Women Power
-
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిలదొక్కుకోనివ్వని సమస్యను నిలువరించి..స్ఫూర్తిగా నిలిచింది దీపా..!
కొన్ని సమస్యలు మనిషిని మాములుగా కుంగదీయవు. ఒక పట్టాన నిలువనివ్వవు. ఏం చేయాలో ఎలా పరిష్కరించాలో అర్థకానీ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడే అసలు పరిష్కారం దాగుంటుంది. మనకు ఎదురై పది శాతం సమస్యకు తొంభై శాతం నీవెలా స్పందిస్తావు అనే దానిపైనే పరిష్కారం దొరకడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతోంది పారా ఒలింపియన్ దీపా. నిలదొక్కుకోనివ్వకుండా పగబట్టి వెంటాడిని సమస్యను తనదైన శైలిలో నిలువరించి తానేంటన్నది ప్రపంచానికి చాటి చెప్పి స్ఫూర్తిగా నిలించింది. ఎవరీ దీపా..? అంటే..ఉక్కులాంటి ధృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం పారాలింపియన్ దీపా మాలిక్. ఆమె తండ్రి ఆర్మీ, తల్లి ఎన్సీపీ క్యాడెట్లో షూటర్. ఆమెకు మూడేళ్ల ప్రాయంలోనే వెనుముక కణితి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీని కారణంగా కోలుకోవడానికి మూడేళ్లు పట్టేంది. అంటే ఆమె ఐదు నుంచి ఎనిమిదేళ్ల ప్రాయం వరకు ఆస్పత్రల్లోనే గడిపింది. అంత పెద్ద భయానక పరిస్థిని నుంచి బయటపడిందని జాలి, సానుభూతులతో పెంచలేదు దీపను ఆమె తల్లిదండ్రులు. మన వద్ద ఉన్న వనరులతో సంబంధం లేకుండా సామార్థ్యం మెరుగుపరుచుకోవడం పైనే దృష్టి సారిస్తే విజయం తధ్యం అనే రీతిగా పెంచారు దీపాని. అంతేగాదు తనకెదురైన సమస్యను పక్కన పెట్టి ఇంకా నువ్వు ఏం చేయగలవు, నీలో ఉన్న శక్తి ఏంటి అన్నదానిపై దృష్టి పెట్టాలని పదే పదే చెప్పేవారు. అదే నినాదంతో పెరిగిన దీపాలో సంకల్పం మెండుగా ఉండేది. అలానే పెరిగింది. సరిగ్గా 19 ఏళ్ల వచ్చేటప్పటికీ తనలానే బైకింగ్ సాహసాల పట్ల ఇష్టం ఉన్న ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. ఆమె జీవితం హాయిగా సాగిపోతుంది. సరిగ్గా 29 ఏళ్ల వయసులో మళ్లి కణితి వచ్చి ప్రతికారం తీర్చుకుంది. ఈసారి పరిస్థితి సివియర్ అయ్యి తనంతట తాను నడవడానికి ఏడు రోజుల మాత్రమే సమయం ఉందని వైద్యులు తేల్చి చెప్పేశారు వైద్యులు. దీపా ఇక వీల్‌చైర్‌కి పరిమితం అయిపోతుందని, తనకి సేవ చూస్తున్న వాళ్లను చూసి విసుగుపుట్టి చనిపోతుందని అంతా అనుకునేవారు. తన వైకల్యం భర్తతో మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిస్థితి ఆమె మల మూత్రాదులపై నియంత్రణ లేకుండా చేసి ఇబ్బందుకులకు గురి చేసింది. ఇలా వీల్‌చైర్‌తో గదికే పరిమితం కావడాన్ని ఇష్టపడక అహ్మద్‌నగర్‌లో రెస్టారెంట్ ప్రారంభించింది. అక్కడకు వచ్చే లాయర్లు, ఆఫీసర్లు, ఇంజీనర్లును కారణంగా తనలాంటి వారు ఎలా పైకి ఎదగొచ్చు అనే విషయాలు తెలుసుకుంది. అలా ఆమెకు ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం వచ్చే మోడిఫైడ్ బైక్‌ల గురించి తెలుసుకుని నడపడం నేర్చుకుంది. అలా బైక్‌పై తనకున్న ఇష్టం క్రీడాకారిణిగా ఎదిగేలా చేసింది. అంతేగాదు బైక్ నడిపేలా ఎగువ శరీరాన్ని బలోపేతం చేసేందుకు హైడ్రోథెరపీ తీసుకుంది. అంటే ఇక్కడ దీపా ఈత కొట్టడం ప్రాక్టీస్ చేయాలి. అలా ఆమె వివిద క్రీడల కోసం శిక్షణ పొందింది. చెప్పాలంటే ఇక్కడ దీపా 30 ఏళ్ల వయసులో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి వచ్చి జేఎల్ఎన్ స్టేడియం సమీపంలో చిన్నఅపార్టెమెంట్లో నివశించడం ప్రారంభించింది. అక్కడ అయితే ఆటలకు సంబంధించిన ప్రాక్టీస్ చేసేది. చాలామంది ఈ వయసులో ఆడుకుంటుందేంటీ?..టైం వేస్ట్ అనేవారు. అయితే అవేమి ఆమె పట్టించుకోలేదు దీపా. ఏదో ఒకరోజు నేనెంటీ అనేది తెలుసుకుంటారనే కసి దీపాలో అంతకంతకు పెరిగిపోయింది. చివరికీ తాను అనుకున్నట్లే పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేగాదు 42 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును గెలుచుకుంది. పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అంతేగాదు షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అనేక విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. నాడు ఎవరైతే ఆమెకు చికిత్స ఇవ్వడం వ్యర్థం అంటూ తన కుటుంబానికి సలహాలు ఇచ్చారు వాళ్లే..మా పిల్లలకు నువ్వే స్ఫూర్తి అంటూ ప్రశంసించారని గర్వంగా చెబుతోంది. చివరగా దీపా దయచేసి ఆగస్టు 28, 2024లో జరిగే పారా ఒలింపిక్స్ వీక్షించండి అని ప్రజలను కోరింది. (చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
13 ఏళ్లకే అరంగేట్రం... చైనా బాలిక రికార్డు!
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయలకు ఎంతో గౌరవం ఉంది. మన ఆచార వ్యవహారాలను ఎంతగానో ఇష్టపడతారని ఎన్నోసార్లు తేటతెల్లమయ్యింది. అది తాజాగా బీజింగ్‌లో 13 ఏళ్ల చైనా బాలిక భరత నాట్య ప్రదర్శనతో నిజమని తేలింది. చైనాలో మన సంప్రదాయ నృత్యం అయిన భరతనాట్యానికి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడి చిన్నారులు భరత నాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజింగ్‌లో చైనా బాలిక లీ ముజి (13) అరంగేట్రం (Arangetram) ప్రదర్శన సంచనలనం సృష్టించింది. మన సాంస్కృతిక కళలు పొరుగు దేశంలో ప్రజాదరణ పొందడం అనేది విశేషం. ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి లీలా శాంసన్, భారతీయ దౌత్యవేత్తలు, చైనీస్ అభిమానుల సమక్షంలో లీ ముజీ సోలోగా 'అరంగేట్రం' ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన భారత రాయబారి కార్యాలయం ఇన్చార్జ్ టీఎస్ వివేకానంద్ మాట్లాడుతూ..చైనాలో పూర్తి శిక్షణ పొంది అక్కడే అరంగేట్రం ప్రదర్శించిన తొలి విద్యార్థి లీ అని చెప్పారు. సాంప్రదాయ పద్ధతిలో సరిగ్గా ప్రదర్శన ఇచ్చిన 'అరంగేట్రం' ఇది అన్నారు. ఇక్కడ లీ చైనీస్ ఉపాధ్యాయులచే చైనాలోనే ఈ భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ప్రదర్శించడం విశేషం. ఇది భరతనాట్య వారసత్వ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని లీకి శిక్షణ ఇచ్చిన చైనా భరతనాట్య నర్తకి జిన్ షాన్ షాన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి శ్రుతి రావత్ కూడా హాజరయ్యారు. అంతేగాదు లీ ప్రదర్శనం కోసం చెన్నై నుంచి విమానంలో సంగీత విద్వాంసుల బృందం తరలి వచ్చింది. కాగా, లీ ఈ నెలాఖారున ఆమె చెన్నైలో కూడా ప్రదర్శన ఇవ్వనుంది. అరంగేట్రం అంటే?భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారిగా గురువు, ఇతరుల ముందు ప్రదర్శన చేయడాన్ని అరంగేట్రంగా వ్యవహరిస్తారు.(చదవండి: తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!) -
'డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్'.. కేన్సర్ బాధితులకు అండగా.. గృహహింసపై పోరాటం!
