యూ చువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక అంతర్జాతీయ ఫండ్ ఎంపిక కీలకమని తెలుసుకోవాలి. నా వయసు 22 సంవత్సరాలు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఏ వయసుకు సొంతిల్లు సమకూర్చుకోవాలి? – రషీద్ సొంతిల్లు విషయంలో అందరికీ సరిపోయే ఏకైక ప్రామాణిక పరిష్కారం ఉందని అనుకోవడం లేదు. కాకపోతే ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఇవి సరైన నిర్ణయం తీసుకునేందుకు సాయపడతాయి. చాలా మందికి సొంతిల్లు ఆర్థికంగా అతిపెద్ద ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ఇంటి రుణం పేరుతో అతిపెద్ద ఆర్థిక బాధ్యత వచ్చి పడుతుంది. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చొప్పున (ఈఎంఐ) చాలా ఏళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆర్థికంగా ఏ మేరకు స్థిరపడ్డామన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలి. తమ ఉద్యోగం లేదా వృత్తి జీవితంలో స్థిరత్వం గురించి స్పష్టతకు రావాలి. అప్పుడే తన ఆదాయంపై అంచనాకు రావచ్చు. వృత్తిపరంగా స్థిరత్వాన్ని సాధించారా? లేదంటే వచ్చే రెండు మూడేళ్లలో ఆ స్థాయికి చేరుకుంటామని భావిస్తున్నారా? ఈ విషయంలో స్పష్టత అవసరం. రెండో అంశం.. ఈఎంఐ కట్టాలన్న లక్ష్యంతో వ్యయాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ ఆదాయంలో ఈఎంఐ మూడింట ఒక వంతును మించకపోవడం సహేతుకమైనది. అప్పుడే ఇతర వ్యయాలను ఎదుర్కోవడానికి మీకు వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు, ఇతర జీవిత లక్ష్యాలకూ కొంత ఆదా చేసుకోగలరు. నెలవారీ వేతనంలో ఈఎంఐ పరిమాణం ఎంతన్నది ముఖ్యమైనది. మీకున్న రుణ పరపతి ఏ మేరకు, బ్యాంక్ బ్యాలన్స్ ఏ మేరకు? అన్న అంశాలను రుణమిచ్చే సంస్థలు చూస్తాయి. వీటి ఆధారంగా రుణ రేటును నిర్ణయిస్తాయి. రుణ పరపతి మెరుగ్గా ఉంటే, ఆకర్షణీయమైన రేటుకే గృహ రుణం అందుకోవచ్చు. ఇక ఇంటిని కొనుగోలు చేయడం అన్నది ఒక్క ఆర్థికపరమైన నిర్ణయమే కాదు. ఇందులో జీవిత భాగస్వామి ప్రాధాన్యాన్ని చాలా మంది పరిగణనలోకి తీసుకుంటారు. కనుక దంపతులు ఇద్దరూ కలసి తమ జీవిత లక్ష్యాలు, ఎక్కడ స్థిరపడాలి, ఎటువంటి ఇల్లు కొనుగోలు చేయాలన్న అంశాలను నిర్ణయించుకోవాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వృద్ధులకు మెరుగైన పెట్టుబడి సాధనం?
వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్‌కు విడిగా కేవైసీ ఇవ్వకుండా, ఏదైనా కేంద్రీకృత ప్లాట్‌ఫామ్ ఉందా? – సమీర్ పటేల్ కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) అనేది ఇన్వెస్టర్ల గుర్తింపు, చిరునామాకు సంబంధించినది. నల్లధన నిరోధక చట్టం కింద ఇన్వెస్టర్ విధిగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం కేంద్రీకృత కేవైసీ (సీకేవైసీ) ప్లాట్‌ఫామ్ ఒకటి పనిచేస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది. ఇన్వెస్టర్ తన కేవైసీ ప్రక్రియను ఒక్కసారి పూర్తి చేస్తే చాలు. ఇన్వెస్టర్ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ కేవేసీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఇన్వెస్టర్లు పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ వద్ద నమోదైన క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తి (స్టాక్ బ్రోకర్, డీపీ)కి సమర్పించొచ్చు. ఆ సమాచారం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా కేంద్రీకృత వ్యవస్థలో నమోదు అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. నేను ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా మాదిరి వృద్ధులు ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకునేందుకు డెట్ ఫండ్ లేదా ఈక్విటీ ఫండ్ ఏది అనుకూలం? – శర్వానంద్ శివమ్ వృద్ధులు కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ముందు కొంత సమయం తీసుకుని పెట్టుబడిపై మరింత స్పష్టతను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి ఉద్దేశాలు, పెట్టబడి కాలం ఎంతన్నది తేల్చుకోవాలి. మీకు దీర్ఘకాల లక్ష్యం ఉందా? లేక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం తర్వాతే పెట్టుబడి అవసరం ఉందా? వీటికి అవును అనేది సమాధానం అయితే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సరైన ఎంపిక అవుతుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడి) లేదా లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడిలో ఏది మంచిది? అని అడిగితే.. మేము అయితే సిప్‌కు అనుకూలం. ఎందుకంటే ఇది కొనుగోలు ధరను సగటుగా మారుస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు తక్కువ ధరల్లోనూ సిప్ ద్వారా కొనుగోలు చేస్తారు. అలాగే, మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగుతాయి. డెట్ ఫండ్స్ అన్నవి స్థిరంగా ఉంటాయి. పెట్టుబడికి రక్షణ ఉద్దేశంతో కొనసాగుతాయి. మీ పెట్టుబడి ఉద్దేశాలకు అనుకూలం అనుకుంటే డెట్ ఫండ్స్‌లో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతలతో ఉంటాయి. కనుక ఈక్విటీ పథకాల్లో ఒకే విడత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే, అప్పుడు ఆ మొత్తాన్ని డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి నిర్ణీత కాలంలోపు పెట్టుబడులను బదిలీ చేసుకోండి. నా సోదరుడు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పుడు మా ఒదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? –వరుణ్ యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినీకి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు.