స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ అంటున్నారు: సంతోష్ హెగ్డే
దేశంలో రాష్ట్రాలు ఎక్కువైతే దేశ సమైక్యతకు భంగం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్నా హజారే బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న హెగ్డే తెలంగాణ అంశంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తామని ప్రకటించడం వల్ల దేశంలో మరిన్ని రాష్ట్రాల కోసం డిమాండ్లు తెరపైకి వస్తాయని, ఇప్పటికే మహారాష్ట్రలో విదర్భ, అసోంలో బోడోల్యాండ్, ఉత్తరప్రదేశ్ నుంచి నాలుగు రాష్ట్రాలు వేరు చేయాలని మాయావతి డిమాండ్ చేయడం లాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. అసలు 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించడమే మనం చేసిన అతిపెద్ద తప్పని, ఇప్పుడు దాని ఫలితాన్ని మనందరం అనుభవిస్తున్నామని సంతోష్ హెగ్డే చెప్పారు. ఇప్పుడు ఇంకా విభజించుకుంటూ పోతే అది మన దేశ ఐక్యతను దెబ్బ తీస్తుందన్నారు.
స్వార్థ ప్రయోజనాలు ఉన్న కొంతమంది మాత్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారని జస్టిస్ హెగ్డే తెలిపారు. గడిచిన 20 ఏళ్లుగా ఈ సమస్య రగులుతున్నా, కేవలం 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ ప్రకటన చేశారని ఆయన గుర్తుచేశారు. దీనివల్ల కలిగే ప్రభావాలేంటో ముందుగా ఊహించలేకపోయారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే అధికార యంత్రాంగం, హైకోర్టు, సచివాలయం, ఇంకా అనేక మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, దానంతటికీ బోల్డంత డబ్బు వెచ్చించాలని అన్నారు. అలా కొత్త రాష్ట్రాలు ఇర్చుకుంటూ పోతపే.. జిల్లాకో రాష్ట్రం చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. దూరప్రాంతాల నుంచి హైకోర్టు, సచివాలయం కోసం హైదరాబాద్ రావడం కష్టం అవుతున్నందునే రెండు రాష్ట్రాలు చేయాలనడం సరి కాదని, ఎక్కడికక్కడ కార్యాలయాలు, అధికారులు ఉండటం వల్ల ఎక్కడి పనులు అక్కడే అయిపోతాయని చెప్పారు. వాళ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలుచేస్తే సరిపోతుందన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే, కర్ణాటకలో కూడా విభజన వాదం వచ్చే అవకాశం లేకపోలేదని హెగ్డే చెప్పారు. ఇప్పటికే అక్కడ బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక అనే వాదాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక మీదట మనం రాష్ట్రాల విభజన గురించి ఆలోచించకపోవడమే మంచిదని చెప్పారు. అది మన దేశ ఐక్యతకు ఏమాత్రం మంచిది కాదని సూచించారు.