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి నైజం. పసి పిల్లలకు పాలు, పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ నుంచి మొదలు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అవసరమైన మందులు అందించడం, రక్తదానం చేయడం వరకు.. మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన వరకు.. ఇలా అన్నింటా మేమున్నామంటున్నారు ’డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్’ సభ్యులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.ఆధునిక వస్త్రధారణతో హైదరాబాద్‌లోని బస్తీకి వెళ్లిన యువతి రెనీ గ్రేస్.. అక్కడున్న ప్రజలను మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగింది. నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఆమెను చూసి నవ్వుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. స్నేహితులు నీతోపాటు మేముంటామంటూ మనోధైర్యాన్ని అందించారు. ఆ ధైర్యం ‘డిగ్నిటీ ఫౌండేషన్’ స్థాపన దిశగా నడిపించింది. 2017 నుంచి ఏడేళ్ల ప్రస్థానంలో 5,500 మందికిపైగా వలంటీర్లను ఫౌండేషన్ సొంతం చేసుకుంది. లక్షలాది మందికి సాయం అందిస్తామంటూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.కేన్సర్ బాధితులకు అండగా.. కూకట్‌పల్లిలోని కుముదినిదేవి హాస్పిటల్లో కేన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో బాధితులను ఆదుకోవాలని డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సభ్యులు నిశ్చయించుకున్నారు. అక్కడున్న కేన్సర్ బాధితులకు అవసరమైన పాలు, లిక్విడ్ ఆహారం పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వరకు ఏ రోజు ఎవరు సరఫరా చేయాలనేది నిర్ణయించారు. రోజుకు రూ.1,500 నుంచి సుమారు రూ.7,500 వరకు వెచి్చస్తున్నారు.బాలికలకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో సైతం మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు, మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.నిత్యావసరాల పంపిణీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్తీలు, దళితవాడల్లో పేద కుటుంబాలకు 2018 నుంచి ఆహారం, ఉప్పు, పప్పు, బియ్యం వంటి నిత్యావసరాలు, కనీస అవసరాలైన దుప్పట్లు, దుస్తులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారు.చేతనైన సాయం చేస్తున్నాం..నా స్నేహితులు పూనం శర్మ, సరితా శర్మ, జైశ్రీరామ్, క్రాంతి రెమ్మల, ప్రతిమతో కలిసి ఫౌండేషన్ నడిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా ఎవరి పనులు వారికి ఉన్నాయి. అదనంగా సమాజానికి ఏదైనా సేవ చేసేందుకు 2017లో డిగ్నిటీ డ్రైవ్‌ను స్థాపించాం. మహిళల హక్కులు, ఆర్థిక సాధికారత కోసం ప్రయతి్నస్తున్నాం. నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆకలి బాధలను అధిగమించేందుకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేస్తున్నాం. నేను షీ టీంలో సభ్యురాలిగా పనిచేస్తున్నా. చివరి స్టేజ్ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు పెయిన్ లెస్ డెత్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు ఒక ఫౌండేషన్ నడిపించడం అంత సులువు కాదనిపిస్తోంది. 5,500 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే వందలాది మంది స్పందిస్తారు. – రెనీ గ్రేస్, డిగ్నిటీ, డ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. -
Mia Le Roux: ఈ అందం వినిపిస్తోందా?
‘సమాజం ఎడంగా ఉంచే దివ్యాంగులకు ఇదెంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసు. అనూహ్యమైన కలలు కని వాటిని సాధించవచ్చని ఇవాళ నేను నిరూపించాను. దివ్యాంగుల పట్ల ఈ భూగ్రహంలో ఉన్న ఆంక్షల సరిహద్దులను నేను బద్దలు కొట్టాను’ అని హర్షధ్వానాల మధ్య అంది మియా లే రూ. 28 ఏళ్ల బధిర వనిత మియా లే 66 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాఫ్రికా అందాల పోటీలో కిరీటం ధరించిన తొలి బధిర మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె ఈ పోటీలో గెలిచినందుకుగాను సంవత్సరం పాటు నివసించడానికి ఒక ఖరీదైన ఫ్లాటు, లగ్జరీ బెంజి కారు, సుమారు 50 లక్షల రూపాయల నగదు, ఇంకా అనేక బహుమతులు దక్కాయి. శనివారం (ఆగస్టు 10) రాత్రి దక్షిణాఫ్రికాలోని పాలనా రాజధాని ప్రిటోరియాలో జరిగిన ఫైనల్స్‌లో ఈ ఘనత సాధించింది.పుట్టుకతో చెవుడుఫ్రెంచ్ మూలాలున్న మియా లే కుటుంబం తరాల ముందు వచ్చి సౌత్ ఆఫ్రికాలో స్థిరపడింది. మియా పుట్టాక సంవత్సరం తర్వాత ఆమెకు పూర్తిచెవుడు ఉన్నట్టు గ్రహించారు తల్లిదండ్రులు. కొన్నేళ్ల తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి రెండు సంవత్సరాల పాటు స్పీచ్‌థెరపీ ఇస్తే తప్ప ఆమె మొదటి మాట మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఆమె మాట స్పష్టం కాలేదు. ఆమెకు ఇప్పటికీ వినపడదు. ‘నా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానం చేసుకున్నాను. అందువల్ల పెదవుల కదలికను బట్టి కొద్దిగా వినపడే ధ్వనిని బట్టి ఎదుటివారి మాటలు అర్థం చేసుకుంటాను. గుంపులో ఉండి నాతో మాట్లాడితే నాకు ఏమీ అర్థం కాదు. అందరి శబ్దాలు కలిసి నాకు స్పష్టత ఉండదు’ అంటుంది మియా లే. మోడల్‌గా, మార్కెటింగ్ రంగ నిపుణురాలిగా పని చేస్తున్న ఈమె అందాలపోటీలో విజేతగా నిలవాలని కలగని, సాధించింది.నల్లరంగు–తెల్లరంగుసౌత్ ఆఫ్రికా అందాల కిరీటం కోసం నల్ల అందగత్తె చిడిమ్మ అడెస్ట్షినా పోటీ పడింది. ఆమెకు సౌత్ ఆఫ్రికాలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె పౌరసత్వం మీద వివాదం నెలకొంది. ఆమె నైజీరియా తండ్రికీ, మొజాంబిక్ తల్లికీ జన్మించిందని ట్రోల్స్ మొదలయ్యాయి. దాంతో విజయం అంచు వరకూ చేరిన చిడిమ్మ పోటీ నుంచి తప్పుకుంది. దాంతో మియా గెలుపు సులవు అయ్యింది. రంగును బట్టి మియా గురించి ఒకటి రెండు విమర్శలు వచ్చినా పోటీ నుంచి తప్పుకున్న చిడిమ్మ మనస్ఫూర్తిగా ఆమెను అభినందించింది. ‘నువ్వు మా అందరి కలలకు ప్రతినిధిగా నిలిచావు’ అని పోటీలో గెలిచిన మియాను చిడిమ్మ కొనియాడింది.నేనొక వారధిని‘దివ్యాంగులు సమాజంలో భాగం కావాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. నాకొచ్చిన ఈ అందాల కిరీటంతో నేను దివ్యాంగులకు ప్రభుత్వానికి ఒక వారధి కాదలిచాను. చిన్నవయసు నుంచి దివ్యాంగులు అసాధ్యమైన కలలు గనే స్థయిర్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను’ అంది మియా లే రూ. -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!
కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారింది వాయనాడ్. కొండచరియలు వాయనాడ్ని తుడిచిపెట్టేశాయి. ఈ ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు. వాయనాడ్ విషాదం ఎందరినో కదిలించింది. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఈ ఘటనలో ఎన్నో కన్నీటి కథలు, వ్యథలు ఉన్నాయి. ఈ విషాద ఘటనలో ఒక మహిళ తమ వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమెనే దీపా జోసెఫ్. ఎవరంటే ఆమె..!కేరళలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ దీపా జోసెఫ్. దారుణ వినాశనాన్ని చవిచూసిన వాయనాడ్‌లో తన అంబులెన్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితులు రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడూ కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని చెబుతోంది దీపా. ఒక్కోసారి తనకు కూడ కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది. ఎవరంటే ఆమె..?కరోనా మహమ్మారి సమయంలో దీపా జోసెఫ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పనిచేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే వ్యక్తిగత విషాదం కారణంగా తన వృత్తి నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. తన కన్న కూతురు బ్లడ్ కేన్సర్‌తో చనిపోవడంతో డిప్రెషన్‌కి వెళ్లిపోయింది దీపా. దీంతో విధులకు గత కొద్ది రోజులుగా దూరంగానే ఉండిపోయింది.వాయునాడ్ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించింది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ..సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది దీపా. కాగా, ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసుకుంటూ..బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా. ఈ అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం తానింకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్‌డ్రైవర్‌గా పనిచేస్తానని తెలిపింది. నిజంగా గ్రేట్ జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం కూడా.(చదవండి: గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్‌కి భారీ విందు..!) -
Anita Dongre: ఇండియన్ ఫ్యాషన్‌కి ఆమె ఓ క్రియేటివ్ సిగ్నేచర్!
అనితా డోంగ్రే.. ఫ్యాషన్‌తో ఏ కాస్త పరిచయం ఉన్న వాళ్లకైనా బాగా తెలిసిన పేరు! ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫ్యాషన్‌కి ఆమె ఓ క్రియేటివ్ సిగ్నేచర్! మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’కి రీచ్ అయిన ఆ త్రెడ్స్ అండ్ నాట్స్ జర్నీ గురించి..అనితా డోంగ్రే.. ముంబై వాసి. సంప్రదాయ సింధీ కుటుంబం ఆమెది. ఇంటి పనులకే జీవితాన్ని అంకితం చేసిన ఆడవాళ్లున్న నేపథ్యంలో పెరిగి.. ఉద్యోగినులుగా, బాసులుగా, పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్న ఆడవాళ్ల మధ్యకు చేరింది. తనింట్లోని స్త్రీల్లా కాకుండా, తాను ఎరిగిన ప్రపంచంలోని మహిళల్లా ఉండాలని నిశ్చయించుకుంది. ఆ నిశ్చయానికి ప్రేరణ సాధికారిక స్త్రీలే అయినా స్ఫూర్తి మాత్రం అనితా వాళ్ల అమ్మ! తన అయిదుగురు సంతానానికి ఆవిడే బట్టలు కుట్టేది. అవి రెడీమేడ్ దుస్తులకు ఏమాత్రం తీసిపోయేవికావు. పిల్లలు వాటిని స్కూల్లో వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వేసుకెళితే స్నేహితులు, బంధువులంతా ఏ షాప్‌లో కొన్నారంటూ కితాబులిచ్చేవారు. అలాంటి సందర్భాల్లోనే అమ్మ నైపుణ్యానికి మురిసిపోయేది అనితా. వర్కింగ్ విమెన్ని చూశాక.. అమ్మ పనితనాన్ని తనూ అందిపుచ్చుకుని వర్కింగ్ విమెన్‌కి అనువైన దుస్తులను డిజైన్ చేసి ఫ్యాషన్‌ను శాసించాలని కల కన్నది. తొలి అడుగుగా ముంబైలోని ఎస్ఎన్డీటీ (శ్రీమతి నతీబాయీ దామోదర్ ఠాకర్సే) మహిళా యునివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది.యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే తండ్రి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని, రెండు కుట్టుమిషన్లు కొని, సోదరితో కలసి చిన్న బొటిక్ పెట్టింది. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులను కోసం డ్రెసెస్ని డిజైన్ చేసి.. సేల్‌కి పెట్టింది. అనితా సృజనకు ఆమె బొటిక్ ఉన్న కాంప్లెక్స్‌లోని లేడీస్ డ్రెస్ వేర్ షాప్స్ అన్నీ వెలవెలపోసాగాయి. దాంతో ఆ మాల్లోని లేడీస్ ఎంపోరియం షాప్స్ వాళ్లంతా అనితా బొటిక్‌ని అక్కడి నుంచి ఎత్తేయించాలని పట్టుబట్టారు. మాల్ ఓనర్ వాళ్ల డిమాండ్‌కి తలొంచక తప్పలేదు.. అనితా వాళ్లు ఆ మాల్ నుంచి షిఫ్ట్ అవకతప్పలేదు.చేతిలో విద్య ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట.. అనే ధీమాతో మరో చోటును వెదుక్కుంది. కొన్ని నెలలల్లోనే బొటిక్‌ని కాస్త ఏఎన్డీ డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్గా మార్చేసింది. ఇక మిషన్ వీల్ వెనక్కి తిరగలేదు. ఏఎన్డీ లేబుల్ కాస్త ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’గా అవతరించింది. దేశీ, క్యాజువల్, బ్రైడల్, గ్లోబల్ .. దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్‌గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్‌కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. అనితా డోంగ్రే డిజైన్డ్ దుస్తులతో ముస్తాబవ్వాలని క్యూ కట్టారు. ఆ వరుసలో మాధురి దీక్షిత్, మలైకా అరోరా, కాజోల్, కత్రినా కైఫ్, ప్రియంకా చోప్రా, మానుషీ చిల్లర్, కృతి సనన్, ఆలియా భట్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, కాజల్ అగర్వాల్, దియా మిర్జా, శోభిత ధూళిపాళ, రాధికా ఆప్టే, సొనాలీ బెంద్రే, మీరా కపూర్, పూజా హెగ్డే, కరిష్మా కపూర్, రష్మికా మందన్నా, అర్జున్ కపూర్, అయుష్మాన్ ఖురానా, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లంతా కనిపిస్తారు.సంప్రదాయ కట్టు, కార్పొరేట్ లుక్, కార్పెట్ వాక్, పార్టీ వేర్.. ఏది కావాలన్నా, ఏ తీరులో మెరవాలన్నా ఏ వర్గం వారైనా కోరుకునే బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’నే! ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు తిరుగులేదు అనే స్థాయికి ఎదిగింది. పింక్ సిటీ పేరుతో జ్యూల్రీ లైన్‌నూ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె దగ్గర మూడు వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంతోమంది ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్స్ ఆమె గైడెన్స్ తీసుకుంటున్నారు. వీళ్లు సరే.. పలు ప్రాంతాల్లోని ఎంతోమంది చేనేత కళాకారులకూ పని కల్పిస్తోంది అనితా డోంగ్రే. -
Chamari Athapaththu: మహిళా క్రికెట్‌పై.. పట్టు!
83 బంతుల్లో అజేయంగా 108 పరుగులు, 80 బంతుల్లో 140 నాటౌట్, 47 బంతుల్లో అజేయంగా 80 పరుగులు, 31 బంతుల్లో 55, 28 బంతుల్లో 44, 139 బంతుల్లో 195 నాటౌట్, 46 బంతుల్లో 73.. ఇటీవల కీలక మ్యాచ్‌లలో చమరి అటపట్టు సాధించిన స్కోర్లు ఇవి. న్యూజీలండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి పటిష్ఠ జట్లపై శ్రీలంక సాధించిన అరుదైన, చారిత్రక విజయాలన్నిట్లో అటపట్టుదే కీలక పాత్ర. లంక జట్టుకు వెన్నుదన్నుగానే కాదు సంచలన బ్యాటింగ్‌తో రికార్డు స్కోర్లు సాధిస్తూ వరల్డ్ నంబర్‌వన్‌గానూ కొనసాగుతోంది. ఈ ఆటకు ఆమె నాయకత్వ ప్రతిభా తోడై శ్రీలంకకు మహిళా ఆసియా కప్ టోర్నీని అందించింది. ఇందులో అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని, ఏడుసార్లు విజేతైన భారత్‌కు ఫైనల్లో షాక్ ఇస్తూ లంక టైటిల్‌ను అందుకుంది. ఈ టోర్నీలో చమరి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సహా 304 పరుగులు అదీ 147 స్ట్రైక్ రేట్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.ప్రతి క్రీడలో ఆ దేశపు జాతీయ పతాకాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ఒక ప్లేయర్ అవసరమవుతారు. విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా సదరు క్రీడపై అందరి దృష్టి పడేలా చేయడం, ఆపై తన వ్యక్తిగత ఆటతో జట్టు స్థాయిని కూడా పెంచడం ఆ ‘ట్రయల్ బ్లేజర్’కే సాధ్యం. శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి చమరి అటపట్టు పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టువి అరకొర విజయాలే తప్ప అసాధారణ ప్రదర్శన కాదు. కానీ చమరి తన ఆటతో ఇతర జట్ల దృష్టి తమ టీమ్‌పై పడేలా చేసింది. తన19వ ఏట, 2009 టి20 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2011 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 67 బంతుల్లోనే 60 పరుగులు సాధించడంతో వెలుగులోకి వచ్చింది. తర్వాతి ఏడాదే శ్రీలంక అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకోవడంతో చమరి శకం మొదలైంది.రికార్డులే రికార్డులు..వన్డే క్రికెట్లోకి చమరి అడుగుపెట్టిన ఏడాదిలోనే ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులతో చెలరేగింది. ఫలితంగా శ్రీలంక తరఫున వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు వన్డేల్లో ఆమె మొత్తం తొమ్మిది శతకాలు బాదగా.. మరే శ్రీలంక ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం! అంతర్జాతీయ టి20ల్లో కూడా మూడు సెంచరీలతో ఆమె ఏకైక స్టార్‌గా నిలిచింది. 2017 వన్డే వరల్డ్ కప్‌లో నంబర్‌వన్ టీమ్ ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన 178 పరుగుల ఇన్నింగ్స్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా మిగిలింది.34 ఏళ్ల 88 రోజుల వయసులో స్కాట్లండ్‌పై శతకం బాదిన చమరి.. అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి అన్ని వన్డే, టి20 బ్యాటింగ్ రికార్డులు చమరి పేరిటే ఉన్నాయి. నాయకత్వ లక్షణాలూ పుష్కలంగా ఉన్న చమరి మూడు టి20 వరల్డ్ కప్(2018, 2020, 2023)లలో శ్రీలంక టీమ్ సారథిగా వ్యవహరించింది. ఆమె కెప్టెన్సీలోనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టి20ల్లో, న్యూజీలండ్పై వన్డేల్లో తొలిసారి శ్రీలంక సిరీస్‌ను గెలుపొందింది. అయితే కెప్టెన్‌గా ఆమె కెరీర్లో అత్యుత్తమ విజయం ఇటీవల ఆసియా కప్‌ను అందుకోవడమే. అసలు భారత జట్టును ఎదురునిలవడమే అసాధ్యం, భారత్ మినహా ఇతర బలహీన టీమ్‌లతో టోర్నీని నిర్వహించడమే అనవసరం అనే విమర్శల నేపథ్యంలో.. చమరి తన టీమ్‌ను ఆసియా విజేతగా నిలపడంతో ఆమె కెరీర్ శిఖరానికి చేరింది.ఫ్రాంచైజీ క్రికెట్లో..వరల్డ్ క్రికెట్లో దూకుడైన బ్యాటర్‌గా, భారీ హిట్టర్‌గా చమరికి వచ్చిన గుర్తింపు ఫ్రాంచైజీ క్రికెట్లో వరుస అవకాశాలనిచ్చింది. లంక తరఫున ఫ్రాంచైజీ క్రికెట్ ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఆమె. ప్రతిజట్టూ తమ టీమ్‌లో ఆమెను ఎంచుకునేందుకు ఆసక్తి చూపించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనగెడ్స్ జట్ల తరఫున, ఇంగ్లండ్ టీమ్‌లు ఓవల్ ఇన్విన్సిబుల్స్, యార్క్‌షైర్ డైమండ్స్, దక్షిణాఫ్రికా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, వెస్టిండీస్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌తో పాటు బీసీసీఐ నిర్వహించిన లీగ్ టోర్నీల్లో సూపర్ నోవాస్, యూపీ వారియర్స్‌కి చమరి ప్రాతినిధ్యం వహించింది.2023–24 ఆస్ట్రేలియా క్రికెట్ విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో 130 స్ట్రైక్‌రేట్‌తో 511 పరుగులు సాధించి ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. బిగ్‌బాష్ లీగ్‌లో అటపట్టు ప్రభావం ఎంతగా ఉందంటే లీగ్‌లో ‘చమరి బే’ పేరుతో ప్రత్యేక సీటింగ్ జోన్ ఏర్పాటు చేసేంతగా! ఆమె కెరీర్లో మరో అత్యుత్తమ క్షణమూ ఇటీవలే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాతో వారి సొంతగడ్డ పోష్స్ట్రూమ్లో జరిగిన వన్డేలో చమరి 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్సర్లతో 195 పరుగులు తీసి అజేయంగా నిలిచి, తన అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆమె బ్యాటింగ్‌తో శ్రీలంక.. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (302) ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్న చమరి అటపట్టు రాబోయే కొన్నేళ్లలో మరిన్ని ఘనతలు అందుకోవడం, రికార్డులు సృష్టించడం ఖాయం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
Paris Olympics 2024: పతకమేదైనా తల్లికి బంగారమే
పోటీ అనేది ఆట వరకే పరిమితం. ఆ తరువాత అంతా మనం మనం’ అని చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా... స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి పాకిస్తాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ గురించి, అర్షద్ నదీమ్ తల్లి రజీయా పర్వీన్ నీరజ్ చోప్రా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన మాటలు క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టాయి.స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకున్నాడు. అయితే ఆయన గెలుచుకున్న రజతం చాలామందికి సంతోషాన్ని ఇవ్వలేదు. అద్భుత శక్తిసామర్థ్యాలు ఉన్న, ఎంతో ఘన చరిత్ర ఉన్న నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సొంతం చేసుకోకపోవడం చాలామందిని నిరాశ పరిచింది.మరోవైపు పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నాడు.‘అర్షద్ నదీమ్ కూడా నా కుమారుడిలాంటివాడే’ అని స్పందించింది నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి. ఆ అమ్మ మాటను ప్రపంచం మెచ్చింది.పాకిస్తాన్‌కు చెందిన క్రీడాకారుడిని సరోజ్ దేవి మెచ్చుకోవడం కొద్దిమందికి నచ్చకపోయినా, వారిని ఉద్దేశించి నీరజ్ చోప్రా వివరణ ఇచ్చినా...స్థూలంగా ఆమె మాటలు అర్షద్ నదీమ్ గెలుచుకున్న బంగారం పతకం కంటే విలువైనవి.‘మా వాడు బంగారం పతకంతో వస్తాడనుకుంటే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది’ అని నిట్టూర్చలేదు సరోజ్ దేవి.‘రజతం అయినా బంగారం అయినా ఒక్కటే. ఇద్దరూ నా బిడ్డలే’ అన్నది.ఆమె మాటలు ప్రధాని నరేంద్ర మోదీకీ నచ్చాయి. ఆమె సహృదయతను ప్రశంసించారు.మరో వైపు చూస్తే... ‘నీరజ్ నా కుమారుడిలాంటివాడు. అతడి కోసం ప్రార్థిస్తాను. నీరజ్ ఎన్నో పతకాలు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటోంది అర్షద్ నదీమ్ తల్లి రజియా పర్వీన్.‘నా బిడ్డ తప్ప ఇంకెవరైనా బంగారు పతకం గెలుచుకోగలరా!’ అని బీరాలు పోలేదు. ఒకవైపు కుమారుడి చారిత్రక విజయానికి సంతోషిస్తూనే మరోవైపు నీరజ్ చో్ప్రా ప్రతిభను వేనోళ్ల పొగిడింది. పాకిస్తాన్, పంజాబ్‌లోని ఖనేవాల్ జిల్లాకు చెందిన అర్షద్ నదీమ్ కుటుంబం నీరజ్ చో్ప్రాను తమ ఇంటికి ఆహ్వానించింది.పోటీలకు అతీతంగా అర్షద్, నీరజ్‌లు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి,.‘ఆటకు సంబంధించి ఎలా ఉన్నా మేము మంచి స్నేహితులం, అన్నదమ్ములం... అని అర్షద్ నాతో ఎన్నోసార్లు చె΄్పాడు’ అంటుంది రజియా పర్వీన్.‘నీరజ్ మా కుటుంబంలో ఒకరు. అతను పాకిస్తాన్‌కు వస్తే ఎయిర్ పోర్ట్ నుంచి మా ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తాం’ అంటున్నాడు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అర్షద్ నదీమ్ సోదరుడు షాహీద్ అజీమ్.ఇద్దరు మిత్రులునీరజ్ చోప్రాకు కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం. పండగలు వస్తే చాలు మిఠాయిల పని పట్టాల్సిందే. ఆ తరువాత బరువు పని పట్టాల్సిందే.‘ఆటగాడికి కుటుంబ మద్దతు చాలా ముఖ్యం’ అంటాడు నీరజ్. ‘ఆటల్లో తొలి అడుగు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబం నాకు మద్దతుగా ఉంది. నా వెనుక నా కుటుంబం ఉన్నది అనే భావన ఎంతో శక్తిని ఇస్తుంది’ అంటాడు నీరజ్. ‘నేను’ అనే అహం నీరజ్‌లో కనిపించదు. ఎదుటివారి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేడు. ముఖాముఖీగా, మీడియా ముఖంగా అర్షద్ నదీమ్‌ను ఎన్నోసార్లు ప్రశంసించాడు నీరజ్ చోప్రా. అందుకే అతడంటే నదీమ్‌కు చాలా ఇష్టం.ఇక నదీమ్ గురించి చె΄్పాలంటే అతడు ఇంట్రావర్ట్. తక్కువగా మాట్లాడుతాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన నదీమ్‌కు ఆర్థిక భారం ఎన్నోసార్లు అతడి దారికి అడ్డుగా నిలబడేది. స్నేహితులు, సన్నిహితులు అతడి విదేశీ టోర్నమెంట్లకు సంబంధించి ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చేవారు. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి నదీమ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పాత జావెలిన్తోప్రాక్టిస్ చేయడం కష్టంగా ఉంది’ అంటూ సాగిన నదీమ్ సోషల్ మీడియా పోస్ట్ ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. నీరజ్ చో్ప్రా కూడా అర్షద్ నదీమ్‌కు మద్దతుగా మాట్లాడాడు. -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
కదిలిన కావ్యం! వారాంతాల్లో పేదలకు అండగా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడిన కుటుంబం.. ఇలాంటి సమయంలో యువత ఏం ఆలోచిస్తుంది.. మహా అయితే చర్మ సౌందర్యం.. బ్రాండెడ్ దుస్తులు, కార్లు, సెలవు రోజుల్లో రిలాక్స్ కోసంకుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేకంగా వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటారు. దానికితోడు విలాసవంతమైన జీవితం కోరుకోవడం సహజం. అయితే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కావ్య మాత్రం పేద పిల్లలను చదివిస్తూ, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ, నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు. వారం రోజులు పనిదినాల్లో ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఆమె సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆమె ఆలోచనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతుండగా, సహచర ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారు. 2019లో ప్రముఖ సంస్థలో ఆమె సాఫ్ట్వేర్ సంస్థలో చేరారు. కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 200లకుపైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2020లో చారిటీ విజిట్స్ యు ఆల్వేజ్ (చార్వ్య) పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. సెలవు దినాల్లో కార్యక్రమాలు నడిపిస్తున్నారు.మురికివాడలే లక్ష్యంగా.. నగర పరిధిలోని మురికి వాడలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వలస కారి్మకులు ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో సుమారు ఎంత మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు? వాళ్ల అవసరాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఆహారం, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఆ ఆనందం వెలకట్టలేనిది..ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, దుస్తులు, ఇతర సరుకులు అందించడం సంతోషంగా ఉంది. ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇతరులు మంచి జీవితాన్ని పొందడానికి నా వంతు సాయం అందిస్తున్నా. నాకున్న అవకా శాల్లో ఒక మార్గం ఎంచుకొని ముందుకెళ్తున్నా.. కుటుంబ సభ్యులు సరే నీ ఇష్టం అన్నారు. నా వేతనం మొత్తాన్నీ చారిటీకే వెచి్చస్తున్నాను. మరింత మందికి సాయం చేసే అవకాశం కలి్పంచాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నా. – కావ్య, చార్వ్య, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు -
Alma Cooper: మిస్ యూనివర్స్ బరిలో.. యువ ఆర్మీ ఆఫీసర్!
‘మిస్ మిచిగాన్’గా సుపరిచితురాలైన అల్మా కూపర్ ‘మిస్ యూఎస్ఏ 2024’ కిరీటాన్ని గెలుచుకుంది. నవంబర్‌లో జరగనున్న ‘2024 మిస్ యూనివర్స్’పోటీ కోసం సన్నద్ధమవుతోంది. ‘యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ’లో గ్రాడ్యుయేట్ అయిన కూపర్ ‘మిస్ మిచిగాన్ యూఎస్’ కిరీటం దక్కించుకున్న తొలి యాక్టివ్ డ్యూటీ ఆర్మీ ఆఫీసర్.వలస కార్మికురాలి కుమార్తె అయిన అల్మా కూపర్ కష్టపడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్మీ ఆఫీసర్ అయింది. అందాలపోటీలపై ఆసక్తి ఉన్న కూపర్‌కు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ‘ఆహార అభద్రత సమస్యను పరిష్కరించడానికి, ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టే కార్యక్రమాలలో క్రియాశీలంగా ΄ాల్గొంటాను’ అని చెబుతుంది 22 ఏళ్ల అల్మా కూపర్. -
క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !
పారిస్ ఒలింపిక్స్‌లో అసమానతలు ధిక్కరించిన అథ్లెట్లలో అజర్బైజాన్ ఆర్చర్ యైలగుల్ రమజనోవా ఒకరు. 35 ఏళ్ల ఈ ఆర్చర్ ఆరు నెలల నిండు గర్భిణి. ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని, మాతృత్వం రెండింటిని ప్రదర్శించి అందరిచే ప్రశంసలందుకుంది. బేబీ బంప్ ఉన్నప్పటికీ ప్రతి షాట్‌ని ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రదర్శించింది. హృదయాన్ని కదిలించే ఆమె గాథ ఏంటో సవివరంగా చూద్దామా..!చరిత్రలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండవ ఆర్చర్ యైలగుల్ రమజనోవా . రియో 2016లో ఓల్కా సెన్యుక్ తర్వాత అజర్‌బైజాన్‌కు తొలిసారిగా ప్రాతినిధ్య వహించిన రెండో ఆర్చర్ ఈ 34 ఏళ్ల రమజనోవా. ఆమె మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో పాల్గొంది. ఆమె ఎలిమినేషన్ రౌండ్ 1/32లో 28వ ర్యాంక్ చైనీస్ ఆర్చర్ ఆన్ క్విక్సువాన్ను ఓడించింది. అయితే ఆ తర్వాత 1/16 రౌండ్లో జర్మనీకి చెందని మిచెల్ క్రోపెన్ చేతిలో నిష్క్రమించింది. గర్భవతిగా ఉన్న ఒలింపియన్‌గా తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో పర్ఫెక్ట్ 10 షూట్ చేయడానికి ముందు తన బేబీ కిక్‌ను అనుభవించిన అనుభవాన్ని వివరించింది. "నేను ఈ చివరి బాణాన్ని వేసే ముందు నా బిడ్డ నన్ను తన్నినట్లు నేను భావించాను, ఆపై నేను 10 షూట్స్ ప్రదర్శించాను. అలాగే ఈ ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో నా గర్భంతో నేను అసౌకర్యంగా భావించలేదు. బదులుగా, నేను ఒంటరిగా పోరాడడం లేదని, నా బిడ్డతో కలిసి పోరాడుతున్నానని నాకు అనిపించింది… నా పిల్లవాడికి లేదా ఆమెకు ఆసక్తి ఉంటే నేను విలువిద్య నేర్పిస్తాను, ” అని రమజనోవా ఇన్‌స్టాగ్రాంలో రాసింది. 127వ ర్యాంక్‌లో ఉన్న రమజనోవా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్లొన్న తొలి గర్భిణీ క్రీడాకారిణి కాదు. ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఫెన్సర్ నాడా హఫీజ్ కూడా ఏడు నెలల గర్భవతిగా పోటీ పడింది. మహిళల సాబర్ పోటీలో హఫీజ్ తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో యూఎస్ఏకి చెందిన మాజీ ఎన్సీఏఏ ఛాంపియన్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీని ఓడించింది. ఇక్కడ ఈ అద్భుతమైన మహిళలు తమ పుట్టబోయే పిల్లలను మోస్తూనే అత్యున్నత స్థాయిలో పోటీ చేసి అంచనాలను ధిక్కరించి, మాతృత్వపు బలాన్ని ప్రదర్శించారు. గర్భవతులుగా ఒలింపిక్స్‌లో పోటీ పడి స్ఫూర్తిగా నిలవడమేగాక ఈ మహిళలు సంకల్పం, సామర్థ్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారు.(చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
Naba Mohammadi: మోటారు పాఠం.. జపాన్ చేర్చుతోంది!
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్‌పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.ఏంటా మోటారు కథ...!నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.తాను కూడా ఏదైనా సాధించాలంటే..!అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
Yaroslava Mahuchyk: యుద్ధం ఆమెకు సలాం చేసింది..
ఉక్రయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కాని ఆ దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు పతకాలు గెలిచి యుద్ధాన్ని చిన్నబుచ్చుతూనే ఉన్నారు. హైజంప్‌లో బంగారు పతకం సాధించిన యారోస్లావా ఏ క్షణంలో ఏ వార్త వినవలసి వస్తుందో అన్న ఆందోళనలో కూడా లక్ష్యాన్ని తప్పలేదు. యుద్ధం ఆమెకు సలాం చేసింది.యుద్ధం చేసిన గాయంతో ఇంకా ఆ దేశం కన్నీరు కారుస్తూనే ఉంది. బాంబులు, బుల్లెట్లు చిందించిన రక్తంతోనే అక్కడి ప్రజలు ఇప్పటికీ సూర్యోదయాన్ని చూస్తున్నారు. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ ధ్వంసమయ్యి రెండేళ్లు దాటింది. కాని ఆ దేశ క్రీడాకారుల మనోబలాన్ని మాత్రం యుద్ధం దెబ్బతీయలేకపోయింది. మీరు మాపై తుపాకులు ఎక్కుపెట్టి యుద్ధం చేస్తే.. మేం బంగారు పతకాలతో శాంతి సందేశాన్ని అందిస్తామంటూ ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుతున్నారు ఉక్రెయిన్ క్రీడాకారులు. హై జంప్‌లో బంగారు పతకం సాధించిన 22 యేళ్ల యారోస్లావా మహుచిక్ వారిలో ఒకరు.నిలువనీడ లేకపోయినా...ప్రశాంతంగా సాగుతున్న యారోస్లావా జీవితాన్ని యుద్ధం ఆందోళనలో పడేసింది. నిత్యం దూసుకొచ్చే క్షిపణులు ఆమెకు రెండున్నరేళ్లుగా నిలువ నీడలేకుండా చేశాయి. తూర్పు ఉక్రెయిన్ లోని సొంతూరు ని్రపో నుంచి బయటపడి వివిధ దేశాల్లో తలదాచుకుంది. తల్లీతండ్రి అక్క అప్పుడప్పుడూ తనను కలిసేందుకు వచ్చేవారు. వారిని చూశాక ఆమె మనసు మరింత కకావికలమయ్యేది. వారు వెళ్లిపోయాక ఏ క్షణాన ఏ వార్త వినాల్సిందోనన్న భయం ఆమెను వెంటాడేది. ఇంట్లో ఉన్నపుడు పక్కన బాంబులు పడుతుంటే ‘నాన్నా బేస్మెంట్లోకి వెళ్దామా అంటే.. ఇంకా భయపడి పారిపోవడంలో అర్థం లేదు. నాలాగే ఎంతోమంది ్రపాణాల మీద ఆశలు వదిలేసుకునే బతుకుతున్నారు తల్లీ’ అన్న తండ్రి మాటలు వద్దంటున్నా గుర్తుకువచ్చేవి. యుద్ధం ఆమెను వెంటాడుతూనే ఉండేది. నేలకొరుగుతున్న దేశ సైనికులు..రోడ్డున పడుతున్న ఉక్రెయిన్ ప్రజలు కళ్ల ముందు కదులుతూనే ఉన్నారు. వాటి మధ్యే ఆమె శిక్షణ కొనసాగిస్తూ వచ్చింది.విషాదగీతాలు మరిచేలా...స్లీపింగ్ బ్యాగ్, యోగా మ్యాట్‌ను ఎప్పుడూ తనతో తెచ్చుకునే మహుచిక్ ఆట విరామ సమయంలో స్డేడియంలో విశ్రాంతి తీసుకుంటూ ఆకాశంలోకి చూస్తూ దేశం గురించే ఆలోచించేది. యుద్ధ విషాద గీతాలు మరుగున పడేలా ప్రజల్లో చైతన్యం నింపేలా దేశానికి పతకం అందించాలని కలలు కనేది. హైజంప్ మ్యాచ్‌లో ప్రత్యర్థితో తలపడే సమయంలోనూ ఆమె మనసునిండా యుద్ధ దృశ్యాలే. చివరకు ఆమె పోరాట స్ఫూర్తి గెలిచింది. ఎంతటి భీకర యుద్ధమైనా ఆశలను, ఆశయాలను తుడిచిపెట్టేయలేదని నిరూపించింది. వ్యక్తిగత హోదాలో దేశానికి ఆమె సాధించి పెట్టిన తొలి గోల్డ్‌మెడల్ ఉక్రెయిన్ ప్రజల భవిష్యత్తుకు నిజంగా ఓ ఆశాకిరణమే. యారోస్లావా మహుచిక్ ఒక్కరే కాదు.. పారిస్ ఒలంపిక్స్‌లో పతకాలు సాధిస్తున్న ఇతర ఉక్రెయిన్ క్రీడాకారులు యుద్ధం కారణంగా నిస్సత్తువగా మారిన ఆ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇంతకాలం యుద్ధం కారణంగా రక్తంతో తడిసిన దేశంలో పతకాల సుమాలు పూయిస్తున్నారు.ఒలింపిక్స్ జరుగుతున్నా...‘‘ఒలింపిక్ క్రీడలు శాంతి సందేశాలు. కానీ రష్యా ఇలాంటి క్రీడలు జరుగుతున్న సమయంలోనూ మా దేశంపై దాడులు ఆపకపోగా మరింత ఉధృతం చేసింది. చిన్నపిల్లల ఆసుపత్రిపై క్షిపణు లు కురిపించడంలోని క్రౌర్యం మాటలకందనిది’’ అంది యారోస్లావా మహుచిక్. -
Latha Mangipudi: హ్యారిస్ గెలిచి మహిళాశక్తిని గెలిపిస్తుంది
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్ గెలుస్తుంది. ఆమె గెలుపు మహిళాశక్తిని నిరూపిస్తుంది’ అంటున్నారు లత మంగిపూడి. అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌కు డెమోక్రటిక్ పార్టీ లెజిస్లేటర్‌గా ఉన్న లత ప్రస్తుతం కమలా హ్యారిస్ గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అమెరికా మహిళల గురించి స్త్రీలకు ఉండాల్సిన దృక్పథం గురించి ఆమె తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.‘ఒక విధంగా చె΄్పాలంటే అమెరికాలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అమెరికన్స్ మరోసారి ట్రంప్ నియంతృత్వ పాలనను అంగీకరించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. కమలా హ్యారిస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. అందుకే ‘సేవ్ అవర్ డెమోక్రసీ’ అనే నినాదం తో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. కమలా హ్యారిస్ అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు లత మంగిపూడి. మైసూరుకు చెందిన లత రాజమండ్రికి చెందిన కృష్ణ మంగిపూడిని వివాహం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యారు. 1985లో యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అనంతరం యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ న్యూహ్యాంప్‌షైర్ చాప్టర్‌కు 2006 నుంచి 2013 వరకు చైర్పర్సన్ గా కొనసాగారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి అధ్యక్షుడు ఒబామా, హిల్లరి క్లింటన్ వంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత 2013 నుంచి ఇప్పటివరకు నాషువా నుంచి లెజిస్లేటర్‌గా గెలు΄÷ందుతూనే ఉన్నారు. కమలాహ్యారిస్ గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ పర్యటనలు చేస్తున్నారు.స్త్రీల హక్కులకు విఘాతం‘ప్రపంచంలో ఏ మహిళకైనా తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉండాలి. ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకొనే అవకాశం ఉండాలి కదా. కానీ అమెరికాలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యం గా పిల్లల్ని కనాలా, వద్దా అనే అత్యంత కీలకమైన అంశంపైన మహిళలు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గర్భం దాల్చిన తరువాత తప్పనిసరిగా బిడ్డను కనాల్సిందే. కానీ బిడ్డను కనేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యరీత్యా సంసిద్ధంగా ఉండాలి. ఇది బిడ్డను కనాల్సిన తల్లి, డాక్టర్ నిర్ణయించవలసిన విషయం. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ బలవంతంగానైనా పిల్లలను కనాల్సిందేననడం సరి కాదు. అత్యాచారానికి గురైన వారు, లైంగిక దాడుల వల్ల గర్భవతులైన వాళ్లు కూడా బిడ్డల్ని కనాలంటే ఎలా? అమెరికా మహిళలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. మా పార్టీ గెలిస్తేనే మహిళల హక్కులకు రక్షణ లభిస్తుంది’ అన్నారామె.ఇంకా వివక్షేనా....‘విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు లభించడం లేదు. స్త్రీలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నారు. చివరకు కొన్నిచోట్ల ఓటుహక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకొనే వాతావరణానికి రిపబ్లికన్ పార్టీ విఘాతం కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కును ΄÷ందిన వాళ్లు, ఇమ్మిగ్రెంట్స్, కొన్నిచోట్ల మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. ఆ పార్టీ మరోసారి గెలిస్తే ఓటుహక్కు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈసారి మహిళా గెలుపు ప్రజాస్వామిక గెలుపు’ అని ముగించారామె.– పగిడిపాల ఆంజనేయులుసాక్షి, హైదరాబాద్ -
యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న మహిళ
కొందరంతే.. తాముఅనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా కూడా ఏదో చేయాలనే తపన వారిని స్థిమితంగా ఉండ నీయదు. లండన్‌కు చెందిన నీషా షా ఈ కోవకు చెందినవారే. లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నా, ఏడాదికి రెండున్నర లక్షలకు డాలర్లకు పైగా జీతం. కానీ దాంతో సంతృప్తి దక్కలేదు. యూట్యూబర్‌గా సరికొత్త అడుగులు వేసింది. కట్ చేస్తే ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదిస్తోంది. నీషా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.నలుగురి కోసంఆరంకెల జీతం వస్తున్నా, బ్యాంకింగ్‌లో చేస్తున్నది కార్పొరేషన్లు, సార్వభౌమ ప్రభుత్వాలకు సహాయం చేయడమే కదా, తనకున్న విజ్ఞానం ద్వారా నలుగురి ప్రయోజన కోసం ఏదైనా చేయాలనిపించింది. దీనికి తగ్గట్టు చేస్తున్న పని సంతృప్తి నివ్వలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ కంటెంట్ క్రియేటర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023 జనవరిలో బ్యాంకింగ్ వృత్తిని వదిలి పూర్తిగా యూట్యూబ్నుకొనసాగించడానికి ధైర్యంగా ముందుకు సాగింది. ఒక్క ఏడాదిలోనే అనూహ్య విజయాన్నందుకుంది. View this post on Instagram A post shared by Nischa Shah (@nischa.me)2021 డిసెంబర్లో తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తనకు ఆసక్తి , పట్టు ఉన్న పర్సనల్ ఫైనాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్రతి వారం రెండు వీడియోలు పోస్ట్ చేసేది. బిజినెస్ విషయాలు కావడం మొదట్లో ఆశించినంత ఆదరణ లభించలేదు. వెయ్యి మంది సబ్స్క్రైబర్ల కోసం దాదాపు సంవత్సరం వేచి చూడాల్సి వచ్చింది.అయినా పట్టుదలగా ముందుకే సాగింది. ఈ క్రమంలోనే 2022 సెప్టెంబరులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఆమె అనుభవాలను వివరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. 50వేలకు పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. రూ.3 లక్షలు సంపాదించింది. అందరికంటే భిన్నంగా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పింస్తూ తన అభిమానులను ఎడ్యుకేట్ చేస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ గురించి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా వీడియోలను షేర్ చేస్తుంది. ముఖ్యంగా "మనీ హ్యాబిట్స్ కీపింగ్ యు పూర్" నుండి "మీ తొలిపెట్టుబడి ఎలా పెట్టాలి" వరకు అంశాలపై సలహాలను అందిస్తోంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఆమె కంటెంట్ విభిన్నంగా, బిజినెస్‌లో చక్కటి సూచనలు సలహాలతో ఫాలోవర్ల మనసు దోచుకుంది. అలా 2024 మే నాటికి ఆమె సంపాదన రూ. 8 కోట్లను దాటేసింది. యూట్యూబ్ మానిటైజేషన్, కోర్సు విక్రయాలు, కార్పొరేట్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్లు, బ్రాండ్స్ పార్టనర్షిప్ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాటి చెప్పింది. సాధించాలన్న అభిరుచి ,పట్టుదల, టాలెంట్ ఉంటో ఆర్థికంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చో నీషా స్టోరీ మనకు తెలియజేస్తుంది. లండన్‌కు చెందిన నీషా షా నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ , ఆ తర్వాత ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) చదివారు. ఆ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే దాదాపు 80 శాతం ఆదాయాన్ని కోల్పోవడమే. కానీ కష్టమైనా ఇష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఇపుడు బ్యాంకింగ్ ఉద్యోగంలో పొందిన జీతం కంటే యూట్యూబర్‌గా ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇది సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది- నీషా. -
Sheikh Hasina: ఆ అక్కకు.. చెల్లెలే ధైర్యం!
ఆగస్ట్ 15, 1975 సైనిక తిరుగుబాటులో బంగ్లాదేశ్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, అతడి భార్య, కుమారులు ఊచకోతకు గురయ్యారు. ఆ కల్లోల సమయంలో రెహమాన్ కుమార్తె రెహానా తన అక్క షేక్ హసీనాతో పాటు యూరప్‌లో ఉంది. అంత పెద్ద విషాదాన్ని, దుఃఖాన్ని తట్టుకోవడానికి ఎవరికి ఎవరు ధైర్యం చెప్పుకున్నారో తెలియదు.ఇక అప్పటి నుంచి వారిది వీడని బంధం అయింది. హసీనా ‘లైఫ్‌లాంగ్ షాడో’గా రెహానాకు పేరు పడిపోయింది. కుటుంబసభ్యుల ఊచకోత జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత బంగ్లాదేశీ విద్యావేత్త అహ్మద్ సిద్దిఖీని వివాహం చేసుకుంది రెహానా. ఆర్థిక కారణాల వల్ల లండన్‌లో జరిగిన ఈ పెళ్లికి షేక్ హసీనా వెళ్లలేకపోయింది అంటారు. తమ కుటుంబ సభ్యుల కిరాతక హత్యపై నిష్పాక్షిక విచారణకు పిలుపునిస్తూ మొదటిసారిగా అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది రెహానా. ఈ సమావేశంలో ప్రవాసంలో ఉన్న ఆమె రాజకీయ సహచరుల నుంచి అంతర్జాతీయ న్యాయనిపుణుల వరకు ఎంతోమంది పాల్గొన్నారు.క్రూరమైన సైనిక నియంతృత్వ నీడలో బంగ్లాదేశ్ ప్రజల దుస్థితిని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించింది రెహానా. కుటుంబ ఊచకోతకు సంబంధించిన అప్పటి విషాదం ఊహకు అందనిది. ఇప్పటి సంక్షోభం గురించి మాత్రం ఇద్దరికీ తెలుసు. నిరసనకారులు ఇంటిని చుట్టుముడుతున్నారు. మరోవైపు హసీనా సన్నిహితులు, సలహాదారులు పారిపోయే దారిలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా అక్క చెయ్యి వీడలేదు రెహానా. ‘పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం’ అని అత్యంత సన్నిహితులు చెబుతున్నప్పటికీ ‘అది జరిగేది కాదు’ అంటూ వెనక్కి తగ్గలేదు హసీనా. ఆ సమయంలో వారు రెహానాను ఆశ్రయించారు. హసీనా దేశం వీడడానికి ఒప్పుకోవడానికి ఆమె కుమారుడు కారణమని, కాదు రెహానే కారణమని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏది నిజం అయినప్పటికీ రెహనా అక్కతో పాటు ఇండియాలోకి అడుగు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.రెహానా కుమార్తె తులిప్ సిద్దిఖీ లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు. యూకేలో లేబర్ పార్టీ అధికారంలో ఉండడంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని హసీనా ఆశ్రయం కోరింది. అయితే బ్రిటన్ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో ఇండియాను ఆశ్రయించక తప్పలేదు. అక్క అధికారిక పర్యటనలలో రెహానా ఉండేది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభ (2006 –2008) సమయంలో హసీనా జైలులో ఉన్నప్పుడు అక్క తరపున పార్టీ సమావేశాలు నిర్వహించింది. కార్యకర్తల్లో ధైర్యం నింపింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లో ఎంత చరిత్ర ఉందో ఆమె చెల్లెలు రెహానాకూ అంతే చరిత్ర ఉంది. ఆ చరిత్ర హసీనా వెలుగు ముందు మసక మసకగా కనిపించేది. అయితే ప్రతి కల్లోల సమయంలోనూ ఆమె పేరు మీద వెలుగు ప్రసరిస్తుంటుంది.‘రెహానా అక్కను తప్పుదారి పట్టించింది’ అని విమర్శించిన వారూ ఉన్నారు. ‘అక్క సరిౖయెన దారిలో పయనించడానికి, బలమైన నాయకురాలిగా ఎదగడానికి రెహానానే కారణం’ అన్నవారూ ఉన్నారు. ఈ వాదోపవాదాలు, నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక్కమాట మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు... అక్కకు చెల్లి కొండంత అండగా నిలిచింది. నిలుస్తోంది. "షేక్ హసీనా పేరు వినిపించగానే ప్రతిధ్వనించే మరో పేరు... రెహానా. అలనాటి కల్లోల కాలం నుంచి అధికార పర్యటనల వరకు అక్క హసీనాతోనే ఉన్నది రెహానా. అక్క జైలుపాలైనప్పుడు పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపింది. ఒకప్పుడు కుటుంబాన్ని కోల్పోయి... ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి అక్కాచెల్లెళ్లు మన దేశంలో తలదాచుకోవడానికి శరాణార్థులుగా వచ్చారు..." -
మనసు గెలిచింది- ఆ వంద గ్రాములు లెక్కే అంటారా?
నవ్వుతూ మాట్లాడకూడదు. నచ్చిన డ్రెస్ అసలే వేసుకోకూడదు. హవ్వ.. అబ్బాయిల్లా ఆ ఆటలు ఏంటి? ఏమ్మా నువ్వైనా నీ బిడ్డకు చెప్పవచ్చు కదా! అసలే తండ్రి లేని పిల్ల... ఇలాంటివి మీకు అవసరమా? సూదుల్లా గుచ్చే ఇరుగు పొరుగు మాటలు లెక్కచేయలేదు– ఆ తల్లీ.. కూతురు తల్లి ఎంతటి ధైర్యశాలో కూతురికి తెలుసు. 32వ ఏటనే భర్తను కోల్పోయినా ఇద్దరు కూతుళ్లను గొప్పగా పెంచింది. ఆడపిల్లలు బలహీనులని భావించక మగాళ్ల గోదాలో రెజ్లర్లుగా దించింది. క్యాన్సర్ బారిన పడ్డా కూతుళ్ల కోసం యముడితో పోరాడి బయటపడింది. అవును... ఆ తల్లిని చూసి పోరాడటం నేర్చుకుంది ఆ కూతురు... వినేశ్ ఫొగట్ డాటరాఫ్ సరళాదేవి.‘పట్టు’ పడితే పతకం మెడలో వాలాల్సిందే. అన్యాయం చేసిన వాళ్ల తాట తీయాల్సిందే. న్యాయపోరాటంలో మొండిగా ముందుకు దూకాల్సిందే. నాన్న లేడని అమ్మను వంకర చూపులు చూసే వాళ్ల తోడేలుతనం ఆమె దృష్టిని దాటి పోలేదు. ఆడవాళ్లకు అదెంత వేదనో స్వయంగా చూసింది. అందుకే తోటి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యామని చెబితే వారికి మద్దతుగా నిలిచింది. కెరీర్‌ను పణంగా పెట్టి రాజధానిలో ఉద్యమానికి ఊపిరిగా మారింది.పాలకుల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జీవితకాల శ్రమతో సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా తృణ్రపాయంగా విడిచిపెట్టింది. ఇంత బరితెగింపా అంటూ అజ్ఞానంతో అనరాని మాటలు అనే వాళ్లను చిరునవ్వుతో మరింత చికాకు పెట్టింది. మద్దతుగా నిలిచిన వారికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఖేల్ ఖతమే అన్న వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా అన్ని సవాళ్లను దాటుకుని మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అంతేనా.. ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించింది. స్వర్ణ పతకపోరుకు అర్హత సాధించింది. ఊహించని విధంగా వందగ్రాములు.. కేవలం వందగ్రాముల అదనపు బరువు కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం సాధించకపోతేనేమి.. అందరి హృదయాలలో అభిమానాన్ని సంపాదించింది. వీటన్నిటి ముందు ‘ఆ వంద గ్రాములు‘ లెక్కే అంటారా? (ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది)-సుష్మారెడ్డి యాళ్లచదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? -
ఆఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్
సినిమాకు ఎంతమాత్రం తీసిపోని కథ మనిజా తలాష్ది. మహిళలు సంగీతం వినడం తప్పు... అనుకునే పరిస్థితులు ఉన్న దేశంలో బ్రేక్డ్యాన్స్పై ఇష్టాన్ని పెంచుకుంది. ఆ ఇష్టం ఆమెకు ఎన్నో కష్టాలు తెచ్చింది. అయినా మడమ తిప్పలేదు. తలాష్ కష్టం వృథాపోలేదు. అఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...‘సంకల్ప బలం ఉంటే బందీఖానాలో ఉన్నప్పటికీ కల నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆఫ్గానిస్తాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్డ్యాన్సర్ మనీజా తలాష్. కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో ఆఫ్గాన్ బ్రేక్ డ్యాన్సర్ల వీడియో చూసి ‘ఇది కలా నిజమా! ఇలా చేయడం సాధ్యమా’ అనుకుంది తలాష్.మూడు నెలల తరువాత...‘సుప్రియర్స్ క్రూ’గా సుపరిచితులైన బ్రేక్ డ్యాన్సర్లను ట్రైనింగ్ క్లబ్లో కలుసుకుంది. ‘నాకు డ్యాన్స్ నేర్పించగలరా?’ అని అడిగింది. వారు ఓకే అన్నారు. శిక్షణ తీసుకుంటున్న 55 మందిలో తానొక్కతే అమ్మాయి. మొదట ఇబ్బందిగా ఫీలయ్యేది.‘ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఇబ్బందిగా ఫీల్ కావద్దు’ అని ధైర్యం చెప్పేవారు సుప్రియర్ క్రూ సభ్యులు. అయితే తలాష్ బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవడం తల్లిదండ్రులు, ఉ΄ాధ్యాయులకు ఎవరికీ నచ్చేది కాదు. ఈ ఒత్తిడి ప్రభావంతోనో ఏమో... ‘నేర్చుకోవడం నాకు కష్టంగా ఉంది’ అన్నది.‘కష్టం కావచ్చు. అసాధ్యం మాత్రం కాదు’ అన్నారు ‘సుప్రియర్ క్రూ’ సభ్యులు.ఇక అప్పటినుంచి వెనకడుగు వేయలేదు తలాష్. నాలుగు సంవత్సరాల తరువాత... అఫ్గానిస్తాన్ ఫస్ట్ ‘బీ–గర్ల్’ (బ్రేక్డ్యాన్సర్ గర్ల్)గా పేరు తెచ్చుకుంది. మరోవైపు తలాష్కు బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. తన కల సాకారం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పన్నెండేళ్ల సోదరుడిని తీసుకొని ΄ాకిస్థాన్కు ΄ారిపోయింది. అక్కడి నుంచి స్పెయిన్‌కు వెళ్లి హ్యుస్కా అనే చిన్న పట్టణంలోని హెయిర్ సెలూన్లో పనిచేస్తూ బ్రేక్ డ్యాన్స్ ్ర΄ాక్టీస్ చేసేది. తలాష్ కథ ఐవోసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దృష్టికి రావడంతో రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్‌లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్‌లో తలాష్ మెడల్ తేస్తే పెద్ద చరిత్రే. కష్టమే అదృష్టమై...΄ారిస్ ఒలింపిక్స్‌తో మొదటిసారిగా బ్రేకింగ్ స్పోర్ట్ (బి–బోయింగ్, బి–గర్లింగ్ లేదా బ్రేక్ డ్యాన్సింగ్)ను ప్రవేశ పెట్టారు. ప్రపంచ క్రీడా వేదిక చెంతకు చేరడానికి ఇది మనిజా తలాష్కు అదృష్టంగా మారింది. అయితే కష్టాన్ని తప్ప అదృష్ట, దురదృష్టాలను ఎప్పుడూ పెద్దగా నమ్ముకోలేదు తలాష్. ఆమె ఒలింపిక్స్ వరకు రావడమే పెద్ద విజయం. పతకం గెలుచుకుంటే చారిత్రక విజయం అవుతుంది. ‘ఈపోటీ నా కోసం మాత్రమే కాదు. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్నేహితులు, ఆత్మీయుల కోసం’ అంటుంది మనిజా తలాష్. -
Paris Olympics : మను భాకర్‌పై నీతా అంబానీ ప్రశంసలు, సన్మానం
ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల కృషిని అభినందిస్తూ మంగళవారం పారిస్‌లోని ఇండియన్ హౌస్‌లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఒలింపిక్ గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు మను.ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన యువషూటర్ మను భాకర్‌ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకి కృషికి, విజయాలను సెలబ్రేట్ చేస్తూ ఆమెను సన్మానించారు. మను భాకర్‌తో పాటు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుశాలేను కూడా సత్కరించారు. ఫ్రాన్స్ ఒలింపిక్ ఈవెంట్లో అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సమున్నతంగా నిలిపిన అథ్లెట్లను అంబానీ అభినందించారు. టోక్యో ఆటల తర్వాత, మను చెప్పినట్టుగా అందరూ మన ప్రాచీన గ్రంథం గీతాసారాన్ని, గీత బోధను అనుసరించాలని 'మీ వంతు కృషి చేయండి , మిగిలిన వాటిని భగవంతుడికి వదిలివేయండి’’ అంటూ క్రీడాకారులకు నీతా సూచించారు.ఈ ఒలింపిక్స్‌లో మన షూటింగ్ టీమ్ అత్యుత్తమ ఫామ్‌లో ఉందంటూ నీతా అంబానీ పేర్కొన్నారు. షట్లర్ లక్ష్య సేన్, షూటర్లు విజయవీర్ సింగ్ సిద్ధూ, మహేశ్వరి చౌహాన్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఈషా సింగ్, రైజా ధిల్లాన్, అనీష్ బన్వాలా, బాక్సర్ నిషాంత్ దేవ్, షాట్ పుట్ అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ టూర్, అథ్లెట్ జెస్విన్ ఆల్డ్రిన్ శాలువాలతో సత్కరించారు.నిలకడగా ఆడి మలేషియాకు చెందిన జియ్ జియా లీపై కాంస్య పతకాన్ని సాధించి ఒలంపిక్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచిన షట్లర్ లక్ష్య సేన్‌ను కూడా అభినందించారు. తకాలు,రికార్డులకు అతీతంగా వ్యక్తిత్వం, పట్టుదల, కఠోర శ్రమ, ఓటమినిఎదిరించే సామర్థ్యంతో మనం అందరం జరుపుకునే విశ్వ క్రీడా వేడుక అని నీతా అంబానీ అన్నారు. Mrs. Nita Ambani felicitates ace shooters, Manu Bhaker and Swapnil Kusale, as she honours all our athletes at India House, “Every Indian feels inspired and every girl in India feels empowered by Manu’s achievements. Swapnil’s historic success has made all of us proud. Our… pic.twitter.com/chBG0jrwBr— Pankaj Upadhyay (@pankaju17) August 7, 2024 -
వయనాడ్ వారియర్స్: స్త్రీని కాబట్టి వెనక్కు తగ్గాలా?
ప్రమాదం జరిగినప్పుడు స్త్రీలను అక్కడకు వెళ్లనివ్వరు. చాలామంది స్త్రీలు తమ భర్త, కొడుకులను సహాయానికి పంపడానికి సంశయిస్తారు. కాని వయనాడ్ వరద బీభత్సం సంభవించినప్పుడు ఒక అంగన్వాడి టీచర్ రక్షణ దళాలతో సమానంగా రంగంలో దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. ‘ఇంత దారుణ పరిస్థితిలో అందరూ ఉంటే స్త్రీని కాబట్టి నేను వెనక్కు తగ్గాలా?’ అని ప్రశ్నించిందామె.వయనాడ్‌లోని చిన్న పల్లె ముప్పైనాడ్. అక్కడ అంగన్వాడి టీచర్‌గా పని చేస్తోంది 36 ఏళ్ల విజయకుమారి. జూలై 30 తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ కాల్ అందుకుంది. వాళ్ల పల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్‌మలను వరద చుట్టుముట్టిందని అందరూ ప్రమాదంలో ఉన్నారని. ఆమె అంగన్వాడి టీచర్. ప్రమాదస్థలంలో ఆమెకు ఏ విధమైన విధులు లేవు ఒక ఉద్యోగిగా. ఒక పౌరురాలిగా ఎలాంటి నిర్బంధం లేదు సేవకు. కాని ఆమె ఆగలేక΄ోయింది. వెంటనే బయల్దేరడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయట భారీ వర్షం. హోరు గాలి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అయినా సరే తన టూ వీలర్ తీసి చూరల్మలకు బయలుదేరింది. తెల్లవారుజాము ఐదు అవుతుండగా అక్కడకు చేరుకుంది.కాని అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను అవాక్కు చేసింది. తనకు బాగా పరిచయమైనప్రాంతం, జనావాసం ఇప్పుడు కేవలం బురదదిబ్బ. ఎవరు ఏమయ్యారో తెలియదు. సహాయ బృందాలు వచ్చి అప్పుడప్పుడే సహాయక చర్యలు మొదలెట్టాయి. విజయకుమారి ఏమీ ఆలోచించలేదు. వెంటనే రంగంలో దిగింది. వారికి తనను పరిచయం చేసుకుని అగ్నిమాపక బృందం వారి షూస్, ఇనుపటోపి పెట్టుకుని రంగంలో దిగింది. ఆ తర్వాత ఆమె చేసినదంతా ఎవరూ చేయలేనంత సేవ. ‘నా ఎదురుగా మహా విపత్తు.ప్రాణంపోయిన వారు ఎందరో. ఇలాంటి సందర్భంలో స్రీగా వెనక్కు తగ్గాలా? అనిపించింది. కాని మనిషిగా ముందుకే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సహాయక చర్యల్లో పాల్గొన్నాను. తెల్లవారుజాము 5 నుంచి 8 లోపు ఎన్నో మృతదేహాలను వెలికి తీసి రవాణా చేయడంలో సాయ పడ్డాను’ అందామె.పనికి వచ్చిన కరాటే..విజయకుమారికిపోలీసు కావాలని చిన్నప్పటి నుంచి కోరిక.పోలీసు కావాలని కరాటే నేర్చుకొని బ్రౌన్ బెల్ట్ వరకూ వెళ్లింది. అంతేకాదు పరీక్షలు రాసిపోలీస్గా సెలెక్ట్ అయ్యింది కూడా. కాని వాళ్ల నాన్నకు ఆమె ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అపాయింట్మెంట్ లెటర్ చింపేశాడు. ఆమె అంగన్వాడి టీచర్‌గా మిగలాల్సి వచ్చింది. పోలీస్ కావాలని నేను తీసుకున్న కరాటే శిక్షణ, చేసిన ఎక్సర్సైజులు నాకు ఈ సమయంలో తోడు వచ్చాయి. రక్షణ దళాలతో సమానంగా నేను కష్టపడ్డాను. మనిషికి మనిషి సాయం చేయాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ సమయంలో ఎందరో స్త్రీలు దుఃఖంతో స్పృహ త΄్పారు. సహాయక బృందాల్లో అందరూ మగవారే ఉంటారు. వారు ఓదార్చలేరు. కాని నేను స్త్రీని కావడం వల్ల వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చగలిగాను. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు ఉండాలి స్త్రీల కోసం’ అంటుంది విజయకుమారి. ఆమె సేవలను అందరూ మెచ్చుకుంటున్నారు. -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్‌లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్‌లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్‌ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది.